నైతిక విలువలు - సి.హెచ్.ప్రతాప్

నైతిక విలువలు

గోపి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. స్వతహాగా మంచి తెలివైన వాడు. కష్టపడి చదివే మనస్తత్వం కూడా వుంది. అందుకే క్లాసులో మంచి మార్కులు సాధిస్తూ మొదటి మూడు స్థానాల్లో ఎప్పుడూ వుంటాడు. మార్కుల సాధనే కాక చదువులో ఉన్నత స్థితికి వెళ్ళేందుకు జ్ఞ సముపార్జన కూడా ఎంతో అవసరం అన్న సిద్ధాంతాన్ని అతని తల్లిదండ్రులు వాడికి ఉగ్గుపాలతో రంగరించి పోసారు.

ఆ సంవత్సరం గోపికి టైఫాయిడ్ జ్వరం రావడం వలన మూడు నెలలు స్కూల్ కి వెళ్ళలేదు. టైఫైయిడ్ తగ్గేందుకు ఎక్కువ మందుకు వాడాల్సి రావడం, ఆ సమయంలో పత్యం తినడం వలన జ్వరం తగ్గాక కూడా విపరీతమైన నీరసం వలన చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. అందుకే చదువులో బాగా వెనకబడ్డాడు. వాళ్ళ నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ తో, క్లాసు టీచర్ తో గోపి చదువు,పరీక్షల గురించి చర్చించారు. మీ వాడు మంచి తెలివైన వాడు మరియు క్లాస్ లో ర్యాంక్ కుడా వస్తుంది. కాబట్టి చదువు విషయమై దిగులు చెందనవసరం లేదని, బాగా ఆరోగ్యవంతుడయ్యాక స్కూలులో స్పెషల్ క్లాసుల ద్వారా సిలబస్ ను కవర్ చేద్దామని వారు భరోసా ఇచ్చారు.

ఇంతలో సంవత్సరాంతం పరీక్షలు వచ్చాయి. సిలబస్ పూర్తి చేయనందున పరీక్షలకు వెళ్ళనని గోపి భీష్మించుకు కూర్చున్నాడు. అయితే అనుభవం కోసం పరీక్షలకు కూర్చోమని , ఒకవేళ బాగా మార్కులు రాకపోయినా, పై తరగతికి ప్రమోట్ చేసే విధంగా స్కూల యజమాన్యంతో ప్రయత్నించుదామని తండ్రి గోపి ని బలవంతం చేశాడు.

స్కూలుకు వెళ్ళినప్పుడు ఇతర క్లాస్ మేట్స్ గోపిని గేలి చేయడం మొదలెట్టారు.క్లాస్ లో ర్యాంక్ హోల్డర్ ఇసారి ఫెయిల్ అవడం ఖాయం అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే గోపి మనస్సు కుత కుతలాడిపోయింది. నడిరోడ్డు మీద నిలబెట్టి రాళ్ళతో కొట్టినట్టుగా బాధపడ్డాడు. ఇంతలో తన కంటే తక్కువ ర్యాంకు తెచ్చుకునే విజయ్, భాస్కర్ లు ఎదురయ్యారు. ఈసారి పరీక్షలలో మాకే మంచి ర్యాంకులు వస్తాయి. ఫైనల్ పరీక్షలో నీకు క్లాసులో తక్కువ ర్యంకు రావడం ఖాయం, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా అవవచ్చు అని గర్వంగా కాలరెగరేసారు.

నిస్పృహ ఆవరించగా గోపి పరీక్ష హాలులో కూర్చున్నాడు. క్వశ్చన్ పేపర్లు పంచారు. మూడు నెలలుగా అనారోగ్యం వలన తన చదువు ఆటక ఎక్కిపోయింది. ఒక్క ప్రశ్న కూడ అర్ధం కావడం లేదు. ఎంత బుర్ర చించుకుంటున్నా సమాధానం స్పురించడం లేదు.

లోపల నుండి దుఖం తన్నుకు వచ్చేస్తొంది. కళ్ళముందు కన్నీటి పొరలు దట్టంగా కుమ్ముకో సాగాయి. ఎదుట వున్న పేపర్ కూడా కనిపించడం లేదు.గోపి అవస్థను పక్కనే కూర్చున్ననారాయన గమనించాడు. నెమ్మదిగా లో గొంతుకతో, "గోపి, నేను ఈ పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యాను. తొంభై శాతం మార్కులు వస్తాయన్న గ్యారంటీ వుంది. నా పేపర్ నీకు కనిపించేలా పెడతాను. టీచర్ చూడకుండా మొత్తం కాపీ కొట్టేయి" అని అన్నాడు.

ఆ మాటలకు గోపిలో కొత్త ఆశ చిగురించింది. నారాయణ చెప్పినది సబబుగానే వుందనిపించింది.తానెలాగూ కష్టపడి చదువుతాడు. ఈ పరీక్షలకు అనారోగ్యం వలన చదవలేకపోయాడు. ఇప్పుడు తెల్ల పేపర్ ఇచ్చే బదులు కాపీ కొట్టి పరీక్ష కాస్త గట్టెక్కితే తర్వాత క్లాసులో కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించవచ్చు. ఇలా చేస్తే తన ర్యాంకు కూడా నిలబడుతుంది.

యధాలాపంగా గోపి టీచర్ వైపు చూసాడు. ఆవిడ కుర్చీలో కూర్చోని ఏదో పుస్తకం శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఆవిడ వాలకం చూస్తే పరీక్ష పూర్తయ్యే వరకు కుర్చీ నుండి లేచేలా అనిపించింది. ఇదొక మంచి అవకాశం అనిపించింది. వెంటనే నారాయణ వైపు చూసి కళ్ళతోనే ఓ కె చెప్పాడు.

నారాయణ కాపీ కొట్టడానికి వీలుగా పేపర్ ని పెట్టాడు. గోపి కాపీ చేసి రాయడం మొదలు పెట్టేంతలో అతగాడికి వాళ్ళ అమ్మ చిన్నతనంలో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

చిన్నప్పుడు ఒకసారి స్కూలులో కాపి చేసి రాస్తున్నాడని వాళ్ళ క్లాస్ టీచర్ ఫిర్యాదు చేసింది. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ గోపి గూబ గుయ్యనిపించింది. తర్వాత వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పింది. " జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిని క్రమశిక్షణతో కష్టపడి పని చేయాలి. సులువుగా విజయం సాధించేందుకు అడ్డదారులు తొక్కడం మంచి పద్ధతి కాదు. మంచి పనులైనా, చెడ్డ పనులైనా వాటి ఫలితాలు మనమే అనుభవించాల్సి వస్తుంది.అందుకే ఇంకెప్పుడూ జీవితంలో చదువైనా, ఉద్యోగమైనా, ఇంకేదైనా అడ్డదారిలో సాధించడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. నిజాయితీతో సాధించేదే మన వెంట చివరి దాకా వస్తుంది."

ఆ మాటలు ఒక్కసారిగా గోపి హృదయంలో మార్మోగాయి. తాను చేయబోయేది ఎంతటి తప్పుడు పనో అర్ధం అయ్యింది. ఈసారి పరీక్షలు సరిగ్గా రాయకపోతే కొంపలేం మునగవు కదా. ఈ పరీక్షలతో తన జీవితం ఏమీ అంతం అయిపోదు కదా.వచ్చే పరీక్షలకు ఇంకా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అంతమాత్రాన తప్పుడు దారిలో నడిచి అధర్మంగా మార్కులు తెచ్చుకోవడం ఏం సబబు ?

వెంటనే గోపి తన నిర్ణయం మార్చుకున్నాడు. తనకు తోచిన జవాబులు రాసి గర్వంగా క్లాసు నుండి నడిచి బయటకు వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు ఉగ్గుపాలతో తమ పిల్లలకు నైతిక విలువలు నేర్పడం ఎంతో అవసరం. అవి వారిని చివరి దాకా తప్పుడు మార్గాన నడవకుండా రక్షిస్తాయి

మరిన్ని కథలు

Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు