వేగుచుక్క - గొర్తి.వాణిశ్రీనివాస్

day star

"ఇంట్లో చెప్పొచ్చావా?నీకు నా కారే దొరికిందా?" టాక్సీవాలా కోప్పడుతున్నాడునన్ను.. నేనే ఏదో ఆలోచిస్తూ రోడ్డు మధ్యకు వచ్చేసినట్టున్నాను. అందరూ ఇదొకటి అంటారు... ఇంట్లో చెప్పావా అని... చావాలంటే చెప్పి వస్తారా? 'కళ్ళు కనబడ్డంలేదా? 'అనడానికి ఇలా అంటారేమో... నాకు కళ్ళున్నాయి ,మనసే నా స్వాధీనంలో లేదు.. కాళ్ళకి కళ్ళున్నట్టు గమ్యం వైపుకి నన్ను నడిపించుకుని తీసుకువెళుతున్నట్టుగా ఉంది. చుట్టూ కోలాహలం ఆగని జనసందోహం ..మధ్య నేను .. ఒంటరి ప్రయాణానికి అర్ధాన్ని వెతకాలని వెళ్ళటం లేదు.. 'అర్ధం' కోసమే వెళుతున్నా సంపాదన కొన్ని సమస్యలను తీరుస్తుందని. కొత్తగా వచ్చిన టి సి ఎస్ కొలువుకు చిహ్నంగా నా మెడలో వేలాడే సూత్రం.. అదొక్కటే నాకు తోడుగా నన్ను ముందుకు నడిపించే నేస్తం . ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ అంటే అందరికీ లోకువే.. ఆ మాట పడకుండా దేవుడు కరుణించాడు.. వాసు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడో? ఏం చేస్తాడు?పొద్దున్నే లేస్తాడు, లేచి ఆవులిస్తాడు.. గానుగెద్దులా పని చెయ్యటానికి రెడీ అవుతాడు..మెళ్ళో గుదిబండ తగిలించుకుని ఆఫీసుకు పరిగెడుతుంటాడు.. నేను గుర్తొస్తుంటానా?వస్తే ఎలా వస్తాను? అయ్యో పాపం ఆ పిచ్చిమొహానికి ఫోను కూడా చేయట్లేదు అనుకుంటాడా?లేక ఆ పిచ్చి మొహానికి నేనెందుకు చెయ్యాలి అనుకుంటాడా?, అప్పట్లో నాకు ఎంత అండగా ఉండేవాడు!నా రికార్డులు రాసిపెట్టేవాడు.నన్ను చదవమంటూ పోరు పెట్టేవాడు.పరీక్షలు అంటే చాలు నా సీనియర్ కాబట్టి తన నోట్సు ఇచ్చి చదివించేవాడు.. మంచి మార్కులు వస్తే పార్టీ.మనసు బాగోలేదంటే ఫ్రెండ్స్ తో కలిసి సినిమా.ఇంజనీరింగ్ విద్యార్థినిగా నా జీవితం ఒక లడ్డు,ఒక మొట్టికాయగా సాగిపోయింది. నా బస్టాప్ వచ్చేదాకా నా ఆలోచనలు తెగేటట్టు లేవు. వాసు ఎప్పుడో ఒకసారి ఎలా ఉన్నావ్ అని మెసేజ్ పెడతాడు...నేను సంతోషంగా మాట్లాడాలని చాట్ మొదలు పెడతా...అన్నిటికీ హ..హ, హా ,హి హి... హో...ఇంతే హ గుణింతం తప్ప ఇంకేం మాట్లాడడు.. ఒకప్పుడు నాకు సబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకునే వాడు..నా నెలసరి ఎప్పుడొస్తుందో కూడా తెలుసు వాసుకి.అప్పుడు నామూడ్ బాగుండదని, నాకు నొప్పి ఎక్కువగా వస్తుందని తెలిసే చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు... కాలేజీలో చదువుకునేటప్పుడు కలివిడిగా ఉండేవాడు.మూడేళ్ళు ప్రతి మిడ్..సెమ్ పరీక్షలకు చదివించాడు. నాలుగవ సంవత్సరంలో అతనికి విప్రో హైదరాబాద్ లో జాబ్ వచ్చింది.వెళ్ళేటప్పుడు చెప్పే వెళ్ళాడు.అక్కడినుంచే నన్ను చదివిస్తానన్నాడు.కాని అలా చేయలేదు.. ఫోన్ చేస్తే బిజీ అంటాడు.. నాకేడుపొచ్చింది.అన్నం నిద్రా మానేసి ఆలోచించా. నేనేం తప్పు చేశానో?వాసు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అని. మూడేళ్ల మంచి సి జి పి ఏ నిలబెట్టుకోవాలని పట్టుదలగా చదివా..నైన్ పాయింట్స్ తో పాసయి క్యాంపస్ బయటకొచ్చా. ఉద్యోగం కూడా వచ్చేసింది. అసలు వాసు నాకు ఎందుకు దూరమయ్యాడు? కృషాజిల్లా తాడిగడప మా స్వగ్రామం.మా చేను చేసే రైతు కొడుకు వాసు.నాకంటే ఏడాది పెద్ద.వాసు చెల్లెలు సుగుణ నాతోటిదే. ఓ రోజు సైకిలు నేర్పిస్తాను రమ్మన్నాడు.వెనకాల క్యారెజీ పట్టుకుని హ్యాండిల్ తిప్పకుండా సైకిల్ తొక్కమన్నాడు. భలే తొక్కాను.రెండు రోజులు అలాగే తొక్కించాడు.. మూడోరోజు ఏం పుట్టిందో ,సైకిలు మధ్యలో వదిలేసి ఇంటికెళ్లిపోయాడు.. భయపడిపోయా.అరిచా..తిట్టిపోస్తూనే సైకిలు తొక్కుకుంటూ ఇంటికొచ్చేసా. మా అమ్మకి ఫిర్యాదు చేశా.. "అలా మధ్యలో వదిలేసావేం వాసూ.అది పడిపోతే ఏవయ్యేది?"అంది అమ్మ ఏడుపు మానేసి నేను నవ్వా.. వాడి తిక్క కుదిర్చానని. వైజాగ్ లో మా ఇంజినీరింగ్ కాలేజీలు వేరైనా బ్రాంచ్ మాత్రం ఒకటే. వాడు నా సీనియర్. కాలేజీ సెలవలొస్తే ఇద్దరం కలిసే మా ఊరు వెళ్ళేవాళ్ళం. నాకు రైల్వే స్టేషన్లో టిజెట్ తీసుకుని,ప్లాట్ఫామ్ చూసుకుని రైలెక్కటం అంటే భయం. అయినా వాసూ వున్నాడు.తనే టికెట్ తీసుకునేవాడు.తన వెనకే రైలెక్కేదాన్ని. ఒకరోజు స్టేషన్ కి వచ్చి వాసు కోసం చూసాను.రాలేదు.ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. వెనక్కి వెళ్లిపోదామంటే హాస్టల్ మూసేసారు. ఎక్కడుంటాను. ఎంతసేపటికీ వాసు రాలేదు.నేనే లైన్ లో నిలబడి టికెట్ తెచ్చుకున్నాను.మొదటిసారిగా.ఆరవ నెంబర్ ప్లాట్ఫారం మీద రత్నాచల్ కదలటానికి సిద్ధంగా ఉంది.ఎక్కేశా. నా సీట్లో కూర్చున్నా.వాసు రాలేదు. విజయవాడ స్టేషన్ లో దిగాక కనిపిస్తాడేమో అని చూసాను. లేడు. సిటీ బస్సు ఎక్కి ఇంటికి వచ్చేశా. నా వెనకే వాసూ వచ్చాడు.. వాళ్ళ నాన్నతో చెప్పా.నన్ను వదిలేసి వచ్చేశాడని. ఆడపిల్లకి తోడుగా ఉండకుండా వదిలేసినందుకు వాసుని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు వాళ్ళ నాన్న. కోపం వచ్చి నాలుగురోజుల వాసూతో మాట్టాడలేదు. కాలేజీ చదువుకునే రోజుల్లో నాకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకున్నాడు.చివర్లో ఏవొచ్చిందో అసలు పట్టించుకోవటం మానేశాడు.. "విద్యా..విద్యా..ఆగు.."ఎవరో పిలిచారు ఎవరిది ? ఆగాను..చుట్టూ చూసాను స్రవంతి.ఇద్దరం ఒకే ఆఫీసు. రోజూ బండి మీద వస్తుంది.ఇవాళ ఏవయ్యిందోమరి.. "విద్యా!,నా బండి పంచర్.నీతోపాటు బస్ లో వస్తా. ఏంటి కబుర్లు.మీ ఆనంద్ ఏవంటున్నాడు? న్యూజిలాండ్ నుంచి రాగానే పీ పీ పీ ..డుండుoట కదా" అంది స్రవంతి "అవునే..ఆనంద్ వాళ్ళ ఇంట్లో అందరికీ నన్ను చేసుకోవడం ఇష్టమేనట.మాయింట్లో కూడా ఆ సంబంధానికే మొగ్గు చూపిస్తున్నారు.నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.ఈ వాసు గాడు మంచి సలహా ఇస్తాడేమో అంటే ఏవయ్యాడో కూడా తెలీదు. ఇంత దాకా చక్కగా సలహాలిచ్చి నడిపించాడు. ఇప్పుడు వదిలేస్తే సొంతంగా నిర్ణయం తీసుకోలేక పోతున్నానే"స్రవంతితో చెప్పేశా.. "విద్యా!నిజం చెప్పొద్దూ!వాసూ నువ్వూ మంచి ప్రేమికులనీ, పెళ్లి చేసుకుంటారని కాలేజీ మొత్తం అనుకున్నాం. కానీ మీరు మంచి స్నేహితులే తప్ప ప్రేమికులు కారని వాసూ మాటలవల్ల మాకు తెలిసింది. ఇద్దరు ఆడవాళ్లు ,ఇద్దరు మగవాళ్ళూ స్నేహం చేసినట్టే ఒక ఆడా మగా కూడా ఉండొచ్చని చెప్పాడు.అందుకే ఇరవై ఏళ్లుగా మా స్నేహం కొనసాగింది.స్వచ్ఛమైన స్నేహితులు విడిపోరు. మిత్రుని సుఖసంతోషాలు కోరుకోవడం తప్ప ఏ స్వార్ధమూ ఉండదు."అన్నాడు "ఆనంద్ ని నీకు పరిచయం చేసింది కూడా వాసే కదా.!ఇక నీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ పంచుకోవలసింది ఆనంద్ తోనే అని వాసు ఉద్దేశ్యం అయి ఉంటుంది. అందుకే ఆనంద్ నీకూ మధ్య ఇంకెవరూ వుండకూడదనుకునే వాసు దూరం అయ్యాడని ఎందుకు ఆలోచించవు..?"అంది అప్పుడు గానీ నాకు బోధపడలేదు..నాకెప్పుడు ఊతం అవసరం వుండదో వాసుకు తెలుసు. వాసు ఆంతర్యం అర్ధమయ్యింది మనసు ఇప్పుడు తేలిక పడింది.. సందేహం మబ్బులా తొలగింది. చిన్నగా వర్షం మొదలయ్యింది. సకాలంలో పడితేనే వర్షానికి విలువ. శ్రావణ మేఘాలు మంద్రంగా కదులుతున్నాయి చల్లగాలిని తోడు తీసుకుని మరో దిక్కుకు తరలి పోతున్నాయి. పొడిబారిన నేలకు తొలకరి జల్లుల్ని పరిచయం చేస్తాయిప్పుడు. మా బస్సు వచ్చింది... రోజూ నా గమ్యానికి యధాలాపంగానే చేరుకుంటాను. కానీ ఈ రోజు మనసు పెట్టి అన్నీ చూస్తున్నాను. మంచి చెడుల నిర్ణయం నాదే ఇక.. నా మెదడులో స్వత్రంత్ర ఆలోచనల యంత్రం కదలిక మొదలయ్యింది. హెచ్చుతగ్గులుంటే సరి చేసుకోవాల్సింది నేనే. నేను ఇంజనీర్ ని కదా మరి.. ఆత్మవిశ్వాసానికి అర్ధం తెలిసింది ఈరోజు.. ఈ రోజు నేను పెద్దదాన్ని అయినట్టుగా అనిపించింది. వాసు నా దృష్టిలో చాలా పెద్దవాడిలా అనిపిస్తాడు ఎప్పుడూ... నాకు తెలియకుండా వాసు నన్ను వాచ్ చేస్తున్నాడు.. నేనిప్పుడు నిర్భయంగా నడుస్తాను... స్వతంత్ర నిర్ణయాలు స్త్రీల హక్కని చెపుతూ వేకువలో మాయమైన వాసు చీకటి ఉన్నప్పుడే నాకు కనిపించే వేగుచుక్క ...