చంద్రునికో నూలు పోగు - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Chandruniko noolu pogu

మాఘ శుద్ధ పాడ్యమి నెలపొడుపుని చూసి "క్షీరసాగర సంపన్నా... లక్ష్మీ ప్రియ సహోదర... హిరణ్య మకుట భాస్వత్ ... బాల చంద్ర నమోస్తుతే..." అని శ్లోకం చదివింది. తన చీరకొంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రునికి ఇచ్చి భక్తి తో నమస్కరించింది పెద్దమ్మ. పెద్దమ్మ చేసిన తంతును ఆసక్తిగా గమనించాడు రుద్రాంశ్. "పెద్దమ్మా నువ్వెందుకు అలా చేస్తున్నావ్" అని అడిగాడు. "చంద్రుణ్ణి చూసావు కదా! చంద్రునిలో నూలు వడికే అవ్వ ఉంది. ప్రతి పాడ్యమి నాడు మనం చంద్రునికి ఒక నూలు పోగు ఇస్తే ఆ నెలలో మనకి కొత్త బట్టలు ఇస్తుంది." అని చెప్పింది పెద్దమ్మ. "దీనికో కథ ఉంది చెప్తాను విను." అంటూ చెప్పడం ప్రారంభించింది. "పూర్వం పుణ్యగిరి అటవీప్రాంతం లో అనేక జంతువులు, పక్షులు నివసించేవి. వారాంతం లో జంతువులు పక్షులు కలసి సంగీత విభావరి నిర్వహించేవి. చందమామను ముఖ్య అతిధిగా అహ్వానించేవి. కోయిలలు పాటలు పాడేవి. మైనాలు సన్నాయి రాగాలు తీసేవి. చింపాంజీలు డప్పులు వాయించేవి. కోతులు, ఏనుగులు, నెమళ్ళు నాట్యాలు చేసేవి. ఇలా ఆనందంగా గడిపేవి. చాలా కాలం గడిచింది. ఒకసారి మృగరాజు అతిధిగా వచ్చిన చంద్రునికి నమస్కరించి " మా కోర్కె మేరకు మీరు సంగీత విభావరికి వస్తున్నారు కానీ మీకు తగిన గౌరవం చేయలేకపోతున్నాము." అని బాధపడింది. "అయ్యో ఎంత మాట. మీతో పాటు నేనూ ఆనందాన్ని పొందుతున్నాను. మీ అభిమానమే నాకొక పెద్ద బహుమతి. ఇంతకంటే ఏం కావాలి. అయినా మీ సంతోషం కోసం చెప్తున్నాను నెలపొడుపు నాడు మీ పక్షుల ఈకలను మా అవ్వకి పంపండి చక్కని బట్టలు కుట్టి ఇస్తుంది." అని చెప్పాడు చందమామ. నాటి నుంచి ప్రతీ పక్షి తమ శరీరం నుంచి ఒక్కో ఈకను పంపేవి. ఆ ఈకలతో అవ్వ అందమైన బట్టలు కుట్టి ఇచ్చేది. అవి వేసుకుని చందమామ సంగీత విభావరికి హాజరయ్యేవారు. అప్పటి నుంచి మనం కూడా నెల పొడుపును చూసి చంద్రునికి నూలు పోగు ఇవ్వడం మొదలైంది. ఆయన మనకి కొత్త బట్టలు ఇస్తాడు అనే నమ్మకం బలంగా నాటుకుపోయింది. అంతే కాదు గొప్పవాళ్ళను గౌరవించేటప్పుడు 'చంద్రునికో నూలుపోగులా' అన్న మాట లోకోక్తి అయ్యింది." అని చెప్పింది పెద్దమ్మ. "హమ్మయ్యో! దీని వెనుక ఇంత కథ ఉందా!"అని నోరెళ్ళబెట్టాడు రుద్రాంశ్.

మరిన్ని కథలు

Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati
KARMA VADALADU
కర్మ వదలదు
- తాత మోహనకృష్ణ