శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography fourth part

తన తప్పును గ్రహించి తోతాపురి, ఆ క్షణం నుంచి కోపాన్ని పూర్తిగా వదిలివేశారు. కోపావేశుడైన వ్యక్తి తనను తాను మరచి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు. సాధారణ మానవులే కాదు, మహానుభావులు కూడా ఈ క్రోధ ప్రభావానికి లొంగిపోతారు. దీనిని సమర్ధవంతంగా నిగ్రహించ గలిగినవారు ఈ ప్రపంచంలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు.

మళ్ళీ కొద్దికాలానికే నరేంద్రుడు రామకృష్ణుని వద్దకు వెళ్ళాడు. అతనిని చూడగానే రామకృష్ణుడు ఆవేశంతో సమీపించి తన కుడిపాదాన్ని నరేంద్రుని శరీరంపై వుంచాడు. అంతే, దానితో నరేంద్రుని కళ్ళముందు ఆమందిరం యావత్తు క్షణకాలం పాటు గిర్రున తిరిగినట్లయినది. తనతో పాటు ప్రపంచమంతా లయించి పోతున్నట్లనిపించింది. మళ్లా రామకృష్ణుడు పాదం తీసి వేయగానే నరేంద్రుడు మామూలు స్థితికి వచ్చాడు. ఇది నరేంద్రునికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికతడు పరమహంస దగ్గర సెలవుతీసుకొని వెళ్ళిపోయాడు.

"భావ శూన్య సద్భావస్థితి" ఎట్టి భావాలకు తావీయదు. దానిలో మనో వ్యాపారాలన్నీ నిగ్రహించబడతాయి. అలాంటి మనస్సు ఎందులో మునుగుతుందో అదియే బ్రహ్మం. దానికోసం భావన తీవ్రంగా వుండాలి. భార్యా బిడ్డలు, ధనం, ప్రేయసీ, ప్రియులు - ఇలాటి సందర్భాల్లో కలిగే ఆరాటాన్ని మించి వుండాలని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పేవారు.

ఒక మహారాజుకు చీపురుకట్టతో వీధులను తుడవమంటే ఆయనకు అభిమానం అడ్డువస్తుంది. చండాలపేటలోకి, మురికివాడల్లోకి వెళ్ళటానికే సంశయిస్తాడు. కానీ, శ్రీ రామకృష్ణులు, మహాత్మాగాంధీ అటువంటి స్థలాల్లోకి వెళ్లి వారి మురుగుదొడ్లు అన్నింటినీ శుభ్రం చేసేవారు. గాంధీ గారు చీపురుతో శుభ్రం చేయగా, రామకృష్ణులకు ఆయన జటాజూటమే చీపురైందట. వీరందరూ మహాత్ములు. దేనిని లెక్కచెయ్యనివారు. వారీ కర్మలు ఆలోచించి చేసినవి కావు. అసంకల్పిత దైవీ చర్యలు. ఇటువంటివి చదివి, విని ఆశ్చర్యానందాలు పొందవచ్చును. ఆధ్యాత్మిక సాధనలో ఎంతటి తీవ్రమైన స్థాయిలను మహాత్ములు అతి తేలికగా సాధించగలిగారో, తెలుసుకోవచ్చును.

రామకృష్ణులు ఇలా చెప్పారు. నీళ్ళలో అణచబడిన వ్యక్తి ఊపిరికోసం ఎలా కొట్టుకుంటాడో, అటువంటి తీవ్రమైన తపన అవసరమని, అటువంటి వారికే ముక్తి, జ్ఞానం లభిస్తాయని.

మరొకసారి నరేంద్రుడు రామకృష్ణుని వద్దకు వెళ్ళగా, అతడు సమాధిలో నిమగ్నుడై, నరేంద్రుని స్పృశించాడు. దానితో కొంతసేపు నరేంద్రునికి స్పృహ తప్పిపోయింది. ఇటివంటి సంఘటనలను బట్టి రామకృష్ణుడు పిచ్చివాడు కాడనీ, మహా మహిమాన్వితుడు అనీ, నరేంద్రుడు గ్రహించాడు. దానితో అతడు రామకృష్ణుని వద్ద శిష్యరికం ప్రారంభించాడు.

రామకృష్ణ పరమహంస, నరేంద్రుని దైవాంశ సంభూతునిగా, నారాయణ స్వరూపుడుగా భావించేవాడు. తన శిష్యులందరిలోకి అతనిపై, రామకృష్ణునకు ప్రత్యేకమైన వాత్సల్యం. అందుకే మామూలుగా శిష్యులంతా చేసే సేవను నరేంద్రుడు చేయడానికి అతడు అంగీకరించలేదు.

