ఋషి, యోగి, ఆచార్యుడు 'అబ్దుల్ కలాం' గారికి నివాళి! - వనం వేంకట వరప్రసాదరావు

sage , Professor ' Abdul Kalam ' tribute !

ఋషి, యోగి, ఆచార్యుడు 'అబ్దుల్ కలాం' గారికి నివాళి!

తపన, కృషి, క్రమశిక్షణ, ఋజువర్తన, అంకితభావం కలిగి ఉంటే సామాన్యుడు మాన్యుడే కాదు, మహనీయుడు అవుతాడు అని ప్రపంచానికి మరొకసారి చాటిచెప్పిన మహామనీషి అబ్దుల్ కలాం. స్వామి వివేకానంద తర్వాత అంతగా తన పలుకులతో, నడవడితో, నిరాడంబరతో కులమతాలకు అతీతంగా యావత్తూ జాతి గుండెలలో నిలిచిన మహానుభావుడు అబ్దుల్ కలాం. సామాన్యుడి సంక్షేమంకోసం, సర్వ మానవ సమానత్వంకోసం కలలు కనడం, కలలతో ఆగిపోకుండా మార్గనిర్దేశం చేయడం, తను నిర్దేశించిన మార్గంలో తాను నడుస్తూ ఇతరులనువెంట  నడిపించడంలో అసలు సిసలు ఆచార్యుడు అబ్దుల్ కలాం, ఈ విషయములో కూడా స్వామి వివేకానంద గతించిన తర్వాత ఆధునిక భారతంలో అబ్దుల్ కలాం గారినే ఆదర్శంగా తీసుకోవాలి.

అమ్మను ప్రేమించి అమ్మనే తన వృద్ధాప్యములో కూడా కలల్లో చూసిన పసి వృద్ధుడు, నిర్మలమైన పసిమనసును కలిగినవాడు అబ్దుల్ కలాం. శారీరకమైన వాంఛలను జయించి, బ్రహ్మచారిగా జీవించి, ఏం చేస్తున్నా దేశం కోసం, సామాన్య ప్రజలకోసం, రోగులకోసం, పసిపిల్లలకోసం, యువత భవిత కోసం, ఆడపిల్లలను విద్యా ఉపాధి రంగాల్లో ప్రోత్సహించడం కోసం నిరంతరమూ కృషిచేసిన ఋషి అబ్దుల్ కలాం. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు పెద్ద పిల్లాడిలా, పెద్దపిల్లలతో ఉన్నప్పుడు పెద్దన్నయ్యలాగా, వృద్ధులతో ఉన్నప్పుడు సాత్విక జ్ఞాన వృద్ధుడిలా,  సామాన్యులతో సామాన్యుడిలా, అసామాన్యులతో మాన్యుడిలా గడిపి, తనను అందరిలోను, అందరినీ తనలోనూ చూసిన నిజమైన యోగి అబ్దుల్ కలాం. యిదే యోగి లక్షణం అని ఉపనిషత్తు చెప్పింది, గీతాచార్యుడు చెప్పాడు, శుకయోగి ఇలానేబ్రతికాడు, దీన్నే 'గీత'ను ఉపాసించిన అబ్దుల్ కలాం ఆచరణలో చూపించారు.

రోగులకూ, ఆర్తులకూ సేవచేయడంలో, వారి యాతనలను తగ్గించే మార్గాలను అన్వేషించడంలో, మానవత్వానికి, కరుణకు, శాంతి కాముకత్వానికి ప్రభలను చిమ్మిన ఎత్తిన మణిదీపం అబ్దుల్ కలాం. లేత రెమ్మలతో ఎదుగుతున్న పచ్చని చెట్టును చూసి పరవశించిపోయిన ప్రకృతి ప్రేమికుడు, ఆశావాది అబ్దుల్ కలాం. భారతీయుల ధర్మం అందరినీ అన్నిటినీ సమానంగా చూసింది, అలానే చూడాలని చెప్పింది, భారతీయులు తమ నరనరాలలో ఆ ఉపదేశాన్ని జీర్ణించుకున్నారు అన్న సత్యానికి కుల, మత, ప్రాంత, వయో, లింగ విభేదాలకుఅతీతంగా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్న కోట్లాది భారతీయులు, ముఖ్యంగా యువతరం అందమైన ఆనవాలు. ఆప్తుడిని కోల్పోయినట్టు అశ్రువులను రాల్చిన యావద్భారతం 'తరతమ భేదాలు లేని తన నిర్మలమైన ప్రేమను, సహనాన్ని, ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పింది. నా భారతం గుడ్డిగా ద్వేషించదు, గుడ్డిగా నెత్తికి ఎక్కించుకోదు, నా భారతం పడిపోదు, నిలిచే ఉంటుంది, ప్రపంచాన్ని నిలబెడుతుంది అని మరొకసారి ఋజువైంది. ఒకచేతిలో ఖురాన్, మరొక చేతిలో భగవద్గీతను పట్టుకున్న పిల్లాడు, పడవను నడిపి పదో పరకో ఆర్జించి పొట్టపోసుకునే పల్లె జనుల పిల్లాడు కేవలం తన గుణం కారణంగా, తన సాత్వికత కారణంగా, అందరినీ ప్రేమించి, అందరూ హాయిగా ఉండాలని కోరుకునే మనసున్న కారణంగా, ఈ దేశం కోసం, ఈ ప్రజలకోసం, దేశ స్వావలంబనకోసం, దేశ రక్షణకోసం నిరంతరమూ కలలు గనే నిలువునా నిండిన దేశభక్తి కారణంగా, ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రథమ పౌరుడు అయినాడు. హిందూ ఛాందసవాదులు అని చెవులు కొరుక్కుంటున్న నోళ్ళు మూతలుపడి, ఒక సామాన్య ముసల్మాను కుటుంబంలో జన్మించిన మాన్యుడు మా ప్రథమ పౌరుడు అని ఛాతీ విరుచుకున్న హైందవ సర్వత్ర సమదర్శనం యిది దేవతలభూమి అనడానికి ఆధునిక కాలంలో అద్భుతమైన నిదర్శనం! అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఈ దేశ యువతకు, సామాన్యులకు, సర్వులకు దిక్సూచి కావాలి. ఏం చేస్తూన్నా, చూస్తున్నా 'నా దేశం, నా దేశ భవిత, గౌరవం, నా దేశ ప్రజలు, వారి సంక్షేమం కోసం నా చేతనైనంతలో నేను పాటుపడాలి అనే ఆదర్శం అబ్దుల్ కలాం గారి జీవితంనుండి అందరూ తీసుకోవాలి. నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్ధమైన జీవనం, సహనం, ప్రేమ, అందమైన కలలుగంటూ ఆ కలలను నిజం చేసుకోవడం కోసం కష్టపడి  పనిజేయడంలోని ఆనందం, ఆత్మ విశ్వాసం, ఆశావాద దృక్పథం యివన్నీ అబ్దుల్ కలాం గారి జీవితం మనకు నిరంతరమూ బోధించే పాఠాలు. ఆ మహోపాధ్యాయుని పాఠాలు భారత యువతకు వెలుగుబాటలు కావాలి.

ఆ ఆచార్యుని మార్గంలో అందరూ నడవాలి, ఆయన కన్న కలలను నిజం చేయాలి. తద్వారా అబ్దుల్ కలాంగారి ఆత్మకు శాంతి లభించుగాక!   

***వనం వేంకట వరప్రసాదరావు