ఫ్యాషన్ - తడకమళ్ళ మురళీధర్

ఫ్యాషన్

బెల్ బాటమ్ ఫ్యాషన్ (తడకమళ్ళ మురళీధర్) ****** దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం బెల్ బాటమ్ ప్యాంటు ధరించటం ఫ్యాషన్లో ఒక క్రేజ్. మన దేశంలో మగ వారితో ప్రారంభమైన ఈ బెల్ బాటమ్ ప్యాంటు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా చాలా కాలం ధరించారు. ప్రస్తుతం కొంత మంది ధరించే అసభ్య వస్త్ర ధారణ కంటే అది ఎంతో బాగుండేదనటంలో ఎటువంటి సందేహం లేదు. పంతొమ్మిదో శతాబ్దంలోనే అమెరికాలో బెల్ బాటమ్ ప్యాంటు మొదలైందట. డ్రెస్ కోడ్ లేని రోజుల్లో నావికా దళం వారు ఈ రక మైన బెల్ బాటమ్ ప్యాంటు ధరించేవారని అంటారు. ఈ ప్యాంటు మోకాళ్ళ దగ్గర సన్నగా ఉండి కిందకు వస్తున్న కొద్దీ వెడల్పుగా ఉండి గంట ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి బెల్ బాటమ్ అనే పేరు స్థిర పడి పోయింది. బెల్ బాటమ్ ప్యాంటు మాత్రమే కాకుండా కొన్ని రోజులకు ఎలిఫెంట్ బాటమ్ అనే మరో రక మైన ఫ్యాషన్ చేరింది. ఎలిఫెంట్ బాటమ్ దాదాపుగా బెల్ బాటమ్ మాదిరే ఉండి పాదాల పైభాగం మాత్రం ఇంకో మనిషి తల పట్టేటంత వెడల్పుగా ఉండేది. పాదాలు, పాదరక్షలు కన్పించకుండా, రోడ్లను ఊడ్చే విధంగా నేలపై జీరాడుతూ ఉండేది. ఇందులో మరో ఫ్యాషన్ ఏమిటంటే మోకాలు, పాదాల మధ్య భాగంలో ప్యాంటుకు రెండు వైపులా అదే రంగు గుండీలు రెండు కుట్టించుకునేవారు. కొంత మంది రెండు వైపులా జిప్ ను కుట్టించుకునేవారు. ప్యాంటుకు నడుము భాగంలో వెడల్పాటి బెల్టు మాదిరి కుట్టించుకోవటం కూడా స్టైలులో ఒక భాగమే. ఆ రోజుల్లో హిప్పీ హెయిర్ స్టైల్, పెద్ద నల్ల కళ్లద్దాలు, ఫుల్ స్లీవ్స్ తో పూల చొక్కా, ఒక చెవి పోగు, బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకొని నడిచే మగ వాడ్ని చూస్తుంటే ఆడో మగో తెలియని పరిస్థితి. హిందీ సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు ఈ తరహా డ్రెస్సు ధరించటం మనం ఎక్కువగా గమనిస్తుండే వారం. రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ తరంతో మొదలైన ఈ ఫ్యాషన్ రిషికపూర్ తరంతో మరుగయినట్టు నాకు గుర్తు. రాజేష్ ఖన్నా హెయిర్ స్టైల్ , నడక, తల ఆడించటం యువత బాగా అనుసరించే రోజులవి. టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, ఇంకా కొంత మంది ప్రముఖ హీరోలు బెల్ బాటమ్ ప్యాంటు, ఎలిఫెంట్ బాటమ్ ప్యాంటు ధరించి సినిమాల్లో పాపులర్ అయ్యారు. వాణిశ్రీ, ప్రభ లాంటి హీరోయిన్లు కూడా బెల్ బాటమ్ ప్యాంటు ధరించి అద్భుత నటనను అందించారు. అప్పట్లో అందరి సైజుల్లో రెడీమేడ్ దుస్తులు అందుబాటులో అమ్మకానికి దొరికినా, చిన్న పిల్లలు మాత్రమే ఎక్కువగా ధరించే వారు. ముఖ్యంగా మగ వారు టైలరు చేత కుట్టించుకున్న దుస్తులకే ప్రాధాన్యత నిచ్చే వారు. అమ్మాయిల్లో లంగా వోణి, పంజాబీ డ్రెస్సు, బెల్ బాటమ్ డ్రెస్సు నుండి ప్రస్తుతానికి లెగ్గిన్స్ , జగ్గిన్సు కు ప్రాముఖ్యత పెరిగింది. అబ్బాయిలు న్యారో ప్యాంట్ల నుండి బెల్ బాటమ్, ఎలిఫెంట్ బాటమ్ వైపు వెళ్లి, ప్రస్తుతానికి స్లిమ్ ఫిట్ అంటూ జీన్స్ ప్యాంట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. జీన్స్ ప్యాంట్ అయితే మురికి అయ్యే ప్రసక్తి ఉండదు. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుండి వృద్ధుల దాకా ఎన్నో రకాల రెడీ మేడ్ దుస్తులు నేడు లభ్యమవుతున్నాయి. ఏ వయస్సు వారికి తగ్గట్టుగా ప్రత్యేక షాపులు వెలిశాయి. వధూవరులకు మాన్యవర్, కరిష్మా లాంటి ప్రత్యేక పెళ్లి దుస్తుల షాపులకు కొదువ లేదు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతుంది. దీన్ని స్వాగతించాలి. కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది. సందేహం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లి హెయిర్ స్టైల్ పై కుర్ర కారు జోష్ పెరిగింది. ఆడవారి, మగవారి హెయిర్ స్టైల్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. మహిళల జడ పిరుదుల దాకా ఉండటం ఒకప్పటి ఫ్యాషన్. నేడు ఎక్కువ శాతం మహిళలు జడ అల్లుకోకుండా జుట్టు విరబోసు కోడానికి సుముఖత చూపిస్తున్నారు. దానితో విరబోసుకున్న కురులను సవరించుకోటానికి ఒక చేతికి ఎప్పటికీ పనే. జడ ఉండదు కాబట్టి పూలు తురుముకునే అవసరం రాదు. ఇవన్నీ వారి వారి ఇష్టాలు. కానీ ఆధునికత పేరుతో మోకాళ్ళ దగ్గర, నడుము కింద చిరుగులున్న ప్యాంట్లు ధరించటం, జాగ్రత్తగా దాచు కోవలసిన అందమైన ఛాతీ బహిర్గతమయ్యే విధంగా ఉద్దేశ్య పూర్వకంగా గుండీలు లేని దుస్తులు వేసుకోవటం లేదా గుండీలు విప్ప దీసుకోవటం, నాభి భాగం ఆచ్ఛాదన లేకుండా ఉంచుకోవడం భారత సమాజం హర్షించదగ్గ పరిణామం మాత్రం కాదు. ...............

మరిన్ని వ్యాసాలు

కేదారనాధ్ .
కేదారనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బదరీనాధ్ .
బదరీనాధ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.