పరివర్తన - పద్మావతి దివాకర్ల

పరివర్తన

బ్రహ్మపురమనే ఊళ్ళో ఉన్న వైద్యనాధుడికి వైద్యుడిగా మంచిపేరు ఉంది. అతని హస్తవాసి మంచిది. అతను ఎలాంటి జబ్బైనా చిటెకెలో నయం చేయగలడు. ఆ చుట్టుపక్కల పాతిక ఊళ్ళకి అతనొక్కడే వైద్యుడు. అయితే జబ్బులు నయం చేసినందుకుగానూ రోగులవద్దనుండి డబ్బులు వసూలు చేసే విషయంలో మాత్రం కచ్చితంగా ఉండేవాడు. అతని వద్ద శిష్యరికం చేసి వైద్యవిద్య అభ్యసించడానికి వైద్యంపట్ల ఆశక్తిగల చాలా మంది యువకులు వచ్చినా అతను ఎవరికీ తన విద్య నేర్పడానికి ఇష్టపడలేదు.

ఎవరికైనా వైద్యం నేర్పితే వాళ్ళు తనకెక్కడ పోటీ అవుతారోనన్న భయం వైద్యనాధుడిది. తను తప్ప మరో వైద్యుడు ఆ చుట్టుపక్కల ఉండటం అతనికి సుతరాం ఇష్టంలేదు. పొరపాటున ఎవరైనా వైద్యుడు ఆ ఊరికిగాని, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోగానీ వైద్యవృత్తి ఆరంభిస్తే ఆ ఊరివాళ్ళ సహాయంతో వాళ్ళని వెళ్ళగొట్టేంతవరకూ ఊరుకోడు.

అదే ఊళ్ళో ఉన్న సహదేవుడనే పేద యువకుడికి తల్లీ తండ్రీ, నా అన్నవాళ్ళెవరూ లేరు. ఆ ఊరివాళ్ళ దయాదాక్షిణ్యాలవల్ల గురుకులంలో విద్య అభ్యసించి తిరిగివచ్చాడు. అతనికి వైద్యవృత్తి చేపట్టి ప్రజలకి సేవ చేయాలనే సంకల్పం కలిగింది. అందుకోసం ఎవరివద్దైనా శిష్యరికంచేసి వైద్యవృత్తి అభ్యసించాలని భావించాడు. తన పేదరికం కారణాన బయటకెక్కడికీ వెళ్ళి వైద్యం అభ్యసించలేడు. అందుకే వైద్యనాధుడివద్ద శిష్యరికం చేసి వైద్యవృత్తి అభ్యసించాలని నిశ్చయించుకున్నాడు.

ఓ మంచిరోజు చూసుకొని వైద్యనాధుడింటికి వెళ్ళి తనను శిష్యుడిగా చేర్చుకోమని అర్ధించాడు. ఎవరికీ వైద్యం నేర్పాలన్న ఉద్దేశ్యంలేని వైద్యనాధుడు అందుకు నిరాకరించాడు. వైద్యవృత్తి నేర్చుకోవాలన్న కోరిక మెండుగా ఉన్న సహదేవుడు ముందు నిరాశ చెందాడు. అయితే ఎలాగైనా వైద్యనాధుడివద్ద ప్రాపకం సంపాదించాలని తలచిన సహదేవుడు "అయ్యా! నాకు మీరు వైద్యం నేర్పకపోయినా ఫర్వాలేదు. నాకు నా అన్నవారెవరూ లేరు. దయచేసి మీ ఇంట్లో పని చేయడానికి పనివాడిగానైనా చేర్చుకోండి. మీ పంచన పడి ఉంటాను." అని వైద్యనాధుడ్ని బతిమాలాడు.

అసలే డబ్బు విషయంలో పిసినారి అయిన వైద్యనాధుడివద్ద స్థిరంగా ఎవరూ పనికి కుదరకపోవడంతో ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే సహదేవుడ్ని ఇంట్లో పనివాడిగా చేరడానికి సమ్మతించాడు. కాకపోతే, రెండుపూటలా భోజనం మాత్రమే పెడతానన్నాడు. వైద్యనాధుడివద్ద పనిలో చేరితే చాలుననుకున్న సహదేవుడు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. అతని ఇంట్లో పనిలో చేరిన తర్వాత నెమ్మదిగా వైద్యనాధుడి ప్రాపకం సంపాదించి వైద్యంలో మెలుకువలు తెలుసుకోవచ్చన్న ఆలోచన సహదేవుడిది. ఆ అవకాశం కోసమే పనివాడిగా అతనివద్ద చేరాడు.

సహదేవుడికి అతనివద్ద పనిలోకి చేరిన తర్వాత గానీ తెలియలేదు తను తలిచినదెంత కష్టమోనన్న విషయం. వైద్యనాధుడు సహదేవుడికి ప్రతీరోజూ ఊపిరి సలపనంత పని అప్పచెప్పేవాడు. ఇంటిపనితో పాటు తను ఔషధాలు తయారుచేసే కల్వంలాంటి పరికరాలు అన్నీకూడా శుభ్రం చేయించేవాడు. అతనివద్ద ఏ పనివాడూ ఎక్కువరోజులు ఎందుకుండటంలేదో అప్పుడు గ్రహించాడు సహదేవుడు. అయినా విసుగు చెందకుండా వైద్యనాధుడు చెప్పిన పనల్లా చేస్తూండేవాడు, ఏ నాటికైనా అతనివద్ద వైద్యం నేర్చుకోలేకపోతానా అని.

అయితే, తననుకున్నది సాధించడం ఎంత కష్టమో త్వరలోనే గ్రహించాడు సహదేవుడు. సహదేవుడికి వైద్యం నేర్పటం మాట అటుంచి తను ఔషాధాలు చేస్తున్నప్పుడుగాని, రోగులకు చికిత్స చేస్తున్నపుడు గానీ సహదేవుడ్ని అటువైపు రానిచ్చేవాడే కాదు వైద్యనాధుడు. మూలికలు తనే తెచ్చి తనే స్వయంగా నూరేవాడు. లేహ్యాలు తనే స్వయంగా చేసేవాడు.

తను తయారు చేస్తున్న మందుల అనుపానాలు సహదేవుడికి తెలియనివ్వకుండా వైద్యనాధుడు జాగ్రత్తపడేవాడు. అందుకే అన్నీ అతనికి కనపడకుండా రహస్యంగా చేసేవాడు. ఎప్పటికైనా తనకు వైద్యం గురించి బోధించక పోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ, వైద్యనాధుడికి రోజూ సేవలుచేస్తున్నాడు సహదేవుడు. అయితే ఎన్నాళ్ళు ఎదురుచూసినా సహదేవుడి కోరిక తీరలేదు. చివరికి విసుగు చెంది ఇక వైద్యనాధుడి ఇంటి నుంచి వెళ్ళిపోదామని అనుకున్న తరుణంలో జరిగిందా ఆ సంఘటన.

ఆ రోజు అర్ధరాత్రి వైద్యనాధుడికి హఠాత్తుగా చాతీలో నొప్పి మొదలై తీవ్రరూపం దాల్చింది. నొప్పి లక్షణాల్ని బట్టి తనకు గుండెనొప్పి వచ్చిందని అర్ధమైంది అతనికి. గుండెనొప్పికి తక్షణం వాడవలసిన మందు తన వద్ద లేదని కూడా గుర్తుకు వచ్చింది. ఆ మందు ప్రస్తుతం తయారు చేసి, వాడే స్థితిలో తనిప్పుడు లేడు. ఆ అలికిడికి మెలుకువ వచ్చిన అతని భార్య గుండె చేత్తో పట్టుకొని మెలికలు తిరిగిపోతున్న వైద్యనాధుడి పరిస్థితి గమనించి కంగారుపడింది. అరుగుపైన పడుక్కొని నిద్రపోతున్న సహదేవుడ్ని లేపింది. సహదేవుడు వెంటనే వచ్చి చూసాడు, కానీ ఏమి చేయాలో అర్ధం కాలేదు.

ఆ చుట్టుపక్కల ఏ వైద్యుడూ లేడాయె! తనకా వైద్యనాధుడు ఔషధాల విషమై ఏ మాత్రం అవగాహన కల్పించలేదు. ఇంట్లో ఔషధాలన్నీ ఉన్నా ఏ ఔషధం వాడాలో తెలియదు. వైద్యనాధుడి పరిస్థితి గమనించిన సహదేవుడు అతని చాతి నిమరి, "అయ్యా! మీ బాధకి ఏ ఔషధం వాడాలో చెబితే తక్షణం తీసుకు వస్తాను. మీకు ఉపసమనం కలుగుతుంది."అన్నాడు.

బాధ భరించలేకపోతున్న వైద్యనాధుడికి అప్పుడే తన తప్పు తెలిసివచ్చింది. ఇంకే వైద్యుడ్ని ఊళ్ళో ఉండనియ్యకపోవడమే కాక, తనెవ్వరికీ వైద్యం నేర్పలేదు. వైద్య విద్యనభ్యసించాలని వచ్చిన సహదేవుడ్ని పనివాడిలా చూసుకున్నాడేగానీ వైద్యం గురించి ఏమాత్రం చెప్పలేదు. అంతేకాక, అతనెక్కడ గమనిస్తాడోనని ఔషధాలు, లేహ్యాలన్నీ తను రహస్యంగా చేసేవాడు. అందుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించవలసి వస్తోందని బాధపడ్డాడు.

సహదేవుడ్ని దగ్గరికి పిలిచి, "నాకు వచ్చిన ఈ గుండెనొప్పిని నయం చేయడానికి ఇంట్లో ఔషధం తయారుగాలేదు. ఇప్పుడిక చేసేదేమీ లేదు. నీకు వైద్యం నేర్పనందుకు భగవంతుడు నాకు తగిన శాస్తి విధించాడు." పశ్చాత్తాపపడుతూ చెప్పాడు. అదివిని అతని భార్య కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

అప్పుడు సహదేవుడు, "బాధపడకండి. మీరు చెప్పండి ఏఏ మూలికలు ఏ పాళ్ళలో వాడాలో. నేను వెంటనే ఔషధం తయారు చేస్తాను. మీకు తప్పక నయమవుతుంది." అతని చాతీ నిమురుతూ అన్నాడు.

బాధని పంటి బిగువుతో భరిస్తూనే వైద్యనాధుడు సహదేవుడికి గుండెనొప్పికి వాడవలసిన మూలికలు, మందుల పాళ్ళు, తయారు చేసే విధానం తెలిపాడు. గురుకులంలో చదువుకున్నందున అతను చెప్పినవి బాగా గ్రహించి కొద్దిసేపులోనే కావలసిన ఔషధం తయారు చేసి ఇచ్చాడు. ఆ ఔషధం సేవించిన తర్వాత కాస్త స్థిమితపడ్డాడు వైద్యనాధుడు. మెల్లిగా గుండెనొప్పి తగ్గసాగింది. రెండురోజుల అనంతరం వైద్యనాధుడికి పూర్తిగా నయమై లేచి తిరగగలిగే స్థితికి వచ్చాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత వైద్యనాధుడికి తన తప్పు తెలిసొచ్చింది. ఆ రోజునుండే సహదేవుడికి వైద్యవృత్తి నేర్పడానికి సంకల్పించాడు. మంచి గ్రహణ శక్తిగల సహదేవుడు త్వరలోనే వైద్యంలో రహస్యాలన్నీఆకళింపు చేసుకున్నాడు. వైద్యనాధుడివద్దే ఉండి అతనికి సహాయం చేస్తూ అక్కడికి వచ్చిన రోగులకు మందులందిస్తూ గురువుకి తగ్గ శిషుడనిపించుకున్నాడు. వైద్యనాధుడు కూడా పూర్తిగా పరివర్తన చెంది రోగులనుండి వాళ్ళు ఇచ్చుకోగలిగినంత డబ్బులు మాత్రమే పుచ్చుకోసాగాడు. డబ్బులు ఇవ్వలేని పేదలకు ఉచితంగా వైద్యం చేసి మంచి వైద్యుడిగానే కాక, మంచి వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