శంకరుని మిథ్యా వాదాన్ని ఖండించినా ఆత్మ పరమాత్మ లను అంగీకరించిన రామానుజులు - పిళ్లా కుమారస్వామి

adi shankaracharya - ramanujan

శంకరుని తరువాత సుమారు 200 సంవత్సరాలకు రామానుజులు క్రీ.శ. 1017లో శ్రీ పెరంబుదూరు (తమిళనాడు)లో (ఇప్పుడది భూతపురి) కాంతమతి,కేశవాచార్య దంపతులకు జన్మించారు. చెన్నై పట్టణానికి సుమారు 25 కి.మీ.దూరంలో ఉంది. తండ్రి వద్ద, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్ద ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరంగ కేంద్రంగా చేసుకుని తన కృషిని కొనసాగించారు. బ్రహ్మసూత్రాల పైనా, భగవద్గీత పై భాష్యాలు రచించారు. ఈయన దాదాపు 123 సంవత్సరాలు తన సిద్ధాంతాలను ప్రచారం చేశారు. రామానుజులు నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరీ మంత్రాన్ని దేవాలయం పైకి ఎక్కి అందరికీ వినిపించేలా చెప్పడం ద్వారా సర్వమత(అన్ని రకాల దేవుళ్ళను) సమదృష్టిని ప్రచారం చేశారు.వేదాలలో 'భగ' అన్న దేవుడి ప్రస్తావన ఉంది. భగ అనే దేవుడు అన్నీ శుభం జరిగేలా ఆశీర్వదించే దేవుడని వేదకాలంలో నమ్మేవారు. అట్టడుగున ఉన్న ప్రజలందరూ భగవంతుని తత్వం అర్థం చేసుకోవాలని బోధించాడు. అందరూ ఆలయప్రవేశం చేసుకోవచ్చన్నారు. దేవునికి పూజ చేయడానికి, దేవుని అనుగ్రహం పొందడానికి ఎవరికీ హక్కు లేదని, అది అందరి సొత్తనీ కులాన్ని బట్టి, వక్తుల మధ్య తేడాలు లేవన్నారు. ప్రపంచం మిథ్య అన్న శంకరుని వాదాన్ని ఖండించాడు. ప్రపంచం సత్యమన్నాడు. అయితే ఆత్మ, పరమాత్మ లను అంగీక రించారు. ఆత్మ శరీరాన్ని చైతన్యం చేస్తుందన్నారు. ఇలాంటి ఆత్మలకు పెద్ద గా ఉన్న చైతన్య స్వరూపం భగవంతుడన్నారు. ఆత్మ పరమాత్మ సిద్దాంతం ఉపనిషత్తుల కాలంలో పుట్టింది. వేద కాలంలోప్రాణాన్ని ఆత్మ గా భావించేవారు. శంకరుడు ఆత్మ పరమాత్మ లు ఒక్కటేనన్నారు. కానీ రామానుజుల ప్రకారం జీవరాసుల్లో పరమాత్మ అంతర్యామిగా ఉంటుంది. ఈ ఆత్మ మానవుడి కర్మలకు సాక్షిగా ఉంటుంది. అంతే తప్ప కర్మలలో(చేసే మంచిచెడు పనులు) పాల్గొనదు. కానీ అంతర్వాణికి మంచి చెడుల గురించి హెచ్చరికలు చేస్తూంటుంది. కానీ జీవి కర్మ భగవంతుడికి (పరమాత్మ కు)అంటదు. ఆత్మ మాత్రం తన ఫలితాన్ని అనుభవించక తప్పదు. భగవంతుడు సృష్టి కారకుడు.ఇది వేద కాలం వారూ నమ్మారు. సృష్టి రెండు స్థితుల్లో ఉంటుంది. ఒకటి ప్రళయ స్థితి. రెండవది సృష్టి స్థితి. ఇవి రాత్రి పగలు లాంటివి. ప్రళయంలో ఆత్మ, ప్రకృతి బ్రహ్మ (భగవ్ంతుని) లో లయమవుతాయి. బ్రహ్మ వీటిని మళ్ళీ ఆరంభం చేస్తాడు.ఇదొక సైకిలు చక్రం లాంటిది. రామానుజల సిద్దాంతాన్ని విశిష్టాద్వైతం అన్నారు.దీని ప్రకారం 1.భగవంతుడు సత్యం. జీవాత్మలు కూడా సత్యమే. 2. ప్రపంచం మిథ్య కాదు. ఇది వాస్తవమే. 3. బ్రహ్మవేరు, జీవులు వేరు. 4.జీవులు భగవంతుడిపై ఆధారపడి ఉన్నాయి. 5.భగవంతుడు సర్వస్వతంత్రుడు. 6.అందరూ దేవుని ముందు సమానమే. రామానుజులు తన శిష్యులకు ఏకాగ్రతను సాధించేందుకు భగవంతుడికి ఒక రూపం ఇచ్చారు. ఆయనను నిరంతర ధ్యానం చేయమన్నారు. భక్తికి పెద్ద పీట వేశాడు. భగవంతుని ధ్యానించటం భక్తికి పరాకాష్ట అన్నారు.రామానుజులునారాయణుని,విష్ణువుని పూజించారు.ఇతను వైష్ణవుడు.ఆయన పాటించిన దానిని వైష్ణవ మతం అన్నారు. రామానుజుని అనంతరం వైష్ణవ మతం వడగలై(ఉత్తరాది) తెంగలై(దక్షిణాది) అనే రెండు శాఖలుగా చీలిపోయింది. వడగలై శాఖ సంస్కృతానికీ, తాత్విక చర్చలకూ ప్రాధాన్యతనిస్తే తెంగలై తమిళ భాషకు ప్రాధాన్యతనిచ్చింది. వడగలై కుల విభేదాలను సమర్థించింది. తెంగలై కుల విభేదాలను వ్యతిరేకించింది. వడగలై తెగది మర్కట కిశోర న్యాయం. అంటే కోతిపిల్ల తల్లి కోతిని గట్టిగా వదలకుండా పట్టుకున్నట్టు భక్తుడు భగవంతుడిని వదలకుండా పట్టుకోవాలి. స్వయంకృషి ద్వారా, జ్ఞాన, భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి. తెంగలై తెగది మార్జాల కిశోరన్యాయం. పిల్లి తన పిల్ల యోగక్షేమాలన్నీ తల్లి పిల్లే చూసుకున్నట్టు భగవంతుడే భక్తుల బాగోగులు చూసుకుంటాడు.