పొరుగింటి పుల్లకూర... - భమిడిపాటి ఫణిబాబు

poruginti pullakoora

సాధారణంగా అందరూ అనుకునేదేమిటంటే, తాను చేస్తున్నదేదో చాలా కష్టమయినదని, అవతలివాడు చేసేది, ఏమీ కష్టపడకుండగా, ఏదో సుఖపడిపోతున్నాడనిన్నూ. చిన్నప్పుడు, అంటే నాన్న చెయ్యి పట్టుకుని ఏ సినిమాకో వెళ్ళినప్పుడు, ఆ సినిమా హాల్లో టిక్కెట్లిచ్చేవాడో లేదా గేటు దగ్గర టిక్కెట్టు చింపి, ఓ టార్చి లైటుతో మనకు సీట్లు చూపించేవాడినో చూసి, "అబ్బ వీడెంత అదృష్టవంతుడో కదూ, ప్రతీ రోజూ, ఎంటీవాడిదో, నాగ్గాడిదో సినీమా చూడొచ్చూ, నేను పెద్దయినతరువాత, ఈ టిక్కెట్లిచ్చేవాడి ఉద్యోగమో, గేటుదగ్గరుండేవాడి ఉద్యోగమో సంపాదించేయాలి..." తో మొదలెట్టి, ఏ బస్సులోనో వెళ్తూన్నప్పుడు, ఆ టిక్కెట్లిచ్చే కండక్టరు ఉద్యోగం మీద కూడా దృష్టిపడుతుంది. పోనీ ఏదో చిన్నతనం, వదిలేద్దామా అనుకుంటే, ఈ జాడ్యం కాలేజీకి వచ్చిన తరువాత కూడా మనల్ని వెంటాడుతుంది. ఇంట్లోవాళ్ళ బలవంతం మీద ఏ లెఖ్ఖలు, సైన్సు గ్రూపో తీసికోవాల్సొచ్చినప్పుడు, ఆర్ట్స్ లోనో, కామర్స్ లోనో ఉన్నవాడిగురించి దుగ్ధ.

ఏదో మొత్తానికి ఏడుస్తూనో, విసుక్కుంటూనో, ఉడుక్కుంటూనో కాలేజీ చదువు పూర్తిచేసి ఉద్యోగం వేటలో పడతాడు. శుభ్రంగా చదువుకుని, మంచిమార్కులతో పాసయితే, తనకి కావాల్సిన ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ అలా పాసవలేరుగా, ఏదో అత్తిసరు మార్కులు తెచ్చికుని, ఏ మోడరేషన్ లోనో పాసయినవాడికి ఈ అదృష్టాలెక్కడా? ఓ ఉద్యోగం సంపాదించిన తరువాత పోనీ సంతృప్తి పడతాడా అంటే అదీ లేదూ. ప్రతీ విషయంలోనూ, అవతలివాడితో పోల్చుకుని ఏడుస్తూ కూర్చోడంతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతూంటుంది. ఇలాటి విషయాలమీద ఆలోచించే సమయం, తను చేస్తూన్న ఉద్యోగం మీద లగ్నం చేయగలిగితే ఎప్పుడో బాగుపడేవాడు. అబ్బే అలాగైతే మన టైము ఎలా గడుస్తుందీ? మనం ఏదో ఫలానా దానిలో ఉద్యోగం చేస్తున్నామనుకుందాము, తను చేసే ఉద్యోగం తప్ప మిగిలినవాళ్ళు చేసేవి అన్నీ" సుఖాశీనాలే". తనది ఒక్కటే ఎందుకూ పనికి రానిది. ఆమాత్రం దానికి అసలు చేరిందెందుకో? మళ్ళీ అలాటి సున్నితమైన ప్రశ్నలు వేయకూడదు, కారణం వాటికి సమాధానం చెప్పడం కష్టం కదూ!

ఏ బ్యాంకులో పనిచేసేవాడినో చూసి, "అబ్బ ఎంత హాయో ఆయనకి, రోజూ పదింటికి వెళ్ళి హాయిగా పని చూసుకువచ్చేస్తాడు. అదీ ఏ క్యాషియరో అయితే రోజంతా డబ్బే డబ్బూ.. పైగా ఎప్పుడుపడితే అప్పుడు ఏదో కారణం చెప్పి హాయిగా సమ్మెలూ అవీ కూడా చేసికోవచ్చూ.." అని.  ఆ "రోజంతా డబ్బే డబ్బూలో" ఉండే కష్టం గురించి మాత్రం అలోచించడు. పోనీ ఆ బ్యాంకాయనేమైనా సుఖపడిపోతున్నాడా అంటే , ఆయన గొడవ ఆయనదీ, "ఛస్తున్నాను ప్రతీరోజూ, బ్యాంకు మూసేసేలోపల డబ్బు లెఖ్ఖెట్టి అప్పగిస్తేనే కానీ, ఇంటికెళ్ళడానికి వీలేలేదూ, హాయిగా ఏ టీచరు ఉద్యోగంలోనో చేరిపోయినా  బాగుండేదని ఆయన గోల.

