అర్ధ రాత్రి కావస్తుంది. ఈ రోజు నాకెందుకో నిద్ర పట్టలేదు. మనసు పలు మార్గాల్లో పరుగెడుతూ ‘కృష్ణుడు’ బావ దగ్గర కాసేపు ఆగింది. వెంటనే గుండె గుడిలో పదిలముగా పడుకున్న బావని పట్టి కుదిపాను. యాబయ్యేళ్ళ క్రితం కృష్ణుడు బావ తన స్వదస్తూరి తో రాసి ఇచ్చిన కథ గుర్తొచ్చింది. కథ కాదు బావ మనసు పుస్తకం. మనసున ఉన్న ప్రేమని మాటల్లో చెప్పలేక ఇలా అక్షరాలలో నిక్షిప్తం చేసి ఇచ్చాడు. బావ ఇప్పుడేం చేస్తున్నాడో అన్న తలపు నన్ను మంచం మీది నుంచి లేచేటట్టు చేసింది.
నా టెంత్ క్లాస్ పుస్తకాలు, సర్టిఫికేట్ల మధ్యన భద్రముగా దాచుకున్న ఆ మూడు పేజీల బావ అంతరంగాన్ని పెళ్ళికి ముందు మూడు వందల సార్లైనా చదివుంటాను. పెళ్ళైన తరువాత ఇదిగో ఈ పుస్తకాల మధ్యన బంధించేసాను.
నేను కూడ సగటు ఆడపిల్లనే, అందుకే అంతకంటె ఎక్కువ సాహసించలేక పోయాను. తరువాత సంసార సాగరములో మా స్వంత నౌకపై 'సహ సరంగు' నిలా పయనించాను.
నౌక తీరం చేరింది. సరంగు అయిదేళ్ళ క్రితమే తన దారి చూసుకున్నారు. ఇంత వరకు మాతో పాటు పయనించే సహచరులు తమ స్వంత నౌకలలో వారి వారి సంసార సాగారాలను ఈదుకుంటున్నారు. ఎవరి సాగరం వారిది. అవసరానికి "అమ్మా" అని పిలుస్తారు.
అలా గత స్మృతులలో తేలియాడుతూ యాబయ్యేళ్ళుగా నా గుండె గుడిలో మరుగున పడిన బావను స్పృశించాను.
-----///-----
అప్పుడు నేను టెంత్ క్లాస్ పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నాను. మా మేనత్త యశోద కోరిక మేరకు నాన్న నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నారు. అత్తకు నేనంటె చాల ఇష్టము. చిన్నప్పుడు “చిట్టి చామంతిలా ఎంత ముద్దొస్తున్నావే” అంటు నా ముఖం ముద్దులతో నింపేసేది యశోదత్త. బావకు నేనంటే అంతకన్నా ఇష్టం.
సాధారణంగా ఎవరైనా అమ్మమ్మ ఇంటికి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడతారు గాని నాకు మాత్రం పండుగ సమయాల్లో ముఖ్యంగా సంక్రాంతి సెలవులకు మా స్వగ్రామంలో ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం. ఎందుకంటే అప్పుడు అత్త కూడా బావని తీసుకుని వచ్చేది. సంక్రాంతి సెలవుల్లో అందరం కలసి ఆడుకునే వాళ్ళం. భోగి మొదలు కనుమ వరకు మూడు రోజులు అప్పుడే గడిచిపోయాయా అన్నట్టు ఉండేది. నానమ్మ మాకు కొత్త బట్టలు కొనేది. భోగి మంటలు, సంక్రాంతి గొబ్బెమ్మలు ఒక ఎత్తైతే కనుమ రోజు జరిగే కోడి పందేలు ఇంకా అద్భుతంగా జరిగేవి.
నాన్న ఉద్యోగ రీత్యా పట్టణాలలోనే ఎక్కువగా ఉండడం వలన, అత్త వాళ్ళు ఉంటున్న పల్లెటూరి వాతావరణం ఆస్వాదించవచ్చు అనే కోరికతో ముఖ్యముగా బావను చూడవచ్చని నేను వెంటనే ‘సరే’ అన్నాను. అనుకున్న వెంటనే వారాంతములో నాన్న నన్ను అత్త వాళ్ళింటికి తీసుకెళ్ళారు.
అత్తకు ఒకడే కొడుకు మా బావ రాధా కృష్ణ. మా ఇంట్లో అందరు కృష్ణుడు అంటారు. నేనైతే 'కృష్ణుడు బావ' అంటాను. నా పేరు చెప్పనే లేదు కదా, నాపేరు రాధ. చిన్నప్పుడు సెలవులలో ఎప్పుడైనా అత్తతో కలిసి బావ మా ఇంటికి వస్తె "రాధ" అని ఎవరైనా పిలిస్తె ఇద్దరం పలికే వాళ్ళం అందుకని మా ఇంట్లో అందరు బావని "కృష్ణుడు" అని పిలవడం మొదలు పెట్టారు. మా ఇద్దరు అక్కలు ‘కృష్ణుడు బావ’ పల్లెటూరి వాడని, తమకంటె చిన్నవాడని ఆట పట్టించేవారు. నాకైతే కృష్ణుడు బావంటె వల్లమాలిన అభిమానం. ఆ వయసులో దానినే ప్రేమ అంటారని తెలియలేదు.
రెండు రోజులు గడిచిన తరువాత ఇంకా ఐదు రోజులుంటానన్న నా కోరికను మన్నించి నాన్న ఒంటరిగానే మా ఇంటికి వెళ్ళిపోయారు.
-----///-----
మొదటి రోజు బావ వాళ్ళ కొబ్బరి తోటకు తీసుకెళ్ళి కొబ్బరి బొండములు కొట్టి ఇచ్చాడు. అమృతం తాగినట్టనిపించింది. ప్రకృతి లోని తియ్యదనం ఈ నీళ్ళలో ఎలా మేళవించాడో పరబ్రహ్మ. అవును బావ గురించి నేను చెప్పలేదు కదా, తాను దగ్గరిలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదివాడు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నాడు. బావ వాళ్ళ నాన్న గారు వ్యవసాయం చేస్తుంటారు.
“ఒకరిని చూస్తె పెట్ట బుద్ధి, వేరొకరిని చూస్తె మొత్త బుద్ధి”అన్నట్టు, అమ్మకు యశోద అత్త అంటె పడదు. వాళ్ళిద్దరి మధ్య ఏవో చిరమరలు ఉన్నట్టున్నాయి మరియు అత్త వాళ్ళ కుటుంబమంటె, పల్లెటూరివాళ్ళని చిన్న చూపు.
అమ్మకు వాళ్ళ అన్న గారబ్బాయి, అంటె మా మేన మామ గారబ్బాయి "విశ్వం" అంటె ఇష్టం. అందుకే విశ్వంకు నన్నిచ్చి పెళ్ళి చేస్తానని నా చిన్నప్పుడే మాట ఇచ్చిందట. విశ్వం బావ డిగ్రీ చదివాడు. రేపో మాపో ఉద్యోగమొస్తె విశ్వం బావతో నా పెళ్ళికి ప్రణాళికలు వేస్తారు.
రెండో రోజు కృష్ణుడు బావ ఫ్రండ్ రాము మరియు తన అక్క ఇందు వచ్చారు. బావ నన్ను వారికి పరిచయం చేసాడు. ఇందు శ్రీకాకుళం లో బి ఏ చదువుతుంది. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చింది. కొద్దిసేపు లోకాభిరామాయణం ముచ్చటించాక సాయంత్రం బీచ్ కు వెళ్దామన్నారు. అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న ‘బారువ’ బీచ్ కు నలుగురం కలిసి రెండు బైకుల్లో వెళ్ళాం. వేసవి సెలవుల మూలంగా చాల మంది మా వయసు వాళ్ళు బీచ్ లో ఉన్నారు.
ఆ సాయంత్రం కృష్ణుడు బావ, రాము కొద్ది సేపు సముద్రం లో ఈత కొట్టారు. నేను ఇందుతో కలిసి ఇసుక తిన్నెలలో ఆడుకున్నాను. నేనైతే ఆ ఇసుకలో 'తాజ్ మహల్' చెక్కాను. ‘తాజ్ మహల్’ పేరు వినగానే నాలో ఏదో తెలియని అనుభూతి, అనిర్వచనీయమైన ఆనందం. అది ప్రపంచ వింతలలో ఒకటైనందుకు కాదు. షాజహాన్ మనసులో ముంతాజ్ పట్ల దాగిఉన్న అమితమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. ఇందు జైపూర్ లోని రాజస్థాన్ రాచరికపు ఔన్నత్యాన్నికి మచ్చుతునక అయిన 'హవా మహల్' ను చెక్కింది. కొంతసేపు ఆ చల్లని కడలి తీరంలో సేదదీరిన తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నాము.
