7 రాజ్యాలకు రాజధానిగా వున్నఏకైక పట్టణం ఏమిటో తెలుసా !! - లక్ష్మి దుగ్గరాజు

Do you know what !!

7 రాజ్యాలకు రాజధానిగా వున్న ఏకైక పట్టణం ఉజ్జయిని ... ఇది  (1) బ్రాహ్మణ, (2) జైన  (౩) బౌద్ధ (4) సింధియన్ (5) హైందవ (6) గ్రీకు  మరియు  (7) మొగలు మొదలగు రాజ్యములకు రాజధానిగా వున్నది . ఈ పట్టణం లో 3వ జ్యోతిర్లింగం కలదు. అదే ఉజ్జయిని మాహా కాళేశ్వర్. నేటి మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గల మాళ్వా ప్రాంతంలో ఈ ఉజ్జయిని పట్టణం కలదు . ఈ పట్టణాన్ని ఉజ్జైన్ , అవంతి , అవంతిక అను పేర్లతో కుడా పిలుస్తారు. హిందువుల 7 ముఖ్య పుణ్య క్షేత్రాలలో ఉజ్జయిని కుడా ముఖ్యమైనది . 

క్షిప్రా నదీ తీరమందు ఈ పట్టణం కలదు . ఈ అవంతిక ( ఉజ్జయిని ) కు  క్రీ పూ 3 వేల ఏండ్ల మహోన్నతమైన చరిత్ర కలదు. మహాకవి కాళిదాసు ఈ ఉజ్జయిని నగరాన్ని  వేవేల విధములుగా పొగిడి యున్నాడు . అశోకుడు , విక్రమాదిత్యుడు , చంద్ర గుప్తుడు , అక్బర్ ఈ పట్టణానికి ప్రాభవమును కల్పించిన వారిలో ముఖ్యులు . అశోకుడు ఈ పట్టణం లో కొద్ది కాలం వున్నాడు అని చరిత్ర కధనం. 
ఉజ్జయిని 2 సార్లు నాశనం చేయబడినది . ఒకసారి ఉధృతమైన వరదల వలన , మరొకసారి ఢిల్లీ ప్రభువు అల్తమష్ వలన . ఇది పలు రాజ్యములకు రాజధానిగా వున్నది. చివరకు గ్వాలియర్ ప్రభువు మహారాజా దౌలత్ రాయ్ సింధియా కాలానికి ఆహోదా వారి నుండీ 1810 లో లష్కర్ కు అందచేయబడినది. అవంతిక ( ఉజ్జయిని ) కి బుద్దుడి కాలం నాటి నుండీ  చరిత్ర కలదు.

ఈ పట్టణం లో సాందీప ముని వద్ద బలరామ కృష్ణులు విద్యను అభ్యసించిరి. నేటికీ సాందీపుని ఆశ్రమం ( గురుకులం )  దర్శనీయ స్థలం . ఇక్కడ ఒక సుందర సరోవరం మరియు దేవాలయం కలవు. దీనినే అంకపథ్ అంటారు .

1835 లో ఇక్కడి మాహా కాళేశ్వరుని దేవాలయం ధ్వంసం చేసి ఢిల్లీ ప్రభువు ఇందలి మహాకాళ విగ్రహమును ఢిల్లీ కి  తీసుకొని పోయెనని చరిత్ర తెలుపుతున్నది. తర్వాత 500  ఏండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం లో పనిచేయుచున్న రామచంద్రుడు అనే పుణ్యాత్ముడు అంతకు ముందు వున్న స్థలం లోనే ఇప్పుడు వున్న దేవాలయము కట్టించెను అని చారిత్రక ఆధారాలు కలవు . ఇక్కడ బ్రాహ్మణ పురోహితులను పాండాలు అని పిలుస్తారు . ఈ ఉజ్జయిని రాజధానిగా పాలించిన విక్రమాదిత్యుడి పేరునే విక్రమ శకమను  ప్రసిద్ధ శకము ఏర్పడినది. 1693 లో రాజ జయసింగు చే కట్టబడిన వేదసాల ఇప్పటికీ యోగ్యముగానున్నది. దీనిని యంత మహల్ అని పిలుస్తారు.

ఈ ఉజ్జయిని జ్యోతిర్లిన్గాన్ని దక్షిణా మూర్తి అనికూడా అంటారు . స్వామి దక్షిణ ముఖుడై ఉంటాడు. ఈ ఆలయ గర్భ గుడిలోని గోడలకు పార్వతి , గణపతి , కార్తికేయుల చిత్రాలు అమర్చబడి వుంటాయి . ఇక్కడి శివలింగాలు 3 అంతస్తులుగా వుంటాయి, అన్నిటికన్నా కింద వుండేది మహాకాళ లింగం , మధ్యలో వుండేది ఓంకార లింగం ,, అన్నిటికన్న పైన వుండేది నాగేంద్ర స్వరూప లింగం.

ఉజ్జయిని మహాకాళి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి . భోజరాజు, మహాకవి కాళిదాసు సంచరించిన పట్టణం ఇది. ఉజ్జయిని లో మాహా కాలుడు ( శివుడు) , మహాకాళి ( పార్వతి) -  జ్యోతిర్లింగం మరియు శక్తి పీఠం కొలువై వున్న మహాశక్తివంతం అయిన మహిమ గల ప్రదేశం .

ఇక్కడ అత్యంత ప్రధానమైన అంశం ,, మహా కాళేశ్వర్ కి అర్ధ రాత్రి 2.30 నుండీ 4.30 మధ్యలో ఇచ్చే భస్మా హారతి .. ఈ హారతి జరిగే సమయం లో స్త్రీలను స్వామిని చూడనీయరు. కానీ స్వామికి భస్మ హారతి అయిపోయాక అలంకారం చేస్తారు అప్పుడు స్త్రీలు మరియు పురుషులు అందరూ స్వామిని చూడ వచ్చు. ఈ భస్మా హారతికి పరమితంగా ( కొంతమందికి మాత్రమె ) టికెట్స్ ఇవ్వబడును . ఈ భస్మా హారతి దర్శనం కోసం అర్ధ రాత్రి 1 గంటకు లేదా 2 గంటలకు టికెట్ క్యూ లో నిల్చోవాలి . ఏవైనా పైరవీ లేఖల ద్వారా కూడా అభిషేకానికి , భస్మా హారతికి అనుమతి పొంద వచ్చును .

ఈ ఉజ్జయిని పట్టణం లో గల మరో ప్రధాన దేవాలయం కాలభైరవ ఆలయం . ఈ ఆలయం లోని కాలభైరవునికి మత్తు పానీయాలు నైవేద్యంగా పెడతారు , కాలభైరవుని నోటి దగ్గర మత్తు పానీయం ఒక ప్లేట్ లో పోసి పెడితే ఆ ప్లేట్ లోని పానీయం స్వామి తాగెస్తారు . ప్లేట్ ఖాళీ అవుతుంది. మరియు సిగరెట్ కాలభైరవుని ముందు వెలిగింఛి ఉంచుతారు . అది చాలా చాలా సహజంగా ఒక మనిషి పీలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది . ఇది చాల చాలా విచిత్రమైన అనుభవం . ఉజ్జయిని లో కాల భైరవ దర్శనం చాలా ముఖ్యమైనదిగా  భక్తులు భావిస్తారు .

ఉజ్జయిని నగరానికి అనేక రకములైన రవాణా సౌకర్యములు కలవు. వివిధ ప్రాంతముల నుండీ రైలు రవాణా సౌకర్యం మరియు బస్సు సౌకర్యం కలదు. ఉజ్జయిని కి దగ్గరలో వున్నా విమానాశ్రయం భోపాల్ , 200 కిలో మీటర్లు. ఏదైనా ప్రాంతం నుండీ మధ్యప్రదేష్ రాజధాని అయిన భోపాల్ నగరం వరకు విమానం లో కానీ రైలు మార్గాన చేరి అక్కడ నుండీ రోడ్ మార్గాన ఉజ్జయిని పట్టణం చేర వచ్చు. భోపాల్ నుండీ రైలు సౌకర్యం కలదు.  ఉజ్జయిని పట్టణం లో వసతి సౌకర్యములు , హోటల్స్  అందుబాటులో గలవు.