సుశాస్త్రీయం: ప్రముఖ పత్రికా సంపాదకుడు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు - టీవీయస్. శాస్త్రి

mutnuri krishna rao biography

ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణా పత్రిక సంపాదకునిగా ఆంధ్రులకు చిరపరిచితులు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు అనగా నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ వికాసానికి కృషిచేసిన మహనీయుడు. ఆ రోజుల్లో చేతిలో కృష్ణాపత్రిక ఉండటం సాహితీ ప్రియులకొక అలంకారం.

శ్రీ కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరు గ్రామంలో జన్మించారు. పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్నారు. మరి కొంతకాలానికి బాల్యంలోనే తండ్రిని కూడా పోగొట్టుకున్నారు. పినతండ్రి పంచన చేరి ఆయన వద్ద పెరిగారు. ప్రాధమిక, ఉన్నత విద్య అంతా బందరులోనే గడిచింది. బందరులోని నోబుల్ కళాశాలలో ఎఫ్. ఏ కోర్సులో చేరారు. అక్కడ వీరికి ఉపాధ్యాయులుగా బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉండేవారు. నాయుడి గారి ఉన్నత భావాలు, సంఘ సంస్కరణాభిలాష, దురాచారాల నిర్మూలన... మొదలైన భావాలు కృష్ణారావు గారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాయుడు గారితో వీరు కూడా బ్రహ్మ సమాజపు ఉపన్యాసాలకు వెళ్ళేవారు. అచిరకాలంలోనే మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. బందరులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు గారు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి. ఎ. లో చేరారు. అక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. సాహితీ వ్యాసంగం ఎక్కువ అవటం చేత డిగ్రీని పొందకుండానే 1903 లో బందరుకు తిరిగి వచ్చారు.

మొదటి నుండీ రచనా వ్యాసంగం పట్ల ఉన్న ఉత్సాహంతో కృష్ణా పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. 1907 లో ఆ పత్రికకు సంపాదకునిగా బాధ్యతలను తీసుకున్నారు. ఆ పత్రిక అతి కొద్దికాలంలోనే ఆనాటి మరొక ప్రముఖ పత్రిక అయిన ఆంధ్రపత్రికకు పోటీగా తయారయ్యింది. పోటీని తట్టుకోలేక ఆంధ్రపత్రిక నిర్వాహకుడు అయిన శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు కృష్ణారావు గారికి నెలకు 500 రూపాయల జీతాన్ని ఆశగా చూపి, తన పత్రిక వైపు ఆకర్షించుకోదలచారు. కానీ, కృష్ణారావు గారు ఆయన చూపిన ఆశలకు లొంగలేదు, కృష్ణాపత్రికలోనే కొనసాగారు. మరొకవైపు శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణాపత్రికను ఒక రాజకీయ పత్రికగా మార్చాలని విశేష ప్రయత్నాలు చేసారు. కానీ, కృష్ణారావు గారు కృష్ణాపత్రికను ఒక సాహిత్య పత్రికగా కొనసాగిస్తూ, మరణించే వరకూ ఆ పత్రికలోనే పనిచేసారు.

అలా తెలుగు భాషపట్ల, తెలుగు సాహిత్యంపట్ల ఆయన తన ప్రేమను చాటుకున్నారు. 1907 నుండి 1945 వరకు, అనగా 38 సంవత్సారాలు ఒక వ్యక్తి ఒక పత్రికకు సంపాదకునిగా పనిచేయటం నేటికీ ఒక రికార్డు. కొంతకాలం ఆంధ్ర భారతి అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించారు. కృష్ణా పత్రిక కార్యాలయంలో వీరి గోష్టిని సాహితీ వేత్తలు "దర్బారు" గా వ్యవహరించేవారట. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించింది. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను శ్రీ ముట్నూరి ఒక తపస్సుగా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణాపత్రికలో వచ్చే వార్తలపై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట. ఎడిటర్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు మాటగా ‘సంపాదకుడు’ స్థిరపడిపోయాడు. ‘సంచార విజ్ఞాన సర్వస్వ’మనిపించుకున్న కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈ మాటను తొలిసారి ప్రయోగించారంటారు. సంపాదకుడంటే, నిర్వచనంగానూ, నిదర్శనంగానూ కనిపిస్తారు కృష్ణారావు గారు.

పత్రిక కార్యాలయంలోని జరిగే సమావేశాలకి అడివి బాపిరాజుగారు ‘కృష్ణరాయ దర్బారు’ అని నామకరణం చేసారు. ఈ సమావేశాల్లో కృష్ణారావుగారిని అందరూ గౌరవించేవారు. ఆ సమావేశాలకు కూడా ఆయనే సమన్వయకర్తగా వ్యవహరించేవాడు. ఆ దర్బారులో హేమాహేమీలయిన కాటూరి వెంకటేశ్వరరావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొడాలి ఆంజనేయులు, పువ్వాడ శేషగిరిరావు, మునిమాణిక్యం నరసింహారావు, మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గార్ల లాంటి వారితో నిజంగానే 'భువన విజయం' లాగా ఉండేది. పట్టాభి సీతారామయ్య, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, చిత్తూరు నాగయ్య తదితరులు అప్పుడప్పుడూ ఆ సభలలో పాల్గొనే వారు. పత్రికా సంపాదకునికి ఉండవలసిన వాడీ, వేడీ కృష్ణారావు గారి సొత్తు. ఈ లక్షణాలే ఆయనను ఒక ప్రముఖ సంపాదకునిగా తీర్చిదిద్దాయి.

‘సంపాదకుడంటే నా కింపారెడు భక్తి కలదు, సంపూర్ణ మనుజు డాతడు - చింపాంజీ కన్న నయము’ అని మహాకవి శ్రీశ్రీ, సంపాదకుదంటే ఒక పూర్ణ పురుషుడని తన బాణీలో చెప్పారు. సంపాదకులకు ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనుడు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు. వీరు మంచి హాస్యప్రియులు కూడా. ఒకరోజు కృష్ణారావు గారు ఒక సంపన్న గృహస్తు ఇంటికి అతిధిగా వెళ్ళారు. ఆ ఇంటి యజమాని పూజలో ఉన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత, ఆయన బయటకు వచ్చి ఆ పూజా జలాన్ని ఎక్కువగా కృష్ణారావు గారి శిరస్సు మీద చల్లారు. దానికి కృష్ణారావు గారు, "ఆయన నా మీద తీర్థం ఎక్కువగా ఎందుకు అభిషేకించారో తెలుసా! నా తల ఆయనకు ఒక శివలింగంగా కనబడటం వలన" అని అన్నారు. అక్కడున్న మిగిలిన మిత్రులు కడుపుబ్బ నవ్వారు. కృష్ణారావు గారిది పూర్తిగా బట్టతల. అందుచేతనేమో! ఆయన ఎప్పుడూ తలపాగాతో ఉండేవారు.

ఒకసారి కృష్ణారావు గారికి అనారోగ్యం చేయటం వలన మిత్రులు ఆయనను వెంటనే ఒక హాస్పిటల్ లో చేర్చి, తరువాత వారి శ్రీమతికి కబురుపెట్టారట! ఆవిడ హాస్పిటల్ లో మంచం మీద ఉన్న కృష్ణారావు గారిని చూసి భోరున ఏడుపు లంకించుకుంది. అప్పుడు కృష్ణారావు గారు భార్యతో, "అప్పుడే రిహార్సల్ మొదలు పెట్టావా?" అని అన్నారట. అంత విషాదకర సన్నివేశాన్ని కూడా వినోదంగా మార్చిన సరస సంభాషణా చతురుడు కృష్ణారావు గారు. అటువంటి మహనీయుడు 1945లో దేహయాత్ర చాలించారు. పత్రికల స్థాయి, ప్రమాణాలు తగ్గి, ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రంగా తయారయిన ఈ రోజుల్లో పత్రికా సంపాదకులు- -- సంపాదకులకు ఇంపారెడు గౌరవాన్ని తెచ్చిన కృష్ణారావు గారి నీతి , నిజాయితీలను ఆదర్శంగా తీసుకోవాలి. 'Journalism for sale' అని అప్రతిష్ట పాలైన పత్రిక​లు,శ్రీ కృష్ణారావు గారి నీతి, నిజాయితీలను ఆదర్శంగా తీసుకొని ​ ​పత్రికల ప్రతిష్టను పునరుద్ధరించాలి!
ఆ మహనీయునికి నా ఘనమైన నివాళి!

 

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు