బుల్లి మనసులో పెద్ద ఆలోచన - ..

big  wonder in a small heart

అద్భుతాల్ని ఆవిష్కరించడానికి వయసుతో సంబంధం లేదు. చిన్న చిన్న ఆలోచనలే పెద్ద పెద్ద విజయాలకి మార్గం చూపిస్తాయి. ఆలోచనలు చాలా మందికి వస్తాయి. అయితే వాటిని ఆచరణలో పెట్టేవాళ్లే విజయాలు సాధిస్తారు. అందరిలోకీ తాము ప్రత్యేకమని చాటుకోగలుగుతారు. నీటితో నడిచే వాహనం, గాలితో నడిచే కారు.. ఇలాంటివి వినడానికి నమ్మశక్యంగా ఉండవు. ఇలా ఎందుకు చేయలేం అనే ఆలోచన నుండే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. యాపిల్‌ పండు కిందే ఎందుకు పడింది. పైకి ఎందుకు వెళ్లదు.. అన్న తర్కం న్యూటన్‌ని భౌతిక శాస్త్ర పితామహున్ని చేసింది. భూమి గుండ్రంగా ఉందని చెబితే, ఆలా చెప్పినందుకు వారి ప్రాణాలు కూడా తేసేశారు ఒకప్పుడు. కానీ అప్పటి రోజులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. కొత్తదనం కోసం పరుగులు పెడుతున్నారు ఇప్పటి యువత. యువతే కాదు, ఈ ఆలోచన అతి చిన్న వయసు నుండే పుట్టుకొస్తోంది. ఇదివరకటి రోజుల్లో సైంటిస్ట్‌ అంటే మాసిన గెడ్డం, మెరిసిన జుట్టు, అంటే ఓ డెబ్బై, ఎనభయ్యేళ్ల వయసుండొచ్చు అనుకునేవారు. కానీ ఇప్పుడు బుల్లి వయసులోనే శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చేస్తున్నారు. ఆ వయసు ఐదారేళ్లయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా కొత్త ఆలోచనలు, అద్భుతాల సృష్టి జరిగిపోతోంది. తద్వారా పదమూడు, పదిహేనేళ్లకే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిపోతున్నారు.

తాజాగా హైద్రాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఈ విషయం బయట పడింది. అతి చిన్న వయసు అంటే పదమూడేళ్లకే ప్రపంచ పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు మాస్టర్‌ హమీష్‌ ఫిన్‌లేసన్‌. కాలుష్యం, వ్యర్ధాలను రోడ్డుపై పడేయడం వల్ల జరిగే అనర్థాలపై పదేళ్లకే తొలి యాప్‌ని తయారు చేసేశాడు ఈ బుల్లి బుడతడు. ఆ యాప్‌ పేరు 'లిట్టర్‌బగ్‌స్మాష్‌'. తర్వాత పర్యావరణ పరిరక్షణ మార్గాలను చూపుతూ మరో యాప్‌ని ఆవిష్కరించాడు. ఇలా ఇప్పటికే ఐదారు యాప్స్‌ని ఆవిష్కరించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇంకా మన బుడతడి లిస్టులో తయారైన రెండు యాప్స్‌ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలో ఆటిజంతో బాధపడే వారందరికీ ఉపయోగపడేలా యాప్స్‌ తయారుచేయాలన్నదే తన జీవిత లక్ష్యమని ఈ బుల్లి శాస్త్రవేత్త చెప్పడం విశేషం. పదిహేనేళ్ల బాలిక రేయాన్‌ కామలోవా వర్షపు నీటిని ఇంధనంగా మార్చింది. వర్షపు నీటిని ఇంధనంగా మార్చాలనే ఆలోచనతో రెయిన్‌ ఎనర్జీ పరికరాన్ని ఆవిష్కరించింది. ఇదే ఆలోచనతో ఓ కంపెనీని స్థాపించింది ఈ బాలిక. ఈ వయసుల్లో ఇంతటి మేధా సంపద కలిగి ఉండి ప్రపంచం దృష్టిని ఆకర్షించారంటే నమ్మశక్యం కాదు. కానీ ఈ ఇద్దరు బాల బాలికల్ని చూస్తే నమ్మి తీరాల్సిందే. అందుకే ఎంతో మేధా సంపత్తి ఉన్న వేల మంది పారిశ్రామిక వేత్తల మధ్యన వీరికీ చోటు దక్కింది. అందరిలోనూ ఈ ఇద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా వచ్చిన ఇవాంకా దృష్టిని ఆకర్షించి, ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.

మనలోనూ చాలా మంది ఇలాంటి మేధా సంపత్తి ఉన్న పిల్లలుంటారు. తల్లితండ్రులు వారి మేధస్సును గుర్తించి తగిన ప్రోత్సాహాన్ని అందించాలి. అలా చేస్తే, ఎందరో బాల మేధావులు పుట్టుకొస్తారు. తద్వారా శాస్త్ర సాంకేతిక వృధ్ధిలో పలు మార్పులు కూడా సంతరించుకుటాయి. మేథస్సుకు వయసుతో సంబంధం లేదు. పరిమితులు అస్సలుండవు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఆలోచన నుండి వచ్చేదే కొత్త ఆవిష్కరణ. ఈ ఆలోచనకు పరిమితులేంటి చెప్పండి. ఈ వినూత్న ఆలోచనతో సమాజానికి ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు రూపు దిద్దుకుంటాయి. సో తల్లితండ్రులూ మీ పిల్లల్లో ఉన్న టాలెంట్‌ని గుర్తించండి. తగిన ప్రోత్సాహం అందించండి. కాబోయే రాబోయే తరానికి కాబోయే సైంటిస్టులుగా, మేధావులుగా మీ పిల్లల్ని తీర్చి దిద్దే బాధ్యత మీపైనే ఉందని గ్రహించండి.

మరిన్ని వ్యాసాలు

Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు