అవీ-ఇవీ - భమిడిపాటి ఫణిబాబు.

   ఆమధ్య ఓ యాడ్ వచ్చింది. Tata Sky వాళ్ళదనుకుంటాను. అడగడానికి మొహమ్మాటం ఎందుకూ అనే అర్ధం వచ్చేటట్టు. అడిగితేనే కదా ఏ విషయమైనా తెలిసేదీ? ఉద్యోగంలో ఉన్నంతకాలం, ప్రతీదానిమీదా ఆసక్తి ఉన్నా, అడిగితే ఏమనుకుంటారో అనే భయం అనండి, మొహమ్మాటం అనండి, ఏదో ఒకటీ నోరెళ్ళపెట్టుకుని చూడ్డంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోయేది..కానీ ఉద్యోగవిరమణ జరిగిన తరువాత రంధే మారిపోయింది. మొట్టమొదటగా వచ్చిందేమిటీ అంటే ధైర్యం. తెలిసినా, తెలియకపోయినా అడిగేయడం. మహా అయితే గియితే ఏమౌతుందీ, " నీకెందుకూ..ఏమైనా కొనే మొహమేనా.." అనొచ్చు.మరీ అంత బరితెగించనివాడైతే, నా వయస్సుకి గౌరవం ఇచ్చి, నేనడిగినదానికి సమాధానం చెప్పొచ్చు. ఆతావేతా తేలేదేమిటీ అంటే, అడగడమా, లేదా అన్నదానిమీదే ఆధారపడి ఉంటుంది. అయినా మీకీ వయస్సులో ఇవన్నీ అవసరమా అంటారా,అవసరమే మరి. ఇదివరకటి రోజుల్లో అంటే ఉద్యోగం చేసేరోజులన్నమాట, స్వదేశీవస్తువులే దొరికేవి.మా చిన్నప్పుడే నయం విదేశీ వస్తువులు అక్కడక్కడైనా, అప్పుడప్పుడైనా దొరికేవి. మా ఇంట్లో మొదటి రేడియో PYE ఇంగ్లాండు లో తయారుచేసినదే. అలాగే OVALTINE బయటనుంచొచ్చినదే. అలాగే ఇంకొన్నివస్తువులుకూడా..

   ఉద్యోగంలోకి వచ్చిన తరువాత పూణె లో విదేశీ వస్తువేదైనా కావలిసొస్తే రెండే మార్గాలు. ఒకటి హాజీమస్తాన్ ధర్మం. రెండోది ప్రభుత్వం వారు పట్టుకున్న అరకొరగా వస్తువులు(వాళ్ళు నొక్కేయగా మిగిలినవి) అవేవో CUSTOMS STORES ల్లో దొరికేవి.ఏదో ఓపిక ఉండి కొందామనుకున్నా, అక్కడ కొన్నవాటికి రిపేరీ ఏదైనా వస్తే, వాటిని బాగుచేసేవాడు దొరికేవాడు కాదు. ఇన్ని గొడవలున్నా, విదేశీ వస్తువులంటే అదో వెర్రి వ్యామోహం. కారణం మరేమీ కాదు, అప్పటికి మనదేశంలో తయారయ్యే వస్తువుల క్వాలిటీ అంతగా చెప్పుకోతగ్గగా ఉండేది కాదు. అయినా మనకంపెనీలు మాత్రం ఏం పొడిచేసేవారూ, తరువాత్తరువాత కదా అవేవో Quality Standards వగైరాలూ అవీ వచ్చేయీ? ఎదైనా ఓ వాచీ కొనాలనుకుంటే అదీ "ఫారిన్ " ది, దొరకడం దొరికేది. కానీ ఆ కొట్లకి వెళ్ళినప్పుడు, మనం కొన్న వాచీకి రసీదూ గట్రా దొరికేదికాదు. అంతా దైవాధీనం సర్వీసూ.పైగా అలాటి కొట్లకి వెళ్ళినప్పుడు అవేవో " బూతు" సినిమాలు చూడ్డానికి వెళ్ళినట్టుగా, అటూ ఇటూ చూసుకుంటూ వెళ్ళడం, తీరా వెళ్ళి, అడిగితే ఏం తప్పో,అని భయపడుతూ అడిగేవాళ్ళం.నా మొదటి జీతంలోని TITONI WATCH మరి అలా కొనుక్కున్నదే.పైగా చేతికొచ్చే 200 రూపాయల జీతంలో 100 రూపాయలు పెట్టి వాచీ కొనుక్కోడమంటే మాటలా మరి? ఉద్యోగంలో ఉన్న 42 ఏళ్ళూ విశ్వాసపాత్రంగా పనిచేసింది.

