మనవడొచ్చాడు - వారణాసి సుధాకర్

మనవడొచ్చాడు

"నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా.. జాబిలి నవ్వున నువ్వేనా.. గోదారి పొంగున నువ్వేనా...నువ్వేనా..." 🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼 అని బాలు మధురంగా పాడుతుంటే, ఆరోజుల్లో నా వయసు అడపిల్లలందరూ తమని ఉద్దేశించే పాడుతున్నాడనుకునేవారు. వాళ్ళల్లో నేను మొదటి వరసలో నిలబడేదాన్ని ! నాకు తెలియకుండానే మొహంలో చిరునవ్వు తొంగిచూసేది. సిగ్గు మొగ్గలు వేసేది. నేనూ - నా ఫ్రెండు మంజుల, ట్యూషన్ నుంచి మాఊరి లక్ష్మీ టాకీసు దగ్గరికి వచ్చేసరికి, అక్కడ ఆగి మరీ ఆ పాట వినేవాళ్ళం. ప్రతిరోజూ ఎన్నిసార్లు వేసేవారో... ఆ రికార్డు అరిగిపోయి, ఎన్నో రికార్డులు పగిలివుంటాయి ! ఆ పాట మొత్తం కంఠతా వచ్చేసింది ! ముఖ్యంగా ఆ పాటలో... "నువ్వైనా..నీ నీడైనా..ఏనాడైనా.. నా తోడౌనా.." అనే చరణం వచ్చేసరికి, ఆ వయసులో ఏదో తెలియని అనుభూతి, మధురభావాలు... సింగినాదం... జీలకర్రా... ఇప్పుడు తల్చుకుంటే నవ్వొస్తుంది కాని, "ఆ వయసే అంత, అప్పటి మనసే అంత !" అనుకుంటూ పడక్కుర్చీలో వాలాను. 💐💐 ఈ మోకాళ్ళ నెప్పులతోటి, ఇలాగే మందులు వాడుకుంటూ, సహజీవనం చెయ్యమని మా కుర్ర ఎముకల డాక్టర్ చెప్పేశాడు. నా పొట్టి మంచం, పడక్కుర్చీ, బుల్లి టీవీ, పెద్ద టాబ్బు, సుందర కాండ...నాకు దోస్తులు ! మా అబ్బాయి, కోడలు, మనవలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను సుఖంగా బతకడానికి కావలసినవన్నీ ఇక్కడే సమకూర్చారు. చిన్న భోజనాల బల్ల, టీవీ, నాకు ఒక టాబ్, అమర్చిపెట్టి, కాఫీ టిఫిన్లు, భోజనం ఇక్కడికే తెచ్చిపెడుతున్నారు. ఈ దిక్కుమాలిన మోకాళ్ళ నెప్పులు లేకపోతే... నేనూ అందరిలాగ మామూలు మనిషినే ! దేవుడిదయవల్ల, ఇంకే రోగం లేదు ! ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంటుంది... "వయసులో వుండగా.. నేనేనా... చెంగు చెంగున ఎగురుకుంటూ, చెట్లూ - పుట్టలూ ఎక్కేస్తూ, వెనకాల్నించి మా అమ్మ వద్దంటున్నా వినకుండా, జామచెట్టెక్కి, కాయలు కోసి, అక్కణ్ణించి ధబేలున దూకేసిన కాళ్ళేనా..ఇవి ?" అని. ఒంటికాలిమీద గెంతుతూ, తొక్కుడుబిళ్ళ ఆడుకుంటూ, మా ఊరి కాలవలో నా స్నేహితురాళ్ళతో కలిసి, గంటలకొద్దీ ఈతలు కొట్టేసి, అక్కడే బట్టలుతికేసి, వస్తూ వస్తూ పెద్ద స్టీలు బిందెతో తాగడానికి మంచినీళ్ళు తెచ్చింది నేనేనా అనిపిస్తుంది. 💐💐 పెళ్ళయ్యాక, అత్తారింట్లో ఎంత చాకిరీ చేసేదాన్ని ! ఎంతమందికి, ఎన్నెన్ని రకాలు వండిపెట్టి, వేళా - పాళా లేకుండా వచ్చిన అతిధులకి మర్యాదలు చేస్తూ, ఆనందంగా బతికేశాను. ముగ్గురు తోడికోడళ్ళు వున్నా... మా అత్తమావలు మాదగ్గిరే వుండేవారు. కారణాలు అందరికీ వుండేవే..తెలిసినవే ! మా నలుగురు పిల్లలూ రాత్రి హాయిగా నిద్రపోయి, తెల్లారి లేస్తూనే నేను ఉతకడానికి ప్రసాదించిన తడి పక్కబట్టల మూటలు, ఎండలో కూచుని ఉతికి, డాబామీద ఆరేసి, సాయంత్రం మళ్ళీ ఆరిన బట్టలు తెచ్చుకుని, మడతలు పెట్టుకుని, మళ్ళీ రాత్రికి వాళ్ళకి మెత్తగా పరిచి, కథలు చెప్పి, జోకొట్టి, బజ్జోపెడితే, తెల్లారి నాకు రిటర్ను గిఫ్టుగా, తడిపిన మూటలు మామూలే ! అప్పట్లో తల్లులందరి బాధా అదేగా ? (ఇప్పుడాబాధ లేదుగా ?) ఈయనా - నేనూ, "ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మొగపిల్లలకి చదువులు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, ఎప్పుడు గట్టెక్కుతామురా..భగవంతుడా..." అనుకోని రోజు లేదు ! వాళ్ళు పెద్దయిపోయారు, రెక్కలొచ్చి ఎగిరిపోయారు కాని, నేనిం....కా పెద్దయిపోయి, ఇలా మూలన పడ్డమే బాలేదు ! 😢 అందుకే కాబోలు, నా నలుగురు పిల్లలూ నాకు ఆమాత్రం ఓపికుండగానే, తీర్థయాత్రలు చేయించేసి, ఇండియాలోను, అమెరికాలోను వున్న ముఖ్యమైన, అందమైన ప్రదేశాలన్నీ చూపించేసి, మంచిపని చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు చూసుకుంటూ కూచుంటే, రోజులు గడిచిపోతున్నాయి. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, చాగంటి వారు, రోజూ నా దినచర్యల్ని నిర్దేశిస్తుంటారు. 💐💐 రేపు మా పెద్దమ్మాయి కొడుకు, అమెరికా నుంచి వస్తున్నాడు. పదేళ్ళ తరవాత, చదువు పూర్తి చేసుకుని, పెద్ద ఉజ్జోగం సంపాదించి, ఆఫీసు పనిమీద, ఇన్నాళ్ళకి ఇక్కడికి వస్తున్నాడు. వాడు తరచుగా ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరగాలిట. తిన్నచోట కూచోనివ్వరు, కూచున్నచోట పడుకోనివ్వరుట ! వాడికి చిన్నప్పట్నుంచీ ఇంటి భోజనం, ముఖ్యంగా, నేను వండిన పాతకాలపు వంటలంటే ఎంతిష్టమో ! కానీ, సంచారజీవి లాగ, దేశాలమ్మట తిరుగుతుంటే ఎక్కడ కుదురుతుంది... ఇంటిభోజనం ? ఆ దిక్కుమాలిన హొటళ్ళవాళ్ళు బోల్డు డబ్బులు తీసుకుని, పేర్లు కూడా తెలియనివి, ఏవి పెడితే, అవే తినాలిట ! చెప్పద్దూ... నాకుమాత్రం, వంటా - వార్పూ బాగా వచ్చిన, చక్కటి ఇక్కడి పిల్లనే చూసి, వాడికి కట్టేస్తే, చాలా బావుంటుంది అనుకుంటూ వుంటాను. ఆ తరవాత వాడిష్టం..వాళ్ళమ్మా - నాన్నా ఇష్టం ! 💐💐 వాడు ఫోన్లో కలిసినప్పుడల్లా, "ఆరోగ్యం జాగర్తరా నాయనా" అని చాదస్తంగా చెబుతూనే వుంటాను. "అలాగే అమ్మమ్మా...నా గురించి వర్రీ అవకు, ముందు నీసంగతి చూసుకో... నువ్వు రిటైరయిపోయావ్... అన్ని పనులూ నువ్వే చెయ్యాలనుకుని, పూర్వంలాగ, అన్నిటికీ అడ్డం పడిపోకు, నీ ఆరోగ్యం జాగర్తగా చూసుకో" అని మందలిస్తూనే వుంటాడు, పిచ్చి కన్న ! వాడు ప్రేమగా మందలించినా నాకిష్టవేఁ ! వాడు అమెరికాలో పుట్టి పెరిగాడే కానీ, వాడివన్నీ మన దేశవాళీ బుద్ధులే... వాళ్ళ తాతలాగ ! నా వంటలు, నేను చేసిన కూరలు వాడికెంతిష్టమో ! "అమ్మమ్మా...ఐదు నక్షత్రాల హొటల్ వాడు పెట్టే పదహారు రకాలు, నువ్వు చేసిన ఒఖ్ఖ కందా - బచ్చలి కూరముందు బలాదూర్ ! నీ బ్రాండు వంకాయ్ పచ్చిపులుసు, వాడు తలకిందుగా తపస్సు చేసినా, చెయ్యలేడు !" అంటాడు, వెర్రినాగన్న ! వాడొచ్చి అడగాలేగాని, వాడికిష్టమైనవన్నీ చేసిపెట్టెయ్యనూ... రేపు వాడొస్తున్నాడంటే, ఈ రాత్రి నిద్రపట్టి చావదే ! రోజూ ఏడు తరవాత లేచేదాన్నల్లా, ఇవేళ నాలుగింటికే లేచికూచున్నాను ! నిన్ననే మా అబ్బాయిచేత, కంద, బచ్చలి, పచ్చడి వంకాయలు తెప్పించి వుంచాను. 'వాడికోసం నేనే వండాలి, ఇంకెవరు వండినా, వాడికి నచ్చదు' అని నా ప్రగాఢ నమ్మకం ! 💐💐 తెల్లారకుండానే ఆరడుగుల నా మనవడు క్యాబ్ లో దిగాడు. నేను ఎత్తుకుని, నా చేత్తో గోరుముద్దలు తినిపించిన వాడు, ఎంత మారిపోయాడు ? సినిమా హీరోలు చాలరు ! వాడికి నా దిష్టే తగిలేట్టుంది. రాగానే ముందు నన్ను గట్టిగా పట్టేసుకున్నాడు. నా తరువాతే..వాడి మేనమావ, అత్త, పిల్లలూ... నాలాంటి ముసలాళ్ళు, ఎవరు ఇంటికొచ్చినా, ముందు తమనే పలకరించాలి అనుకుంటారని, ఎక్కడో చదివాను... "అమ్మమ్మా...రెండ్రోజులే వుంటాను. అందులో ఒకరోజు బయట ఆఫీసు గొడవతోనే సరిపోతుంది. ఈరోజు మాత్రం, నువ్వు నాకిష్టమైన ఐటమ్స్ చేసిపెట్టాలి. ఓ పట్టు పడతాను" అన్నాడు. వాడలా అడిగితే, ఏదో తెలియని ప్రేమ, ఆనందం, పులకింత ! "అలాగేరా.. పిచ్చికన్నా... (వాడికి నేను పెట్టిన ముద్దుపేరు) నువ్వు అడగడం, నేను చెయ్యకపోవడమూనా...?" అన్నాను. 💐💐 అంత పెద్ద ఆఫీసరు, వాళ్ళ మేనమామ పిల్లల్తో ఆడుతూ, అల్లరి చేస్తూ, వాళ్ళకోసం తెచ్చిన ఎన్నెన్నో వింత వింత వస్తువులు వాళ్ళకి ఇస్తుంటే, వాళ్ళ మోహాల్లో వచ్చే వెలుగు, ఆనందం.. చూసి తీరాలి. మేనమామకి ఖరీదైన సెల్ ఫోను, లాప్ టాప్, అత్తకి ఖరీదైన హ్యాండు బ్యాగ్గు, సెంట్లు ఇచ్చాడు. నాకోసం ప్రత్యేకంగా, మెత్తటి స్వెట్టరు, శాలువా, రగ్గు, కాళ్ళ నెప్పులకి కరెంటుమీద కాళ్ళు నొక్కే అదేదో యంత్రం, సింగపూర్ దేశంనించి, చుట్టూ దీపాలతో, ఎంతో అందంగా... వెండిమీద బంగారం పూతతో తయారు చేసిన నా ఇష్టదైవం, వేంకటేశ్వరస్వామి ఫొటో తెచ్చాడు. మా అందరికీ ఎన్ని ఫొటోలు తీశాడో ! పాపం నా కోడలు నా కూడా వుండి, అన్నీ అందిస్తూ, సాయంచేస్తుంటే, ఎలాగో వంట కానిచ్చానే కాని, చాలా ఏళ్ళ తరవాత వంటచెయ్యడం వల్ల, నా మనవడికి నచ్చేటట్టు వచ్చాయో, లేదో అనే శంక మనసులో పీకుతోంది. నా మనవడు, మా అబ్బాయి, పిల్లలు..దొడ్లోంచి అరిటాకులు కోసి తెచ్చుకుని, కింద కూచుని, భోజనాలు చేస్తుంటే, నాకెందుకో వెర్రి ఆనందం. వాడు చిన్నప్పుడు..పేద్ధ అరిటాకులో తింటానని పేచీ పెట్టడం గుర్తొచ్చింది. తినేవాళ్ళ మొహాలకేసి అదేపనిగా చూస్తూ, వండిన పదార్ధాలు ఎలా ఉన్నాయంటారో అనే ఆత్రుత వుండడం, బావున్నాయని మెచ్చుకుంటే, వండినవాళ్ళకి వచ్చే తృప్తి, ఆనందం ఇంతా - అంతా కాదు ! ఇది తర తరాలుగా వస్తున్నదే ! అటువంటిది, నా మనవడు, కొడుకు పిల్లలు ప్రతి ఆధరువు రెండుసార్లు కలుపుకుని తింటుంటే, ఏదో తృప్తి ! నా మనవడైతే, "అమ్మమ్మా, సూపర్... నీ వంట తిని ఎన్నాళ్ళయిందో... అన్నీ చాలా చాలా బావున్నాయ్, నీ వంటకోసం ఇక్కడే ఉండిపోయి, ఇక్కడే ఉజ్జోగం చేసుకుంటా..." అన్నాడు. మనసుకి ఏదో చెప్పలేని ఆనందం ! 💐💐 అన్నట్టు...పొద్దుటినుంచీ నా కాళ్ళనెప్పులు ఏమైపోయాయి, నా గదిలోకే అన్నీ తెప్పించుకుని తింటున్న నాకు, ఇంత ఓపిక, ఉత్సాహం ఎలా వచ్చేశాయి ? ఆశ్చర్యంగా వుంది !!! ప్రేమలు వున్నచోట, ఆప్తుల పలకరింపులు, మెచ్చుకోళ్ళు నాలాంటివాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని, కొత్త జన్మని ఇచ్చి, ఇంకో ఇరవై ఏళ్ళు బతికిస్తాయేమో ! 💐💐 అని తన మనవడి రాక అనుభవాలు చెప్పడం ముగించింది, మా పెద్దమ్మ...భారతమ్మ. "పెద్దమ్మా.. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ పిల్లలు, మనవలు అందరూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, ఇంతకంటే ఏం కావాలి, చెప్పు ?" అన్నాను. "నిజవేఁరా, నాయనా.. అంతా ఆ దేవుడి దయ !" అంది. 💐💐💐💐💐💐

మరిన్ని కథలు

Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