సాహితీవనం - వనంవెంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆముక్తమాల్యద

యామునాచార్యుడు తన కుమారునికి రాజనీతి ని బోధిస్తున్నాడు, యామునాచార్యుని సాధనముగా చేసుకుని శ్రీకృష్ణదేవరాయలు తన రాజనీతికౌశల్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ ఘట్టాన్ని చదివితే చాలు, శ్రీకృష్ణదేవరాయలు భారతదేశమే కాదు, ప్రపంచము మొత్తము చూసిన మహా చక్రవర్తులలో ఒకడని ఎందుకు భావిస్తామో తెలుస్తుంది.

అహితుడు వేఁడిన నేలెడు
మహి సగమే నిచ్చి తెగని మైత్రి గొని విభుం
డహిభయము మాన్పికోఁ దగు
నహిభయ మహిభయముకంటె నధికము గాదే

తనకు అహితుడైనవాడు వేడుకుంటే వాడికి తన రాజ్యములో సగభాగాన్ని ఇచ్చైనా సరే, తెగని స్నేహాన్ని చేసుకోవాలి. శత్రు భయాన్ని మాన్పుకోవాలి. శత్రువు పాముకన్నా దుర్మార్గుడు, శత్రుభయము పాము భయముకన్నా తీవ్రమైనది. 'అహిభయము' అంటే రాజులకు తమ స్వపక్షము లోని శత్రువుల వలన కలిగే భయము అని కూడా అర్ధము, కనుక, స్వపక్షములో నున్న శత్రువులను గుర్తించడం ఎలాగూ కష్టమే, ఇంటిదొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా, స్వపక్షములోని వారిని చాకచక్యముగా ఎదుర్కొనడానికి బయటి శతృవులను మిత్రులుగా చేసుకుని, సమర్ధులైన వారిని తన పక్షము వారిగా చేసుకొనడం మంచిది.

బెదరి చేరని బలియుని బిగియఁ బట్ట
కతనిమైవడినే వచ్చి హత్తఁ జేఁత
క్రమము పెనఁగెడు బలుమీను త్రాటఁ జేఁదు
నొడ్డుగాలంపు వేఁటకాఁడుపమ గాడె

బెదిరి తనంత తానుగా దాడికి రాకుండా ఉన్న శత్రువును నానాకష్టపడి పట్టుకునేకంటే వాడిని ఏదోరకంగా ఉసిగొలిపి వాడికి వాడి వచ్చి చిక్కుకునేలా చేయాలి, అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ ఫలితాన్ని రాబట్టాలి, పట్టూ విడుపూ కావాలి, ఉపాయం కావాలి. ఈ విషయములో  తన గాలానికి చిక్కుకున్న పెద్దచాప పెనగులాడుతూ, లాక్కుపోవడానికి ప్రయత్నిస్తుంటే ఒక్కసారే తాడును తెగేదాకా లాగకుండా, అనవసరముగా అలసిపోకుండా, తాడును, గాలాన్ని నెమ్మదిగా లాగుతూ, వదులుతూ నిదానంగా చాపను వడ్డుకు లాగి బల్లెంతో పొడిచేసే తెలివైన జాలరి మనకు ఉదాహరణ కాడూ!

అడవులు గడిదేశములవి
దడములుగాఁ బెంపు మాత్మ ధరణీస్థలికిన్
నడుములవి పొళ్లుపొళ్లుగఁ
బొడిపింపుము దస్యుబాధ పొందక యుండన్

ఎల్లలలో, సీమలలో (ఇతర రాజ్యాల సరిహద్దులలో) అడవులను వృద్ధి జేయాలి, శత్రువులకు జొరబడడానికి కష్టంగా ఉంటుంది. తన రాజ్యములో దేశ మధ్యంలో ఉన్న అడవులను ముక్కలు ముక్కలుగా నరికేయాలి, చోరులకు మాటు లేకుండా ఉంటుంది, క్రూర జంతువులకు నెలవు లేకుండా ఉంటుంది.

సింధుర మహాశ్వ ముఖ్యము ల్చేర్చు దౌల
దీవివణిజుల కూళ్ళు సద్గృహములు పురిఁ
గొలువుఁ దేజంబు వెల మేలు గలుగఁ బ్రాఁత
వారిఁగాఁ జేయు మరి నవి చేరకుండ

ఏనుగులు, మంచి జాతి గుఱ్ఱాలు మొదలైనవాటిని తీసుకొచ్చే దూరదేశపు వ్యాపారులకు ఊళ్లు, ఇళ్ళు, నీ కొలువులో సేవ, తేజస్సు(కీర్తి) వెలిగేలా ఏర్పాటు జేసి వారిని పాత వారిగా అంటే నీ చిరపరిచితులుగా అంటే స్నేహితులుగా ఉండేట్లు చేసుకో. ఆ మేలుజాతి ఏనుగులు, గుఱ్ఱాలు నీ శత్రువులకు అందుబాటులో లేకుండా చూసుకో!

