గృహయోగం - డా. హేమావతి బొబ్బు LLB, MSc, Ph.D

Gruhayogam

సిరికాకుళం జిల్లాలోని ఒక మారుమూల చిన్న పల్లెటూరు. అక్కడ పార్వతమ్మ ను చూస్తే అందరికీ ఒక ఆశ్చర్యం. తెల్లవారుజామునే లేచి బావి దగ్గర నీళ్లు తోడుతున్నా, పొలంలో కలుపు తీస్తున్నా, ఇంట్లో వంట చేస్తున్నా.. ఆమె మొఖంలో ఒక వింతైన వెలుగు ఉండేది. ఆమె మొహం లో చిరునవ్వు ఆమెను అందరికి చేరువ చేసింది. ​ఒక రోజు మధ్యాహ్నం, వూరి రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న గంగాధరం మాస్టారు ఆవును తోలుకుని పొలం నుండి ఇంటికి పోతున్న పార్వతమ్మను ఆపి అడిగారు...."అమ్మా ! నీ మొగుడు తాగుబోతోడు, నీ కొడుకులు నీ మాట వినరు, ఇంటి నిండా అప్పులు.. అయినా సరే, నువ్వు ఎలాగమ్మా అంత నిబ్బరంగా ఉంటావు? " నీకేమైనా మంత్రం తెలుసా, లేకపోతే ఏ సాములోళ్ల దగ్గరైనా ఉపదేశం పొందావా?" అన్నాడు. ​పార్వతమ్మ అయన వైపు చిరునవ్వు తో చూస్తూ, తన తెల్ల చీర అంచుతో మొఖం తుడుచుకుని, మెల్లగా నవ్వి చెప్పింది... ​"ఏం లేదు మాస్టారూ.. ఇదంతా ఆ సామి ఆట. మొదట్లో నేను కూడా 'నా ఇల్లు', 'నా మొగుడు', 'నా బతుకు' అని ఏడ్చేదాన్ని. కానీ ఒకసారి గుడిలో పురాణం విన్నాక నా మతి మారింది. 'ఆత్మ సమర్పణ' అంటే ఏదో పెద్ద మాట అనుకున్నాను కానీ, అది మనసు చేసే మొక్కు అని తెలిసింది." ​మాస్టారు ఆశ్చర్యంగా వింటున్నారు. పార్వతమ్మ కొనసాగించింది.... ​"మాస్టారూ.. ఇప్పుడు నేను వంట చేస్తున్నానంటే, అది నా మొగుడి కోసం కాదు, ఆయన లోపల ఉన్న ఆ భగవంతుడి కోసం. ప్రతి మనిషి లో భగవంతుడు ఉన్నాడు అనుకుంటాను. ఈ శరీరానికి విలువ ఇవ్వడం మానేశాను. ఆకాశం లో ఉన్న శక్తి నాలోని ఉంది, తిరిగి ఆ దైవాన్ని కలుస్తుంది అనుకుని, మరణానికి విలువ ఇవ్వను". "నా కొడుకులు నన్ను విసిగిస్తుంటే.. 'ఓహో! నా సామి నా ఓపికను పరీక్షిస్తున్నాడు' అని నవ్వుకుంటాను". రోజంతా పనులు చేస్తాను కానీ, రాత్రి పడుకునే ముందు.. 'స్వామీ! ఇవన్నీ నీ పనులే, నేను నీ చేతిలో ఒక కర్ర ముక్కను మాత్రమే. లాభం వచ్చినా, నష్టం వచ్చినా అది నీకే అప్పజెప్పేస్తున్నాను' అని మనసుని ఆయన కాళ్ల దగ్గర పెట్టేస్తాను." ​గంగాధరం మాస్టారు అడిగారు, "అంటే బాధ కలగదా పార్వతమ్మ?" ​"ఎందుకు కలగదు మాస్టారూ? శరీరం అన్నాక నొప్పి ఉంటాది. కానీ ఆ నొప్పిని నేను పట్టుకోను. సముద్రంలో కెరటం వస్తాది, పోతాది.. కానీ సముద్రం అక్కడే ఉంటాది కదా? నా మనసు కూడా అంతే. పైన గొడవలున్నా, లోపల మాత్రం ఆ సిరికాకుళం ఆంధ్రమహావిష్ణువు పాదాల దగ్గర ఉన్నట్టు నిశ్శబ్దంగా ఉంటాది. ఇదే నా యోగం.. దీనికి కాషాయం అక్కర్లేదు, కొండలకి వెళ్లక్కర్లేదు. చేసే పనిలో 'నేను' 'నాది' అనే అహంకారాన్ని చంపేస్తే, అదే పెద్ద తపస్సు." ​ఆ మాటలు విన్న మాస్టారుకి అర్థమైంది... పార్వతమ్మ చదువుకోలేదు కానీ, వేదాల సారాన్ని తన జీవితంలో కలిపేసుకుందని. ఆమె ఒక సామాన్యమైన ఆడది కాదు, సంసార సాగరంలో మునగని ఒక నిజమైన యోగిని.

మరిన్ని కథలు

Jadivaana
జడివాన
- కొడవంటి ఉషా కుమారి
Karmafalam
కర్మఫలం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vepachettu tho sahajeevanam
వేపచెట్టుతో సహజీవనం
- బూర్గుల రవి, టీచర్
Mundadugu
ముందడుగు
- Prabhavathi pusapati
Tanku malina dhatrmam
తనకు మాలిన ధర్మం
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Pedda bottaame katha
పెద్ద బొట్టామె కథ
- హేమావతి బొబ్బు
Guruvu viluva
గురువు విలువ
- తాత మోహనకృష్ణ
సంకల్పం
సంకల్పం
- డా:సి.హెచ్.ప్రతాప్