ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు - - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu -

ఈ 300 వ సంచిక నుండీ ప్రారంభించి, ప్రతీవారం, చరిత్రలో నిలిచిపోయిన కొందరు తెలుగు ప్రముఖులను స్మరించుకుందామా..
ఈ వారం  జయంతులు
శ్రీ  పాకాల తిరుమల్ రెడ్డి…
జనవరి 4, 1915 న , కరీంనగర్ జిల్లా, అన్నారం గ్రామంలో జన్మించారు.  PT  గా ప్రసిధ్ధి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు. ఆరు దశాబ్దాలుగా , చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసి, కుంచెలను రంగరించిన తెలంగాణ చిత్రకారుడు ఆయన…

శ్రీ మామిడిపూడి వెంకటరంగయ్య.. ..
జనవరి 8, 1889 న , నెల్లూరు జిల్లా పురిణి గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు.
వీరికి  భారత ప్రభుత్వం 1968లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

శ్రీ ధూళిపూడి  ఆంజనేయులు..
జనవరి 10,  1924 న , గుంటూరు జిల్లా యనపర్రులో జన్మించారు.  DA  గా ప్రసిధ్ధి చెందిన శ్రీ ఆంజనేయులు,, ఓ సుప్రసిధ్ధ ఆంగ్లరచయిత, మరియు సంపాదకుడు..  తెలుగు సాహిత్యాన్ని, రచయితలను , తెలుగేతరులకు పరిచయం చేయడంలో విసిష్టమైన కృషి చేసారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ల రచనలను ఇంగ్లీషులోకి అనువదించి, తెలుగువారి గొప్పతనాన్ని తెలియచేసారు.
వీరి స్వంత గ్రంధాలయం దేశంలోని అతి పెద్దదయిన వ్యక్తిగత గ్రంధాలయాలలో ఒకటి.

వర్ధంతులు
 శ్రీ గరికపాటి మల్లావధాని  
వీరు కవి, స్వాతంత్ర యోధుడు, సంస్కృతాంధ్ర పండితుడు. పుస్తకాలు రచించడమే కాకుండా, పండితుడిగా అనేక పుస్తకాలను పరిష్కరించారు కూడా.వీరు 1921 లో చదువుమానుకుని, మహాత్మాగాంధి స్పూర్తితో, స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేకమార్లు జైలుకి వెళ్ళారు.
వీరు జనవరి 5, 1985 న స్వర్గస్థులయారు.

 శ్రీ చింతా వెంకటరామయ్య
కూచిపూడి కి యక్షగాన సొగసులు అద్దిన  అపర నాట్య గురువు , కూచిపూడి నాట్యత్రయం లో ఒకరు. అనాటి వెంకటరామా నాట్య మండలిని 100 సంవత్సరాల క్రితం స్థాపించి, అవిచ్ఛిన్నంగా నిర్వహించి, ఆ సంస్థ ద్వారా అనేక మంది వుత్తమ నటశేఖరలను సృష్టించి, ఈ నాటి కూచిపూడి నాట్య కళకు దివ్య యశస్సును ఘటిల్ల జేసిన ప్రముఖ నాట్యాచారుడు.
వీరు జనవరి 6, 1949 న స్వర్గస్థులయారు.

 శ్రీ పింగళి  లక్ష్మికాంతం   
వీరు ప్రసిధ్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయలఅష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు. లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, నటుడిగా, కవిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు.
వీరు పాండవోద్యోగ విజయములు, ముద్రా రాక్షసము నాటకాలలో ధర్మరాజు, రాక్షస మంత్రిగా పాత్రలు చక్కగా పోషించి పేరుపొందారు.
వీరు జనవరి 10, 1972  న స్వర్గస్థులయారు.  వీరి జన్మతేదీ కూడా జనవరి 10 ( 1894 ) అవడం యాదృఛ్ఛికం.


త్యాగయ్య   

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన  త్యాగరాజు గారు , జనవరి 6, 1847 న తన ఆరాధ్యదైవమైన ఆ శ్రీరామచంద్రునిలో ఐక్యమయారు.
నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు.
భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు.

 

మరిన్ని వ్యాసాలు

Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు