ఏం చదువుకున్నామన్నది కాదు గురూ.. - ...

how to skill development

ఈ రోజుల్లో బీటెక్‌ చాలా చిన్న విషయం. విదేశాలకు వెళ్ళి ఎంఎస్‌ చేసేయడం కూడా చాలా మామూలు విషయంగా మారిపోయింది. డిగ్రీలు అలవోకగా, 'వ్యాలెట్‌'లో చేరిపోవచ్చుగానీ, ఎంత చదివినా 'స్కిల్స్‌' లేకపోతే ఏ రంగంలోనైనా రాణించడం కష్టమే. సాధారణ బీఏ చేసినవారూ, అసలేమీ చదువుకోనివారూ వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలు సాధించడం గురించి వింటూనే ఉన్నాం. అలాంటిది అత్యున్నత చదువులు చదివి కూడా జీవితంలో ముందడుగు వేయలేకపోవడమంటే అది ఎంత అవమానకరం? కాలానికనుగుణంగా తమను తాము మార్చుకున్నప్పుడే ఏ రంగంలో అయినా సత్తా చాటగలం. నేటి యువత ముఖ్యంగా గుర్తుచేసుకోవాల్సిన అంశమిదే. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అనగానే ఇంజనీరింగ్‌ విభాగంలో కాకుండా సాఫ్ట్‌వేర్‌ విభాగం వైపు దృష్టి సారించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే అక్కడ 'ఫ్రెషర్స్‌' కోటాలో అతి తక్కువ వేతనాలతో వారి కెరీర్‌ ప్రారంభమవుతోంది. 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అయితే సమస్యేమీ లేదు. అక్కడ ఓ సారి తేడా వచ్చిందంటే అంతే సంగతులు. ఇంజనీరింగ్‌ విభాగంలో నైపుణ్యం లేకపోవడంతో, తిరిగి ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకుని ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించినా ఫలితం ఉండటంలేదు. 

కళాశాల స్థాయి నుంచే 'స్కిల్‌ డెవలప్‌మెంట్‌' విషయంలో యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అది ఇంజనీరింగ్‌ కావొచ్చు, ఇంకైదనా కావొచ్చు. స్కిల్స్‌ మాత్రం తప్పనిసరి. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన డాక్టర్‌నే తీసుకుందాం. స్కిల్స్‌ ఉంటే, వైద్య రంగంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించేందుకు అవకాశమేర్పడుతుంది. లేనప్పుడు, ఎంబీబీఎస్‌ కాదు కదా, ఎంఎస్‌ చేసినాసరే వైద్య రంగంలో తగిన గుర్తింపు సాధించలేరు. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, సీఏ ఇలా ఏదైనా కావొచ్చుగాక. చదువుతోపాటుగా స్కిల్స్‌ ఉన్నప్పుడే ఆ చదువుకి విలువ అని గుర్తుంచుకోవాలి. ఓ అంచనా ప్రకారం మన దేశంలో తయారవుతున్న ఇంజనీర్లలో సగం మందికి పైగా నైపుణ్యం లేనివారేనని తేలింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించిన కఠోర వాస్తవాలివి. నిజం ఇప్పుడూ కష్టంగానే అనిపిస్తుంటుంది. ఆ నిజాన్ని జీర్ణించుకోగలగాలి. లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. అప్పుడే ధైర్యంగా ముందడుగు వేయగలం, సత్తా చాటగలం. 

'గొర్రెల మంద' అన్న మాట అవాంఛనీయం అయినప్పటికీ కూడా, చాలా కళాశాలలు విద్యార్థుల్ని అలాగే భావిస్తున్నాయి. తమ సంస్థలు నడిచేందుకోసం ఆర్థిక వనరుల్ని సమకూర్చే మనీ మెషీన్లుగా మాత్రమే విద్యార్థుల్ని చూస్తున్నాయి. సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఎలాగోలా తమ బిడ్డ ఇంజనీరింగ్‌ పూర్తి చేసెయ్యాలనో, ఇంకో డిగ్రీ తమ పిల్లల 'వ్యాలెట్‌'లో చేరాలనో కోరుకుంటున్న తల్లిదండ్రులూ, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టగలిగితే పిల్లల భవిష్యత్‌ అత్యద్భుతంగా ఉంటుంది. భారతదేశంలో టాలెంట్‌కి కొదవ లేదు. కానీ, ఆ టాలెంట్‌ని వెలికి తీయడంలోనే అశ్రద్ధ. అదే అన్ని అనర్ధాలకీ మూలం.