    ఇలాటి smuggled goods కావాలంటే ఏ బొంబాయో వెళ్ళడం. ఫ్లోరా ఫౌంటెన్ దగ్గరా, క్రాఫొర్డ్ మార్కెట్ దగ్గరలోని మనీష్ మార్కెట్ లోనూ కోకొల్లలుగా దొరికేవి. అలాగే మెడ్రాస్ లోని మూర్ మార్కెట్ దగ్గరా.పైగా ఫుట్ పాత్తుల్లో దొరికే చోట బేరాలు కూడా ఆడే సదుపాయం ఉండేది.మోసాలు కూడా అలాగే ఉండేవనుకోండి.చేసికున్నవాడికి చేసికున్నంతా అనుకోడం, ఓ దండం పెట్టుకోడం.

    అదీ ఇదీ కాదనుకుంటే పైచదువులకో, ఉద్యోగరీత్యానో ఏ అమెరికాయో, ఇంగ్లాండో వెళ్ళేవారున్నారనుకోండి, వాళ్ళని కాళ్ళా వేళ్ళా పడి, ఏ టేప్ రికార్డరో, కెమెరాయో చివరాఖరికి సిగరెట్లైనా సరే,మందురాయళ్ళైతే అడక్కండి. ఏదో ఒకటి తెప్పించుకోడం. మరి ఆరోజుల్లో విదేశీ వస్తువులంటే అంత మోజుగా ఉండేది. మా అన్నయ్యగారు 1966 లో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు నాకు ఓ PHILISHAVER ఒకటీ, ఓ చిన్న అలారం టైంపీసూ తెచ్చారు. నా వాడకం సరీగ్గా ఉండక మూలపడిపోయాయి కానీ, ఇప్పటికీ లక్షణంగా ఉన్నాయి.మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశవాళీ తయారీలకంటే ఓ మెట్టు పైనే ఉండేవి.అలాగని నన్ను దేశద్రోహి అని మాత్రం ముద్రవేయకండి. I love INDIA and proud to be an INDIAN. కా...నీ...

   ఏదో మొత్తానికి ఆర్ధికసంస్కరణల ధర్మమా అని '92 తరువాత మన దేశంలోనూ, విదేశీ వస్తువులో లేదా వారి సహాయసహకారాలతో ఇక్కడే తయారుచేసినవో మొత్తానికి ఫారిన్ brands ఇక్కడా దొరకడం ప్రారంభం అయింది.సంస్కరణలంటే వచ్చేయి కానీ, జీతాలేమీ పెరగలేదుగా , ఎక్కడేసిన గొంగళీ అక్కడే అన్నట్టుగా ఉండేవి. నేను చెప్పేది, ప్రభుత్వోద్యోగులగురించి.ఈమధ్యనే కదండీ పెరిగిందీ, అదేం కర్మమో కానీ నా ఉద్యోగవిరమణ అయ్యేదాకా కాసుక్కూర్చున్నట్టుంది !

   విదేశీ బ్రాండులు ఇక్కడే దొరకడం ప్రారంభం అయినా, ఆర్ధిక స్థోమత దృష్ట్యా, Window shopping కి మాత్రమే పరిమితమయిపోయేది. దానికి సాయం, భార్యా పిల్లలూ కూడా నన్ను ఎప్పుడూఇరుకులో పెట్టకపోవడం ఓ ముఖ్యకారణం అనుకోండి. ఏదో మా ఇంటావిడ పుట్టినరోజుకి ఓ YARDLEY Talcum Powder లాటిది కొని ఇస్తే పాపం సంతోషపడిపోయేది వెర్రి ఇల్లాలు !అయినా అప్పటికి మీడియా కూడా గంగవెఱ్ఱులెత్తుకోలేదు. ఇప్పుడు ఏ చానెల్ చూసినా, ఏ పత్రిక చూసినా విదేశీ సరుకులే. వాటికి సాయం online businessలుఒకటీ. ప్రపంచంలో ఏ వస్తువు కావాలనుకున్నా, నెట్ లోకి వెళ్ళడం, ఏ e-bay లోనో amazon లోనో చూసుకోడం, కార్డుమీద పేమెంటు చేసేసికోడమూనూ. మరి జీతాలూ అలాగే ఉన్నాయిగా.

ఏదైనా అడిగితేనే కదా తెలిసేదీ? అయినా అడగడానికి సిగ్గూ, మొహమ్మాటం, ఒక్కోప్పుడు నామోషీ కూడానూ.. నూటికి డెభై మంది, తమకే అన్నీ తెలుసుననుకుంటూంటారు, తీరా ఎవడైనా అడిగితే, “ అబ్బే ..తెలియదండీ..” అని ఒప్పుకుంటారు. మనకు ఏదైనా తెలియకపోయినా, ఈ ఆధునిక యుగం లో “ గూగులమ్మ” ని అడిగినా తెలుస్తుంది. కానీ దాన్ని ఉపయోగించడం కూడా తెలియాలిగా. అంటే నాకేదో తెలుసునని కాదు, ఏదైనా సందేహం ఉంటే, గూగులమ్మ ని అడిగి తెలిసికోవడం మాత్రం వచ్చింది. పాపం “ ఆవిడ” మనం అడిగే ప్రతీ చొప్పదంటు ప్రశ్నలకీ ఓపిగ్గా సమాధానం చెప్తుంది....