మిథ్యావాదాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడు. - పిళ్లా కుమారస్వామి

మిథ్యావాదాన్ని, అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడు.

నంబూద్రి బ్రాహ్మణులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పెరియార్ నది ఒడ్డున ఉన్న కాలడి గ్రామంలో క్రీ.శ. 788 లో శంకరుడు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు ఆరుద్రలో జన్మించారు. కేరళలో ఎర్నాకులం జిల్లా లోగురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఉంది. శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకును పెంచి పెద్ద చేసి శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. శంకరులు చిన్న తనంలో నే సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పెరియార్ నదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. శంకరులు మొసలి బారి నుంచి చాకచక్యంగా పలువురి సాయంతో తప్పించుకున్నాడు.తగిన గురువు కోసం అన్వేషించడానికి ఉత్తర భారత యాత్ర చేయాలని భావించారు.తల్లి అనుమతి కోరాడు. తప్పకుండా తిరిగి వస్తానని తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పి బయలు దేరాడు. ఆమె అవసాన దశలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. గురువు కోసం అన్వేషిస్తూ నర్మదా నది(మధ్య ప్రదేశ్-గుజరాత్) వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద పాదుల దగ్గర శిష్యులుగా చేరారు.గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక గురువు ఆజ్ఞతో పండితులకు నిలయమైన వారణాసి వెళ్లారు. అక్కడాయన ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు.అప్పుడతని వయస్సు 12 సంవత్సరాలు మాత్రమే. కాశీ(వారణాసి) నుండి బదరి(బద్రినాథ్- ఉత్తర ఖండ్ లోని చమోలి జిల్లా)కి బయలు దేరారు. బద్రిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండిత గోష్ఠులలో పాల్గొన్నారు.అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు. ఒకరోజు గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అతనితో 'అడ్డు తొలగు తొలగు' అన్నారు. చండాలప్పుడు వారితో "అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్ ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి" అంటూ ఆగాడు. ("సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైంది ఈ శరీరం.ఇది నాలో గాని, బాపనయ్యలోగాని ఒకేవిధంగా పనిచేస్తుంది. మరి మీరు నా శరీరాన్ని తప్పు కోమంటారా? లేక లోపలనున్న ఆత్మనా? ") వాళ్ళు ఆశ్చర్యంగా అతనివైపు చూస్తున్నారు. అంతే. శంకరుని అజ్ఞానం పటాపంచలైంది. దీనినే ఆయన గురించి చెప్పే వారు ఆ చండాలుడు శివుడని చెప్పి తమ బ్రాహ్మణ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండే ప్రయత్నం చేసుకున్నారు. అప్పటి నుండి శంకరులు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" లో అద్వైతం గురించి ఇలా చెప్పారు. (బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః) బ్రహ్మమే సత్యం, ఈ ప్రపంచం మిథ్య. జీవునకు, బ్రహ్మం కు భేదం లేదు. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్ముక్తులవుతారన్నారు. శంకరుల (మిథ్యా వాదం) మాయావాదం తీవ్రంగా విమర్శకు గురైంది. మాయంటావా? అంతా మిథ్యంటావా? నా ముద్దుల వేదాంతీ! ఏ మంటావు? మాయంటావూ? లోకం మిథ్యంటావూ? కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరపు, స్వప్నం, ని శ్శబ్దం ఇది మాయ! మాయ! మాయంటావూ? అంతా మిథ్యంటావూ? జమీందారు రోల్సుకారు మహారాజు మనీపర్సు మాయంటావూ? స్వామీ ఏమంటావూ? మరఫిరంగి, విషవాయువు మాయంటావూ? ఏం, ఏ మంటావు? పాలికాపు నుదుటి చెమట, కూలి వానిగుండె చెరువు బిచ్చగాని కడుపు కరువు మాయంటావు? అంటూ శ్రీశ్రీ తన మిథ్యావాది కవితలో ప్రశ్నించారు. చారిత్రకంగా పరిశీలిస్తే వారు చెప్పే సిద్ధాంతానికీ ఆచరణకు సంబంధం లేకుండా పోయినందువలన భావవాదం పుట్టింది. ఆచరణకు సిద్ధాంతానికి ఎక్కడా పొత్తు కుదరదని శంకరుడు కూడా వాటి మధ్య తేడాను సమర్థించాడు. జ్ఞానం, కర్మ(వైదిక ధర్మాలు) రెండు పరస్పర విరుద్దాలన్నాడు. జ్ఞానాన్ని సంపాదించడానికి కర్మ పెద్ద ఆటంకమన్నాడు. కర్మ అంటే వైదిక కర్మ అనీ, జ్ఞాన మంటే బ్రహ్మజ్ఞానమనీ చెప్పినాడు. శంకరుడు పూర్తిగా జ్ఞానంపై దృష్టిని నిలిపాడు. జ్ఞానం వలన మోక్షం వస్తుందన్నాడు.కర్మ మోక్షానికి ఆటంకమని భావించారు. జ్ఞానాన్ని మోక్ష స్వరూపంగా స్వీకరించారు. జ్ఞానంపై ఆయనకున్న అపారమైన ప్రేమే కర్మను తిరస్కరించడానికి కారణమైంది. ఆయన తీసుకొన్న జ్ఞానం కూడా అలౌకికమైనది. దాంతో ఆయన మీమాంసకులు చెప్పిన తార్కిక జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని ఆయన ఖండించాడు. ఇది నిర్లక్షంతో చేసిన పని. అందువల్లే శంకరుని మిథ్యా వాదం శిఖరాగ్రానికి చేరి మన దేశంలో తార్కిక ఆలోనలను నశింపజేసింది.అది విజ్ఞానశాస్త్రాల పురోగమనాన్ని నిరోధించింది.

మరిన్ని వ్యాసాలు

ద్వీపాలు-వర్షాలు.పురాణకథ.
ద్వీపాలు-వర్షాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
మాస్క్ బాంబులు
మాస్క్ బాంబులు
- చంద్ర శేఖర్ కోవూరు
Lahiri Lahiri Lahirilo -2
లాహిరి లాహిరి లాహిరిలో-2
- కర్రా నాగలక్ష్మి
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
మన సినిమాల్లో గోదావరి గీతాలు.
- డా.బెల్లంకేండ నాగేశ్వరరావు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
తెలుగు నాటకరంగ విషేషాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
కోరికలే గుర్రాలు ఐతే
కోరికలే గుర్రాలు ఐతే
- చంద్ర శేఖర్ కోవూరు
శ్రీ కుమారస్వామి ఆలయాలు.
శ్రీ కుమారస్వామి ఆలయాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.