తా నవంబుగ దొరఁ జేయువాని మంత్ర
మునకు వేగమె లోఁ జేయఁ జనదు వాఁడు
క్రొత్తమన్నన రహి ననుగులకుఁ జెప్ప
నయిన నదిచెడు మరి వాఁడు నడఁగుఁ గాన

క్రొత్తగా దొరతనాన్ని పెద్ద ఉద్యోగాన్ని ఇచ్చి పెంచినవాడిని వెంటనే ముఖ్యమైన మంత్రాంగ విషయాలలో, ఆలోచనలలో భాగస్వామిగా చేయకూడదు. వాడు కొత్తగా వచ్చిన పెద్దరికం, పదవి ఇచ్చిన సంతోషంలో ఆ విషయాన్ని తన వారితో గొప్పగా చెప్పుకుంటాడు, సమాచారం బయటపడిపోతుంది. గోప్యత ఉండదు. దానివల్ల వాడైనా చెడిపోతాడు, ఆ కార్యమైనా చెడిపోతుంది, రెండూ చెడిపోవచ్చు కూడా. కనుక క్రొత్తగా పదవులలోకి తీసుకున్నవారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

ప్రతిన వలదు వైరి పట్టున నృపతికి
దండువెడలఁ దీర కుండుఁ దీరుఁ
గాక యుండియుండి కాలాంతరమున నౌఁ
గార్యకాఁడొ యనక గాఁడొ నృపుడు

శత్రువు పట్ల రాజుకు మొండి పట్టు ఉండకూడదు. దండయాత్రకు, యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడు పని కాకపోవచ్చు, కావొచ్చు, లేదా తర్వాత కొంతకాలానికి కావొచ్చు, అంటే, విజయము అప్పుడే లభించవచ్చు, లభించకపోవచ్చు, కొంతకాలము తర్వాత లభించవచ్చు, ఏదీ కచ్చితంగా చెప్పలేము. రాజు కార్యశీలుడో? సమరశీలుడో? అంటే రాజు కార్యసాధకుడా? విజయసాధకుడా? కార్యసాధకుడే అయి ఉండాలి, కార్యసాధకునికి పట్టూ విడుపూ ఉండాలి అని ధ్వని. కుమారా! ఈ విధముగా రాజు సకల విషయములలోకుశలుడై ఉండాలి. ఒకరు చెప్పకుండానే, యోగ్యులకు తగిన దానములను, మాన్యతను ఇవ్వాలి. దేవ, పితృ కార్యాలలో పితృ కార్యాలు ఉన్నతమైనవి కనుక వాటినితప్పక చేయాలి. దేవకర్యాలు కూడా చేసి దైవానుగ్రహాన్ని పొందాలి. దానముచేత విప్రులకు, జ్ఞానముచేత తనకు రక్షణ కలిగేట్లు రాజు మెలగాలి.

కరధృతదరారివితరణ
పరిపాలిత తొండమాన్నృపాలక!పునరు
త్తరిత నర నప్తృబాలక!
శరణాగతసేవధీ! భుజంగాశరథీ!

నీ హస్తములచేత ధరింపబడిన శంఖమును, చక్రమును ప్రదానం చేసి తొండమాన్ చక్రవర్తిని పాలించినవాడా! మరలా బ్రతికింపబడిన నరుడి(అర్జునుడి) మనుమడిని(నప్తృబాలక) కలిగినవాడా, అర్జునుడి మనుమడైన పరీక్షిత్తును పునర్జీవితుడిని చేసినవాడా, నిన్ను శరణువేడినవారికి పెన్నిధి(సేవధి) ఐనవాడా! భుజంగములను ఆహారముగా కలిగిన(భుజంగాశ) గరుత్మంతుడిని వాహనముగా, రథముగా కలిగినవాడా! శ్రీవేంకటేశా! యిది నాచేత విరచింపబడిన హృద్యమైన పద్యముల ఆముక్తమాల్యద లోని నాలగవ ఆశ్వాసము, వినుమయ్యా అని శ్రీకృష్ణదేవరాయలు నాల్గవ ఆశ్వాసాన్ని ముగిస్తున్నాడు.

కొనసాగింపు తరువాయిసంచికలో)

***వనం వేంకట వరప్రసాదరావు   

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్