సాహితీవనం - వనం వెంకట వర ప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద

అయ్యిందువదన ధరాంగన కావున / బ్రాజ్మైత్రి బొరుగుల భాగవతుల
గృహములందు మరాళికైకావళీ హరి / ణీ మనోజ్ఞా స్రగ్విణీసమాఖ్య
లమర జనించి వయస్య లై నాగక / న్యలు పుత్రికా వివాహములయందు
బాడు పద్మాలయా పరిణయామేయ గే యముల ననంతకళ్యాణగుణము

లద్భుతం బొప్ప విని విని యతని గవయు
బుద్ధి ప్రాగ్జన్మసంస్కరమున జనింప
దదవతారానుమేయ కథాసుథాసు
కలితలీలానుకృతుల వర్తిలుచు నుండి

ఆ చంద్రముఖి ఐన గోదాదేవి భూదేవి అవతరము కనుక పూర్వజన్మలనుండి సంక్రమించిన స్నేహం కారణంగా నాగకన్యలు ఆమెతోపాటే ఆమె స్నేహితురాళ్ళుగా ఇరుగు పొరుగు భాగవతుల ఇళ్ళల్లో జన్మించారు. వారి పేర్లు మరాళిక, ఏకావళి, హరిణి, మనోజ్ఞ, స్రగ్విణి. వారు కూడా గోదాదేవితోపాటే పెరిగి పెద్దవారై యిప్పుడు యుక్తవయస్కలు అయినారు. వారు పెళ్ళిళ్ళలో ఉత్సవాలలో అమ్మవారి కళ్యాణపు విశేషాలను, పద్మాలయ ఐన శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువును వివాహము చేసుకున్న కథను పాటలుగా పాడేవారు. శ్రీమహావిష్ణువుయొక్క అనంతకళ్యాణగుణములను అద్భుతంగా గానం చేసేవారు. ఇక్కడ కూడా ఒక చిన్ని మెరుపు ఉన్నది. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర మథనం జరుగుతున్నపుడు జనించింది, చేతిలో వరమాలతో జన్మించింది, వరుడుగావడానికి అందరూ నేనంటే నేను అని ఉవ్విళ్ళూరుతుంటే, ఆమె శ్రీమహావిష్ణువును చూసి మోహించి, నేరుగా ఆయనను సమీపించి, ఆయనమెడలో ఆ 'మాలను వేసి' వరించింది. ఆ మాల, ఆ మాధవుడు, ఆ పరిణయము అన్నీబాల్యమునుండీ గోదాదేవి పాటలుగా, కథలుగా వింటున్నది, ఆమె మనసు కూడా 'అలానే' మాలవేసి,వలపులమాలలో బందీని చేసి ఆ మాధవుడిని చేపట్టాలి అని ఉవ్విళ్ళూరసాగింది. పూర్వజన్మసంస్కారఫలితముగా మరలా ఈ జన్మలో తన నాథుడిని పొందాలి అని కోరుకోవడం ఒక విషయము అయితే,శ్రీమహావిష్ణువు అవతారాలను, ఆయన విజయగాథలను బాల్యమునుండీ వినీ వినీ ఆయనే మనసులోనిలిచిపోయాడు అనేది మరొక విషయము. యిది మనస్తత్వపరిశీలన, రాయలవారు పరిశీలించనిది

ఏమున్నది కనుక?    

తమతండ్రి శ్రీశదత్తశ్రీలు గృహమున / ద్రవ్వితండములయ్యు దనదు తొంటి
స్రగ్వినిర్మాణదాస్యం బనుత్సేకత / జరపుచు బ్రజ్ఞ వైష్ణవపురాణ
సంహితావ్యాఖ్యారచన బ్రొద్దు గడపుచు / గట్టెడుకమ్మచెంగలువవిరుల
తోమాలె లలకలు దువ్వి కంతునకు బా / ర్హనిబద్ధఖేటకం బనగ నీల

వృషకకుద్రేఖ నెడమకొక్కింత యొరగ
నిడిన ధమ్మిల్లవలయంబు నడుగునందు
గొంతసే పర్థి గీలించి కూపవారి
నీడ వీక్షించి క్రమ్మర గూడ నునుచు

శ్రీమహావిష్ణువు కరుణించి ప్రసాదించిన సిరులు ఉన్నప్పటికీ ఆయన సేవకు నిత్యమూ సేకరించే విరులుప్రీతిపాత్రములు అయినాయి విష్ణుచిత్తులవారికి. మొదటినుండీ ఎలా పూమాలలు అల్లి స్వామివారికిసమర్పించేవాడో అలానే సమర్పించడం, విష్ణుపురాణ వ్యాఖ్యానముతో సమయాన్ని గడపడమూ చేస్తున్నాడు. ఘుమఘుమలాడే చెంగలువపూలతో (కమ్మ చెంగలువ విరులు) దండలు(తోమాలెలు) నేర్పుగా, భక్తితోఅల్లేవాడు. గోదాదేవి చక్కగా కురులను దువ్వుకుని, మన్మథునికి ఆయుధముగా(?) తయారుచేసిననెమలీకల తోరణమో, రానున్నది మన్మథుని తండ్రితో జరపబోయే వలపుల'రణమో' అన్నట్లు, ఆపూలమాలను, స్వామివారికి అలంకరించడానికి విష్ణుచిత్తులవారు తయారుజేసిన పూమాలను, తనకొప్పులో అలంకరించుకునేది తండ్రి చూడకుండా.కొద్దిగా ఎడమప్రక్కకు వాలిన ఆమె కొప్పు నల్లని వృషభముయొక్క మూపురంలా ఉండేది. వృషభముయొక్కమూపురముతోనే పోల్చడం ఎందుకు? వృషభము ధర్మానికి ప్రతీక కనుక. గోదమ్మ యిప్పుడు కాదు,ఎప్పటినుండో ఆ స్వామికి ధర్మపత్ని కనుక.

మరొక కారణమూ ఉన్నది, ఈ అల్పమాత్ర ప్రజ్ఞుని ఉద్దేశములో. వృషభమును అంటే ఎద్దును, ఆంబోతునుఆవులన్నిటికీ భర్తగా అంటే ఆ  ఊళ్ళో ఉన్న గోవులకు సంతానాన్ని కలిగించి 'గో'సంపదను వృద్ధి చేయడంకోసం స్వేచ్ఛగా వదిలిపెడతారు. తెలుగు జానపదులు 'వెంకన్న ఎద్దు' అని ఆ ఆంబోతును వేంకటేశ్వరునిప్రతిరూపముగా భావిస్తారు. కలలో ఎద్దు, ఆంబోతు దర్శనమైతే వేంకటేశ్వరుని కరుణగా భావిస్తారు!ఈ సమస్త విశ్వమూ ఒక గోకులము. జీవులన్నీ స్త్రీలే, గోవులే! పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు.వృషాహీ వృషభో విష్ణుర్వాసుదేవో.. అని కీర్తింపబడే పురుషుడు, పురాణ పురుషుడు, పుండరీకాక్షుడుశ్రీహరి. గోవులు అంటే సాధువులు, భక్తులు, జ్ఞానులు అని కూడా. ఆ గోకులాన్ని, ఆ సాధువుల, భక్తుల,జ్ఞానుల సమూహాన్ని ఉద్ధరించడానికి, వృద్ధి చేయడానికి జన్మించిన 'గోమాత' గోదాదేవి కనుక. గోవు'భూదేవత'కు చిహ్నము కనుక, పూర్వజన్మలో గోదాదేవి 'భూదేవి' అని చెప్పాడు కనుక. ఈ కారణముగావృషభము, వృషభ మూపురము అనే పోలిక తెచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు, ఆయన పాదములకుశత సహస్ర ప్రణామములు!ఆ కొప్పులో ధరించిన పూలమాలతో మిసమిసలాడుతున్న తన సొగసును పెరట్లోని నూతిలో చూసుకునేదిగోదాదేవి. నూతిలో ఎందుకు, ఇంత అలంకరణ చేసుకుంటున్న యువతి ఇంటిలో, అంత సంపన్నుడైన తండ్రిఇంటిలో కనీసం అద్దముకూడా లేదా అంటే, నూతి అయితే ఎక్కడో పెరటిలో ఉంటుంది, తండ్రి గమనించకుండా చూసుకోవచ్చు అని! అదీ రాయలవారి ఔచిత్యము.

అలా మురిపెముగా కొంతసేపు ఆ పూమాలతో తన అందచందాలను చూసుకుని, మరలా ఏమీ తెలియనట్లే, మామూలుగా ఆ పూమాలను దాని స్థానంలో దాన్ని ఉంచేది, యిదంతా తెలియని ఆమె తండ్రి ఆ పూమాలనుతీసుకెళ్ళి కోవెలలో స్వామివారికి అలంకరించేవాడు. యిలా కాలము జరుగుతున్నది, నానాటికీ గోదమ్మకువిష్ణువ్యామోహము పెరుగుతున్నది, మాధవుని తలపుతోనే ఆమె తనువంతా కరుగుతున్నది!

(కొనసాగింపు వచ్చేవారం)

**వనం వేంకట వరప్రసాదరావు 

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్