కోడలి యిల్లు - S Sridevi

Daughter-in-law's home

కోడలి యిల్లు "నా పేరు హైమవతి. నేను మా కోడలి యింట్లో వుంటాను. కోడలి భర్త మంచివాడేగానీ భార్యకి ఎదురు చెప్పలేని పిరికివాడు. నన్ను చూసినప్పుడు తప్పు చేసినట్లు తప్పించుకు తిరుగుతాడు. ఇంక కోడలి యిల్లు... ఆ అమ్మాయి అత్తగారు ఇరవైలక్షలు డౌన్ పేమెంటు చేసి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకుంటే భర్త లోను తీసుకుని కొనుక్కున్నాడు. రెండు పడగ్గదుల ఫ్లాట్ . మొదట్లో ఓ పడగ్గదిలో నేనుండేదాన్ని. ఇప్పుడు నా పడక హాల్లోకి మార్చారు. అదికూడా వాళ్లకి ఇష్టం లేదు. నా దారి నేను చూసుకోవాలని వాళ్ల కోరిక" అరవయ్యేళ్ల ఆ స్త్రీ నిర్వికారంగా చెప్తుంటే ఆశ్చర్యంగా వింది ప్రసన్న. మార్నింగ్‍వాక్ పూర్తిచేసుకుని కూర్చుందామని చుట్టూ చూస్తే ఎక్కడా ఒక్క బెంచీకూడా ఖాళీగా లేదు. ఆమె ఒక్కతే ఉండటం చూసి అదే బెంచీమీద మరో చివరకి కూర్చుంది. పక్కని ఒక వ్యక్తి అలా వచ్చి కూర్చోవడాన్ని కూడా గమనించనంతగా తల వెనక్కి వాల్చి ఆలోచనలో వుంది. కట్టుకున్న చీర పాతబడి రంగు వెలిసినా చదువుకున్నవాళ్ళ ముఖంలో వుండే వర్చస్సు కనిపిస్తోంది. మెడలో సన్నటి గొలుసు, చేతులకి ఒకొక్క గాజు. జుత్తు తెలుపూనలుపుల కలనేతలా వుంది. ముడి వేసుకుంది. ఏదో కష్టంలో వుందనిపించింది. లేకపోతే వరస కష్టాలు తెచ్చిన నిర్వేదంలో. నెమ్మదిగా లేచి చుట్టూ ఒకమాటు చూసి పమిటచెంగుతో చుట్టి పట్టుకున్న పేకెట్టు తెరిచి అందులోని ఇడ్లీ తిని పేపర్ని డస్ట్‌బిన్‍లో వేసి, పంపుదగ్గర నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ తనచోట్లో కూర్చుంది. "ఎక్కడుంటారు?" మాట కలిపింది ప్రసన్న. అప్పుడు చెప్పింది హైమవతి, కోడలి యింటి సంగతి. విషయాన్ని కొంచెం తార్కికంగా విశ్లేషించింది ప్రసన్న. కొడుక్కి పెళ్ళవకముందు తల్లీకొడుకులు కలిసి ఒక ఇల్లు కొనుక్కున్నారు. పెళ్ళై కోడలొచ్చాక ఈమెని పరాయిదానిగా చూస్తున్నారు. తన యింట్లోనే తను పరాయిగా వుంటోందన్నమాట. కొన్ని పరిచయాలు చాలా చిన్నవైనా మనసుని ఎక్కడో తాకుతాయి. స్నేహానికీ, దయకీ, మరో శాశ్వాతమైన బంధానికీ దారితీస్తాయి. ఒక నిర్వేదమైన జీవితాన్ని గడుపుతోంది ప్రసన్న. మామగారు పేరుమోసిన ప్లీడరు. ఆయన వారసత్వాన్ని తీసుకున్నాడు భర్త. అతన్ని కోరి చేసుకుందామె. ‌పెళ్ళయాక తనూ లా చదివింది. మొదట్లో ముగ్గురూ, తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాక్టీసు చేసారు. సంపాదించుకున్నారు. ప్రసన్న భర్తకి అన్నదమ్ములు లేరు. అతనొక్కడే కొడుకు. వీళ్ళకి ముగ్గురు కొడుకులు. ముగ్గురూ మంచి చదువులు చదువుకున్నారు. విదేశాల్లో వుంటున్నారు. విజయాన్ని శ్వాశిస్తూ వున్నంతకాలం తెలియలేదు, అదికూడా చివరికి మిగిల్చేది నిర్వేదమేనని. ప్రసన్న భర్త పోయాడు. మూడేళ్ళైంది. ఆమెకి ప్రపంచం ఆగిపోయినట్టైంది. అప్పుడు గుర్తొచ్చాయి మామగారి మాటలు-"మన దగ్గర అవసరానికి మించిన డబ్బుందంటే ఇంకెక్కడో డిప్రవైజేషన్ జరిగిందని అర్థం. ఈ అసమతుల్యతని మనం సరిదిద్దలేం కానీ, తోటివారి పట్ల కొంత దయ, కరుణ చూపిస్తే ఎంతో కొంత పరిహారమౌతుంది"అని. ఆయన తనదైన ఒక పద్ధతిలో బతికాడు. డబ్బున్నవాళ్ళ దగ్గర ఎక్కడా రాజీపడకుండా నిక్కచ్చిగా ఫీజులు తీసుకునేవాడు. లేనివాళ్ళని కోర్టుదాకా రానివ్వకుండానే వివాదం సర్దుబాటు చేసే ప్రయత్నం చేసేవాడు. డబ్బున్నవారికి మాట నెగ్గడం దగ్గర, ఎదుటివాడిని ముంచడం దగ్గర వివాదాలొస్తాయి. ఓడినవాడు బాహాటంగానూ, గెలిచినవాడు ఇంట్లోనూ ఏడ్చేంతవరకూ సాగుతాయి ఈ వివాదాలు. లేనివాడి వివాదం జీవన్మరణ సమస్య. ఆయన కొడుకు తరం వచ్చేసరికి వృత్తిలో ఈ వ్యక్తిగతస్పర్శ ఎక్కడో తప్పిపోయింది. పెళ్ళితో ఒకసారి మారిన ప్రసన్న జీవితం అతను పోయాక మరోసారి మార్పుని కోరుకుంది. కలిగిన ఇంట్లో పుట్టింది. కోరుకున్న చదువు చదువుకుంది. నచ్చినవాడిని చేసుకుంది. మరో సిరిమంతుల ఇల్లు మెట్టింది. ఇంకా సంపాదించుకుంది. పిల్లల్ని కంది, పైకి తెచ్చుకుంది. మామగారు చెప్పిన అసమతుల్యతని సరిచేసే ప్రయత్నంఎప్పుడూ చెయ్యలేదు. ఇప్పుడు... అంటే బాధ్యతలన్నీ తీర్చుకున్నాక అదొక వెల్తిలా అనిపిస్తోంది. అలాంటి వెల్తిని నింపుకోవటానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు హైమవతి కలిసింది. ప్రసన్ననుండీ వచ్చిన చిన్న పలకరింపుకే హైమవతి కదిలిపోయింది. కళ్ళముందు కొన్నేళ్ళుగా జరిగిన విషయాలన్నీ మెదిలాయి. పొరలుపొరలుగా పోగుపడ్డ బాధంతా వెలికి వచ్చింది. కళ్ళు చెమర్చాయి. *** పుట్టుక, చదువు, పెళ్లి అన్నీ సవ్యంగానే జరిగాయి హైమవతికి. తండ్రిది చిన్న వుద్యోగం. తను, తమ్ముడు... డిగ్రీదాకా చెప్పించి పెళ్లి చేసాడు. భర్త బియ్యే బియ్యీడీ చేసాడు. గవర్నమెంట్ వుద్యోగం లేదు. ప్రైవేటు స్కూల్లో చేసేవాడు. "చదువుకున్నావుకదా, వుద్యోగానికి ప్రయత్నించు. లేకపోతే ఎదుగుదల లేకుండా ఇలాగే వుండిపోతాం" అన్నాడు. తనకేదో అయాచిత వరం దొరికినట్టే అయింది. ప్రయత్నం చెయ్యగా చెయ్యగా స్టేట్ గవర్నమెంటులో క్లర్కు వుద్యోగం వచ్చింది. అతను అలాగే వుండిపోయాడు. ఇద్దరిమధ్యా ఎలాంటి అర అమరికలు లేవు. జీతం తెచ్చి తనకిచ్చేవాడు. ఇల్లు తను నడిపేది. మాటలనుకోవడాలు, గాయపరుచుకోవడాలు లేవు. చాలా సౌహార్ద్రంగా, సామరస్యంగా సాగింది జీవితం. పెళ్లైన మూడేళ్లకి సతీష్ పుట్టాడు. "ఒక్కడు చాలు. వీడిని సవ్యంగా పెంచి ఏ లోటూ లేకుండా పెద్ద చేస్తే మన బతుకులు తరించినట్టే" అన్నాడు భర్త. అతనేం చెప్పినా సరిగ్గా చెప్తాడు. కొడుకు ఇంటరుకి వచ్చేదాకా వొడిదుడుకులు లేకుండా సాగిపోయింది. సతీష్ ఇంటరుకి రావటం, భర్తకి కేన్సర్ బయటపడటం ఒక్కసారి జరిగాయి. బతుకు కూకటివేళ్ళతో సహా కదిలిపోయినట్టు అనిపించింది. అతను వుద్యోగం వదిలెయ్యక తప్పలేదు. తనకి జీతం నష్టంమీద సెలవులు... అతని వైద్యం, సతీష్ చదువు... ఖర్చులు జోడుగుర్రాలమీద సవారీ చేసాయి. మూడేళ్ళకి అతను చనిపోయాడు. ఉండేది అద్దె ఇంట్లో కావటంతో అతన్ని ఇంటికి తీసుకురానివ్వలేదు. అదొక పెద్ద దెబ్బ. అతని మరణంకన్నా ఎక్కువగా బాధించిన దెబ్బ. అందులో ఇంటివాళ్ళని తప్పుపట్టే అవసరం లేదు. అందరూ ఏవో ఒకలాంటి సాంప్రదాయపు సంకెళ్ళలో ఇరుక్కుని వున్నవాళ్ళే. తనుగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ, ఎదుటివారిని ఇంకొన్నిటిని మానమనటం తప్పు. హాస్పిటల్‍నుండి అటే పితృవనానికి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత రెండేళ్ళకి సతీష్ చదువై వుద్యోగం వచ్చింది. భర్త వైద్యానికీ, సతీష్ చదువుకీ బోల్డన్ని అప్పులయాయి. తలకి మించిన భారంలా ఎంత వచ్చినా అప్పులకే సరిపోతుంటే తప్పదన్నట్టు వాలంటరీ రీటైర్‍మెంటు తీసుకుని అప్పులన్నీ తీర్చి, వూపిరి పీల్చుకుంది. ఇంకొంత మిగిలితే అది డౌన్‍పేమెంటు చేసి కొడుకుని లోన్ తీసుకొమ్మని ఫ్లాట్ కొంది. జాయింట్‍లో. తెలిసినవాళ్ళ ద్వారా సంబంధం చూసి కొడుక్కి చేసింది. అది పెద్ద తప్పు. అప్పటికి తనింకా తేరుకోలేదు. బాగా నలిగిపోయింది. విరక్తిలో వుంది. కుటుంబంమీద పట్టులేనప్పుడు వాళ్ళ పెళ్ళి చేసింది. తన స్థానాన్ని జటిలం చేసుకుంది. ఏ ఆడపిల్లేనా అత్తింట్లో సుఖపడాలనుకుంటుంది. ఆపైన పద్మలో కొంచెం చెడ్డతనం వుంది. ఉన్నదంతా తనదేననుకోవటం. గొడవ... సన్నసన్నగా మొదలైంది. మీకెవరూ లేరా? ఇంకెక్కడా ఆస్తుల్లేవా? అందరికీ పల్లెటూళ్ళలో ఇళ్ళూ అవీ వుంటాయికదా? మీకెందుకు లేవు? పెళ్ళయ్యాక వెళ్ళిపోతారనుకున్నాను... అంటూ ప్రశ్నలు. ఇదేమిటి, ఇలా మాట్లాడుతోంది? తను ఎక్కడికో వెళ్ళటమేమిటి? ఉన్నది ఒక్క కొడుకు. వాడిదగ్గర కాకపోతే ఇంకెక్కడ వుంటుంది? ఐనా మనసులో ఏదో గిల్ట్. నిజమే ! రెండు బెడ్రూంల ఫ్లాట్‍లో కొత్తగా పెళ్ళైనవాళ్ళమధ్య తనకీ ఇబ్బందిగానే వుంది. అందులోనూ పద్మకి పడగ్గదికీ హాలుకీ తేడా వుండదు. అలాగని ఎక్కడికి వెళ్తుంది? అయోమయం. కొడుకు పూర్తిగా అటు తిరిగిపోయాడు. తనతో మాట్లాడడు. ఎదురుపడితే తలొంచుకుని వెళ్ళిపోతాడు. మాట్లాడితే కోడలు వూరుకోదు. క్రమక్రమంగా పరాధీనత... ఆరోగ్యంగా వున్న శరీరాన్ని వశపరుచుకుంటున్న వ్యాధిలా. తన పడక హాల్లోకి మార్చారు. కోడలి తల్లిదండ్రులు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళకోసం ఆ గది. ఆ గదిలో కూర్చుని సూటీపోటీ మాటలంటారు. కూతురితో కలిసి మంతనాలాడతారు. వియ్యపురాలి ఇల్లు వాళ్ళకి స్వంతం. స్వతంత్రం. తను ఇంట్లో తిరిగితే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని హేళనగా నవ్వుతారు. హాల్లో అర్ధరాత్రిదాకా టీవీ మోగుతునే వుంటుంది. టీవీ లైట్లు ఆఫ్ చేసి గదిలోకి వెళ్తే అప్పటికి తనకి నిద్ర. అప్పటిదాకా బాల్కనీలో చాప వేసుకుని కాసేపు వరిగితే అలాగే తనని వదిలేసి తలుపు గడియ పెట్టేస్తుంది. భర్త వినేలా- "మంచి నిద్రలో వున్నారు. అందుకే లేపలేదు" అంటుంది. ఇలాంటి మనుషులుంటారా అనే ప్రశ్న. తనకి ఇలాంటివి తెలియదు. అత్తగారిని స్వంతతల్లిలా చూడకపోవచ్చుగానీ ఎప్పుడూ అవమానించలేదు. ఎప్పుడు చచ్చిపోతావని అడగలేదు. ఎలా తిరగబడాలో అర్థమవలేదు. అవికూడా కుటుంబసాంప్రదాయంగానే రావాలేమో! వియ్యపురాలు పరమగయ్యాళీ. వియ్యంకుడు మాట్లాడగా తనెప్పుడూ చూడలేదు. ఈ క్రమంలోనే కొడుక్కి ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలని తనదగ్గరకి రానివ్వదు. ఖర్చు పెరిగిందట. అదొక గొడవ. పొద్దున్న టిఫెను పెట్టదు. అందరూ తినేసాక హాట్‍‍పాక్‍ చక్కగా మూతపెడుతుంది. అందులో మిగిలి వుందనే నమ్మకం భర్తకి కలిగేలా. ఒకటిరెండుసార్లు తనే మోసపోయింది. బాక్స్ తెరిచి చూస్తే ఏముంది? ఖాళీ. మధ్యాన్నం భోజనంకూడా అంతే. టిఫెన్ అరిగాక నెమ్మదిగా ఏ రెండింటికో పిల్లలకి పెట్టి తను తింటుంది. ఆ తర్వాత తను తినాలి. మూతలేనా పెట్టకుండా వదిలేసిన చాలీచాలని పదార్ధాలు... ఎంగిళ్ళే కలిసాయో... అన్నంకూడా అడుగూబొడుగూ. తిండీ నిద్రా లేకుండా బతకడం ఎలా? సంకోచిస్తూనే అవకాశం చూసుకుని కొడుకుతో పరిస్థితి చెప్పింది. అతను చుట్టూ చూస్తూ భయపడుతూ వినీవిననట్టు విన్నాడు. భార్యకి చెప్పినట్టున్నాడు. మర్నాడు నిండు గిన్నెలన్నీ అతనికి చూపించింది. ఒట్లు పెట్టింది. అతను నమ్మాడు. తననే అపనమ్మకంగా చూసాడు... నువ్వు ఇలాంటిదానివా అని. పరిస్థితి మరింత దిగజారింది. వంట్లో అస్వస్థత మొదలైంది. అప్పుడు మొదలుపెట్టింది, చెవులవి అమ్మేసి హోటల్లో తినడం... లెక్కగానే. ఎలా చేరిందో కోడలికి వుప్పందింది. ఇంక రకరకాల మాటలు. బీరువాలకి తాళాలు వేసుకోవటం, అడిగినవాళ్ళకీ అడగనివాళ్ళకీ చెప్పటం...దొంగతిళ్ళు తింటుంది, చిల్లరకొట్లకి అలవాటు పడింది, ఇంట్లో వండినవి పనికిరావని ప్రచారం. "ఎందుకమ్మా, ఇలా పరువు తీస్తున్నావు? తను వండిపెట్టినవేవో తినచ్చుకదా?" అన్నాడు కొడుకు. "సరే. ఇప్పట్నుంచీ నీతోపాటే నాకూ పెట్టమను. ఇద్దరం కలిసి తిందాం. మధ్యాన్నంకూడా భోజనానికి ఇంటికి రా" అంది తను. అతను ఇంకేం మాట్లాడలేదు. తెలియనివాడికి చెప్పచ్చు. తెలిసినవాడికి చెప్పచ్చు. తెలిసికూడా తెలియనట్టు నటించేవాడికి చెప్పలేరు. "ఆ గొలుసూ గాజులూ లాక్కో. అమ్ముకుని తినేస్తుంది" అంది కోడలు. తనకి వినిపించేలాగే. "అవి గిల్టువి. నాన్న పోయినప్పుడు అన్నీ అమ్మేసింది" అన్నాడు కొడుక్కూడా తనకి వినిపించేలాగే. అవి తనకొక సంకేతంలా అనిపించాయి. గొలుసూ గాజులూ తీసి దాచేసుకుని గిల్టువి కొనుక్కుని వేసుకుంది. ఇంకో జత అదే షాపులో కొని ఏసిడ్ పోసి కడిగి మర్చిపోయినట్టు బాత్‍రూమ్‍లో వదిలేస్తే అప్పుడు చల్లబడింది కోడలు. ఎవరికేనా చెప్పుకున్నా నమ్మరేమో! నమ్మినా ఏం చేస్తారు? జాలి చూపిస్తారు. అంత తెలివితక్కువగా ఎలా చేసుకున్నావని కోప్పడతారు. మరీ దగ్గరవాళ్ళైతే వందో యాభయ్యో చేతిలో పెడతారు, ఖర్చులకి వుంచుకొమ్మని. దాంతో పరిస్థితి చక్కబడుతుందా? స్వంత అన్నే పరిస్థితి తెలిసి, విసుక్కున్నాడు- ఇలా ఎలా చేసుకున్నావు, అలాంటి సంబంధం ఎలా చేసుకున్నావని. **** మధ్యరాత్రి వంటిగంట. బాగా దాహం వేసి మెలకువ వచ్చింది హైమవతికి. నెమ్మదిగా లేచి, వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి వస్తుంటే కోడలి గదిలోంచి మాటలు వినిపించాయి. కొడుకు గది, తన యిల్లు అనుకోవడం మర్చిపోయి చాలా కాలమైంది. తను పడుక్కున్నా మెలకువ వచ్చి లేచి వినాలన్నట్టు మాటలు గట్టిగానే వస్తున్నాయి. "ఇంకెంతకాలం ఈ ముసలిదాన్ని భరించాలి? పాపీ చిరాయువన్నట్టు ఇలాంటివాళ్ళకి చావుకూడా రాదు. మన మధ్య తనెందుకు? దరిద్రపు మొహం చూస్తేనే చిరాకేస్తోంది" అంటోంది కోడలు... తన గురించే. మా అమ్మని గురించి అంత అమర్యాదగా మాట్లాడతావేమిటి? అనటం కొడుక్కి అలవాటు తప్పింది. "ఆవిడకి వున్నదే ఒక్కడిని. ఎక్కడికి వెళ్తుంది చెప్పు?" బుజ్జగిస్తూ అన్నాడు కొడుకు. "ఎక్కడికేనా పోనీ . ఏదేనా ఓల్డేజి హోంలో వదిలెయ్. నాకనవసరం. నేనూ నువ్వూ పిల్లలు... ఇంట్లో ఇంకవరూ వుండకూడదు" "పెన్షను వాడుకుంటునే వున్నాంకద పద్మా? " "ముసల్ది పోతే నీకొస్తుంది" "నాకు ఇవ్వరు" "నీ మొహం. నీకేం తెలుసు? ఫామిలీ పెన్షను ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళకి వస్తుందట. మా అమ్మ చెప్పింది" అంత బాధలోనూ నవ్వొచ్చింది హైమవతికి ఆ తెలీనితనానికి. "పొమ్మని మొహమ్మీద చెప్పినా సిగ్గులేకుండా చూరుపట్టుకుని వేలాడుతోంది.... అసలు మన పెళ్లయాక తనే పోతుందనుకున్నాను. సిగ్గూ శరం లేని మనిషి... కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య తిష్ట వేసుక్కూర్చుంది ..." "..." "నేనింత మాట్లాడుతుంటే నువ్వసలు పట్టించుకోవేంటి సతీష్? ఆ తల్లికి పుట్టిన మనిషివేగా? పౌరుషం అనేది వుంటే భార్యాభర్తల మధ్య మరో మనిషి వుంటే కాపురం చేసేవాడివి కాదు" " ఏం మాట్లాడను?" "ఔను... నువ్వేం మాట్లడతావు?... మాట్లాడవుకదా?... ఇలాగే మాట్లాడకుండా వూరుకో. ఏం చెయ్యాలో నేనే చేస్తాను. ఆమెని పంపిస్తేగానీ నాకు మనశ్శాంతి లేదు. నువ్వుగానీ కలగజేసుకున్నావో, పిల్లలిద్దరికీ విషమిచ్చి, నేను మింగుతాను. అప్పుడు మీరిద్దరూ చిప్పకూడు తిందురుగాని" రాబోతున్న నిట్టూర్పు ఆపుకుంది హైమవతి. వెచ్చని కన్నీళ్ళు కనుకొలుకులలోంచీ జారి చెంపలమీదుగా జుత్తులో పడి ఇంకుతున్నాయి. ఇంక నిద్ర పట్టలేదు. తెల్లారితే మరో ప్రళయం వుంటుందన్న ఆలోచన వణికిస్తోంది. ఒకవైపు షుగరు, మరోవైపు బీపీ... పోషణ లేక కృశించిపోతున్న దేహం... భగవంతుడా! బతుకు ఇలాగైందేమిటన్న ఆవేదన అన్నిటినీ మించి. అరవయ్యైదేళ్ళ జీవితచిత్రం అస్తవ్యస్తంగా మనోనేత్రం ముందు ఆవిష్కృతమౌతుంటే దాన్ని పట్టి నిలిపే ప్రయత్నం చేసింది. *** "కొడుకు టూరుకి వెళ్ళాడు. నేను బయటికి వచ్చిన టైం చూసుకుని కోడలు ఇంటికి తాళం వేసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది" అంది. అంటుంటే హైమవతి గొంతు వణికింది. ఇంత అమానుషమా? ప్రసన్నకి చాలా కోపం వచ్చింది. "మీకు పోరాడే ఓపిక వుందా?" అడిగింది. "కట్టుబట్టలతో రోడ్డుమీద నిలబడ్డాను. ఇంక పోయేదేం వుంది? పోలీస్ కంప్లెయింటు ఇవ్వాలనుకుంటున్నాను... ఏ గొడవా లేకుండా చచ్చిపోతే సరిపోతుందనీ అనిపిస్తుంది" "నాతో రండి. నేను అడ్వకేట్‍ని. మావారు చనిపోయి మూడేళ్ళైంది. ప్రాక్టీసు వదిలేసాను. మళ్ళీ మీకోసం నల్లకోటు వేసుకుంటాను " అంది ప్రసన్న హైమవతి రెండో నిర్ణయానికి చలించి. "ప్రస్తుతం నాదగ్గిర డబ్బేమీ లేదు. మీకు టైపింగ్ చార్జెస్ ఇవ్వాలన్నా నాకు కొంచెం టైం పడుతుంది. పెన్షన్ బుక్, దానికి సంబంధించిన బేంకు పాస్‍బుక్, ఏటీయమ్ కార్డు వాళ్ళ దగ్గిరే వున్నాయి. ఇదుగో, వంటిమీద కొద్దిగా బంగారం వుంది. వాళ్ళు తిండి పెట్టరు. ఒకొక్కటీ అమ్ముకుని తింటున్నాను. ఇంకో వస్తువేదైనా అమ్మినప్పుడు మీకు కొంత ఇవ్వగలను. నాకో దారి చూపించండి" అంది హైమవతి. ఆమె మాటల్లో చాలా కచ్చితత్వం వుంది. "ముగ్గురు పిల్లలు. విదేశాల్లో స్థిరపడ్డారు. యువతకి ఒక పాఠం నేర్పించాలనే మీ కేసు వప్పుకున్నాను. డబ్బుకోసం కాదు. ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి " చిన్నగా నవ్వి, అంది ప్రసన్న. *** సతీష్ కేంపునుంచీ తిరిగొచ్చాడు. ఫ్లాటు తాళం వేసి వుంది. పద్మ పిల్లల్తో పుట్టింట్లో వెళ్ళానని చెప్పింది. మరి అమ్మ? అతనికి దిగ్గుమంది. అన్నంత పనీ చేసిందా, తన భార్య? అమ్మని వెళ్ళగొట్టేసిందా? తాళంకూడా తియ్యకుండా అక్కడే చెప్పుల స్టాండుమీద కూలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళుంటుంది అమ్మ? తనెందుకు పద్మని ఎదిరించలేకపోతున్నాడు? అదుపు చెయ్యలేకపోతున్నాడు? పిల్లలు తనకే కాదు, ఆమెకీ పిల్లలే. చంపుకుంటుందా? చంపుకోనీ. ఆమే చస్తుందా? చావనీ. వాళ్ళ చావులకి కారణం చేసి జైలుకి పంపిస్తుందా? పంపించనీ. కేసులు పెడుతుందా? పెట్టనీ. ఎందుకు భయపడుతున్నాడు తను? తనతోపాటు అమ్మా వుంటుందనా? అమ్మకి మేలు చెయ్యకపోయినా కీడు చెయ్యకూడదనా? కానీ ఇవేవీ జరగవు. చేస్తానని భయపెడుతుంది. కొండచిలువ కౌగిలించుకున్నట్టు వుంటుంది ఆమెతో సహచర్యం. లొంగిపోవటమే తప్ప వదిలించుకోవడం వుండదు. "సార్!" అపార్ట్‌మెంటు వాచ్‍మెన్ పిలుపు. "మీకు రిజిస్టర్ లెటరొచ్చిందట. పోస్ట్‌మేన్ ఈ చిట్టీ ఇచ్చి వెళ్ళాడు. రేపు మళ్ళీ తీసుకొస్తాడట. లేదంటే నాలుగింటిలోపు పోస్టాఫీసుకు వెళ్ళినా ఇస్తాడట" అతను ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తనకి రిజిస్టర్ లెటరా? ఎక్కడినుంచి? ఎవరు పంపిస్తారు? టైం చూసుకున్నాడు. ఇంకా నాలుగవ్వలేదు. పక్క వీధిలోనే పోస్టాఫీసు. వెళ్ళి తెచ్చుకుని వచ్చాడు. లీగల్ నోటీసు. ప్రసన్నలక్ష్మి అనే లాయరు ఇచ్చింది. తనకి ఎందుకు వచ్చిందో అర్థమవలేదు. దాని వెనుక ఎవరున్నారో వూహించేంతగా ఆలోచన విస్తరించలేదు. కవరు తెరిచి అందులోని కాగితాలు బయటికి తీసాడు. సతీష్ అనబడు అతనూ, అతని భార్యా తన క్లయంటును బాగా హింసించి, ఇంట్లోకి రాకుండా నిరోధించారనీ, ఆమె పెన్షనుకి సంబంధించిన కాగితాలు, డబ్బు అన్నీ అక్రమంగా దగ్గర పెట్టుకున్నారనీ, ఇకపై వారితో కలిసి వుండటం సాధ్యం కాదుకాబట్టి విడిగా వుండాలనుకుంటోందనీ, ఆమె పెన్షను కాగితాలు, డబ్బుతో పాటుగా ఇంటికి జాయింటు ఓనరు కాబట్టి ఇంటివిలువలో సగభాగం ఆమెకి తక్షణం అందజెయ్యాలనీ... దాని సారాంశం. చదవటం పూర్తయేసరికి సతీష్ నుదుట చెమటపట్టింది. అతనికి ఆ క్షణాన కలిగిన ఆలోచన భార్య దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందని. అమ్మ ఇలా చేసిందేమిటి? సర్దుకుపోతోందనుకున్నాడు. ఇప్పుడుకూడా ఏ గుళ్ళోనో రెండురోజులు గడిపి తిరిగొస్తే ఎలాగో ఒకలా పద్మకి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళేవాడు. లేకపోతే ఓల్డేజిహోమ్‍లో చేర్చేవాడు. ఇదేంటిలా? అమ్మంటే సర్దుకుపోవటం, త్యాగం అని ఏవేవో చెప్తారు, కొడుకు జీవితానికి ఇంత సమస్యగా మారింది? అతనికి అంతు చిక్కలేదు. కొండచిలువ పరిష్వంగంలో వున్నవాడు ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తున్నాడు. వెంటనే రమ్మని పద్మకి మెసేజి పెట్టాడు. ఆమె రావటం, చిందులు తొక్కడం అయింది. "ఎలాగో ఒకలాగ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తర్వాత చూసుకుందాం. అంతేగానీ నెల తిరిగేసరికి వచ్చిపడే డబ్బు వదులుకుంటామా, ఇల్లమ్మి వాటా ఇస్తామా? ముసల్దానికి బుర్రలేకపోతే నాకు లేదా? ఆ లాయరేమైనా దీని చుట్టమా? డబ్బుకోసం కేసు తీసుకుంది మనం ఇంకాస్త పడేస్తే మనవైపు తిరుగుతుంది" అంది చివరికి. తండ్రిది ప్రైవేటు వుద్యోగం. రిటైరయ్యాక కూడా అక్కడా ఇక్కడా చేస్తునే వున్నాడు. అత్తగారికి కూర్చోబెట్టి పెన్షను ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అసూయ... ఇంటికి తీసుకొచ్చి నాలుగురోజులు తిండి పెట్టకుండా గదిలో పడేసి తాళం పెడితే తాడో పేడో తేలిపోతుంది. కాస్త లంచం పడేసి ఆ పెన్షను భర్త పేరుమీద మార్చుకోవచ్చని ఆలోచన. తండ్రి తిమ్మిని బొమ్మీ, బొమ్మిని తిమ్మీ చెయ్యగలడని ఒక నమ్మకం. *** ప్రసన్న ఇంట్లో ఔట్‍హౌస్‍లో తాత్కాలికంగా వుంటోంది హైమవతి. ప్రసన్న మామగారు వున్నప్పుడు పొరుగూళ్ళనుంచీ వచ్చే కక్షిదారులకోసం ఆయన కేటాయించిన గదులవి. వృద్ధాశ్రమంలో వెళ్ళి వుంటానంటే వద్దంది ప్రసన్న. "మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని మీ కొడుకూ కోడలూ చాలా వత్తిడి చేస్తారు. ఇంకా వేరేవాళ్ళ చేత కూడా చెప్పిస్తారు. ఎవరూ లేకుండా వంటరిగా వుండటంకన్నా ఇక్కడ వుండటమే మంచిది. " అంది. "కేసు వెనక్కి తీసుకోవటమంటే నా చావుని నేను కొని తెచ్చుకోవటమే. ఇక్కడికే సర్వభ్రష్టుడయ్యాడు వాడు. ఇంక జైలొక్కటే మిగిలింది" అంది. ఆమెది మాతృహృదయమే. ఎలా బాధపడాలో, అలాగే బాధపడింది. తండ్రి పోయినప్పుడు "ఇకమీదట ఎలా బతుకుతామే?"’ అని తనని పట్టుకుని ఏడ్చినవాడే... అన్నీ తను చూసుకుంటే తన వెనుక నిలబడినవాడు... పెళ్ళవగానే భార్య తనకన్నా బలంగా అతన్ని రక్షించగలదనుకున్నాడేమో, ఆమె వెనుక నిలబడిపోయాడు. గుండెల్లో ఆవేదన. అతనికి గుణపాఠం తనే నేర్పాలి. ఈ గుణపాఠంలోంచీ బతుకు పాఠం నేర్చుకోవాలి. ప్రసన్న అన్నట్టుగానే సతీష్, పద్మ వచ్చారు. ఒక లాయరు ఇంట్లో ఆవిడకి ఆశ్రయం దొరుకుతుందని ఇద్దరూ అనుకోలేదు. వస్తూనే పద్మ వలవల ఏడుస్తూ హైమవతి కాళ్ళమీద పడింది. "నన్ను క్షమించండి అత్తయ్యా! చాలా తప్పు చేసాను" అని గట్టిగా చెంపలు వేసుకుంది. "ఇంటికి వచ్చెయ్యండి. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను" అంది. "తప్పు చేసానని వప్పుకున్నావు. సంతోషం. నీ భర్తనీ పిల్లల్నీ జాగ్రత్తగా చూసుకో ఇకమీదైనా" అంది సహనంగా. "అదేంటి? మీరు రారా?" అంటోన్న ఆమె ప్రశ్న పట్టించుకోకుండా కొడుకుని అడిగింది, " నా పేపర్లు తెచ్చావా?"’ అని. అతను జవాబివ్వలేదు. తలదించుకున్నాడు. "ఎందుకురా, ఇలా పరువు తీసుకోవడం నీకు అవసరమా? " అంది బాధగా. "ఐతే మీరు రానంటారా?" కొంచెం గట్టిగానే అడిగింది పద్మ. "పోలీస్ కంప్లెయింటు ఇచ్చి మీడియా ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. నేను అడుగుతున్నది ఛారిటీ కాదు, నా హక్కు. నాయింట్లో నా డబ్బుతో నేను గౌరవంగా బతికే హక్కు" అంది హైమవతి స్థిరంగా... కొడుకుతో. అతను నివ్వెరపోయాడు. అమ్మ... అమ్మ ఇలాకూడా ప్రవర్తిస్తుందా? తనకన్నా, డబ్బు ముఖ్యమా? పెన్షను తనే వుంచుకుని ఏం చేసుకుంటుంది? ఒక ఇంట్లో వుండే మనుషుల మధ్య ఇన్ని లెక్కలా? ఆ ఫ్లాట్‍లో ఆవిడకి వాటా కావాలా? ఇద్దరూ ఒకటే అనుకున్నాడు తను. ఆవిడలో ఇంత బేధభావమా? అమ్మ అనగానే త్యాగానికి బ్రాండ్‍అంబాసిడర్ అని అనుకునేవారిలో అతనూ వున్నాడు. షాక్‍లోంచీ తేరుకోలేకపోతున్నాడు. పద్మకీ షాగ్గానే వుంది. పెళ్ళి చేసుకుని వచ్చినది తన యిల్లు. అత్తదే అవనీ. ప్రతి పైసా తన చేతిలోకి కచ్చితంగా తన చేతిలోకి రావాలి. అత్తేనా, భర్తేనా, తను పెడితే తినాలి, తిడితే పడాలి, కుక్కిన పేలలా పడుండాలి. పెళ్ళి చేస్తూ తన తల్లి తనకి చెప్పినది ఇదే. పుట్టింట్లో తను నేర్చుకున్నదీ ఇదే. నాయనమ్మ ఆస్తంతా కొడుక్కి రాసిచ్చి, ఇంటెడు చాకిరీ చేసి, కోడలు భోజనానికి పిలిచేదాకా పెరట్లో ఓమూల పడుంటుంది. తన అత్తేమిటిలా తిరగబడింది? "పదండైతే. ఆ లాయరమ్మతోటే మాట్లాడదాం" అని భర్తని బయల్దేరదీస్తే, ఇద్దరూ వెళ్ళి "గెట్ లాస్ట్" అనిపించుకుని ఐదునిముషాలకి గేటవతల నిలబడ్డారు. *** తల్లి కాగితాలన్నీ యిచ్చేసాడు సతీష్. చిన్న ఆశ. ఇంక ఇంటిమాట ఎత్తదని. కానీ ఆవిడ కచ్చితంగా అడిగేసింది. "మిగిలిన డబ్బు మాటేం చేసావురా?" "ఈ వయసులో ఏం చేసుకుంటావే, అంత డబ్బు? ఇప్పటికిప్పుడు ఎక్కడినుంచీ తేను? " "మీ నాన్న వైద్యానికి అప్పట్లో పదిలక్షలపైన ఖర్చైంది." "ఈ డబ్బు మిగులేకదే?" అతని భావం అర్థమైంది. మనసు చిన్నబోయింది. ఇంత లేకీగా, ప్రేమలేకుండా పెంచిందా ఇతన్ని? "నేను నీ కొడుకునే. ఇద్దరు పిల్లలున్నారు. ఇల్లమ్మేస్తే బజార్న పడతాం" "నాకు కొడుకు లేదు. వున్నదల్లా కొరివిలాంటి కోడలు, దాని భర్తాను. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కోడలి ఇంటికి మెరుగులు దిద్దటానికి ఇచ్చేంత వుదారత్వం నాకు లేదు. ఎంత తొందరగా ఆ డబ్బు ఇచ్చేస్తే అంత మంచిది... అంత బజార్నేమీ పడవు... మిగిలిన డబ్బు డౌన్‍పేమెంటు చేసుకుని ఇంకోటి కొనుక్కో" తల్లి కాఠిన్యాన్ని భరించలేకపోతున్నాడు. పద్మ తననేమీ ఆవిడకన్నా ఎక్కువగా చూడదు. తనకీ చాలీచాలని తిండే. సాలరీ అకౌంటు తనే చూస్తుంది. ప్రతి పైసకీ లెక్క. ఒక్క పైస చేతిలో వుండనివ్వదు. ఆఫీసులో ఎవరేనా టీకని లేస్తే వాళ్ళతో వెళ్ళిపోతాడు. బిల్లు టైముకి ఏదో ఫోనొచ్చినట్టు పక్కకి తప్పుకుంటాడు. చేబదుళ్ళు. తీర్చడు. తనకి ఆఫీసులో ఎలాంటి గౌరవం లేదు. అందరికీ చులకనే. తను పడుతున్న బాధలో సగం ఆవిడది అనుకున్నాడు. ఆవిడ దులుపుకుంటోంది. అతనికీ మనసు విరిగింది. వెళ్ళిపోయాడు. పద్మ తన తల్లిదండ్రులని రాయబారానికి పంపింది. "మా లాయరుగారితో మాట్లాడండి" అని పంపేసింది హైమవతి వాళ్ళని. **** ఫ్లాట్ బేరం పెట్టాడు సతీష్. పద్మ ఏడ్చింది. గొడవ చేసింది. "ఇల్లమ్మి తల్లికి వాటా పెడతావా? నీకు మగతనం లేదా? ఒక్క ఆడదాన్ని అదుపుచెయ్యలేవా?" అంది. సంస్కారం అనేది గాజుతెరలాంటిది. అది ఒకసారి పగిలిందంటే మాటాల బాణాలు మోస్తున్న అక్షయతూణీరంలాగా మారిపోతుంది మనసు. "ఐతే పిల్లల్ని ఎవరికి కన్నావో చెప్పు" సతీష్ ఎదురు అన్నాడు. "నన్నంతమాట అంటావా? ఇంక నేను బతికి ఎందుకు? నేనూ పిల్లలూ చచ్చిపోతాం" అంది పద్మ. "ముందు నువ్వు చచ్చి చూపించు, పిల్లల్ని చంపాలో వద్దో తర్వాత చూద్దాం" అన్నాడతను. *** "ఇంత గట్టిగా నిలబడతావని అనుకోలేదు హైమా!" ప్రశంసగా అంది ప్రసన్న. "చట్టాలు ఎన్ని వున్నా, ఇది వంటరిగా చేసే పోరాటం కాదు మేడమ్! కనీసం ఒక్క వ్యక్తి సహకారం వుండాలి. కొట్లాడిన మనిషితో అదే ఇంట్లో వుండలేరు. ఆశ్రయం కావాలి. ఆ ఆసరా, ఆశ్రయం ఇవ్వాలంటే సాయం చెయ్యాలనుకునే వ్యక్తికి అది ఒక పేషన్‍లా వుండాలి. మీనుంచీ అది నాకు దొరికింది. బతకాలనే బలమైన కోరిక ఇంకా నాలో వుంది. అనాయాసంగా చచ్చిపోవాలనీ వుంది. అవి రెండూ అపరాధాలు కాదనుకుంటాను " నిట్టూర్చింది.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