కొండా వెంకటప్పయ్య. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కొండా వెంకటప్పయ్య.


దేశభక్త కొండా వెంకటప్పయ్య.
స్వాతంత్ర్య సమరయోధుడు,రచయిత,నటుడు అయిన కొండావారు 1866 ఫిబ్రవరి 22 న గుంటూరు పట్టణంలోని పాత గుంటూరులో జన్మించాడు. ప్రాథమిక విద్య గుంటూరు మిషన్ స్కూలులో, ఉన్నత విద్య మద్రాసు క్రైస్తవ కళాశాలలో పూర్తిచేసి తరువాత బి.ఎల్. పట్టా పొంది, బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. వెంకటప్పయ్యకు మొదటి నుండి పౌరవ్యవహారాలలో ఎక్కువ ఆసక్తి ఉండటం వలన, అవే పనులు చేయడానికి ఎక్కువ ఉత్సాహపడేవాడు. దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు
పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలు తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవారు. వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుగారితో కలసి కృష్ణపత్రిక ప్ర చురణను ప్రారంభించారు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపి, గుంటూరులో స్థిరపడగానే దాని సంపాదకత్వ బాధ్యతలను ముట్నురు కృష్టారావుగారికి అప్పగించారు. న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధాన వృత్తిగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు గుంటూరు అరండల్ పేటలో శారదా నికేతన్‍ స్ధాపనకు వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మివేసి పదివేల రూపాయల విరాళం ప్రకటించాడు. 1910లో బందరులో
జాతీయ కళాళాల వీరిచే ప్రారంభోత్సవం చేయబడింది. నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అతనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించాడు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ - చమ్స్‍ఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసుకు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యుడు.
1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రకాం గ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనలో ఇది తొలివిజయం. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యాడు. సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే కొండా వెంకటప్పయ్య శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యాడు.
1921 మార్చి, ఏప్రియల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయల విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించాడు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకు ఆయన మొదటిసారి జైలు శిక్ష అనుభవించాడు.

1923 కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ శాసనోల్లంఘనల అనంతరం శాసన సభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదుల మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికఅయ్యారు. దేశబంధు చిత్తరంజన్ దాస్ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశాడు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యాడు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని విజయవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. గాంధీజి తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్యే ఆ రోజుల్లో నాయకత్వం వహించేవాడు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది.

1929లో సైమన్ కమీషన్ రాక సందర్భంలోనూ, 1930 ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942 క్విట్ ఇండియా ఉద్యమం లోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో వీరు మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యాడు. భాషా ప్రాతిపదిక మీద మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. మొదటి వాడుగా ఆంధ్రరాష్ట్ర ఉద్యమంనుండి 1920 నుంచి 1949లో కీర్తి శేషుడయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకడిగా అతనిని నియమించి ఆయన త్యాగాలకు ఆ విధంగా విలువకట్టారు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షుడిగా పనిచేశాడు.
అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాలం సభ్యుడిగా ఉన్నాడు. గ్రంథాలయోద్యమానికె కూడా తోడ్పడ్డాడు.స్వరాజ్యపోరాటంలో ఉండగా అతని సతీమణి పక్షవాతంతో మరణించింది.
కొండా నెంకటప్పయ్య కడలూరు జైలులో ఉన్నప్పుడు "డచ్ రిపబ్లిక్" అనే గ్రంథాన్ని రచించాడు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా రాశాడు. "శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి" అన్న భక్తి రసభరితమైన శతకాన్ని, ఆధునిక రాజ్యంగ సంస్ధలు అనే పుస్తకం రచించాడు.వీరు ఆంగ్లంలోనూ తెలుగులోనూ మంచి వక్త, కవి. మొదటి నుంచి నాటకాలంటే కొండా వెంకటప్పయ్యకు చాలా మక్కువ, స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.
కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి కొండా వెంకటప్పయ్య 1949 ఆగస్టు15 న శాశ్విత నిద్రలో ఒరిగిపోయారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.