మూడో రోజు అత్త మామయ్య బావలతో సహా నేను కూడ పక్క వీధిలోని వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాను. ఆ రోజు ఏకాదశి కావడం వలన స్వామిని చక్కగా అలంకరించారు చూడ ముచ్చటగా ఉన్న ఆ నంద నందనుడిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. దర్శనానంతరము గుడిలో జరుగుతున్న ముగ్గుల పోటీలకు బావ నా పేరు ఇచ్చాడు. నేను ఆ పోటీలో పాల్గొన్నాను. నాకు ఆ పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. తరువాత పక్కనున్న కోనేటి మెట్లపై కొంత సేపు కూర్చుని మాటామంతి ముచ్చటించుకున్నాక ఇంటికి చేరుకున్నాము. మనస్సుకు ఎంతో సాంత్వన చేకూరి, హాయిగొల్పింది ఆ స్వామి దర్శనముతో.
-----///-----
నాల్గవ నాడు ఉదయం రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ రోజు సాయంత్రం ఆ ఊరి "శాఖా గ్రంథాలయం" లో బావ మాటలాడబోయే ప్రసంగాన్ని వినడానికి రాముని, ఇందుని రమ్మని పిలిచాము.
ముందుగా బావ తయారు చేసుకున్న ప్రసంగం "చలం రచనలలో స్త్రీ పాత్ర" ను బావ ఆ సాయంత్రం సభలో చదివి వినిపించాడు. సమాజములో 'ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు' పేరుతో ఈ రోజుకు కూడ స్త్రీ స్వాతంత్ర్యాన్ని నియంత్రిస్తున్నారని తన నిరసన తెలియజేస్తూ, దైనందిన జీవితములో స్త్రీకి ఎదురయ్యే ఇబ్బందులను విశదీకరించాడు. విన్నవాళ్ళందరు బావను ఎంతో మెచ్చుకున్నారు. కొందరైతే బావను 'జూనియర్ చలం' గా అభివర్ణించారు. నా మనసుకు నచ్చిన బావకు ఇన్ని ప్రశంసలు రావడం నాకు చాల ఆనందాన్ని ఇచ్చింది. బావకు ప్రశంసలు రావడం కొత్త కాదు. ఏడవ తరగతి కామన్ పరీక్షలలో జిల్లాలో మొదటి స్థానం సంపాదించాడు. టెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు బావ చిన్నప్పటినుండి చదువుల్లో ఫస్ట్. నా మనసులో బావపై ఇంకా ఉన్నత భావం కలిగింది.
బావ వాళ్ళ ఊరిలో నేను గడపబోయే చివరి రోజు ఆ మరుసటి రోజే.
"ఊరికి దగ్గరలోని చిన్న కొండల లాంటి నల్లరాతి గుట్టల సముదాయం మధ్యలో ఉన్న గుహలో ఈశ్వరాలయం ఉంది. దానిని పాతాళీశ్వరాలయం అంటారు. అక్కడ రేపు మన పిక్నిక్" అన్నాడు బావ. ఇందుని రాముని కూడ రమ్మని చెప్పాడు. "మాస శివరాత్రి కాబట్టి ఎక్కువ మంది వస్తారు. మన దర్శనం అయిన తరువాత ఆ పక్కనున్న జామ, మామిడి తోటల్లో మన పిక్నిక్ స్థావరం ఏర్పాటు చేసుకుని రేపు ఎంజాయ్ చెయ్యవచ్చు" అన్నాడు బావ. అందరం సరేనన్నాం.
-----///-----
మరుసటి రోజు అనుకున్నట్టుగానే పొద్దున్నే లేచి తల స్నానము చేసి బావ, నేను కలిసి రాము, ఇందు వాళ్ళ
ఇంటికి వెళ్ళాం. అక్కడ రాము ఇందుతో పాటు వారి పక్కింటక్కలు, అన్నయ్యలు కూడ బయలు దేరారు. అందరం కలిసి రిక్షాలలో పాతాళీశ్వరాలయంకు వెళ్ళాం. దర్శనం, నారికేళాభిషేకముల తరువాత కొంత సేపు ఆ నల్ల రాతి గుట్టలపై మా పేర్లు చెక్కుకున్నాం. తదుపరి మామిడి తోటలో నీడ ఉన్న ప్రాంతములో బెడ్ షీట్లు పరచి కూర్చున్నాం. అప్పటికే ఉదయం పదకొండు గంటలు కావడముతో మాతో పాటు తీసుకెళ్ళిన లంచ్ బాక్సుల్ని ఓపెన్ చేసి తినేసాము.
కొంత సేపు భుక్తాయాసము తీర్చుకున్నాక "కోతి కొమ్మచ్చి" ఆట ఆడాము. అందరం అలసి పోయాక చీటీల ఆట పెట్టుకున్నాము. మేము మొత్తం ఎనిమిది మంది కాబట్టి ఒక తెల్ల కాగితము తీసుకుని దానిని ఎనిమిది ముక్కలు చేసి ఒక్కొక్క కాగితపు ముక్క మీద ఆ కాగితపు ముక్క దొరికిన వారు ఏమి చెయ్యాలో రాసాం. అందులో నటనలు, పాటలు పాడడం, జంతువుల అరుపులు అనుకరించడం మొదలైనవి ఉన్నాయి.
నాకు బావకు వచ్చిన చీటీలలో పాటలు పాడడం వచ్చింది. నేను పాడతానని బావకు తెలుసు కాని బావ కూడ అంత బాగా పాడతాడని నాకు ఆరోజు వరకు తెలియదు. బావ నాకిష్టమైన 'పూజ' సినిమాలోని "ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది" పాటను మొదలు పెట్టాడు. నేను కూడ శృతి కలిపాను. తన్మయత్వముతో మేమిద్దరం పాడుతున్నప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలింది. పాట ముగిసిన వెంటనే అందరు చప్పట్లతో మమ్మల్ని అభినందించారు.
సాయంత్రం సమీపిస్తుండడముతో తిరుగు ప్రయాణములో రిక్షాలు దొరక్క అందరం కలిసి కాలికి బుద్ధి చెప్పాం. అలా నడుస్తున్నప్పుడు ఇందు నేను కలిసి మాటలాడుకుంటు అందరికన్నా ముందు నడుస్తున్నాం. అప్పుడు ఇందు ఒక విషయం అడిగింది. "రాధాకృష్ణ అంటె నీకు ఇష్టం కదా పెళ్ళి చేసుకుంటావా?" అని. "నాకు మనసులో బావపై నూరుశాతం ప్రేమ ఉంది గాని మా అమ్మతో చెప్పలేను. మా విశ్వం బావతో నా పెళ్ళి చిన్నప్పుడే ఫిక్స్ చేసేసింది మా అమ్మ" అని బదులిచ్చాను.
కృష్ణుడు బావ చాల అమాయకుడు. నోరు తెరిచి ఏమీ చెప్పలేడు. అందుకే ఇందుతో అడిగించాడనుకున్నాను. అయినా కృష్ణుడు బావకు కూడ తెలుసు నాకు విశ్వం బావతో పెళ్ళి అవుతుందని. అందుకే అడిగే సాహసం చెయ్యలేదు. రాత్రి పడుకునే ముందు బావ నాదగ్గరికి వచ్చి తన మనసు ఆవిష్కరించిన ఈ మూడు పేజీల కథ "మరపురాని రోజులు" ఇచ్చాడు. నాతో గడిపిన ఆ వారము రోజుల్లో తన మనసు పడే ఆరాటం, మనసు పొందే ఆహ్లాదం, తియ్యని తలపుల మేళవింపులతో రాసినది ఆ కథ, బావ అంతరంగం లోని ప్రేమ తరంగం. ఆ రాత్రంతా అనేక సార్లు తనివి తీరా చదువుకున్నాను.
ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు “చిన్నప్పడు మదిలో కలిగే భావోద్వేగాలు వ్యక్తపరచలేకపోయినా అంతర్లీనంగా అవి వృద్ధి చెందుతాయి తప్ప అంతరించి పోవు”.
ఇప్పుడు బావపై నాకున్న ప్రేమ, అనురాగం బృహదీకృతమైంది. నాగుండె నిండా గుడిగంటల
మ్రోతలు నన్ను నిలువనీయడం లేదు. అవి వేరెవరికీ వినిపించవు ఎందుకంటె నా గుండె తలుపులు నేను తెరిస్తే కదా. కాని ఆ గుండెలో కొలువైన బావకు అవి వినిపిస్తూనే ఉంటాయి. బావ గుండెలో కూడ నేను తిష్టవేసి కూర్చున్నానని బావ తన కథలో చెప్పకనే చెప్పాడు. అలా మా ఇద్దరి మస్తిష్కాలలో రూపు దిద్దుకున్న మా ప్రేమలు గుండె లోతుల్లో మరుగున పడిపోయాయి. మరు జన్మంటూ ఉంటే బావ గుండె లోనే కాకుండా బావ ఒడికి చేర్చమని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.

