చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

ఈ రోజుల్లో చాలా ఇళ్ళల్లో వినే మాట ఏమిటంటే, ' ఏమిటోనండి, మా చిన్నప్పుడు, మాకేది ఇష్టమో తెలిసికోకుండా, మా తల్లితండ్రులు చెప్పిందే చదివి, వాళ్ళబలవంతం మీదే ఇంజనీరింగూ, మెడిసినూ చదవవలసి వొచ్చిందీ, మాకు దేంట్లో ఇంటరెస్టుందీ చెప్పుకోడానికి కూడా స్వతంత్రం లేదూ, అందువలన మా పిల్లలకి అలాటి పరిస్థితి రాకుండా,We treat them as our friends', అనడం ఓ ఫాషనైపోయింది.వినడానికి బాగానే ఉంటుంది ఎవరికీ ఈ నవతరంలోని తల్లితండ్రులకి. అస్తమానూ, వాళ్ళ తల్లితండ్రులేదో, వాళ్ళని హింసపెట్టేశారూ అని దిన్ భర్ మొత్తుకోకుండా, అసలలాటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలిసికోడానికి, ప్రయత్నం, atleast a cursory attempt చేశారా ఒక్కరైనా?

అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదే మంచి అనే అపోహలో ఉన్నట్లే.ఒకసంగతి చెప్పండి, మీరు అంటే ఇప్పటి తల్లితండ్రులు, మీరు చదువుకునే రోజుల్లో, పరీక్షలై శలవలు మొదలెట్టిన తరువాత ఏం చేసేవారు? ముందుగా, ఆ ఏడాదంతా ఔపోసన పట్టిన పుస్తకాలని, అటకెక్కించేయడమో, ఇంకోరెవరికైనా అవసరం వస్తే వాళ్ళకిచ్చేయడమో. వరుసగా ఓ వారం రోజులపాటు, అలుపూ సొలుపూ లేకుండా, ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసేయడం,ఎండొచ్చేవరకూ నిద్రలేవకపోవడమూ,అప్పుడు మెల్లిగా స్నానం పానం చేసి, అమ్మ పెట్టేదేదో తిని, మళ్ళీ ఊరిమీద పడడం. అంతేగా. మీ అమ్మా నాన్నా ఎప్పుడైనా ఒక్కసారైనా ఏమైనా అన్నారా? పోన్లెద్దూ, ఏడాదంతా శ్రమ పడి చదివాడూ, శలవల్లోనైనా రిలాక్స్ అవనీ అనేవారు కానీ, అస్తమానూ ఊరిమిద పడి తిరుగుతావేమిటిరా అని ఒక్కటంటే ఒక్కసారైనా మీతో అన్నట్లు గుర్తుందా?ఆలోచించండి.

కానీ మీరు ఇప్పుడు, అక్కడికేదో మీకు అన్యాయం జరిగిపోయిందనే flimsy excuse తో ,మీ పిల్లలని పెడుతున్న హింస ఏమిటీ? శలవలొచ్చేసే ముందరే, నెట్ లో వెదికేసి, ఊళ్ళో ఎక్కడెక్కడ ఏ ఏ so called కళల్లో, కోచింగ్ క్లాసులున్నాయో తెలిసికుని, వాళ్ళని రోజంతా కోచింగులకే కదా పంపేది? Idea is to keep them fully engaged. ఏమైనా అంటే, మా వాడికి ఫలానా గిటార్ అంటే ఇష్టమండీ, డ్రాయింగంటే ఇష్టమండీ,ఫలానా యోగా అంటే ఇష్టమండీ, ప్రాణాయామం అంటే పడి చస్తాడు.సంగీతం అంటే చెవి కోసుకుంటుంది అనే వంకతో ప్రొద్దుటే హిందుస్థానీ, సాయంత్రం కర్నాటక సంగీతమూనూ. ఈ మధ్యలో టైముంటే జిమ్మూ.ఇవన్నీ వాళ్ళకి ఇష్టం అని మీకు చెప్పారా? వాళ్ళని అడిగేదేమిటిలే అని మీరే డిసైడ్ చేసేశారా? ఉన్న నెలా పదిహెను రోజులో, రెండు నెలలో శలవుల్లో, ఇన్నేసి కళల్లో వాళ్ళు అంటే మీ పిల్లలు,expert అయిపోతారని మీరెలా అనుకున్నారసలు?ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలు మీరు తెలిసికోనఖ్ఖర్లేదా? మీ తల్లితండ్రులు మిమ్మల్నేదో హింస పెట్టేశారని అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పే బదులు, మీరేం చేస్తున్నారో ఆలోచించండి.

