ఆంద్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు - టీవీయస్. శాస్త్రి

andhra kesari tanguturi prakasam pantulu

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంద్ర రాష్ట్ర ప్రధమ ముఖ్య మంత్రి, ప్రజా నాయకుడు అయిన శ్రీ ప్రకాశం పంతులు గారిని గురించి నాకు తెలిసిన విషయాలు క్లుప్తంగా చెబుతాను. 'ఆంద్ర కేసరి'గా వారిని తెలుగు ప్రజలు గౌరవంగా పిలుచు కుంటారు. శ్రీ ప్రకాశం పంతులు గారు నేటి ప్రకాశం జిల్లాలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈ తెలుగు వారి ముద్దుబిడ్డను కన్న ధన్యజీవులు గోపాలకృష్ణయ్య , సుబ్బమ్మ దంపతులు. ప్రకాశం గారికి తన పదకొండవ ఏటనే పితృ వియోగం కలిగింది. తల్లి ఒక చిన్న భోజనశాలను ఒంగోలు పట్టణంలో నడుపుతూ కుటుంబ భారం మోసింది. కష్టపడి పిల్లలను బాగా చదివించి వున్నత స్థితికి తీసుకొని రావాలని ఆవిడ సంకల్పం. శ్రీ హనుమంతరావు నాయుడు గారు ప్రకాశం గారికి గురువు మరియూ మార్గ దర్శకుడు. వారు రాజమహేంద్రవరం వెళ్ళుతూ, అక్కడ విద్యాభ్యాసానికి మంచి అవకాశాలు వున్నాయనే భావనతో ప్రకాశం గారిని కూడా తన వెంట తీసుకొని వెళ్ళారు. ప్రకాశం గారికి న్యాయవాది కావాలనే బలమైన కాంక్ష ఉన్నప్పటికీ, మెట్రిక్యులేషన్ పరీక్షలోనే ఉత్తీర్ణులు కాలేక పోయారు. దానికి కారణం, ఆయనకు స్నేహితులు ఎక్కువ. అంతకు మించి వారికి నాటకాలంటే చెప్పలేనంత పిచ్చి.

ఒక పక్క నాటకాలలో వేషాలు వేస్తూనే, పట్టుదలతో చదివి మద్రాసుకు వెళ్లి అక్కడ లా కాలేజీలో చదివి, రాజమహేంద్రవరంలో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. ఆ వృత్తిలో వారు బాగారాణించి పేరు ప్రఖ్యాతులు మరియూ అత్యధిక ధనం అనతికాలంలోనే సంపాదించారు. అచిర కాలంలోనే రాజమహేంద్ర పురవాసుల మన్నన సంపాదించి, రాజమహేంద్రవరానికీ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అప్పుడు వారి వయసు 30 సంవత్సరాలు. వారి ప్రజా జీవిత ప్రస్థానంలో తొలి సోపానం ఇదే! ఆ తరువాత బారిస్టర్ చదువులకై ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ తన చదువును విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చారు. శ్రీ దాదాభాయి నౌరోజీ నేతృత్వంలో రాజకీయాలలో ప్రవేశించి చురుకుగా పని చేసి అతి తక్కువ కాలంలోనే పలువురు జాతీయ నాయకుల దృష్టికి వెళ్ళారు. స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

ఆ కాలంలో బ్రిటిష్ వారు నియమించిన సైమన్ కమీషన్ భారత దేశానికి వచ్చింది. నాటి కాంగ్రెస్ పార్టీ వారు, సైమన్ కమీషన్ వారి రాకను వ్యతిరేకిస్తూ, 'సైమన్ గో బాక్' అనే నినాదాన్ని తీసుకొని వ్యతి రేకించమని దేశంలోని కార్యకర్తలందరికీ ఆదేశాలు యిచ్చారు. సైమన్ కమీషన్ వారి రాకను వ్యతిరేకించటానికి ముఖ్య కారణం-- ఆ కమీషన్ లో ఒక్క భారతీయుడు కూడా లేక పోవటమే!సైమన్ కమీషన్ వారికి ప్రతి చోట నల్ల జండాలతో , వారి రాక పట్ల తీవ్ర నిరసన తెలిపారు. సైమన్ కమీషన్ వారు మద్రాసు కు వచ్చిన సమయంలో పోలీసు వారు ఆందోళన కారులను అడ్డగించారు. దానితో ప్రజలు మరీ వుగ్రులై విపరీతంగా గుమికూడి సైమన్ కమీషన్ పట్ల తమ నిరసనను మరీ తీవ్ర స్వరంలో వినిపించారు. పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఒక యువకుడు వెంటనే అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రజలు చనిపోయిన యువకుని శవం తీసుకోవటానికి ముందుకు వురుకుతున్నారు. పోలీసులు, ముందుకు వస్తే మళ్ళీ కాల్పులు జరుపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ సమయంలో ప్రకాశం గారు ధైర్యంగా పోలీసులను సమీపించి, తన చొక్కా బొత్తాములను తీసి గుండె చూపించి, "గుండుతో ముందు నన్ను కాల్చండి" అని పోలీసులకు ప్రతి సవాల్ విసిరారు. పరిస్థితిని అర్ధం చేసుకున్న పోలీసులు ప్రకాశం గారికీ, ఆయన అనుచరులకూ దారి యిచ్చారు. ఈ సంఘటన తరువాత నుండీ ప్రజలు ప్రేమతో వీరిని 'ఆంద్ర కేసరి' అని పిలిచి గౌరవించేవారు.

