stain - భవ్య చారు

మరక

అయ్యో , ఇప్పుడు ఎలా ? ఏం చేయాలి ? అయ్యో కనీసం నేను ఇంకో అయిదు నిమిషాలు లేట్ గా బయల్దేరినా బాగుండేది. అప్పటికి అనుకుంటూనే ఉన్నా, అయినా నా బుద్ధితక్కువ కాకుంటే, అన్ని తెలిసి కూడా నేనెందుకు మర్చిపోయాను. అవును అన్నీ దాని వల్లే, అది రాకపోవడం  వల్లే ఇలా జరిగింది. లేకపోతే  అన్ని ముందే చేసుకుననేది కాదు. 

రోజూ లేట్ గా లేచేది. లేట్ అయ్యేది , ఈ సంగతి తెలిసేది. అయ్యో భగవాన్ ఎందుకు చేశావ్ అయ్యా ఇలా , ఇప్పుడే  ఇది రావాలా, ఏదైనా పని ఎగ్గొట్టాలని ఉన్నప్పుడు రాదే ఇది, అర్జంట్ పని ఉన్నప్పుడే వస్తుంది. అయ్యో దేవుడా ఎవరైనా గమనించారా, చుట్టూ చూస్తూ  హమ్మయ్య ఎవరూ గమనించలేదు. అయినా దీనికి బుద్ధి , సమయం ఉండొద్దూ, దాన్ని అనుకుని ఎం లాభం , ఎప్పుడూ దగ్గరే ఉండేది. 

ఇప్పుడేమిటో దగ్గర లేదు. అయ్యో ఇప్పుడు ఎలా , ఏం చేయాలి , ఎవరికైనా చెప్పాలి అన్నా , ఏమని చెప్తా సిగ్గు లేకుండా , చి చి , అయ్యో రామా, ఇది రావడం ఎందుకో అసలు , అసలు పని మనిషి ముందు రోజే రానని చెప్పడం వల్ల, తాను తొందరగా లేచి ,పనులు చేసేసిoది. దాని వల్ల సమయానికి అన్ని అయిపోయి, ఈ రోజు  తొందరగా బయల్దేరి వచ్చేసింది...

రోజూ లేట్ గా వచ్చే తాను ,ఈ రోజు తొందరగా రావడం తో అందరూ బిత్తరపోతారు అని అనుకుంటుంటే, తానే బిత్తరపోయేలా చేసింది ఇది, చా నా మూడ్ అంత చెడగొట్టింది, ఇది , ఆయినా నేను ముందుగా రావడం నా తప్పు , ఇప్పుడు ముందుగా వచ్చి, వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. 

కనీసం పక్క టేబుల్లో రమ్య కూడా రాలేదు.దాని దగ్గర ఉందేమో అడుగుదాం అంటే, అది ఈ రోజే సెలవు పెట్టాలా, ఎంత అనిజీగా ఉందొ, తనకి , తమ ఆఫీస్ లో అందరూ మగవెధవలే ఉన్నారు, అయ్యో రాత , కోపం లో తిట్లు కూడా వచ్చేస్తున్నాయి. బాబోయి , ఇలాగే ఇంకో ఆరు గంటలు కూర్చోవాలి తప్పదు..., 

కనీసం అవి ఆయినా ఉంటే, కొంచం లో కొంచం బెటర్ గా ఉండేది. ఆ లక్మమ్మ కూడా రాలేదేందుకో, అమ్మో ఆమెకి చెప్తే ఏమైనా ఉందా, ముందే చెవిటి మేళం , ఎందమ్మా అని గట్టిగా అరుస్తుంది. దానికి అరుస్తూ చెప్తేనే వినబడుతుంది. ఖర్మ కాకపోతే వాళ్ళు ఇద్దరూ ఈ రోజే రాకుండా ఉండాలా,? 

అయినా నా పిచ్చి కాకపోతే ఎవరేమనుకుంటే నా కేంటి వెళ్లి , ఆడిగేస్తే పొలా, అవును ఎందుకు భయపడాలి ? 
ఈ రోజుల్లో ఎవరూ దేనికి భయపడటం లేదు , నేను మాత్రం ఎందుకు భయపడాలి.? అయినానా వారెవరో భయపడ్డo లేదని , నేను బరితెగించి అడగాలా? , చ సిగ్గు, బిడియం అడ్డొస్తున్నాయి. అయినా అలా అడుగుతారెంటి, అందరి ముందు పరువు పోదు, చీ చీ, అవును ఆ టీవీ లో మాత్రం  గెంతుతూ చూపించడం లేదు.? సిగ్గు లేకుండా ? అయ్యో భగవాన్ ఏమిటి నాకు పరీక్ష, ? 

అయినా ఆడవాళ్లు అంతరిక్షంలో అడుగుపెడుతున్న ఈ కాలం లో కూడా నేనింకా సిగ్గు పడుతూ కూర్చుంటే లాభం లేదు, ఎలాగో ఒక లాగా ఆడిగేయ్యాలి, అవును ఆడిగేయ్యాలి.కానీ ఎలా అడగడం, ఏమైనా జరిగిందేమో, నా వెనకాల ఏవరైనా చూస్తున్నారేమో,చీ చీ ఇంత అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు. 

వెనక ఏమైందో అన్న అనుమానం, భయం , సిగ్గు, బిడియం తో బిక్కచచ్చి పోతున్నా, ఏంటో ఇది నాకే రావాలా, ?అది కూడా ఈ రోజే, అయ్యో రేపే శ్రావణ శుక్రవారం , వచ్చిన పేరంటాలు వెనక్కి వెళ్లిపోతారేమో,అయ్యో రేపే ఆఖరి శుక్రవారం, ఇక ఆ పనమ్మాయి నాలుగు రోజులు రాదు. 

దాని భాధ కూడా ఇదేనేమో, పాపం ,ఈ నాలుగు రోజులు వంట ఎలాగో మరి, ఆయన చేతులు కాలాలి తప్పదు, అయిన కలుపుతా అంటే వింటారా, ఆహా అదెలా కుదురుతుంది , అగ్ని హోత్రులం అని అంటారు, అంతగా కాకుంటే హోటల్ ఉంది అంటారు..,

 మరి హోటల్ వాళ్లలో ఇలా జరిగిన వారు ఉండరా ఏమిటి ? ఆయన పిచ్చి కాకపోతే, రేపు మూలన పడ్డాక తెలుస్తుంది లే, నాకేం అవసరం , ఇప్పటి నుండి అనుకుని , అయ్యో ఎదో మాట్లాడుతూ , ఇంకేదో అలిచిస్తున్నా, ఇప్పుడు ఈ మార్గం తిరే దారేది, ఎవరొచ్చి కాపాడతారు...

అయినా ఈ ఆఫీసులు ఇంతంత కడతారు, లేడీస్ కోసం ఆలోచించి, ఆ మాత్రం పెట్టొద్దు, నాకు లాగా ఎవరైనా మర్చిపోయే వారు ఉంటే, లేదంటే అత్యవసరం అయినప్పుడు వాడుకుంటారు ,కదా, అదేదో దేశం లో అలాగే పెడుతున్నారు అంట, మన దేశం లో కనీసం ఆ ఆలోచన అయినా రావడం లేదేమి , ఖర్మ కాకపోతే, లాభాలు ఆర్జించే వారు కావాలి కానీ , ఇలాంటివి వారికి అవసరమా ..?

ఇంకో జత అయినా బాగ్ లో లేదే, అయ్యో అవును లంచ్ టైం అయినట్లు ఉంది. అందరూ డబ్బాలు పుచ్చుకుని వెళ్తున్నారు. హు డబ్బాలు , చెంబులు అనలేదు, నయం దేవుడా,  అవును అదేదో  మెడికల్ యాప్ ఉందిగా , అవును నేను మార్చే పోయాను, ఫోన్ తీసుకుని  యాప్   తీసి  ఆర్డర్ చేసింది. హమ్మయ్య ఆదోచ్చేస్తుంది ఇక ఏమి భయం లేదు. అని ఊపిరి పీల్చుకుంది.  

అయిదు నిమిషాల్లో  మెడికల్ అతను వచ్చాడు . ఫోన్ చేస్తూ, టేబుల్ దగ్గరికి వచ్చేసి, ఇచ్చేసి వెళ్ళాడు. హమ్మయ్య అందరూ వెళ్లిపోయారు, ఇప్పుడు వెళ్లొచ్చు ఇక,మెల్లిగా సీట్ లోంచి లేచి, బాత్రూమ్ లోకి వెళ్ళింది. డ్రెస్ కింద ,పైన , వెనక ,ముందు చూసుకుని , హమ్మయ్య అని అనుకుంటూ... విస్పెర్ ప్యాకెట్ ఓపెన్ చేసింది....

(అందరం ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితిని దాటి వచ్చిన వారిమే,కదా, అందుకే  ఆడవారికి అలాంటి సమయంలో ఏ ఆఫీస్ లో అయినా, ఏస్కూల్, కాలేజీ, పరిశ్రమలో ఆయినా ఇలాంటి సౌలభ్యం, సౌకర్యాలు అందించే రోజు రావాలని కోరుకుంటూ.....