బహుముఖ ప్రజ్ఞాశీలి - అడివి బాపిరాజు గారు - ambadipudi syamasundar rao

బహుముఖ ప్రజ్ఞాశీలి - అడివి బాపిరాజు గారు

అడివి బాపిరాజు గారు బహుముఖ ప్రజ్ఞాశీలి. తెలుగు సాహిత్యములో పేరెన్నిక గన్న రచయిత, కళాకారుడు, నాటక కర్త.మరియు స్వాంతంత్ర్య సమరయోధుడు తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే పత్రిక సంపాదకుడిగా కళా దర్శకుడిగా ఆచార్యుడిగా భిన్న పాత్రలు పోషించినవాడు.మిత్రుల పెళ్లిళ్లలో మంగళ హారతులు పాడి అందరిని మెప్పించిన సంస్కారి సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.కాల్పనికోద్యమ కాలములో బాపిరాజుగారు తెలుగు కవిత్వాన్ని సృజనాత్మక వచన రచనలను కొత్త పుంతలను తొక్కించినవాడు బాపిరాజు
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించిన వారిలో బాపిరాజు ఒకడు.
చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి ఎల్లోరా గుహల్లోని యక్షిణి చిత్రాన్నిచూసిన బాపిరాజు ఒక గంట పాటు తన్మయత్వములో గడిపాడుట,ఆయన హృదయము లోని కళారాధన ఆర్ద్రత అటువంటివి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడినాయి .అలాగే ప్రముఖ  సాహితి పత్రిక భారతి కి చిత్రాలు వేసేవాడు నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో ఉన్నాయి.అలాగే సూర్యదేవర అనే చిత్రము కూచ్ బీహార్ లో ఉంది. అయన గీసిన తిక్కన చిత్రము ఆంధ్ర యూనివర్సిటీ బహుమతి గెలుచుకుంది. 1951లో అప్పటి మద్రాసు ప్రభుత్వం కోరికపై సింహళం లోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
మీరాబాయి అనే చలన చిత్రానికి కళా దర్శకుడిగా పనిచేశాడు అనసూయ ధ్రువ విజయము వంటి సినిమాలు బాపిరాజు సృష్టియే. అయన రచించి దర్శకత్వము వహించిన రేడియో నాటకాలలో దుక్కిటెద్దులు ,ఉషాసుందరి మొదలైనవి ఉన్నాయి. అలాగే కథల్లో తూలిక నృత్యము,హంపి శిధిలాలు, శిల్ప బాల , వీణ ప్రత్యేకం, పత్రికా వీరుడు తెలంగాణా ప్రజల నాడి  మొదలైనవి  నాటి ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలకు ఓ సాహిత్య వారధిగా నిలిచినా వ్యక్తి బాపిరాజు రచయితగా తెలుగు సాహిత్యానికి ,సంపాదకుడి గా తెలంగాణా పత్రిక రంగాన్ని విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తి బాపిరాజు. ఆ విధముగా తెలుగు నేలకు తెలుగు వారికి చిరస్మరణీయుడు 1943లో స్థాపించిన మీజాన్ పత్రికకు హైదరబాద్ లో పత్రికా సంపాదకుడిగా అతి ప్రతికూల పరిస్థితులలో పనిచేశాడు పత్రిక యజమాన్యము ఉద్దేశ్యము నిజాము కు అనుకూల వార్తలు వ్రాయటం కానీ బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి తెలంగాణా సాయుధ పోరాటానికిఅంధ్ర మహాసభలకు, హైదరాబాద్ విలీన ఉద్యమాలకు తన పత్రిక ద్వారా గుర్తింపు తేవటానికి విశేషముగా కృషి చేశాడు తానూ ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు చేరువ అయ్యాడు.అన్ని రాజకీయ పార్టీలలో స్నేహితులు ఉండటం వల్ల మరియు అభ్యుదయ రచయితల సంఘము హైదరాబాదుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ అన్ని వర్గాల వారికి చేరువ అయ్యాడు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. 1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందు పరచాడు.1934లో బాపిరాజు వ్రాసిన నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది ఈ నవలతో బాపిరాజు తెలుగు సాహితి ప్రియులకు మంచి నవలా రచయితగా చేరువ అయ్యాడు. కదాంశము ఏమిటి అంటే సాధారణ యువకుడు బుద్దిమంతుడు, ఉమ్మడి కుటుంబీకుడు అయినా నారాయణ రావు ఓ జమిందారీ కుటుంబములోని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందో వివరణ చివరకు ఈ ఇబ్బందులను అధిగమించి భార్య ప్రేమను గౌరవాభిమానాలను ఎలా పొందాడో రచయిత చక్కగా వివరిస్తాడు.వ్యక్తిగత జీవితము లో సహకరించని భార్య వికలాంగురాలైన కూతురు కోర్టు లావా దేవీల్లో ఉన్న కొద్దిపాటి అస్తి ఇవన్నీ నారాయణ రావు బాపిరాజు ఒకరేనా అన్న అనుమానము పాఠకులకు కలుగుతుంది. బాపిరాజు నవలలు చదవటం అంటే పాఠకులకు వ్యక్తిత్వము అభిరుచులు తెలియజెప్పటమే.
బాపిరాజుకు ముందు తెలుగు సాహిత్యములో చారిత్రత్మక నవలలు అంటే అనువాదాలు లేకపోతె ఇతర దేశాల చరిత్రలు ఈ అరువు సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టిన వాడు బాపిరాజు బాపిరాజు చారిత్రిక నవలల ద్వార తెలుగువాడి చరిత్రకు అక్షర రూపము కలుగ జేశాడు. అయన వ్రాసిన పది  నవలలలో ఐదు చారిత్రకా లే ఆ ఐదు అయిదు కాలాలకు చెందినవి హిమబిందు శాతవాహనుల చరిత్రను, అడవి శాంతిశ్రీ ఇక్షాకుల కాలాన్ని, అంశుమతి చాళుక్యుల చరిత్రను, గోన గన్నారెడ్డి కాకతీయ వైభవాన్ని , మధురవాణి తంజావూరు నాయకుల జీవితాన్ని మనకు తెలియ జేస్తాయి. ఆ విధముగా బాపిరాజు చారిత్రక నవలా రచనలలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు,ఆ రోజుల్లో యువతకు బాపిరాజు ఒక ప్రభంజనం. తెలుగు సాహితి జగత్తులో విశ్వనాధ వారు సూర్యుడు అయితే బాపిరాజు చంద్రుడు గా అభిమానులు కీర్తించేవారు.
ఇతర సాంఘిక నవలల విషయానికి వస్తే నారాయణ రావు నవల విశ్వనాధ వారి వేయి పగడలతో పోటీ పడి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు బహుమతి ని గెలుచుకుంది. ఈ నవలలో కవిత్వము, శిల్పం, చిత్రలేఖనం, వంటి అనేక అంశాలను సవిరంగా బాపిరాజు చిత్రీకరించాడు ఈ నవలలో సందార్భాన్ని బట్టి గీతాలను కూడా వాడుకోవటం జరిగింది. ఆ విదముగా ఈ నవలను సంగీత నృత్య రూపకముగా మనముందు ఉంచాడు. ఇతర సాంఘిక నవలలు, తుఫాను, కోణంగి, నరుడు ,జాజిమల్లి తన బహుముఖ ప్రజ్ఞను ప్రతి నవలలోని ప్రదర్శించి పాఠకులను మెప్పించాడు. బాపిరాజు నవల అయినా కవిత అయిన కదా అయినా అయన భావుకతను పట్టము కట్టినవే,ఆ విధముగా కాల్పనికత మూర్తిభావించిన రచయితా బాపిరాజు. అభిమానులు ఒక వ్యక్తిలో ఇన్ని సుగుణాల? ఇంత ప్రతిభ? అని ఆయనను అడిగితె మా ఇంటి పేరు అడివి కదా అడవిలో అన్ని ఉంటాయి అని సమాధానము ఇచ్చిన మహోన్నత వ్యక్తి బాపిరాజూ గారు. అలాగే గోదావరిని మన కళ్ళ ముందు నాట్యమాడించిన వ్యక్తి మరియు తెలుగువారికి  బావ బావ పన్నీరు పాటను బహుకరించిన వ్యక్తి బాపిరాజు ఆ విధముగా చెప్పటానికి బాపిరాజు ప్రతిభకు ఎల్లలు లేవు అయన వ్యక్తిత్వాన్ని ఏ ఒక్క చట్రములో బిగించలేము ఆయనకు జరిగిన సన్మానాలు  ఎన్నో వైజాగ్ ఆర్.కె బీచ్ లో బాపిరాజు విగ్రహ ప్రతిష్ట జరిగినది భీమవరం లోని మునిసిపల్ స్కూల్ కు అయన పేరు  పెట్టారు భీమవరం నగర వాసులు ఆయనకు కనకాభిషేకం చేశారు  సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు భౌతికంగా మరణించినప్పటికీ అయన రచనల ద్వార తెలుగువారి గుండెలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడు అడవి బాపిరాజు గారు.
అంబడిపూడి శ్యామసుందర రావు