వేపచెట్టుతో సహజీవనం - బూర్గుల రవి, టీచర్

Vepachettu tho sahajeevanam

సూర్యుడు నారింజ రంగు పులుముకొని మేఘాలు కొండలు,చెట్లు చేమలు దాటుకొని తాటి కమ్మల గుడిసె చూరు సందు నుండి తన కిరణ హస్తాలతో రామయ్య తాతను తట్టి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. తొమ్మిది పదుల భారమైన అనుభూతులు, ఆలోచనలు చుట్టుముట్టి మనసంతా బరువెక్కి నులక మంచంలో నడుము వాల్చి ఉన్న రామయ్య తాత ఒంటిపై ఎండ పడగానే లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుని పక్కన ఉన్న కళ్ళజోడు పెట్టుకుని లేత భానున్ని చూసి రెండు చేతులెత్తి నమస్కరించాడు. మెల్లగా లేచి గుడిసెముందు రెక్కలు తెగిన పక్షిలా తనవైపు దీనంగా చూస్తున్న వేప చెట్టు వైపు నడిచాడు. చెట్టు దగ్గరగా వెళ్లి దాన్ని కింద నుండి పైకి చూసి రెండు చేతులు దాని చుట్టూ వేసి కౌగిలించుకున్నాడు. మెల్లగా కళ్ళు మూసుకుని దాన్ని తడిమి తడిమి స్పృశిస్తూ తన బాల్య స్మృతుల్లోకి జారుకున్నాడు. తనకి మూడేళ్ల వయసు. ఓ రోజు సాయంకాలం నాన్న భుజంపై అరక, ముందు కాడెద్దుల జత గంభీరంగా నడుస్తుంది. వెనకాల చల్లని గోమాత దాని చుట్టూ చెంగుచెంగున ఎగురుతూ పరుగులు తీస్తున్న తెల్లని లేగదూడ. నెత్తిన ఆకలి తీర్చే గంజికుండతో అమ్మ, అమ్మ కడుపులో తమ్ముడు, అమ్మ ఎడమ చేతి చూపులు వేలు పట్టుకొని లేగదూడ గెంతులకు కేరింతలు కొడుతూ తనూ నడుస్తున్నాడు. ఆ దారిలో ఒక చోట చటుక్కున తను ఆగాడు. దారి పక్కన ఒక లేత వేప మొక్క కనిపించింది. దాన్ని ఇంటి పెరట్లో నాటుకుందామని అమ్మను అడిగాడు. అమ్మ సరే అని తీసి ఇచ్చింది. అపురూపంగా దాన్ని తన చిట్టి చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకువచ్చి నాన్న సాయంతో ఇంటిముందు నాటాడు. అది మొదలు ఆ వేప మొక్కకు తనకు అనుబంధం మొదలయ్యింది. ఆటపాటలన్నీ ఆ లేత మొక్క చుట్టే. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఊసులు ఎన్నో మాటలు ఆ మొక్కతోనే. అమ్మ కోప్పడితే అలిగి మొక్క ఒడిలోనే ఆదమరిచి నిద్రించేవాడు. ఆడుకునే వేళ, తినే వేళ, ప్రతి ఆనందంలోనూ, బాధలోనూ భాగమయ్యేది. రోజు రోజుకి వేగంగా పెరుగుతూ మొక్క చెట్టయింది. ప్రతిరోజు ఉదయం దాని లేత పుల్లలతో పళ్ళు తోముకోవడంతో దినచర్య మొదలయ్యేది. ముత్యాల వంటి దాని రాలిన వేపపండ్లు ఏరి డబ్బా నింపి షావుకారుకు ఇస్తే పావలా ఇచ్చేవాడు. ఇంటి పశువులకు వేపచెట్టు తానే నివాసమయి నిలుచునేది. తనకి తమ్మునికి అమ్మతల్లి వేసినప్పుడు పక్కలో పాన్పు అయ్యేది. వేపాకులు మెత్తగా నూరి తన ఒళ్లంతా పట్టించడానికి మంచి గంధపు లేపనం అయ్యేది. అమ్మ బోనాన్ని అలంకరించి వేపాకులను బోనానికి కట్టి చేతుల్లో వేపమండలతో దేవతల పూనకంతో గుడికి వెళ్ళేది. ఉగాది పండగొస్తే నాన్న ఉగాది పచ్చడిని చేసి వేప పువ్వులను కలిపి రుచి చూపించేవాడు. గూడు లేని పక్షులకు గూడునిచ్చేది. తన తోటి బాలల కోతికొమ్మచ్చి ఆటలకు సహకరించేది. ఆ వేప చెట్టు కింద ఎప్పుడు ఒక నులక మంచం ఉండేది. ఇంటికి చుట్టం వచ్చినా, అధికారులు వచ్చినా ఆ చెట్టే నీడనిచ్చేది. ఎండాకాలం ఆడపిల్లలు, మహిళలు అష్టచెమ్మ ఆటలకు ఆవాసమయ్యేది. ముసలి వాళ్ళ కబుర్లకు నిలయమయ్యేది. పండగైనా, పెళ్లయినా, వేడుకైనా ఇంటికి పదిమంది వస్తే తన నీడ దిక్కయ్యేది. ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి దూలాలయ్యి నిలుచునేది. వేప చెట్టు పైనుండి ఒక చిన్న కొమ్మ విరిగి కింద పడిన చప్పుడుకు రామయ్య తాత ఒక్కసారిగా ఆలోచన నుండి బయటకు వచ్చి తలపైకెత్తి చెట్టును చూశాడు. అది తన వైపు దీనంగా చూస్తుంది. ఎన్నో రోగాలకు మందు అయిన వేప చెట్టుకు నేడు మాయ రోగం అంటింది. వైరస్ సోకి, ఆకులన్నీ మాడిపోయి, రాలిపోయి, కొమ్మలు బలహీనమై ఒక్కొక్కటిగా విరిగి పడుతున్నాయి. దాని దీనస్థితిని చూసి బరువెక్కిన గుండెతో రామయ్య తాత దాని మొదలును ఆనుకొని అలాగే కూర్చుండిపోయాడు. చాలా సమయం గడిచింది. తాతలో చలనం లేదు. పాపం బరువెక్కిన ఆ గుండె బద్దలైంది. తాత చితిలో కూడా ఆ వేపచెట్టు తోడయ్యి రెండు దేహాలు బూడిదగా విలీనమయ్యాయి.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)