భగవాన్ శ్రీ రమణ మహర్షి (ఎనిమిదవ భాగం) - సుధారాణి మన్నె

bhagavaan shree ramana maharshi biography

ఓం నమో భగవతే శ్రీ రమణాయ.


విరుపాక్ష గుహ:
విరూపాక్ష దేవుడనే యోగి అస్థికలు ఉన్న విరూపాక్ష గుహకి 1899సంవత్సరంలో శ్రీభగవాన్, వారి అనుచరుడు పళనిస్వామితో కలిసి బస మార్చారు. ఆ గుహ 'ఓంకార' ఆకారంలో వుంటుంది. అస్థికలు లోపలిగా, విరుపాక్ష యోగి సమాధి కూడా అక్కడ వుంటుంది. ఈ గుహలో స్వామి 17 సంవత్సరములు ఉన్నారు. ఇక్కడ కూడా భగవాన్ మొదట కొన్ని సంవత్సరములు మౌనంగానే గడిపారు. అప్పుడప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలను వ్రాసి ఇచ్చే వారు. పలికే ప్రతిమాటకంటే అంతరాంతరాలలోకి చొచ్చుకు పోయే మౌనమే ఆయన విశిష్ట లక్షణము.

భగవాన్ విరుపాక్ష గుహలో వుండగా, సమీపంలో ఉన్న కొలనులో నీరు త్రాగడానికి చిరుతపులి వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలడానికి పళ్ళాలు, డబ్బాలు తీసుకొని డప్పులు వేసేంతలో అది నీళ్ళు తాగి మళ్ళీ గోండ్రుమని  అరచి వెళ్ళిపోయిందట.

భగవాన్ భక్తుల్ని చూసి "మీరెందుకు భయపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియ జేసింది. నీళ్ళు త్రాగి మరొక అరుపుతో వెళ్తున్నానని చెప్పి తన దారిన తాను పోయింది. మీ జోలికి రాలేదు కదా? మీకెందుకు భయం? ఈ కొండ వాటి నివాసం. వారింటికి మనం వచ్చి వారిని తరమటం ఏం న్యాయం?" అని వారిని వారించారు. "ఈ గిరి యందు అనేక సిద్ధపురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని వివిధ రూపాలలో వస్తూ వుంటారు. వారికి ఏ విధమైన  అలజడి కలిగించరాదు" అని మందలించారట

ఒకసారి, ఒక పాము భగవాన్ కాలు మీద పాకిందట కదా అని ఒక భక్తుడు అడిగితే , భగవాన్ ఇలా చెప్పారు. "ఆ పాము స్నేహ భావంతో వచ్చిన మాట నిజమే. కాలు మీదకు పాకబోయింది. నేనే కాలు ఇవతలకు తీసుకున్నాను. అంతే. దానంతట అది వస్తూ, పోతూ ఉండేది." అని చెప్పారు. అరుణగిరి యోగి కూడా ముంగిస రూపంలో భగవాన్ దగ్గరికి వచ్చేవారట.

అరుణాచలం వచ్చిన తర్వాత, తమ మొదటి భిక్షను గురించి భగవాన్ ఇలా చెప్పారు. "గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవారు . వారు మరొకరితో కలిసి నా వద్దకు వచ్చారు. ఆయన మౌనస్వామి. నేనూ మౌన స్వామినే గదా? ఒకరితో ఒకరికి మాట లేదు. మంచీ లేదు. మధ్యాహ్నమయింది. పాపం ఆయనే నన్ను చూసి 'ఈ కుర్రవాడు ఎవరో చాలా అలసి పోయినట్లున్నాడు. కొంచెం ఆహారం ఇవ్వమని' ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో. వీరు చెప్పగానే వారొక తాగారు గొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యం అన్నం. పెద్ద పెద్ద మెతుకులు, పైన ఉప్పు, అడుగున పుల్ల నీళ్ళు, నంజుకునేందుకు ఊరగాయ బద్ధ. అదే శ్రీ అరుణాచాలేశ్వరుని మొదటి భిక్ష. ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను. పంచ భక్ష్య పరమాన్నాలు కూడా దానికి సాటి రావు. " అన్నారు భగవాన్

భగవాన్ ఇలా చెప్పారు. "నేను పచ్చయంమన్ కోవెలలో ఉండగా, ఎవరో ఇచ్చిన తుండు(కౌపీనం) ఒకటే నా వద్దే ఉండేది. కొన్ని రోజులకే అది, లెక్కలేనన్ని చిల్లులతో తయారయ్యింది. అదెలావుంటే  మనకేమి? పని గడిస్తే సరిపోతుంది స్నానం చేసినపుడు అట్లాగే తుడుచుకొని చాటుగా ఆరవేసుకొనే వాడిని. ఒక పిల్లవాడు అది దులుపుతుంటే చూసి, 'స్వామి, స్వామీ, గవర్నరుకు కావాలంట యీ తుండు. అడిగి తెమ్మన్నాడు స్వామీ. ఇవ్వండి' అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. 'అమ్మా, యీ తుండా? ఊ హు, ఇవ్వను పో' అన్నాను. ఒకనాడు నీనెక్కడికో వెళ్ళినపుడు, శేషయ్యరు ఏదో వెతుకుతూ ఉంటే తుండు దొరికింది. 'అయ్యో, వేయి కంతలతో ఉన్న ఈ తుండుతో ఆ స్వామీ తడి తుడుచుకోవడం, మా భక్తి బండలు గానూ! ఇంత మాత్రం కనుక్కోలేక పోతిమే' అని నొచ్చుకొని కొత్తవి తెచ్చి ఇచ్చారు.  ఇదీ భగవాన్ తుండు కథ. (కౌపీనవన్తః ఖలుభాగ్యవన్తః) అని ఆచార్య శంకరులు వారు వర్ణించారిలాంటి మహానుభావులనే. భగవాన్కి ఏమి కావాలి? కమండలం, కర్ర, కౌపీనం, పై తుండు. ఇవే వారి వస్తువులు. తలచుకోగానే తయారయిపోతారు."

ఎవరో రెండు చిరుత పులి పిల్లలను భగవాన్ దగ్గరికి తెచ్చారట. ఆ పులి పిల్లలు భగవాన్ హస్త స్పర్శ వల్ల ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే, భగవాన్ దగ్గర హాయిగా పడుకున్నాయట. అవి ఉండగానే జాతి వైషమ్యం లేకుండా, ఉడుతలు వచ్చి పప్పులు, పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నావట. అలాగే రెండు పావురాలను ఎవరో తీసుకు వచ్చి ఇస్తే, వాటికి  పంజరం వెదకి తెచ్చే సరికి గంట పట్టిందట. ఆ గంట సేపు పావురాళ్ళు కదలక మెదలక భగవాన్ ఒడిలో సమాధిస్థులగు యోగులలాగా కూర్చున్నాయి. ఒక భక్తుడు 'ఇదేంటి' అని అడిగితే 'ఏమో వారు వచ్చారు. పోరట. ఇక్కడే ఉంటారట. ఉన్న సంసారం చాలక ఇదొకటి వచ్చింది.' అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ.

"ఏ జీవి అయినా కర్మావశేషం అనుభవించటానికే నా దగ్గరకు  వస్తుంది. కనుక వేటిని రాకుండా నిషేదించవద్దు." అని భగవాన్ చెప్పేవారు.