1941 లోదక్షిణభారతదేశం నుండి సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి వ్యక్తి ప్రకాశంగారు. 1942 లో Quit India ఉద్యమంలో పాల్గొని మూడేండ్లు కఠిన కారాగారవాస శిక్షను అనుభవించారు. 1945 లో జైలు నుండి విడుదల అయిన తరువాత దక్షిణ భారత దేశమంతా విస్తృత పర్యటన చేసి ప్రజలూ వారి సమస్యలతో మమేకమయ్యారు. 1946 లో మద్రాసు ప్రెసిడెన్సీ కి జరిగిన ఎన్నికలలో ప్రకాశం గారు ముఖ్యమంత్రి అయ్యారు. తమిళుడు అయిన కామరాజ్ గారు వీరి నాయకత్వాన్ని బలపరచారు. ఆ ఎన్నికలో వీరికి ప్రధాన ప్రత్యర్ధి శ్రీ రాజాజీ. కానీ ఆ ప్రభుత్వం 11 నెలలు మాత్రమే పనిచేసి పడిపోయింది. కానీ, ప్రకాశం గారి ప్రజా జీవన యాత్రలో ఏ మార్పూ లేదు. సామాన్య మానవుడి సంక్షేమమే ఆయన జీవిత లక్ష్యం. దానికోసం జీవించినంత కాలం పోరాడారు. 1948 లో, నెహ్రూ గారు ప్రకాశం గారి క్షేమం దృష్టిలో వుంచుకొని వారించినా, నిజాం పరిపాలనలో వున్న హైదరాబాద్ రాష్ట్రం అంతా పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. రజాకార్ల నాయకుడైన ఖాసిం రజ్వీని కూడా కలిసారు. ఆయన ధైర్య సాహసాలకు రజాకార్లు 1952 లో గౌరవ సూచనగా మార్చింగ్ కూడా చేశారు. అలా శత్రువు గుహలోకి ధైర్యంగా చొరపడగల సింహం శ్రీ ప్రకాశం గారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి 'ప్రజా పార్టీ'ని స్థాపించి విశేష ప్రచారం చేసి కృషి చేసినప్పటికీ, అది అధికారంలోకి రాలేక పోయింది. ఈ పరిస్థితులలో 1952 లో పొట్టి శ్రీ రాములు గారు ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా వీరూ ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజ్యాంగంప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి నపుడు, తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం యెందుకు ఇవ్వరు? అని నెహ్రూ ను నిలదీసి ఒక రూపాయి నోటును విసిరివేసి, "చూడండీ! ఈ రూపాయి నోటులో ఒక్క రూపాయి అని తెలుగులో వ్రాసివుంది, మాకు ప్రత్యేక రాష్ట్రం యెందుకు ఇవ్వరూ?" అని గర్జించారు. పొట్టి శ్రీ రాములు గారి ఆత్మార్పణం తరువాత 1953 అక్టోబర్ లో ప్రత్యేక ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది. నెహ్రూ గారి కోరిక మేరకు ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. కమ్యూనిష్టులు మద్దతు విరమించుకోవటం తో ఒక సంవత్సరం తరువాత వారి ప్రభుత్వం కుప్పకూలింది. 1955 లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పటికీ, ప్రకాశం గారు ప్రత్యక్ష రాజకీయాలనుండి విరమించుకున్నారు.

1956 నవంబర్ 1 వ తేదీన పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం విలీనంతో 'ఆంద్ర ప్రదేశ్' అవతరణ జరిగింది. ప్రకాశం గారి ముఖ్య అనుచరుడైన శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు ప్రత్యక్ష రాజకీయాలనుండి విరమించు కున్నప్పటికీ ప్రజలతో సంబంధాలను జీవించినంత కాలం కొన సాగించారు. ఒక సారి ఒంగోలు లో పర్యటించే సందర్భంలో తీవ్రమైన వడ దెబ్బ తగిలి, హైదరాబాద్ లోని హాస్పటల్ కు తరలించారు. కానీ, ఏ మాత్రం లాభం లేకపోయింది. వారిని 20 మే, 1957. న మృత్యువు కబళించింది. ప్రముఖ గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి వీరి అన్నగారి కూతురు. మరొక ప్రముఖ నటుడు శ్రీ విజయ చందర్ వీరి మనవడు(కూతురి కొడుకు). శ్రీ విజయ చందర్, ప్రకాశం గారి జీవిత చరిత్రను 'ఆంద్ర కేసరి' అనే పేరుతొ ఒక మంచి సినిమా తీయటమే కాకుండా , అందులో ప్రకాశం గారి పాత్రను కూడా పోషించారు. ఈ సినిమా తప్పక చూడవలసిన సినిమా!

ఆంద్ర దేశ ప్రజల హృదయాలలో చిరంజీవి గా వున్న ఆ మహనీయునికి నా స్మృత్యంజలి...

మరిన్ని వ్యాసాలు