శ్రీ రామకృష్ణ పరమహంస వద్ద లాటూ అనే పరిచారకుడు కూడా స్వామి అనుగ్రహం చేత, తన విద్యా శూన్యతను అతిక్రమించి జ్ఞానాను భావాన్ని పొంది, అద్భుతానందస్వామిగా కీర్తి చెందాడు.

శ్రీ రామకృష్ణ పరమహంసకు కేశవచంద్రసేన్ అనే శిష్యుడు ఉండేవారు. వారు దైవాన్ని గురించి ఉత్తేజ పూర్వకమైన సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చేవారు. వాటికి ఎంతోమంది విద్యావంతులు సంస్కారవంతులు ఉద్యోగస్థులు ఆకర్షితులయ్యేవారు. వారి సమాజంలో, వివేకానంద కూడా ఒక సభ్యుడిగా వుండేవాడు. ఈ విషయాన్ని బట్టి కేశవచంద్ర ఉపన్యాసాలు ఎంత ఆకర్షణీయమైనవో ఊహించుకోవచ్చును. శ్రీ రామకృష్ణులు తరచూ చెప్పేవారు - "భగవంతుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారినుంచే లోకమంతా ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందుకుంటుంది. దీనిని "stamp of authority" అని పేర్కొన్నారు. వారు ఉపయోగించిన అతికొద్ది ఇంగ్లీషు మాటలలో ఇది ఒకటి.

నరేంద్రుడు బ్రహ్మసమాజంలో వుండటం వల్ల విగ్రహారాధన అతనికి నచ్చేదికాదు. కానీ రామకృష్ణుడు విగ్రహారాధనను సమర్ధించేవారు. ఈ విషయంలో వీరిరువురకూ ఎన్నోసార్లు వాద ప్రతివాదాలు తీవ్రంగా జరిగాయి. నరేంద్రునకు అద్వైత వేదాంత రహస్యాలను ఉపదేశించడానికి పరమహంస చాలా ప్రయత్నాలు చేసారు. కానీ అవి ఎంతకూ నరేంద్రునకు అర్ధం కాలేదు.

శ్రీ రామకృష్ణులు "భక్తునిగా ఉండు. కానీ మూర్ఖునిగా ఉండకు" అని భక్తులకు చెప్పేవారు. నరేంద్రుడు దీనిని సమర్ధిస్తూ "మీరందరూ మూడనమ్మకాలతో గూడిన మూర్ఖులుగా ఉండే కంటే, పూర్తి నాస్తికులుగా ఉన్నా ఫరవాలేదు" అనేవారు. నరేంద్రనాథ్ తన లక్ష్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండేవారు. అతని గురుదేవులైన శ్రీ రామకృష్ణులు, తన సాధనా క్రమంలో అష్ట సిద్ధులను సాధించారు. (కానీ రామకృష్ణ పరమహంస సిద్ధులను ఉపయోగించేవారు కాదు. వారు సిద్ధులను వేశ్యమలంగా అభివర్ణించారు). తన ప్రియాతి ప్రియశిష్యుడు నరేంద్రనాథ్ కి, ఆ సిద్ధులన్నిటినీ ఇవ్వటానికి ఆయన సిద్ధపడ్డారు. సాధారణంగా వేరే ఎవరైనా అయితే, వాటిని తీసుకోవటానికి వెంటనే అంగీకరించేవాడే కానీ, నరేంద్రుడు ఆ సిద్ధులు దైవ సాక్షాత్కారాన్ని కలుగజేస్తాయా? లేదా? అని తెలుసుకోవాలనుకున్నాడు. గురువు నుంచి దానికి వ్యతిరేఖంగా సమాధానం పొందిన నరేంద్రుడు, ఆ 'అష్టసిద్ధులు' వద్దని తిరస్కరించాడు. ఆ సిద్ధులు తన లక్ష్యాన్నుంచి తనను మరలించి భగవత్సాక్షారానికి ఆటంకాలవుతాయని అతను భావించాడు.

ఒకరోజు నరేంద్రుడు, తన మిత్రునితో విగ్రహారాధనను వ్యతిరేకించి మాట్లాడుతూ, ప్రతిదీ బ్రహ్మమే అనడం కన్నా అక్రమం లేదని చెపుతూ వుండగా, రామకృష్ణుడు అదివిని, నరేంద్రుని సమీపించి చేతితో తాకి సమాధిలో నిమగ్నమయ్యారు. దానితో నరేంద్రునకు ప్రపంచంలోని ప్రతి వస్తువు బ్రహ్మమై కనిపించసాగింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అద్వైత సిద్ధాంతం నరేంద్రునికి  పూర్తిగా అర్ధమైంది. రామకృష్ణుని సంకల్పం సత్ఫలితాన్ని సాధించింది.

(...ఇంకా వుంది)