విరూపాక్ష గుహలో వుండగా మల ప్రవృత్తికి గాను రాత్రి పూట ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను. ఒక రోజున కరక్కాయలు పూర్తిగా అయి పోయాయి. పళనిస్వామి, కరక్కాయల కోసం బజారుకు బయలుదేరగా, ఒకతను వచ్చి "స్వామీ! మీకు కరక్కాయలు కావాలా?" అన్నారు. ఉంటే రెండివ్వమన్నాము. పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు. ఇవన్నీ ఎక్కడి వయ్యా? అంటే 'స్వామీ! తమ దర్శనం చేసుకొని ప్రక్కనున్న పల్లెలో పని వుంది బండిలో వెళ్ళాను. నా బందికన్న ముందే ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతూ వున్నది. ఒక గోనెకు చిల్లు పడి ఇవన్నే దారి కడ్డంగా పడినాయి. ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను.ఉండనీయండి స్వామీ' అన్నారు కొన్ని తీసుకొని, మిగతావి వారికి ఇచ్చేశాము. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఎన్నని చెప్పగలం? అమ్మ వచ్చి వంట మొదలు పెట్టిన తరువాత, ఇనుప గరిటె వుంటే బాగుండునే అనేదామే. చూద్దాములే  అనే వాణ్ణి. మర్నాడో, మూడో నాడో, ఎవరో ఒకరు, అయిదారు రకాల గంటెలు తీసుకువచ్చి ఇచ్చేవారు. పాత్ర సామాను అంతే. ఇది ఉంటె బాగుండును. అది ఉంటే బాగుండును అని అమ్మ అనడం. అట్లాగా? అని నేననటం. ఆరోజో, మర్నాడో, ఒకటికి పది రావడం, చాలు చాలు బాబు అనిపించేది. ఇలాంటివి ఎన్నో జరిగేవి అన్నారు భగవాన్.

కొండ మీద ఉండగా భగవాన్, టెంకాయ చిప్పలతో గరిటెలు, చెంచాలు, గిన్నెలు ఎన్నో తయారు చేసేవారట. బత్తాయి పండ్లు, కమలాఫలాలు వస్తే, వాటి తోళ్ళు పారవేయకుండా, పచ్చళ్ళు గానో, ఊరగాయలుగానో, పులుసు ముక్కలుగానో తయారు చేసేవాళ్ళు. గులాబీ పువ్వులు ఎవ్వరైనా ఇస్తే, ఆ గులాబీ రేకులు పాయసంలో వేసేవారట. కొండకు వెడుతూ వుంటే, దారిలో ఉపయోగకరమగు ఆకులేమైనా కనిపిస్తే, కోసి తెచ్చి ఎంతో  రుచిగా వంట తయారు చేయించేవారు భగవాన్. ఖరీదు గల వాటికంటే ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్థాలే వారికి ఇష్టం. అంటే "స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చునని" భగవాన్ భోదిస్తున్నారు.

భగవాన్ ఇలా చెప్పేవారు. "నా అనుగ్రహం లేనిది ఎవరును, నా ఆశ్రమమునకు రాలేరని", "పులినోట పడిన మాంసపు ముద్ద తప్పించుకొనగలదేమో కాని, నా అనుగ్రహమునకు పాత్రులైన వ్యక్తులు తప్పించుకు పోలేరు."

చెల్లమ్మ అనే భక్తురాలు, భగవాన్ దర్శనానికి వచ్చి, తిరిగి ఇంటికి వెళ్ళటానికి భగవాన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో సన్నగా వర్షం పడటం ప్రారంభమైంది. అప్పుడు భగవాన్ ఆమెని పాట పాడమని కోరారు. ఆమె పాడింది. దాని తరువాత ఇంకొక పాట, ఇంకొక పాట అని అరగంట సేపు ఆమెతో పాటలు పాడిస్తూనే వున్నారు. వర్షం ఉధృతి కూడా ఎక్కువయ్యింది. ఇక చాలు అని మహర్షి అనగానే , ఆమె పాడడం ఆపివేసింది, దానితో పాటు వర్షం కూడా ఆగి పోయింది. భగవాన్ ఆమెను మీరు ఇంటికి వెళ్ళవచ్చు అన్నారు. ఆమె ఇంటికి చేరిన తరువాత మరల వర్షం ఎక్కువయ్యింది. మర్నాడు శ్రీ భగవాన్, చెల్లమ్మతో 'నిన్న మీరు వర్షంలో తడవలేదు కదా?' అని అడిగారు. భగవాన్ తనని నమ్మిన వారిని అనుక్షణం కాపాడుతూ వుంటారు.

(మరిన్ని విరూపాక్ష గుహ విశేషాలు వచ్చే సంచికలో...)

మరిన్ని వ్యాసాలు