ప్రైవేటు రంగంలో పనిచేసేవాళ్ళకి ప్రభుత్వ రంగంలో పనిచేసేవారంటే గుర్రూ. మీకేమిటండీ హాయిగా ఏడాదికి రెండేసిసార్లు డిఏ లూ అవీనూ, పైగా పెన్షన్లోటీ. మావీ ఉన్నాయి ఉద్యోగాలంటారా, తుమ్మితే ఊడే ముక్కుల్లాటి ఉద్యోగాలు, ఎప్పుడు పింకు స్లిప్పులిస్తారో ఎవడికీ తెలియదు, దినదినగండం. పోనీ ప్రభుత్వరంగంలో పనిచేసేవాళ్ళకైనా సంతృప్తి ఉంటుందా అంటే అదీ లేదు. రైల్వేల్లో పనిచేసేవారిని చూసి ప్రతీవాడూ ఏడ్చేవాడే, వాళ్ళకేముందండీ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడకిపడితే అక్కడకి తుర్రుమంటూ వెళ్ళిపోవచ్చు. మనలా వాళ్ళేమైనా టిక్కెట్లకోసమూ, తత్కాల బుక్కింగులకోసమూ, రోజంతా క్యూల్లో పడి ఏడవాలా ఏమిటీ, అని.

ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగాలు చేసే ప్రతీవాడూ, తన ఉద్యోగం తప్ప ప్రపంచంలో ఉండే ప్రతీ ఉద్యోగమూ, ఆఖరికి పూజలూ, కర్మలూ చేయించే పురోహితుడి బ్రతుకు కూడా హాయిగా ఉందనుకునేవాడే. అలాగే వ్యాపారాలు అంటే పెద్దపెద్దవని కాదు, ఏ కిరాణాకొట్టో, ఇంకోటేదో చూసుకునేవాడైతే, మీకేమిటి సార్ నెల తిరిగేసరికి హాయిగా జీతమైనా వస్తోంది, మా సంగతడక్కండి సరుకు అమ్ముడైతేనే కదా, నాలుగు రాళ్ళు వెనకేసికునేదీ అంటాడు.

అక్కడికేదో బయటకెళ్ళి ఉద్యోగాలు చేసికుంటున్నవాళ్ళే అసంతృప్తితో బ్రతుకుతున్నారనుకుంటే అపచారం. అందరూ కలిసి నివసించే కాలనీల్లో చూడండి, అదేదో బ్యాంకు కాలనీ అంటారు, ఎన్ జి ఓ కాలనీ అంటారు, కాదూ కూడదంటే పోనీ ఎం ఎల్ యే కాలనీ అందాం. అక్కడ అందరూ ఒకే రంగంలో పనిచేసేవారే. పుట్టింటారి విషయం మేనమామకి తెలియదా ఏమిటీ అయినా, ఆ ఇళ్ళల్లో ఉండే ఆడవారికి, పక్కింట్లో ఏదైనా కొత్తవస్తువు వచ్చిందీ అంటే చాలు, భర్త ఇంటికి రాగానే, " మీరూ ఉన్నారు ఆ పక్కింటి మీనాక్షమ్మ గారిని చూడండి, రోజుకో చీర కడుతుంది, వాళ్ళాయనకి ఆవిడంటే ఎంత ప్రేమో.. ఈమధ్యనే ప్లాస్మా టివీ కూడా వచ్చింది, వాళ్ళకారు చూశారా, మార్కెట్ లోకి కొత్తగా ఏ మోడల్ వస్తే వాళ్ళింటికి వచ్చేయాలే.. " అంటూ సణుగుతూంటుంది.  ఎంఎల్యే ల విషయం అడక్కండి. చేసికున్నంత వాళ్ళకి చేసికున్నంతా!

తోటివారి పిల్లలు వెళ్ళే స్కూలు , వీళ్ళపిల్లలు వెళ్ళే స్కూలుకంటే బాగుంటుందేమో, మనింట్లో కొత్తగా కొనుక్కున్న సోఫాసెట్టు కంటే, పక్కవాళ్ళదే నాణ్యంగా ఉందేమో, మనం ఉండే సొసైటీ కంటే, వాళ్ళెవరో ఉండే సొసైటీలోనే సదుపాయాలు ఎక్కువగా ఉంటాయేమో ఇలా ప్రతీదాంట్లోనూ ఇంకోరెవరిదో బాగుంటుంది. అంతదాకా ఎందుకూ, ఇంట్లో పంచభక్ష్యపరవాన్నాలతో  విందు చేసినా, వాళ్ళెవరింట్లోనో బాగుందేమో అని నోరుజారడం, ప్రాణం మీదకు తెచ్చికోవడం. ఏది చూడండి,  పొరిగింటిదే నచ్చుతుంది. చెప్పుకోడానికి బాగుండదని కానీ, చివరకి పెళ్ళాం విషయంలో కూడా, ఆ పక్కావిడే బాగుందేమో అనడానికి కూడా వెనుకాడరు కొందరు ప్రబుధ్ధులు....
భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు

కళల ఆవిర్భావం .
కళల ఆవిర్భావం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
లంబాడి సంస్కృతి .
లంబాడి సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గిరిజన నృత్యాలు .
గిరిజన నృత్యాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం ఒగ్గు కథ.
కళారూపం ఒగ్గు కథ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
యోగాలు .
యోగాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కళారూపం తోలుబొమ్మలాట .
కళారూపం తోలుబొమ్మలాట .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కురుక్షేత్ర సంగ్రామం.
కురుక్షేత్ర సంగ్రామం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.