చరిత్రలో బానిసలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

చరిత్రలో బానిసలు.

మహాన్నతమైన భారతదేశచరిత్రలొ ఎన్నోమహత్తర విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. దాస, దాసిలుగా అమ్ముడు పోవడం మన చరిత్రలో కనిపిస్తుంది. అతి పురాతనమైన ఋగ్వేద గ్రంధంలో 'దస్యులు' (దాసులు) ప్రసక్తి ఉంది. నాటి కాలంలో యుధ్ధంలో ఓడిన వారిని చంపకుండా, బంధించి బానిసలుగా వినియోగించుకునేవారు.

ఉదాహరణకు కరికాల చోళుడు అనే రాజు సింహళ దేశంపై దండెత్తి జయించి, పన్నెండు వేల మందిని బందీలుగా పట్టుకు వచ్చి వారిచే కావేరి ఆనకట్ట నిర్మాణపు పనులు చేయించాడు. త్రిలోచనా పల్లవుడు అనే రాజును ఓడించి బానిసగా మార్చి అతనిచే మట్టి తట్టలు మోయించాడు. కౌటిల్యుని అర్ధశాస్త్రంలో బానిస వ్యవస్ధ గురించి వివరింపబడింది.

బానిసలకు యజమాని విధించే శిక్షలు, బానిస విముక్తి షరతులు 'జాతకథ' లోను, మను, పరాసర సార దస్మృతుల ద్వారా తెలుస్తాయి.

పూర్వం దానం చేసే వారు ధన, జన, కనక, వస్తు, సకుటుంబంగా, గ్రామాలు, అగ్రహారాలు, దానం చేసేవారు. వీటి సమస్త జనసమేత, సజనాన్, సప్రజాయాం, ప్రజాయుక్త, ఆజ్ఞశ్రవణ, విధేయ భూత పలు భాషలకు అర్ధ బానిసలతో సహా, వెట్టి చాకిరి చేసే రైతులు, వృత్తి పనివారలతో సహ దానం చేస్తున్నానని అర్ధం.

భారతదేశ బానిస చరిత్రలో... దాస, దాసి, ప్రౌష్య, కర్మకార, భృతకమని పేర్లు కనిపిస్తాయి. దాస(పురుషులు), దాసీ(స్త్రీలు) అంటే బానిసలు, కర్మాకార అంటే వృత్తిపనివారు, పౌష్య అంటే స్వేచ్చ కోల్పోయిన రైతు, భృతకము అంటే గృహ సేవకుడు. వెట్టిచాకిరి చేసే వారిని 'విష్టకారులు' అని, రుణ విముక్తి కోసం కట్టు బానిసలైన వారిని 'రుణవాన్' అని పిలిచేవారు. అంతే కాదు నాడు వ్యాపారస్తులకు 'సార్ధ', 'సార్ధవాహ' అనేవి పర్యాయ పదాలు. ధన, జన, భూసంపద కలిగిన వారిని 'భోగి, భోగపతి, మహాభోగి అని సంభోదించేవారు. విదేశి చరిత్రలోకి వెళితే, ఆఫ్రికా నుండి అమెరికాకు బానిసలను కొనితేవడం 1619 లోప్రారంభం అయినది. ఉత్తర అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని జేమ్సు టౌన్ లోనికి మొదట సారి బానిసల ప్రవేసం జరిగింది. తొలుత ఇరవై మంది బానిసలతో మోదలైన సంఖ్య 1810 నాటికి పది లక్షలు దాటింది. తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యల కొరకు అలుపు ఎరుగని పోరాటం చేసి వేల మంది అసువులు బాసారు. ఫ్రెడరిక్ డగ్లస్ అనే నల్ల జాతియుని అధ్వర్యంలో జరిగిన పోరాటంలో 1865 ఏప్రిల్ 9వ తేదిన నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ బానిసత్వ నిర్మూలన ప్రకటించాడు.

ఏ దేశ చరిత్ర పరిశీలించినా నాడు బానిసత్వ వ్యవస్ధ కనిపిస్తుంది. బలవంతులదే రాజ్యం హరప్ప మొహంజెదారో నాగరీకత కాలం. పూ. 2500 - 3000, మధ్య కాలానికి బానిస, బానిస యజమాని వ్యవస్ధ ఉందని నిర్ధిస్టమైన ఆధారాలు లభించాయి. ఈజిప్టు, బాబిలోనియన్ దేశాల బానిస వ్యవస్తకు దీనికి పోలికలు ఉన్నాయి.

మనదేశంలో సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యం ధారబోసి, తన భార్యాబిడ్డలను కాలకౌసికుడు అనే బ్రాహ్మణునికి అమ్మి, తను వీరబాహువు నకు అమ్ముడు పోయాడు. శ్రీకృష్ణుని నడి వీధిలో నారదుడు అమ్ముతుంటే తులసి దళంతో రుక్మిణి దక్కించుకుంది. కద్రువకు, వినత. శర్మిష్ఠకు దేవయాని దాసిలుగా ఉన్నారు. జూదంలో ఓడిన పాండవులు కొద్దిసేపు బానిసలుగా దుర్యోధనుని ముందు నిలబడ్డారు. విరాటరాజు పట్టమహిషి సుదేష్టకు ద్రౌపతి సైరంద్రి పేరున దాసిగా అజ్ఞాత వాసం గడిపింది. తల్లితండ్రులను కావిడి లో మోసిన, పిత్రుయాగానికి తనను తాను అమ్ముకున్న మహనీయులున్నమనదేశ చరిత్ర ఎంతో గొప్పది.