కనీసం శలవులిచ్చిన తరువాత, ఒక పదిహేను రోజులు, వాళ్ళ దారిన వాళ్ళనుండనీయండి,Sky is not going to fall ! పోనీ ఈ శలవల్లో రోజంతా తిప్పలు పడి నేర్చుకున్నది, ఏడాదంతా నేర్చుకుంటారా? మళ్ళీ స్కూళ్ళూ, చదువులూ.వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, ఈ రోజుల్లో టి.వీ.ల్లో వస్తున్న రియాలిటీ షోలూ, వాటిల్లో వచ్చే ప్రైజు మనీ లూ చూసి, తమ పిల్లలేదో వెనక్కి పడిపోతారేమో అని, left,right,centre కోచింగులకి పంపేయడం. పోనీ అలాగని ఇలా ట్రినింగైన ప్రతీవారూ, టి.వీ.ల్లో వస్తున్నారా? అయిదారేళ్ళనుండి చూస్తున్నాము అవే మొహాలు, అవే పాటలు, అవే చానెళ్ళూ. మహ అయితే ఓ పది పదిహెనుమంది కొత్తవాళ్ళొచ్చారేమో? మరి ఈ మిగిలిన ట్రైనింగు పుచ్చుకున్న వాళ్ళందరూ ఏమైనట్లు? ఒక చానెల్ లో నెగ్గితే, ఇంకో చానెల్ లో రెండో మూడో స్థానం. అవే పాటలు, అదే జడ్జీలు, అవే పాటలూ.Everybody is being taken for a sweet ride! మరి ఇన్ని తెలిసీ, పిల్లల్ని,అంతంతేసి హింసలు పెట్టడం న్యాయమంటారా? ప్రతీ వాడూ prodigy అవడండి బాబూ. ఏ లక్షమందిలోనూ ఒకడుంటాడు.ట్రైనింగయిన ప్రతీ వాడూ ఓ సైనా నెహ్వాల్, ఓ విశ్వనాథన్ ఆనంద్ అవలేరు గా! అదేదో పెసిమిజం అనుకోకండి.పచ్చి నిజం.

ఇప్పుడు మీపిల్లలు ఎలా తయారవాలని ఆశిస్తున్నారో అలాగే మీ తల్లితండ్రులు కూడా తమ పిల్లలు అలా తయారవాలని ఆశించారు తప్ప, మరేమీ చెప్పుకోలేని పాపమేదో చేయలేదు. ఊరికే దిన్ రాత్ వాళ్ళమీద పడి, క్షోభ పెట్టకండి.ఏదో నిజంగానే తప్పు చేశామేమో అనే గిల్టీ ఫీలింగిచ్చేయకండి.వాళ్ళు బాధ పడేదల్లా ఏమిటంటే, వాళ్ళ పిల్లల పిల్లలు, అంటే మనవలూ, మనవరాళ్ళూ వారి బాల్యం అందులోని మధురానుభూతులూ కోల్పోతున్నారే అని!

మీరు  మీ తల్లితండ్రుల చేతిలో పడ్డ ( మీరనుకున్నట్టుగా ) so called  హింస, ఈరోజుల్లో ముందస్తుగానే పిల్లలు కొంతకాపోతే కొంతైనా తప్పించుకోగలుగుతున్నారు. ఈరోజుల్లో కనీసం కొంతమంది పిల్లలైనా, వారి తల్లితండ్రుల కోరికమేరకు కాకుండా, తమకి ఇష్టమైన చదువులు చదువుతున్నారు… మార్పు ప్రారంభం అయితే మాత్రం అయింది…మరి ఇప్పటి తల్లితండ్రులు ఎంతవరకూ తట్టుకోగలరో కాలమే చెప్తుంది…

సర్వేజనా సుఖినోభవంతూ…