Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

aaditya hrudayam - vn adithya

"తల్లి, తండ్రి, గురువులు, దైవం"


1) తల్లి, తండ్రి :
"ఇల్లంటే ఇటుక, సున్నం కాదు, ఇంట్లో ఉండే మనుషులు" అని ఆచరించి చూపుతున్న నా తల్లితండ్రుల సంస్కారానికి నమస్కరిస్తూ ఈ వారం కాలమ్ మొదలు పెడుతున్నాను.

దైవభక్తి, పాపభీతి రెండూ కలిగి ఉండడం మనకి, సమాజానికి కూడా చాలా మంచిది అని మా నాన్నగారు నా చిన్నప్పట్నుంచి చెప్తుండేవారు. ఆయన పదే పదే చెప్పిన విషయాల్లో సరదాగానైనా, సీరియస్ గానైనా బాగా గుర్తుండిపోయినవి కొన్ని.

"విద్యా తురాణాం న సుఖం న నిద్ర"

"ప్లే వైల్ యూ ప్లే, వర్క్ వైల్ యూ వర్క్"

"వివాహాయ విద్య నాశాయ, సర్వనాశాయ శోభనమ్"

"లెక్కకు రానీయడు కార్య సాధకుడు, దుఖంబును, సుఖంబును మదిన్"

ఇలా మరెన్నో - ఒక్క చలంగారిని తప్ప ఆ సేతు సీతాచల పర్యంతం లబ్దప్రతిష్టులైన ఎందరో రచయితలు, రచయిత్రులందరినీ పుస్తకరూపేణా గానీ, ప్రత్యక్షంగా గానీ మాకు పరిచయం చేస్తూనే ఉన్నారాయన ఇప్పటికీ. ఐడియా వచ్చిన ప్రతివాడికీ అది బైటకొచ్చి తను పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. కొన్నివేల పుస్తకాలు చదివిన అనుభవంతో సొంతంగా చందోబద్దంగారాయగలిగిన సత్తా ఉన్న పేరు కోసం పాకులాట, పీకులాట లేకుండా ఏ సాహితీమూర్తినైనా సమానంగా అభిమానించడం, ప్రోత్సాహించడం మా నాన్నగారికి పరిపాటి.

సాహిత్యాభిమానానికి ఏమాత్రం పొంతనలేని స్టేట్ బ్యాంక్ ఆఫీసరు ఉద్యోగాన్ని మా కోసం పాతికేళ్ళకు పైగా ఆయన చేయడం నాకు తెలిసి కుటుంబం కోసం ఆయన చేసిన పెద్ద త్యాగం.

ఆ బాధ మేం పడకూడదని మా చదువులు, ఉద్యోగాల ఛాయిస్ మాకే పూర్తిగా వదిలిపెట్టేసిన స్నేహితుడాయన.

అందుకే, మా పెద్దన్నయ్య సతీష్ టాలీవుడ్ టి.వి. ఛానల్ లో క్రియేటివ్ హెడ్, రెండో అన్నయ్య సుధాకర్ హెచ్ ఎస్ బిసీ బ్యాంక్ లో సీనియర్ డేటా ప్రోసెసింగ్ ఎగ్జిక్యూటివ్, మూడోవాణ్ణి నేను సినిమా దర్శకుణ్ణి. మా నాన్నగారి పేరు వాడ్రేవు వెంకట సత్యప్రసాద్. మా అమ్మగారి పేరు ఉమ. మా నాన్నగారి గురించి ఇన్ని చెప్పాను కదా! ఆయన్ని ఇన్ని రకాలుగా మంచిగా, స్వేచ్చగా, ఆరోగ్యంగా, నిష్కల్మషంగా ఉంచడంలో ప్రధాన పాత్ర మా అమ్మగారిదే. ఆయన మనసులో ఏదీ దాచుకోరు. మా అమ్మగారు అన్నీ కడుపులో దాచుకుంటారు. ఆయనకి కోపం ఎక్కువ. ఆవిడకి సహనం ఎక్కువ. ఆయనకీ సాహిత్యం, సినిమాలు అంటే పిచ్చి. ఆవిడకి దేవుళ్ళు, పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, భక్తి. చిన్న విషయాల్లో పొంతన లేకపోతేనే పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్న ఈ రోజుల్లో, ఏ మాత్రం పొంతన లేని రెండు భిన్న వ్యక్తిత్వాలు కలిసి ఉండాల్సిన ఆవశ్యకతని ఆచరణలో నిరూపిస్తున్న కొద్దిమందిలో వీరిద్దరూ ఉంటారు.

