పుస్తక సమీక్ష: రాయవాచకము - సిరాశ్రీ

Book Review - Rayavachakamu
పుస్తకం: రాయవాచకము
వెల: 120/-
రచన: విశ్వనాథనాయనయ్యవారి స్థానాపతి
సంపాదకులు: మోదుగుల రవికృష్ణ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తయ విక్రయ కేంద్రాల్లో
 
1987 లో దాసరి నారాయణరావు రచన, దర్శకత్వం లో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా "విశ్వనాథ నాయకుడు" సినిమా వచ్చింది. చక్కని చారిత్రక చిత్రంగా మన్ననలు అందుకుంది. విశ్వనాథ నాయకుడనే వాడు శ్రీకృష్ణదేవరాయలి సామ్రాజ్యంలో మదురనేలిన నాయక రాజని ఆ సినిమా ద్వారా ఎందరికో తెలిసింది. లేకపోతే చరిత్ర పాఠాలు చెప్పే వారికి తప్ప సామాన్యులకు తెలిసే భాగ్యం లేదు.

"రాయవాచకం" పుస్తక సమీక్ష అని హెడ్డింగ్ పెట్టి సిమిమా గురించి చెబుతున్నాడేంటని అనుకోకండి. దానికి, దీనికి లింకుంది. ఈ "రాయవాచకం" గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాయల కాలం నాటి వ్యవహారిక భాషలో ఉన్న ఏకైక పుస్తకం. ఆ కాలంలో అష్టదిగ్గజ కవులు గాని, రాయలవారు గాని, ఇతర కవులు గాని అంతా కావ్యభాషలోను, గ్రాంథికంలోను వ్రాసారు తప్ప అప్పటి ప్రజలు మాట్లాడుకునే భాషలో రాయలేదు. అలా రాస్తే వారికి గౌరవం దక్కేది కాదు. అందుకే కావ్యాల్లో పద్యాల నడుమ వచనం రాయాల్సి వచ్చినా, అక్కడ కూడా తమ భాషా ప్రౌఢి, శబ్దార్థ చమత్కారాలు ప్రదర్శించేవారు. ఇది మాత్రం అలా కాదు. పూర్తిగా అప్పటి జనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది. ఇంతకీ ఈ పుస్తకం సారాశం ఏమిటంటే విశ్వనాథనాయకుని స్థానాపతి తన ప్రభువైన విశ్వనాథనాయకునికి సమర్పించిన నివేదిక. ఇందులో శ్రీకృష్ణదేవరాయలి పట్టాభిషేకం తో మొదలై కళింగరాజుపై దండయాత్ర ఘట్టంతో ముగుస్తుంది. ఇది సుమారుగా క్రీ. శ. 1520 ప్రాంతంలో రచింపబడిందని చారిత్రకుల అభిప్రాయం.

దాదాపు శతాబ్దం క్రితం పుదుక్కొట్టైలో దొరికిన తాళపత్రాల ఆధారంగా అతి కష్టమ్మీద ఈ రాయవాచకాన్ని జనంలోకి తీసుకొచ్చారు. అప్పడు వ్రాసేవాళ్ళకి కామాలు, ఫుల్ స్టాపులు వంటివి తెలియడానికి ఆస్కారం ఎలాగో లేదు, కనీసం పదానికి పదానికి దూరం పెట్టి వ్రాయాలన్న ధ్యాస కూడ లేకుండా రాయడం వల్ల అర్థం చేసుకుని ప్రచురించడానికి చరిత్ర కారులకి, భాషా వేత్తలకి తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తానికి సాధించారు. ఇలా మన ముందుంచారు.

క్రీ.శ. 1520 నాటి పలుకుబళ్ళు, పదబంధాలు, ప్రస్తుత వ్యాకరణ ప్రమాణం కాని పదప్రయోగాలు, సంధి సమాసాలు వంటివన్నీ ఈ పుస్తకంలో దర్శనమిస్తాయి. అయితే ఇప్పటి దక్షినప్రాంతంలో ఉన్న తెలుగువారికి దగ్గరలో ఇందులోని చాలా పదాలు ఉన్నాయి. బహుసా వ్రాసిన స్థానాపతి ఆ ప్రాంతం వాడై ఉండొచ్చు.

ఉదాహరణకు ఈ పుస్తకంలోని ఒక భాగాన్ని ఇక్కడ రుచి చూపించే ప్రయత్నం చేస్తా..కృష్ణరాయుని నిత్యకృత్య వివరణం చేస్తూ.." ...రాత్రి కొలువు తీరిన తర్వాత నగరుశోధనకు విచ్చేశి సకల కార్యములున్ను తెలుసుక, అరుణోదయానికి నగరికి వచ్చి కొంత తడవు పవ్వళించి యుదయాననే లేచి దంతధావన, ముఖమజ్జన, నామతీర్థపు కొలువు జేసుకొని పెద్దకొలువునకు వచ్చి తాము రాత్రి నగరు శోధనకు బయలుమెరశిన వేళ గనుకొన్న కార్యములు విన్న కార్యములన్నియు మనస్సునదెచ్చుకొని..." ఇలా సాగుతుంది భాష.

135 పేజీలతో కూడిన ఈ పుస్తకం ప్రతి పేజీలోను ఫుట్ నోట్ లో ప్రతీ అంశానికి చక్కని వివరణ ఇచ్చారు సంపాదకులు. ఆ వివరణ లేకపోతే చివరిదాకా చదివి ఆస్వాదించడం కష్టమే అవుతుంది. సంపాదకులు మోదుగుల రవికృష్ణ కృషి అభినందనీయం. తెలుగు భాషాభిమానులకు, ప్రాచీన భాషారక్తులకు, చారిత్రక పరిశోధకులకు ఈ "రాయవాచకం" అవశ్యపఠనీయం.

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు