వాట్సాప్ - Bhamidipati Krishna Murti

వాట్సాప్

వాట్సాప్

వాట్సాప్ మన జీవితాలలో ప్రవేశించి సుమారు ఒక దశాబ్దం అవుతునాది మెల్ల మెల్లగా అది మన దైనందిన కార్యక్రమాలలో సగటున 20 నుండి 30 శాతం వరకూ ఆక్రమించుకుంది. వాట్సాప్ వాడుకలో ప్రపంచంలోకెల్లా భారత దేశం ప్రధమ స్థానంలో ఉంది. మనదేశంలో సుమారు 35 కోట్ల మంది జనం ఈ సదుపాయాన్ని వాడుతునారు. రానురానూ మనం ఏపనిలో ఉన్నా అటువైపు ఓకన్ను వేసుంచే పరిస్థితి వచ్చింది. మొదట్లో ఎవరో ఒకరితోనే చాటింగ్ చేసేవారం. అదికాస్తా గ్రూపులుగా తయారై గ్రూప్ మొత్తానికి ఒకే మారు మన సందేశాల్ని పంపగలుగుతున్నాము . గ్రూపులు రకరాలుగా ఉన్నాయి కొన్ని తమ కుటుంబ సభ్యులతోను, కొన్ని మరీ దగ్గర చుట్టాలతోను, మరికొన్ని స్నేహితులతోను, కొన్ని క్లాస్మేట్స్ తోనూ ఇలా రకరకాలుగా తయారయ్యాయి. రువాత పేకాటరాయుళ్ళకొకటి, మందుబాబులకొకటి, క్రికెట్, టెన్నిస్ ఆటగాళ్లకొకటి చొప్పున్న మన ఇష్టాలప్రకారం విస్తారంగా అల్లుకుపోయింది వాట్సాప్.

ఇంతకీ సందేశాలలో మనకి అచ్చంగా పనికొచ్చేవి 10 శాతం మాత్రమే. మిగిలినవి గుడ్ మార్కింగ్ లు, జోకులు, ఏవేవో సాహస చర్యల వీడియోలు, పాటలు, వగైరా. ఇహ పండగలొస్తే సరేసరి. చిన్న పండుగనుండి పెద్ద పండుగ దాకా కుల మత జాతి భేదాలు లేకుండా నిస్పక్షపాతంగా అభినందనలు పెట్టేస్తారు. అందులో కొన్ని పండుగలు మునుపెన్నడూ వినలేదుకూడా . ఉదా|| ఇంటర్నేషనల్ యానిమల్స్ డే, అంతర్జాతీయ సామాజిక న్యాయ దినం, అంతర్జాతీయ మగాళ్ల దినం, అంటూ గతంలో ఎరుగక పోయినా ఇప్పుడు మాత్రం వివక్ష లేకుండా గ్రీటింగ్స్ పెట్టేస్తున్నారు. కొందరు అవతలివారేమనుకుంటారో అనుకొని ప్రతీ మెసేజికి సమాధానం రాసి అలసిపోయిన

సంఘటనలు లేకపోలేదు.

పుట్టినరోజులు పెళ్లిరోజులు వచ్చాయంటే మరి చెప్పక్కర్లేదు. మన ఫోను నిండిపోయినన్ని మెసేజ్ లు వచ్చేస్తాయి. ఇదిలా ఉండగా వేరే వర్గం వారు రకరకాల గ్రీటింగ్స్ ను వివిధమైన భాషల్లో ఉచితంగా దొరికే యాప్స్ తయారు చేస్తున్నారు. అవి చూసి నచ్చిన భాషలో నచ్చిన గ్రీటింగ్స్ ఎంచుకొని పంపించేస్తునారు.

 

ఈరోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొనేవరకు వాట్సాప్ ను అంటిపెట్టుకునే ఉంటున్నారు కొందరు. భోజనం చేసే సమయంలో కూడా దృష్టి, తినే పదార్ధాలమీద కన్నా మొబైల్స్ మీదనే ఉంటోంది. టీవీ చూస్తున్నప్పుడు కానీ, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కానీ చూపు మాత్రం మొబైల్ పై నుండి దృష్టి మళ్లించలేక పోవటం మనం చూస్తూనే ఉన్నాం. మునుపు టీవీ చూసేటప్పుడు కరెంట్ పొతే జనం బాధ పడేవారు. కానీ ఇప్పుడు మాత్రం కరెంట్ పోగానే చూపు వాట్సాప్ మెసేజిలపైకి పోతునాది. చివరికి వంట చేస్తున్నప్పుడు కాని, పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు, లేక పాలు పట్టేటప్పుడు కాని చూపు అటువైపునుంచి తిప్పుకోలేక పోతున్నారు. ఆఖరుకి స్నానాలగదిలోనికి కూడా వదలటం లేదు.

అంటువ్యాధితో పుస్తకాలూ పత్రికలూ చదివే అలవాట్లు బాగా తగ్గిపోయాయి. విషయం వాటి అమ్మకాల పరిమాణమే చెప్తునాది. వార్తలు కూడా ఎవరో ఒకరు వాట్సాప్ లో పెట్టేయటం అదే follow అయిపోవటం, దాంతోనే సరిపెట్టుకోవడం జరుగుతునాది.

ఇంత సౌలభ్యం అందుబాటులోకొచ్చేసరికి మన సృజనాత్మక శక్తి కూడా బాగా తగ్గుముఖం పట్టింది. స్పెల్లింగ్స్ మరచిపోతున్నాము. ఒక్క వాక్యం కూడా సరిగా రాయలేకపోతున్నాము. కనీసం ఈమెయిల్ ద్వారానైనా ఉత్తరాలు రాసే ఓపిక తగ్గిపోయింది. శుభ సమాచారాల నుండి నిర్యాణ సందేశాల వరకు వాట్సాప్ లనే వాడుకుంటున్నారు. చాలా చోట్ల ఒక పదానికి మరొక పదం పడటం , దానికి విపరీతార్ధం రావటం మనం తరచు గమనిస్తూనే ఉన్నాం. ఇలాగ రకరకాల కారణాలవలన మానవుని మేధాశక్తి కాస్తా మెల్లగా క్షీణించిపోతునాది. మరోకోవకు చెందినవారు తెలుగుభాషనే ఇంగ్లీషు లిపిలో రాస్తూ ఉంటారు. అది అర్ధం చేసుకోవటం మరీ కష్టం.

ఇంక ఈమధ్య రకరకాల ఎమోజిలు బయలుదేరాయి. మన ముఖ కవళికలన్నింటికీ ఒక్కొక్కటి చొప్పున తయారుచేసి పెట్టేశారు. వాటిని మనవారు ధారాళంగా వాడేస్తున్నారు. పైగా పూల గుచ్చాలు, విడి పువ్వులు, నమస్కారాలు, వేళ్ళతో వివిధ సంకేతాలు,ఓంకారాలు వంటివి చాలా వరకు చోటు చేసుకున్నాయి. అవి గాక వివిధ దేశాల జెండాలు, కేకు బొమ్మలు, జంతువులూ వంటివెన్నో వచ్చేశాయి. చాలా మంది సంకేతాలతోనే సమాధానాలు ఇచ్చేస్తున్నారు.

ఇంక సందేశాలు చదివేవాళ్ల స్థితి చూద్దాం. అందులో లిఖిత మెసేజిలకన్నా వీడియో మెసేజీలు ఎక్కువవైపోయాయి. అలాగే ఒకే మెసేజి వేర్వేరు గ్రూపులనుంచి ఏడెనిమిది మార్లు వచ్చేస్తుంది. వాటిని చెరుపుకుందుకే విసిగిపోవాలి. ఒక్కొక్కప్పుడు సమాధానాలు రాయం. రాయక్కరలేదుకూడా. పైగా సందేశం పంపినవారు మనకిష్టులు కాకపోతే మనం చదవం. ఒకవేళ చదివి సందేశం బాగున్నాఒక పూల గుచ్ఛం కానీ ఒక Thumbs up కానీ పెట్టం. అదేకాని మనకు నచ్చినవారు పంపితే ఎంతో ఉత్సాహాన్నిస్తూ ప్రోత్సాహితంగా స్పందిస్తాం. ఇదొక మానసిక పరిస్థితి.

ఈమధ్య మన సందేశం ఎంత చిన్నది గాను, క్లుప్తంగానూ ఉంటే అంత ఎక్కువ మంది చూస్తునారు. వీడియో అయితే మూడు నిముషాలు దాటితే చూడకపోవటం లేక ఫాస్ట్ ఫార్వర్డ్ వంటివి చేసేస్తారు. అలాగే లిఖిత సందేశాలయితే రీడ్ మోర్ అన్న దాకా చదివి వదిలేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనలతో ప్రజలలో సహనం బాగా తగ్గిపోతునాదని స్పష్టంగా తెలుస్తోంది.

అలాగే దేనికైనా సరే వాట్సాప్ చేసేయండి అనటం పరిపాటైపోయింది. ఉదా|| కు.

టెలిఫోన్ నెంబరు… … … వాట్సాప్ చేసేయండి

అడ్రసు … … … … వాట్సాప్ చేసేయండి

ఇమెయిల్ అడ్రసు వాట్సాప్ చేసేయండి

పెళ్ళికొడుకు / పెళ్లికూతురు వివరాలువాట్సాప్ చేసేయండి

మన ఉంటున్న ఇంటి లొకేషన్ కూడా వాట్సాప్ చేసేయండి

ఇలాగ ప్రతీ దానికి వాట్సాపే. మన ప్రగతికి కూడా వాట్సాపే గతి.

వాట్సాప్ లో ఇంకొక ముఖ్యమైన అంశం - మన ప్రొఫైల్ ఫోటో. సందేశం వచ్చినప్పుడు అవతలివారికి మన పేరుతొ సహా మన ఫోటో కూడా కనపడుతుంది. ఈప్రోఫైల్ ఫోటోను కొందరు మాటిమాటికీ మార్చేస్తూ ఉంటారు. ఆ మారుస్తున్న ఫోటోలు మిత్రులు చూసారా లేదా అని ఆతృతగా పరీక్షిస్తూ ఉంటారు. ఎవరూ స్పందించక, బాగుంది అని రాయకపోతే మాత్రం చిన్నపుచ్చుకొనే వారెందరో ఉన్నారు. ఈస్థితిని తక్షణ సంతృప్తి” (instant gratification) అంటారు. తాను పెట్టిన సందేశానికి సానుకూలకమైన స్పందన రాకపోతే ఆరోజంతా వారు కాస్త దిగులుగానే ఉంటారు. ఇదొక మానసిక దౌర్బల్యం. అందువలన "ఓ లైక్ కొట్టేస్తే పోలా .." అన్న సిధ్ధాంతం అవలంబిస్తున్న వారెందరో ఉన్నారు.

ఇహ నాణెం యొక్క రెండోవైపు చుస్తే చాలామంది తమతమ రచనాశక్తిని ప్రదర్శించటానికి ఇదొక చక్కని వేదికగా పరిగణిస్తున్నారు. అటువంటి వారు అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ తమ రచనలను మాధ్యమం ద్వారా ప్రచురించుకుంటున్నారు. అలాగే ఫోటోలు వీడియోలు తీయటం, వాటిని అనుకున్న వారికి పంపటం, తనవారితో ముఖాముఖీ మాట్లాడటం వంటి సదుపాయాలుండటం వల్ల కొందరు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా దూరంగాఉన్న తల్లిదండ్రులతోటి గాని, స్నేహితులతో గాని ఇతర బంధువులతో గాని మాట్లాడేందుకు అవకాశం బాగా దోహదపడుతునాది. అలాగే సాంప్రదాయక సంభాషణల కన్నా ఒకటి / రెండు పదాలతో సమాధానం ఇచ్చే సౌలభ్యం కూడా ఉంది గనక పని త్వరగా జరిగిపోతునాది. ఇది పూర్తిగా ఉచిత సేవ కావటం మూలాన వాడుక బాగా పెరిగింది. అంతేకాక ఒక సర్వే ప్రకారం తేలిందేమంటే ఈ సదుపాయంతో బంధుప్రీతి, మిత్రులతో స్నేహ బాంధవ్యములు బాగా మెరుగు పడ్డాయి.

మొత్తంమీద చూస్తే ప్రతీ సోషల్ మీడియా లోనూ మంచి చెడ్డా రెండూ ఉంటాయి. అందులో మంచిని గ్రహించి సద్వినియోగం చేసుకుంటే అత్యవసర పరిస్థితులలో అవి ఎంతో ఉపయోగ పడతాయి. కానీ అదొక వ్యసనంలా మారేముందే కొంచెం నియంత్రించుకొని ఆ సమయాన్ని అంతకన్నా మంచిదేదైనా అలవాటు చేసుకొని ఉపయోగకరంగా మార్చుకోవటం అన్నివిధాలా ఎంతో శ్రేయస్కరం.

 

. కృష్ణ మూర్తి