తల్లిదండ్రులనే బంధం వల్ల వచ్చిన బాధ్యతను, ప్రేమను మించి ఇద్దరినీ వారి వారి వ్యక్తిగత లక్షణాల వల్ల ఎక్కువ అభిమానిస్తాను నేను.

మా ముగ్గురు సోదరులతో పరిచయమున్న వారితో సహా మా అమ్మ, నాన్నలకి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు చాలా ఎక్కువ. ఆస్థుల మీద ధ్యాస లేకుండా ఆత్మీయుల్ని ఎక్కువ సంపాదించుకున్న భాగ్యవంతులు వీళ్లు. సుఖాల్లో కన్నా, కొడుకుల కష్టాల్లోనే వారితో కంపల్సరీగా కలిసుండాలనే నిస్వార్ధం వారి నైజం.

జీవితంలో పైకి రావడం ఎలాగో ఎవరూ చెప్పలేరు. కానీ ఆ ప్రయత్నంలో తగిలే దెబ్బలు ఒడుపుగా ఎలా కాచుకోవాలో, పడితే ఎలా లేవాలో, నాకు నలుగురు చెప్పారు - తల్లి, తండ్రి, గురువులు, దైవం. సక్సెస్ కి ఒక సూత్రం లేదు. ఫెయిల్యూర్ లో మనకి మళ్ళీ నిరూపించుకునే అవకాశం ఒక్కటి రావడమే సక్సెస్ కి మొదటి మెట్టు.

2) గురువులు :
ఒక గురువు గురించి రాస్తే అది గురువు కాకుండా లఘువు అవుతుందని గురువులు అని హెడ్డింగ్ పెట్టాను.

ఎటువంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ నైనా ఎదుర్కొని పోరాడి దాని ప్రతిఫలం(మంచైనా, చెడైనా) అనుభవించాలన్నది శ్రీ పరుచూరి బ్రదర్స్ సిద్ధాంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సిట్యుయేషనూ కాంప్లికేట్ అవ్వకుండా ముందే చూసుకోవాలన్నది శ్రీ సత్యానంద్ గారి పధ్ధతి. సత్యానంద్ గారు నాలుగు వందల పై చిలుకు చిత్రాలు రాసారు. ఇంకా రాస్తూ ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ నాలుగు వందల చిత్రాల దాకా రాశారు. ఇంకా రాస్తూ ఉన్నారు. వారి ముందర, తర్వాత చాలామంది రచయితలు పెన్ను విరమణ చేశారు కానీ, సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్ మాత్రం నిలకడగా నిబద్ధతగా ఇంకా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు, రాస్తూనే ఉన్నారు.

పరుచూరి బ్రదర్స్ తో 16 ఏళ్లుగా , సత్యానంద్ గారితో 4 ఏళ్లుగా, శ్రీ రావి కొండలరావు గారితో 20 ఏళ్లుగా, శ్రీ సింగీతం గారితో 20 ఏళ్లుగా, శ్రీ జయంత్ గారితో 16 ఏళ్లుగా, 'నేనున్నాను' కథా రచయిత భూపతి రాజాతో 8 ఏళ్లుగా, నాకున్న సాన్నిహిత్యంలో నేను నేర్చుకున్న విషయాలెన్నో. అవి నన్నెలా నడిపించాయో, నడిపిస్తున్నాయో నాకు మాత్రమే తెలుసు. వీళ్ళందరిలోను, రావి కొండలరావు గారితో, పరుచూరి వెంకటేశ్వరరావు గారితో, సత్యానంద్ గారితో, సింగీతం గారితో, జయంత్ గారితో నేనున్నంతసేపూ నవ్వుతూనే ఉంటాను. చాలావరకు నా ఆయుష్షుని పంచే దివ్యౌషధాలు వీళ్ళు.

పరుచూరి గోపాలకృష్ణ గారంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కొంచెం భయమే. బ్యాడ్ స్టూడెంట్ కి, డిసిప్లిన్డ్ టీచరంటే ఉన్న భయం. భూపతిరాజాతో రైటర్, డైరెక్టర్ రిలేషన్ కంటే క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన కలిగిన పెద్దన్నయ్యకి, అల్లరి చేసే తమ్ముడికి ఉన్న రిలేషన్ ఉంది.  ఈ గురువుల చలనచిత్ర నిర్దేశకత్వమే కాదు, నిజ జీవిత మార్గ నిర్దేశం కూడా అంతే సక్సెస్ ఫుల్ గా ఉంటుంది. నన్ను ఓ పరిశ్రమలో ప్రొఫెషనల్ లా కాకుండా సొంత కుటుంబ సభ్యుడిలా ఆదరించిన గురువులు వీరు.

నేను పని నేర్చుకున్న గురువుల వల్ల నాకు జరిగిన మేలు మరొకటి కూడా వుంది. దీన్ రాజ్, కాశీ విశ్వనాథ్, వీరు పోట్ల, రాజ సింహ, ప్రేమ్ రాజ్, శ్రీమతి బలభద్రుని రమణి గార్ల వంటి మంచి మిత్రులు, అంతకు మించి మంచి రచయితలు, దర్శకులు, నటులు, స్నేహితులుగా లభించడం.

నేను వర్క్ చేయకుండా సినిమాలు చూసి శిష్యరికం చేసిన గురువులు శ్రీ దాసరి గారు, శ్రీ రాఘవేంద్రరావు గారు, శ్రీ విశ్వనాథ్ గారు, శ్రీ బాపు గారు, శ్రీ జంధ్యాల గారు, శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు, శ్రీ మణిరత్నం గారు, శ్రీ కె. బాలచందర్ గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీ యష్ చోప్రా గారు, శ్రీ మన్ మోహన్ దేశాయ్ గారు, శ్రీ హృషికేష్ ముఖర్జీ గారు, శ్రీ అకిరా కురసోవా గారు, శ్రీ జేమ్స్ కామెరూన్ గారు, శ్రీ బెర్నాల్డో బెర్ట్ లూసీ గారు, శ్రీ స్టీవెన్ స్పీల్ బర్గ్ గారు.


3) దైవం :
ప్రయత్నం మాత్రం మనది. ఫలితం కాదు అన్న గీతావాక్యం నాకు మొదట చెప్పినది మా పెద్దన్నయ్య. స్వామి వివేకానంద ఉపన్యాసాలు, రమణమహర్షి ప్రవచనాలు నాకు పరిచయం చేసింది కూడా ఆయనే. మా ఇలవేల్పు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఇంట్లో నిత్య పూజలందుకునేది పరమేశ్వరుడు, అమ్మవారు. హోమాలు చేయటం ద్వారా, దానాలు చేయటం ద్వారా గ్రహశాంతి చేయొచ్చని తద్వారా కష్టకాలంలో కూడా మనశ్శాంతిగా ఉండొచ్చని చెప్పిన గురువుగార్లు శ్రీ వెంపటి రవికుమార్ శర్మ గారు, శ్రీ రామమూర్తి సిద్ధాంతి గారు, అన్నిటినీ మించి నన్ను నేను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో నాలోనే దేవుడున్నాడని, ఆయన్ని పాజిటివ్ భావాలతో ఉంచితే శక్తివంతుడవుతాడని, నెగిటివ్ భావాలతో ముంచితే అంతే క్రూరంగా మారతాడని సైంటిఫిక్ గా ఆస్ట్రాలజీ ద్వారా నిరూపించిన అస్ట్రో గురువు కిరణ్ గారు. వీళ్లతో పాటు చిన్నప్పట్నుంచీ క్రమం తప్పకుండా పూజాదికాలు ఇంట్లో నిర్వహిస్తున్న మా అమ్మగారు - వీళ్ళందరి వల్ల దైవం పట్ల నాకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది. మూడ నమ్మకాలు లేని నమ్మకం ఉంది. మడి, ఆచారాల మీద పెద్దగా పట్టింపులు లేవు కానీ, మానుష రూపేణా దేవుణ్ణి చూడాలన్న జ్ఞానం ఉంది. చిన్న పిల్లల్ని, పెద్ద వాళ్ళని పరుషంగా మాట్లాడకూడదని నేర్పించిన సంస్కారం భక్తి వల్లే వస్తుందని నేననుకుంటున్నాను. దేవుడు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. కానీ నేను పైన పేరు రాసిన ప్రతి వ్యక్తిలోనూ నాకు కనిపించాడు. నేనీ రోజు వరకూ లొకేషన్ చూడడానికో, షూటింగ్ చేయడానికో ఔట్ డోర్ వెళితే, (ఫారెన్ తో సహా) అక్కడున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించకుండా రాలేదు.

ప్రతి సినిమా షూటింగ్ మొదటి రోజు నుంచి రిలీజు వరకు వెంకటేశ్వరస్వామికి తల నీలాలు మొక్కుకోకుండా లేను.

ఫలితం నాది కాదు అన్న భావన అలవర్చుకోవడానికి నేనెంచుకున్న మార్గం దైవం.
 

( వచ్చేవారం "ముఖ్యమంత్రులతో నేను" ) 





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
dil raju heart feelings