12-19: ఈ వయసు యమ డేంజర్‌ - ..

12 to 19 years too dangerous

మీ పిల్లల వయసు 12 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ మధ్యలో ఉందా? అయితే మీ కోసమే ఈ హెచ్చరిక. ఇది గణాంకాల ద్వారా వెల్లడవుతున్న హెచ్చరిక. శాస్త్రీయ అధ్యయనాల అనంతరం చేస్తున్న హెచ్చరిక. మరీ భయపడిపోవాల్సిన అవసరం లేదుగానీ, అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే మాత్రం అనూహ్య పరిణామాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు 18 నుంచి 21 ఏళ్ళ మధ్య వయసుని 'ఈ వయసు చాలా హాట్‌ గురూ' అని చెప్పుకునేవాళ్ళం. రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. చిత్రంగా కమ్యూనికేషన్‌ తగ్గింది. ఫ్రెండ్స్‌తో కమ్యూనికేషన్‌ పెరిగిపోయి, పేరెంట్స్‌తో కమ్యూనికేషన్‌ తగ్గిపోతుండడమే అన్ని అనర్థాలకీ కారణం. పొద్దున్నే ఆరు గంటలకే స్కూల్‌ బస్‌ ఎక్కేస్తున్నారు చిన్నారులు. సాయంత్రం ఏడింటికిగానీ ఇంటికి చేరుకోవడంలేదు. ట్యూషన్‌ ఉంటే ఇక రాత్రి 9 తర్వాతే పిల్లలు, తల్లిదండ్రులకి కన్పించేది. ఇక్కడ పిల్లలు అంటే స్కూలుకి వెళ్ళేవారే కాదు, కాలేజీలకు వెళ్ళేవారు కూడా!

ఈ 12 నుంచి 19 ఏళ్ళ ఏజ్‌లోనూ మళ్ళీ గ్రూపులున్నాయి. 12 నుంచి 15 వరకు ఒక గ్రూప్‌, 15 నుంచి 17 వరకు ఇంకో గ్రూప్‌, 17 నుంచి 19 వరకు మరో గ్రూప్‌. ఒకదాన్ని మించి ఇంకోటి యువతను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. ముందే చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులతో పిల్లలకు కమ్యూనికేషన్‌ తగ్గిపోతోందని. ఆ తగ్గిపోవడం కొన్ని సందర్భాల్లో తెగిపోవడానికీ దారి తీస్తుండడం బాధపడాల్సిన అంశం. మరి ఎలా? పిల్లల్ని దగ్గర చేసుకోవడమెలా? వారిని సన్మార్గంలో నడిపించడమెలా? వారిని అర్థం చేసుకోవడమెలా? ఈ ప్రశ్నలకు మానసిక వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. చదువు పరంగా ఒత్తిడిని వీలైనంతవరకు పిల్లల మీద తగ్గించడంతోపాటుగా, తల్లిదండ్రులు - పిల్లలు ఎక్కువగా ఇంటరాక్షన్‌ అయ్యేందుకు సమయం కేటాయించాల్సిందేనని వారు సూచన చేయడం జరుగుతోంది. లేనిపక్షంలో పిల్లల ఆలోచనలు ఇంకో వైపుకు మళ్ళిపోతాయి.

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఇప్పుడు ఓ విష సంస్కృతిగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ లేదా ట్యాబ్‌ కావొచ్చు, స్మార్ట్‌ ఫోన్‌ అయినా కావొచ్చు. అక్కడ విజ్ఞానానికి బదులుగా ఇంకో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటోన్న యువత పెరుగుతోంది. ప్రమాదకరమైన ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారిలో భారతీయ యువత ముందంజలో ఉంది. అదొక్కటే కాదు, ఆ ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారిలోనూ మనమే ముందున్నాం. చిత్రంగా ఇంతటి ప్రమాదకరమైన గేమ్స్‌కి రూపకల్పన చేస్తున్నది ఆ 12 నుంచి 19 ఏళ్ళలోపువారే. మద్యానికి బానిసలవడం, సిగరెట్‌కి అలవాటు పడటం, ఇంకో రకమైన వ్యసనాల బారిన పడటం అనేది ఒకప్పటి మాట. వాటన్నిటికన్నా ప్రమాదకరమైన 'స్మార్ట్‌' వ్యసనం ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడటమే అయిపోయింది. సో తల్లిదండ్రులూ పిల్లల విషయంలో 'కేర్‌' తప్పనిసరి. 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు