మానవీయ విలువలను నేర్చుకుందాం - కొత్తపల్లి ఉదయబాబు

Manual values

ఎక్కడిదీ జాడ్యం? ఎక్కడిదీ ధైర్యం?

అవును. ప్రస్తుత సభ్య సమాజంలో  అక్షరాస్యులందరూ తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న?

సమాజంలో   కన్నతల్లితండ్రుల తరువాతి స్థానం లో  ఒకనాడు గురుర్బ్రహ్మ ... అనిపించుకున్న  ‘’ఉపాధ్యాయుడు’’ లేదా ‘’ఉపాధ్యాయిని ‘’కి నేటి విద్యార్ధులు ఇస్తున్న గౌరవ ప్రపత్తులు చూస్తుంటే  ఈదేశంలో విద్య బోధించడానికి నిర్దేశించిన పాఠ్య ప్రణాళికలను అనుమానించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

మన పవిత్ర భారత దేశంలో ఎక్కడో ఒక పాఠశాలలో ఉపాధ్యాయినిని  విద్యార్ధులు దారుణంగా కొట్టిన సంఘటన వైరల్ వేడియోగా  మీడియాలో చెక్కర్లు కొడుతున్న వైనం.

మన తెలుగు రాష్ట్రాలలో ఒక చోట పాఠశాలలో  హింసాత్మకంగా ప్రవర్తిస్తూ  ఉపాధ్యాయులనే భయపెడుతున్న విద్యార్ధులపై  పోలీసు కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన ప్రధానోపాధ్యాయురాలికి పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపిన వైనం. అంతకు కొన్ని రోజులముందే ఒక వుపాధ్యాయుడిని గొంతుపట్టి నులిమిన సంఘటన.

పిల్లవాడ్ని ఉపాద్యాయుడు కొట్టాడని బంధువులంతా పాఠశాలకు వెళ్ళి ఉపాద్యాయుడిని చితక్కొట్టిన వైనం. ఏమిటి వీటి పర్యవసానం.? ఈ దేశం లో మేధావులందరూ స్తబ్దంగా కూర్చుంటే ఎలా? ఇలాంటి సంఘటనలను ఖండిచే వారు లేరా?  అసలు ఆ విద్యార్ధులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వారి మానసిక పరిస్తితి ప్రస్తుతరోజుల్లో ఎలా ఉంటోంది? అందుకు కారకులెవరు?

ఉదయం ఒక పిల్లవాడు లేచి  దగ్గరనుంచి  పాఠశాలకు వెళ్ళేంతవరకు ఇంటిలోనే ఉంటాడు. కేవలం విద్యాబోధన సమయంలో మాత్రమే అంటే సుమారు అయిదున్నర గంటలు విద్యాబోధనలోను, మరో రెండు గంటలు పాఠశాలకు చేరదం,  తిరిగి రావడంతో  ఇంటికి చేరుతాడు విద్యార్ధి. ఇంటికి వచ్చిన వెంటనే పాఠశాలలో ఉపాధ్యాయులు తమ తమ సబ్జైక్ట్స్ లో ఇచ్చిన ఇంటిపని పూర్తి చేయడానికి తల్లి కసరత్తు ప్రారంభిస్తుంది. అవి పూర్తి చేసి కాస్త సమయం వారి వినోదానికి గాని, ఇంటి క్రీడలపై గాని దృష్టి కేంద్రీకరించి అవి చూసిన తరువాత పడుకుంటారు. ఇంటికి తొందరగా వచ్చాకా తమ పనులకో, వినోదానికొ అడ్డు వస్తారనే  తలంపుతో తమ  ఆపిల్లలకు పాఠశాలలోనే ఇంటి పని చేయించి పంపేలా ట్యూషన్ ఏర్పాటుచేసే తల్లితండ్రులు కూడా ఎక్కువ శాతం మందే ఉన్నారు. తెల్లవారుఝామున లేపించి చదివించే ఓపిక తీరిక  లేని తల్లితండ్రులు తెల్లవారాకా లేచి హడావుడిగా కనీసం స్నానం కూడా చేయకుండా వంటలు పూర్తిచేసి బాక్సులు సర్ది , పిల్లలని, భర్తని బయటకు సాగనంపేసాకా అపుడు తీరిక దొరుకుతుంది ఆ ఇంటి ఇల్లాలికి. ఆపైన తన వ్యాపకాలలో పడిపోతుంది ఆమె. తన పిల్లలకు నాలుగు  ‘అలా ఉండకూడదు...ఇలా చేయకూడదు’ అని చెబుతుందే తప్ప అవే విషయాలని కధల రూపం లోనో, పద్యం రూపం లోనో పిల్లలకు నేర్పిస్తే వారి హృదయం లో  అటువంటి మంచి విషయాలు ముద్రించుకుంటాయి అని గుర్తించలేని స్థితిలో ఉన్నారు నేటి తల్లులు. పిల్లలకు మనో ధైర్యాని,  నిబ్బరాన్ని కలిగించే కధలు, నీతి పద్యాలు అసలు ఈనాటి తల్లులకే రావు అని కొన్ని సర్వేలు తెలియచేసున్నాయి.

ఇక తండ్రుల విషయానికి వస్తే  ఉదయం లేచిన దగ్గరనుంచి వ్యాయామం, ఉదయపు నడకలతో బయట గడిపిన అనంతరం ఇంటికి వస్తూనే మైళ్ళ దూరం లో ఉన్న ఆఫీసుకు బైక్ మీదో, బస్ మీదో బయల్దేరడం, అలసి సొలసి రాత్రి  బాగా చీకటి పడ్డాకా  ఇల్లు చేరుకోవడం పరిపాటి అయిపోయింది. ఇంటికి వచ్చాకా తమ పిల్లలు ఆరోజు ఏం చదివారు అనే అంశాలను పరిశీలించే అవకాశమే లేకుండా పోతోంది. ఇంకా నాలుగు మంచి విషయాలు నేర్పుకునే అవకాశం అతనికి ఉండటం లేదు. ఇంటికి వచ్చాకా అతని వ్యాపకం అతనిది.

ఇక పాఠశాలలలో ఉపాధ్యాయుల సంగతి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మంచి విద్యార్హతలను, విద్యార్ధులకు బొదించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారు పాఠశాలలో బోధన చేసే అయిదు గంటల సమయం లో నిజానికి బోధించే సమయం మూడు గంటల సమయం మించదు.ఆ సమయం లోనే తమకు కేటాయించిన విద్యార్ధులకు తాము బోధించవలసిన పాఠ్యప్రణాళికలను బోధించడానికే సమయం సరిపోతుంది. ఈలోగా తమ తమ సబ్జెక్టులలో విద్యార్ధుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంతర్జాలం లో నమోదు చేయడానికో, జవాబు పత్రాల దిద్దుబాటుకో సరిపోతుంది.

పిల్లలకు ప్రత్యక్షదైవాలైన తల్లితండ్రులే తమ పిల్లలకు మానవీయ విలువలను నేర్పుకోకపోతే భవిష్యత్తులో తమను గౌరవించే అవకాశం ప్రశ్నగా ముందు నిలబడే ఉంటుంది. పోనీ పాఠశాలల్లో చొరవతీసుకుని కొందరు వుపాధ్యాయులు నేర్పిద్దామని ప్రయత్నిస్తే వినకుండా అల్లరి చేస్తారు పిల్లలు. అపుడు వుపాధ్యాయులు మరింత సంయమనంతో విద్యార్ధులకు బోధించాల్సి ఉంటుంది.కానీ వారి పని వొత్తిడిలో అసహనం చేత ఒక దెబ్బ వేస్తే దానిని తీవ్ర విషయంగా పరిగణించి తల్లితండ్రులు వుపాధ్యాయులపైనా, విద్యాసంస్థలపైనా దాడులు చేస్తున్నారు.అయితే కొందరు  ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడం నిజంగా నేరమే.ప్రస్తుతకాలాన్ని బట్టి అటువంటి ఆవేశాలకు లోనూ కాకుండా వుపాధ్యాయులు ఓర్పు సహనం తో వ్యహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ విద్యార్ధి, అతని చదువు అన్న విషయాన్ని  పక్కనపెట్టి విద్యాసంస్థల అధికారులకు ఫిర్యాదు చేయకుండా తల్లితండ్రులు తమ బలగాలతో ఉపాధ్యాయులపై దాడిచేయడం చూస్తే తమ పిల్లలు నేర్చుకునే విద్య పట్ల వాళ్ళకు గల నమ్మకం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. దాంతో ఉపాధ్యాయులు వుదాసీనతతో వ్యవహరిస్తూ తమ బాధ్యతను తాము చేసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పురుష ఉపాధ్యాయుల కంటే స్త్రీ ఉపాధ్యాయులమీద దాడులు జరుగుతుండటం ఎక్కువగా మనం చూస్తున్నాం.

సమాజానికి భావి భారత పౌరులైన విద్యార్ధుల పట్ల  ఇంటివద్ద తల్లితండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రమే వాళ్ళకు మానవీయ విలువలను  నేర్పగలరు.  అటువంటి వారే తమ బాధ్యతను విడనాడితే భావి సమాజం యే విధంగా ఉంటుంది అన్న వూహ చేయలేని స్థితి లో ఉన్నాం మనం. కాబట్టి పిల్లలకు విద్య నేర్పడంలో, అందులో భాగంగా మానవీయ విలువలను నేర్పడంలో తల్లితండ్రులు , వుపాధ్యాయులు తమ వంతు పాత్ర తప్పక పోషించితీరాలి. అందుకోసం కొన్ని మార్గాలు అనుసరించాలి. అనుసరించి తీరాలి.విద్యార్ధులచేత ఆచరింపచేయాలి. ముందుగా  తమ పిల్లల  మానసిక, శారీరక పరిస్తితిని తల్లితండ్రులు గమనించాలి. శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం బాగుంటుదన్న విషయం అవగాహన చేసుకుని తమ పిల్లలు తమ పర్యవేక్షణ లో  ఆడుకునే అవకాశం కల్పించాలి.ఆ సమయం లో పిల్లలలో తోటి పిల్లల పట్ల ఈర్ష్య,ద్వేషం ఏర్పరచుకోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటమి, గెలుపులను సమానంగా తీసుకునే విధంగా వారిని మానసికంగా సిద్ధం చేయాలి.

క్రీడల అనంతరం పిల్లలు విశ్రాంతి తీసుకునే సమయంలో వారికి సాహస బాలల కధలు, పురాణ బాలల కధలు, మంచి నీతి కధలు, చక్కని నీతిని బోధించే పద్యాలు నేర్పాలి. అంతటి అవకాశం తమకు లేకపోతే ఆయా విలువైన పుస్తకాలను కొని చదవడం నేర్పాలి. పుస్తకాన్ని మించిన మంచి స్నేహితుడు మరోకటి లేదు అని తమ పిల్లలు గుర్తించేలా చేయాలి. వాటిల్లో సారాన్ని వారెంత గ్రహించారో వారిచేత వ్రాత రూపంలోనో, కధ రూపంలోనే, చిన్న స్కిడ్స్ రూపంలోనో తిరిగి చెప్పించాలి. దానివలన వారిలో సృజనాత్మకంగా ఆలోచించే అవకాశం బీజం వేసుకుంటుంది. వారికి తమ ఇంటికి వచ్చే అతిధుల చేత చక్కని సూచనలు ఇప్పించాలి. అయినా వినకుండా పిల్లలు విపరీత ధోరణులలో ప్రవర్తిస్తుంటే వారిని మానసిక వైద్యుని చేత పరీక్షింపచేసి వారి సూచనప్రకారం తమపిల్లలను సరిద్దుకోవాలి. ఇదంతా తల్లి తండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత.

ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే తమ తమ వ్యక్తిగత సమస్యలను ఇంటివద్దనే వదిలేసి, పాఠశాలలో వాటి ప్రభావం బోధనపై పడకుండా చూసుకోవాలి. వాటి ప్రభావం బోధనలో చోటుచేసుకుంటే తనకు సంతృప్తి కలగదు సరికదా  విద్యార్ధులపై ఆ ప్రభావం మరొక విధంగా దారితీసే విధంగా ఉంటుంది. విద్యార్ధుల హృదయాలు ఎటువంటి మాలిన్యమూ లేని శ్వేతపత్రాలు. కమ్మటి మీగడ చిలకగా వచ్చిన స్వచ్చమైన వెన్నముద్ద మనస్తత్వం గలవారు. అటువంటి శ్వేతపత్రం మీద వారికి బంగారు భవిష్యత్తును లిఖించే ఉన్నత మనస్తత్వం గలిగిన  తల్లితండ్రులు,  ఉత్తమ ఉపాధ్యాయులు సమాజానికి అవసరం. విద్యార్ధుల వెన్నపూస మనస్తత్వం ఎటు మలిచితే అటు మలుగుతుంది. ఒక చక్కని మూర్తిమత్వం గల విద్యార్ధిగా అతన్ని లేదా ఆమెను తయారుచేసే దిశను వారికి నిర్దేశించి, ఆ లక్ష్యం దిశగా వారు కృషిచేసేలా అనుక్షణం వెన్నంటి వారిని ప్రోత్సాహింవలసిన బాధ్యత  ఇటు తల్లి తండ్రులదీ, అటు ఉపాధ్యాయులదీ మాత్రమే. ఈ మధ్య కాలంలో ప్రచార సాధనాలు విరివిగా పెరిగి విస్తృతమైన సమాచారాన్ని అన్నీ రంగాలవారికి అందచేస్తున్నాయి. విద్యార్ధులను ఆలోచింపచేసేదిశగా వారిందించే సమాచారం, విజ్నానమ్ పరిపూర్ణంగా అందచేయగలిగే బాధ్యతను ప్రచార సాధనాలు స్వీకరించాలి . అంతవరకు విద్యార్ధులకు తెలియని ఎన్నెన్నో స్పూర్తిదాయక  విషయాలను, ఆసక్తి కలిగించే అంశాలను, విద్యార్ధిలో చైతన్యం పెంపొందించే శాస్త్రీయ దృక్పధాలను, వారిలో ధైర్యాన్ని నింపి నిర్భయంగా ముందుకు సాగే సాహసోపేత చరిత్రలను అన్నింటిని సమాచార సాధనాలు సేకరించి అందించాలి. అవి ఎంతగా వారి మనసుల్లో నాటుకుపోవాలంటే, వాటిని చదివి తామూ సమాజ అభ్యున్నతికి ఉపయోగపడే ఎన్నెన్నో ఆవిస్కరణలు, మంచిపనులు చేయ సంకల్పించుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ ఓర్పు , సహనంతో విద్యార్ధులు నేర్చుకుని  తమకు భగవంతుడు ఇచ్చిన మానవజన్మ జన్మ సార్ధకతకు తమజీవితం అంకితం చేసుకునే విధంగా ఉన్నతవిలువలు అలవరచుకుని ప్రవర్తించేలా ఉండాలి.

గౌరవం ఇచ్చి మర్యాదపుచ్చుకునే స్థాయికి విద్యార్ధులు ఎదగాలి. అంతే కానీ తాత్కాలిక ఆవేశాలకు తాము లోనై, తమ పెద్దలను రెచ్చగొట్టి తమ కన్నా పెద్దవారందరినీ దూషిస్తూ, అవసరమైతే పరాభవిస్తూ పోతూ ఉంటే తాము పాలు పోసి పెంచిన పిల్లలే తమను నిర్దాక్షిణ్యంగా కాటువేసిన నాడు ఆ పెద్దల మానసిక బాధ వర్ణాతీతం అవుతుంది. ఆ విద్యార్ధులు యే కర్రను నిప్పు ఉంటే అదే కాలిపోతుందన్న చందాన తమ పాలిట తామే భస్మాసురులై రాలిపోతారు. తద్వారా సమాజమే తన ఉనికిని కోల్పోయే ప్రమాదముంది.

కాబట్టి అటు తల్లితండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, విద్యార్ధుల జీవితాలను ప్రభావితం చేసే సమాజంలోని అన్నీ రకాల వ్యక్తులు తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చిన నాడు ‘’ ఒక బట్టకు పడిన చిరుగుకు సకాలం లో కుట్టు వేస్తే, తొమ్మిది కుట్లు వేసుకునే అంత పెద్ద చిరుగు కాకుండా కాపాడబడి’’ సభ్యసమాజం లో పెద్దల యెడ పిన్నల గౌరవం ఆచంద్రార్కమూ ఆకాశ దీపంలా వెలుగుతుందనడంలో సందేహం లేనేలేదు.                 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు