వీడిన మౌనం. - సురేఖ దేవళ్ల

veedina mounam

శాంతి ఇంజనీరింగ్ కళాశాల"  అందమైన అక్షరాలతో  ఉన్న  ఆ బిల్డింగ్ వైపు చూశాను, ఏదో తెలియని భావం మనసును చుట్టేసింది..ఇక్కడ ఎలా గడుస్తుందో...

గతం గుర్తుకొచ్చి  బాధ గొంతువరకు వచ్చి ఆగింది. వస్తున్న ఏడుపుని దిగమింగుకుని ముందుకు నడిచాను.ఎవరినీ ఏమీ అడగకుండా  ఒక్కో క్లాస్ రూమ్ చూసుకుంటూ నా క్లాస్ రూమ్ వచ్చేసరికి ఆగాను.. అప్పటికే అక్కడ కొంతమంది వచ్చి కూర్చున్నారు.  ఒకరికొకరు పరిచయం చేసుకుంటున్నారు.  నేను ఖాళీగా ఉన్న ఒక బెంచ్ దగ్గర కూర్చున్న.. వాళ్ళందరూ నావైపు ఒకసారి చూసి మళ్ళీ వాళ్ళ గొడవలో పడిపోయారు.. నేను బ్యాగ్ లో నుండి  "వెన్నెల్లో ఆడపిల్ల" నవల  తీసి చదువుకుంటూ కూర్చున్న..

ప్రొఫెసర్ వచ్చేసరికి క్లాస్ రూమ్ అంతా నిండిపోయింది స్టూడెంట్స్ తో.. ప్రొఫెసర్ వచ్చిన తర్వాత మరోసారి పరిచయ కార్యక్రమాలు జరిగాయి. అందరిలోకి నన్ను ఒక అమ్మాయి ఆకర్షించింది.. అందం వల్ల కాదు , ఉత్సాహంగా ,కలుపుగోలుగా లోకంలో ఉన్న సంతోషం అంతా తన దగ్గరే ఉందా అన్నట్లు  ఉన్న ఆమె ప్రవర్తన వల్ల.  నాకు చాలా నచ్చింది.. తన పేరు భవిత. 

ఆ రోజు నుండి ప్రతిరోజు ఆమెని గమనించడం నా దినచర్యలో భాగం అయిపోయింది.  ఆరునెలల కాలం ఇట్టే గడిచిపోయింది.  ఈ ఆరునెలల వ్యవధిలో ఎవరూ నాకు స్నేహితులు కాలేదు..కాలేదు అనేకంటే అయ్యే అవకాశం వారికి ఇవ్వలేదు అంటే బాగుంటుంది.. ఎంతమంది పలకరించినా చిన్న నవ్వు తప్ప మరో సమాధానం నానుండి రాలేదు ఎప్పుడూ.. "ఇలాంటి మౌనమునులతో ఉంటే మనమూ  మాటలు మర్చిపోతామేమో " అనుకుంటూ నాకు చేరువయ్యే ప్రయత్నాలు ఆపేశారు...

పదిరోజుల నుండి భవిత కాలేజ్ కి రాలేదు. ఏమయ్యిందో తెలీదు.. ఎవరిని అడగాలో ఎలా అడగాలో కూడా అర్థం కాలేదు.. మనసంతా అలజడిగా మారింది.. మరో వారం తర్వాత వచ్చింది తను కాలేజ్ కి..నాకు చాలా సంతోషం అనిపించింది.  కానీ ఆమెలో మునుపటి ఉత్సాహం లేదు..ఆమె పెదాలపై నిత్యం కదలాడే చిరునవ్వు మాయం అయిపోయింది.. ఒక రెండు రోజుల తర్వాత నాకు కారణం తెలిసింది  ..వాళ్ళ అమ్మగారు చనిపోయారని.  చాలా బాధనిపించింది నాకు.. అమ్మ లేని లోటేంటో అమ్మని పోగొట్టుకున్న నాకు తెలుసు.. అందుకే తను నాకు మరింత ఆత్మీయంగా అనిపిస్తుంది....ఎంత అభిమానం ,ప్రేమా ఉన్న తనతో  ఎదురుగా మాట్లాడలేకపోతున్న..తనతోనే కాదు ,ఎవరితో అయినా కూడా.. ఎంతగా మారదామని ప్రయత్నించినా గతజ్ఞాపకాలు ప్రతిబంధకాలు అయిపోతున్నాయి. మరో రెండు నెలలు గడిచాయి.. ఈ రెండు నెలలు తనను ఫాలో అవుతూనే ఉన్నా ,ఎందుకో నాకూ తెలియదు..ఏదో తెలియని భయం..తనకి ఏమైనా అవుతుందేమో ,ఎవరైనా హాని తలపెడతారేమో అని మనసులో గుబులుగా ఉంటుంది.

మూడు రోజుల నుండి తనతో ఎవరూ మాట్లాడటంలేదు , దూరం పెడుతున్నారు అందరూ.. కారణం తెలియలేదు..ఏమని అడగాలో అర్థం కాలేదు.. తన కళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటున్నాయి ఈమధ్య. లంచ్ అవర్ లో తను కాలేజ్ ఆవరణలో ఉన్న ఒక చెట్టుకింద కూర్చుని మోకాళ్ళలో తలదూర్చి వెక్కి వెక్కి పడుతుంది.. ఇక మౌనంగా ఉండడం నావల్ల కాలేదు.. తన దగ్గరకు వెళ్ళి తలమీద చేయి వేశాను. తను తలఎత్తి నన్ను చూసి ఆశ్చర్యపోయింది..తనకు దగ్గరగా కూర్చుని 'ఏం జరిగింది' అనడిగాను. ఏమనుకుందో ఏమో తన వేదనంతా తీరేలా ఒక్కసారి గట్టిగా ఏడ్చేసి తర్వాత కళ్ళు తుడుచుకుని మంచినీళ్ళు తాగి చెప్పడం మొదలుపెట్టింది.. "మా అమ్మ ఒక ప్రాస్టిట్యూట్..మా అమ్మకి తల్లి లేదు..మేనమామ తన విలాసాల కోసం అమ్మని ఎవరికో అమ్మేసాడు..ఇష్టం లేని జీవితం అయినా చచ్చే ధైర్యం లేక బలవంతంగా ఆ జీవితాన్నే గడిపింది.  నేను కడుపున పడకముందు ఎవరో ఆసామి అమ్మని కొనుక్కుని ఈ నరకం నుండి తప్పించి తన ఇలాఖాలో పెట్టుకున్నాడంట..ఎనిమిది నెలలు బానే చూసుకున్నాడంట..తర్వాత నేను కడుపున పడేసరికి అమ్మని వదిలించుకుని వెళ్ళిపోయాడంట.. అమ్మకి ఏ పనీ చేతకాదు..తప్పనిసరి పరిస్థితుల్లో నాకోసం, నన్ను పెంచడం కోసం మళ్ళీ ఆ వృత్తిలోకే దిగింది..

అనుకోని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న మా పిన్నిని కూడా తను అక్కున చేర్చుకుంది.. నేను కొంచెం ఎదిగేసరికి నా భవిష్యత్తు కూడా తనలా ఎక్కడ అవుతుందో అనే భయంతో ఆ ఊరు వదిలి ఇక్కడికి తీసుకుని వచ్చేసింది..పాత జీవితాన్ని మర్చిపోయి , అంతకముందు సంపాదించిన డబ్బులతో ఇంట్లోనే బట్టల షాప్ పెట్టింది.. 

అది రాను రాను బాగా ఉండడంతో మాకు తిండికీ బట్టకూ , నా చదువుకు ఏ లోటూ ఉండేది కాదు.  తన గతం గురించి ఏమీ దాయకుండా నాకు అర్థం చేసుకునే వయసు రాగానే మొత్తం చెప్పింది.   అప్పటినుంచి అమ్మ మీద మరింత గౌరవం పెరిగిందే తప్ప తగ్గలేదు..

అనుకోకుండా అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయింది .. పిన్ని ఉన్నా కూడా అప్పటినుంచి నేను ఒంటరిననే భావం వదలట్లేదు..ఈమధ్య మా పిన్ని ప్రవర్తన లో తేడా వచ్చింది.. ఏమిటి అనేది సరిగ్గా అర్థం కావడంలేదు కానీ నాకు భయం వేస్తుంది..ఒకసారి అమ్మ చనిపోయిన బాధలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కి ఇదంతా చెప్పాను..వాళ్ళు అర్థం చేసుకోకపోగా నన్ను దూరం పెట్టారు... ఏం చేయాలో పాలుపోవడంలేదు.."  అంది.

అది విన్న నాకు గుండెలు బరువెక్కాయి...తనకు నేనున్నాననే భరోసా ఇచ్చాను..ధైర్యం చెప్పాను..తనకోసం నేనున్నా అనే ధైర్యం ఇచ్చాను..
తన కళ్ళల్లో కొంచెం వెలుగు వచ్చింది.." ఒక మనిషికి మనం చేసే పెద్ద సాయం అంటే బాధల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నా అనే  నమ్మకం కలిగించడం..ఆ నమ్మకం  ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునే మనోధైర్యాన్ని ఇస్తుంది " అని నా అభిప్రాయం.  అప్పటినుండి తనని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాను..దాదాపు పదినెలలుగా మౌనాన్ని ఆశ్రయించిన నేను తనకోసం దానిని విడిచిపెట్టి తన బాధ తగ్గేలా చేయగలిగాను..

పది రోజులు బాగానే గడిచాయి..సడెన్ గా తను కాలేజ్ కి రావడం మానేసింది.. రెండు రోజులు ఎదురుచూసినా తన జాడలేదు..వాళ్ళ ఇంటి దగ్గర అబ్జర్వ్ చేశాను..ఒక కార్ ఆగి ఉంది..డ్రైవర్ కాకుండా ఇంకో ఇద్దరు కార్ దగ్గరే ఉన్నారు.. వాళ్ళని చూడగానే అర్థం అయ్యింది వ రౌడీల జాతికి చెందిన వారని.  నాకు ఒక అంచనా వచ్చేసింది ఏం జరగబోతుందో..  అలాగే ఒక చెట్టు పక్కన నిలబడి చూస్తూ ఉన్నా..

ఒక అరగంటకి లోపలినుండి భవిత వాళ్ళ పిన్ని  మరో అతనితో బయటికి వచ్చింది..అతనికి ఒక అరవై ఏళ్ళు ఉండవచ్చు బహుశా..అతను కారెక్కి వెళ్ళిపోయాడు..ఆమె లోపలికి వెళ్ళిపోయింది.. చుట్టూ చూశాను.. ఎవరూ లేరు బయట..అదురుతున్న గుండెలను అదుపులో పెడుతూ వాళ్ళింటి వైపు కదిలాను..గేట్ తీసి కాకుండా వెనకవైపు నుండి గోడ దూకి లోపలికి వెళ్ళాను..గోడ మరీ ఎత్తులేదు ,పైగా పూర్వానుభవం కూడా ఉంది గోడ దూకడంలో. 

అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ చూశాను. ఒక కిటికీ  తెరిచి ఉంది.. అక్కడినుంచి మాటలు వినిపిస్తున్నాయి.. "చూడు ,నిన్ను కాపాడేవాళ్ళెవరూ లేరు ఇక్కడ.. నీ పుట్టుపూర్వోత్తరాలను గురించి తెలిసి అసహ్యించుకునేవారే అందరూ.. అయినా లక్షణంగా పెళ్ళి చేసుకోమంటే ఏం రోగం..నేనేమైనా మా మేనమామలా అమ్మేస్తున్నానా...పెళ్ళే కదా చేస్తున్నా..కాకపోతే అతనికి కొంచెం వయసెక్కువ అంతే కదా..బోలెడంత డబ్బు ఉందతనికి..నువ్వు నేను కూడా చచ్చేవరకు మహారాణుల్లా బతకొచ్చు..పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా చెప్పినట్లు విను.  " అంటూ అరిచి బయటికి వెళ్ళిపోయిందామె ఫోన్ వస్తే మాట్లాడటానికి..

ఫోన్ మాట్లాడుతూ బయట ఉందామె..గుమ్మానికి కొంచెం దూరంలో ఉండడంతో నేను చిన్నగా,సౌండ్ రాకుండా నడుస్తూ  లోపలికి వెళ్ళిపోయాను..భవిత గదివైపు నడిచి గెడ తీసి లోపలికి వెళ్ళాను.. 'భవితా ' అని పిలిచాను..
"అక్కా , నువ్వెలా వచ్చావు" అంటూ కొంచెం ఆశ్చర్యంగా ,కొంత ఆందోనగా అడిగింది. 

ఎలానో వచ్చాలే ,పద తొందరగా అంటూ తన చెయ్యి పుచ్చుకుని బయటికి నడిచాను..హాల్లోకి వచ్చేసరికి వాళ్ళ పిన్ని వచ్చేసింది.. "ఎవరు నువ్వు ,ఎక్కడికి తీసుకు వెళుతున్నావు దాన్ని" అంటూ కంచు కంఠంతో అరిచింది. 

"తన శ్రేయోభిలాషిని , స్నేహితురాలిని..మీరు చేసేది తప్పు.. దయచేసి వదిలేయండి తనని " అన్నాను అర్థిస్తున్నట్లుగా..

ఏంటే వదిలేది అంటూ నా దగ్గరకు వచ్చి  లాగిపెట్టి కొట్టింది... ఆ దెబ్బకి కళ్ళు తిరిగినట్లయ్యింది..కానీ వెంటనే తేరుకున్నాను.. ఎదురు తిరిగి నేనూ కొట్టాను..కొంతసేపు కలబడేసరికి భవిత కూడా నాకు తోడవ్వడంతో ఆమె మా ముందు ఎంతోసేపు నిలవలేదు..కాళ్ళూచేతులు కట్టేసి ,నోట్లో బట్ట పెట్టి బయటికి పరిగెత్తాం..

ఈలోగా ఆ కార్ రావడం చూశాం ..కార్ ఆ ఇంటిముందు ఆగినట్లే ఆగి ముందుకు రాసాగింది..అంటే మమ్మల్ని గమనించారన్నమాట..పరిగెడుతూ ఉన్న మాకు అటుగా వెళుతున్న ఆటో కనిపించింది.. వెంటనే అందులోకి ఎక్కి ఆటోని స్పీడ్ గా పోనిమ్మన్నాను..

కొంచెం ముందుకు వెళ్ళేసరికి  సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవడంతో ఆటో ఇరుక్కుంది..

ఆటో అతనికి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇద్దరం బయటకు దూకి పరిగెట్టాం..వెనక నుంచి అరుస్తున్న ఆటోడ్రైవర్ ని కానీ ,మమ్మల్నే ఫాలో అవుతున్న వాళ్ళని కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం..

రైల్వేస్టేషన్ దగ్గరకు వచ్చేశాం ...వెనక్కి తిరిగి చూశా ఆ కార్ లోని రౌడీలు  వచ్చేస్తున్నారు..స్టేషన్ లోకి పరిగెడుతూ వెళ్ళేసరికి అక్కడ నాన్న కనిపించారు..ఆందోళనగా చూస్తున్న నాన్నని, మాతోపాటు ఒక భోగీలోకి ఎక్కించి మరోవైపు నుండి దిగిపోయి అవతల వైపు కదలడానికి సిద్ధంగా ఉన్న ఒక రైలు ఎక్కేశాం..అదెక్కడికి వెళుతుందో తెలీదు ,ఇక్కడినుండి తప్పించుకుంటే చాలు అనిపించింది..

ఎక్కిన తర్వాత ఒక భోగీనుండి మరో భోగీలోకి మారుతూ జనరల్ కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఆగి డోర్ దగ్గర కూర్చుండిపోయాం ముగ్గురం..ఆయాసం తగ్గిన తర్వాత నాన్నకి జరిగింది అంతా చెప్పేశాను.." నా జీవితంలా తనది నాశనం కాకూడదని ఇలా చేశాను అన్నాను.."అర్థం చేసుకున్నారు నాన్న.  భవిత ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు..

" డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు బయటికి వెళ్ళి వస్తున్న నన్ను ,నాన్నని నలుగురు రౌడీలు అడ్డగించి నాన్నని కొట్టి పక్కకు పడేసి నన్ను ..నన్ను.. నన్ను....." అంటూ వెక్కిళ్ళ మధ్య ఆగిపోయిన నా తలపై ఓదారుస్తున్నట్లుగా చేయి వేశారు నాన్న కళ్ళనీళ్ళతో.. భవిత ఏడ్చేసింది విని..

"అక్కా ,నీ బాధను నీలోనే దాచుకుని ఎంత కుమిలిపోయుంటావు... నాకోసం అని ఇంత సాహసం చేశావు..నీ రుణం ఎలా తీర్చుకోగలను"  అంది చేతులు జోడిస్తూ.. ఇది సాహసమో కాదో నాకు తెలీదు.. నాకు జరిగిన దానిని మార్చలేను కానీ నీకు జరగబోయే అన్యాయాన్ని ఆపగలను..అందుకే నావంతు ప్రయత్నం నేను చేశాను" అన్నాను. ముగ్గురం ఇకపై మంచే జరగాలని కోరుకుంటూ మౌనంగా ఉండిపోయాం..రైలు ఎవరి ఆలోచనలతో సంబంధం లేకుండా ముందుకు సాగిపోతోంది.