శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Sri Swamy Vivekananda

నరేంద్రుని విదేశీ పర్యటన:
బొంబాయి నుంచి నరేంద్రుడు 1893 వ సంవత్సరం మే 31వ తేదీన ఓడలో విదేశీ పర్యటనకు బయలుదేరాడు. ఆ ఓడలో జపానుదేశం మీదుగా ప్రయాణిస్తూ నరేంద్రుడు ఆ దేశంలోని ప్రధాన నగరాలను దర్శించి వాటి అభివృద్ధికి ఆశ్చర్యపడ్డాడు. అచ్చటి అభ్యున్నతి గురించీ, ఆప్రజల కార్యనిర్వహణ దీక్షతను గురించీ అతడు మద్రాసులోని తన శిష్యులకు జాబు వ్రాస్తూ భారతమాత ఇప్పుడు లక్షలాది యువకుల త్యాగాన్ని కోరుతున్నదని పేర్కొన్నాడు.

నరేంద్రుడు, వివేకానందుడిగా అమెరికావెళ్ళి విశ్వమత మహా సభాస్థలమైన షికాగో నగరం చేరుకున్నాడు. తన నెరిగిన వారుకానీ, తనతో మాట్లాడేవారు కానీ లేనందువల్ల మొదట్లో వివేకానందుడు అక్కడ చాలా ఇబ్బంది పడవలసి వచ్చినది. అదీగాక, ఇంకా రెండునెలల వరకూ మత మహాసభ జరుగదనీ, అప్పుడైనా అందులో ప్రతివారూ పాల్గొనటానికి వీలులేదనీ ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులకు మాత్రమే అవకాశముంటుందనీ తెలియడంతో వివేకానందుడు చాలా విచారించాడు. ఈ ప్రయాణమంతా వృధా కావలసినదేనా? అని అతడు చాలా ఆవేదన చెందాడు.

ఇంకా సభకు రెండు నెలల సమయం వుంది కదా అని వివేకానందుడు షికాగో నుంచి బోస్టన్ నగరానికి వెడుతుండగా, అదే రైలులో ప్రయాణం చేస్తున్న జకవృద్ధ వనిత అతనితో సంభాషించి అమితానందంతో అతనిని బోస్టన్ కు సమీపగ్రామంలో వున్న తన యింటికి అతిధిగా ఆహ్వానించింది. వివేకానందుడు అందుకు అంగీకరించి ఆమె ఇంట్లో చేరాడు. అక్కడికి తరచూ చాలామంది వచ్చి వివేకానందుని చూసి ఏవో ప్రశ్నలు వేస్తూ వుండేవారు.

అక్కడున్న సమయంలో వివేకానందస్వామి అమెరికాలోని వివిధ విశేషాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండేవాడు. అక్కడ జైలు పరిస్థితులను గురించి ఒక శిష్యునకు వివేకానందుడు వ్రాసిన యీక్రింది వాక్యాలు గమనిస్తే మాతృదేశాన్ని గురించి ఆయనెటువంటి ఆందోళనకు గురిఅయ్యేవాడో అర్ధమవుతుంది.

"ఇక్కడ జైలును చెఱసాల అనరు. ప్రవర్తన సంస్కరణశాల అంటారు. ఇక్కడ ఖైదీలను ఆదరించి, వారి ప్రవర్తనను తీర్చిదిద్దే సంఘానికి ఉపయోగపడే వారిగా తయారుచేస్తారు. ఇకమన భారతదేశంలోని దీనులనూ, నిమ్న జాతివారినీ మనంచూసే విధానం తలుచుకుంటే గుండె బ్రద్దలవుతుంది. సమాజం యొక్క కర్కశత్వానికి కృంగిపోయి తాము మానవులమన్న మాటనే వారు మరచిపోయారు. ఇందుకు ఫలితం బానిసత్వం. అయితే ఈదోషాన్ని మనం సనాతన ధర్మానికి అంటగట్టడం భావ్యం కాదు. ఇందుకు పారమార్ధికం పేరుతో అక్రమ సిద్ధాంతాలను కల్పించిన వంచకులే బాధ్యులని నాకు భగవానుడు తెలియజేశాడు. యువకులారా! నడుములు బిగించండి. ఈకార్యనిర్వహణకై భగవానుడు నన్ను నియమించాడు. నా జీవితమంతా బాధలతో, దుఃఖాలతో నిండిపోయినది. నా ఆప్తబంధువులూ, మిత్రులూ, అన్నార్తులై నాఎదుటనే మరణించారు. ఇక నా ఆశలన్నీ మీపైనే పెట్టుకున్నాను. దీనజనోద్ధరణ కొరకు పరితపించండి. సహాయం దానంతట అదే వస్తుంది. ఈ పరమాశయంతోనే నేను 12 సంవత్సరాలు తిరిగితిరిగి గొప్పగొప్ప ధనవంతులందర్నీ చూశాను. చివరకు మాతృ దేశాభ్యుదయానికి అవసరమైన సహాయం కోసం ఇక్కడకు వచ్చాను. భగవానుడు నాకు తోడ్పడగలడని ధైర్యం వున్నది. అయినా ఒకవేళ ఆకలిబాధచే నేనిక్కడ మరణించినా మరణించవచ్చు. కానీ యువ మిత్రులారా! అజ్ఞానులనూ, దీనులనూ, దరిద్రులనూ ఉద్ధరించే యీసానుభూతిని, యీకార్యదీక్షను నేను మీకు స్థిరాస్థిగా సమర్పిస్తున్నాను.

భగవంతుని స్మరిస్తూ ముందుకు సాగిపోండి. మాతృదేశం కోసం ఆ మహానుభావుడు పొందిన పరితాపం పైమాటలలో ప్రతిబింబిస్తున్నది. ఎవరిపైనయితే వివేకానందుడు మొదటి నుంచీ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడో ఆభగవానుడే ఆయనకు అండగా నిలచి ఎప్పుడూ సహాయపడేవాడు.

(...ఇంకా వుంది)

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి