Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

గద్దలకొండ గణేష్ చిత్ర సమీక్ష

gaddala knda gansesh movie review

చిత్రం: గద్దలకొండ గణేష్‌ (వాల్మీకి)
నటీనటులు: వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్దే, అధర్వ మురళి, మృణాళిని రవి, సత్య, తనికెళ్ళ భరణి తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్‌
సినిమాటోగ్రఫీ: అయానంక బోస్‌
నిర్మాణం: 14 రీల్స్‌
దర్శకత్వం: హరీష్‌ శంకర్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీనాథ్‌ ఆచంట
విడుదల తేదీ: 20 సెప్టెంబర్‌ 2019

క్లుప్తంగా చెప్పాలంటే..

గ్యాంగ్‌ స్టర్‌ గద్దలకొండ గణేష్‌ అలియాస్‌ గనీ (గనీ) పేరు చెబితే అందరికీ హడల్‌. కానీ, ఆ గద్దలకొండ గణేష్‌ కథతో సినిమా తీయాలనుకుంటాడు అభిలాష్‌ (అధర్వ). ఈ క్రమంలో గద్దలకొండ గణేష్‌ జీవితంలోని ఇంకో కోణాన్ని తెలుసుకుంటాడు అభిలాష్‌. అయితే, గద్దలకొండ గణేష్‌ మీద సినిమా అభిలాష్‌కి సాధ్యమయ్యిందా. ఈ ప్రయత్నంలో అభిలాష్‌ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు.? అభిలాష్‌ కారణంగా గద్దలకొండ గణేష్‌ జీవితం ఎలా మారింది.? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

వరుణ్‌ తేజ్‌ సినిమా సినిమాకీ తనను తాను సరికొత్తగా మలచుకుంటున్నాడు. ప్రతి సినిమాతోనూ నటుడిగా మరో మెట్టు పైకెక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రతి సినిమానీ ఓ ఛాలెంజ్‌గా తీసుకుంటున్నాడు వరుణ్‌ తేజ్‌. నటుడిగా ఈ సినిమా వరుణ్‌కి పెను సవాల్ళను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే, ఆ సవాళ్ళను స్వీకరించాడు. తనను తాను సరికొత్తగా మలచుకున్నాడు. సినిమాకి కావాల్సినంత పవర్‌ జోడించాడు. అన్ని ఎమోషన్స్‌నీ పెర్‌ఫెక్ట్‌గా పండించగలిగాడు.

హీరోయిన్‌ పూజా హెగ్దేకి తక్కువ నిడివి వున్న పాత్ర దక్కినా, ఆ పాత్రని ఆమె ఛాలెంజింగ్‌గా తీసుకుంది. చాలా క్యూట్‌గా కనిపించింది. 'ఎల్లువొచ్చి గోదారమ్మ..' రీమిక్స్‌ పాటలో పూజా హెగ్దే చాలా అందంగా కనిపించింది. వున్నంతసేపూ తన ప్రెజెన్స్‌తో సినిమాకి ఎక్స్‌ట్రా గ్లామర్‌ అద్దింది పూజా హెగ్దే. అధ్వర్వ చాలా బాగా చేశాడు. మృణాళిని రవిబాగానే చేసింది. సత్య, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, అన్నపూర్ణమ్మ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. డింపుల్‌ హయతి స్పెషల్‌ సాంగ్‌లో హాట్‌ అప్పీల్‌ అదరగొట్టేసింది.
తమిళంలో ఘనవిజయం సాధించిన 'జిగర్‌తాండ' సినిమాని తెలుగులోకి తీసుకొచ్చిన హరీష్‌ శంకర్‌, కథ పరంగా పెద్దగా మార్పులేమీ చేయకపోయినా, తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొన్ని రిపేర్లు మాత్రం చేశాడు. ఆ రిపేర్లు బాగానే వర్కవుట్‌ అయ్యాయి కూడా. డైలాగ్స్‌ బావున్నాయి. కథనం ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో కొంత సాగతీత అన్పిస్తుంది. ఎడిటింగ్‌ పరంగా అక్కడ ఇంకాస్త స్కోప్‌ వుందనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది.

ఫస్టాఫ్‌ అంతా సరదా సరదాగా సాగిపోతుంటుంది. గద్దలకొండ గణేష్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ నట విశ్వరూపం ప్రదర్శించేశాడు. చాలా ఎనర్జిటిక్‌గా సాగుతుంటుంది వరుణ్‌ తెర మీద కన్పించినంతసేపూ. సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఎమోషనల్‌ సీన్స్‌ ఎక్కువయ్యాయి. దాంతో కథలో కాస్త వేగం తగ్గినట్లన్పిస్తుంది. కొన్ని ట్విస్ట్‌లు మళ్ళీ కథలో వేగాన్ని పెంచుతాయి. కొన్ని సన్నివేశాల్ని మినహాయిస్తే, ఓవరాల్‌గా 'గద్దలకొండ గణేష్‌' అవసరమైనంత వినోదాన్ని పండించినట్లే. మాస్‌ మెచ్చే అంశాలు సినిమాలో చాలానే వున్నాయి గనుక.. మాస్‌ ఆడియన్స్‌కి ఇది ఓ పండగ లాంటి సినిమానే. సినిమా నిడివి ఎక్కువవడం కొంత ప్రతికూలత. అయితే, ఎమోషనల్‌ సీన్స్‌తో కనెక్ట్‌ అయ్యేవారికి అది మరీ అంత కష్టం అన్పించలేదు. ఓవరాల్‌గా ఓ మంచి ఔట్‌పుట్‌తో వచ్చాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌.

అంకెల్లో చెప్పాలంటే
3/5

ఒక్క మాటలో చెప్పాలంటే
గద్దలకొండ గణేష్‌.. గత్తర్‌ లేపాడంతే.!  

మరిన్ని సినిమా కబుర్లు
churaka