ఆకాశమే హద్దు - జీడిగుంట నరసింహ మూర్తి

akasame haddu

కృష్ణమూర్తికి ఈ వూరు ఈ మధ్యే ట్రాన్సఫర్ కావడం, భర్తకు ప్రమోషన్తో పాటు బాధ్యతలు ఎక్కువవడంతో రోజువారీ అవసరమైన పనులన్నీ తనే చేసుకోవాలని అనుకుంది రాధిక .ఆ రోజు బట్టలషాపులో షాపింగ్ నిమిత్తం ఒక సాయంత్రం పూట కాలినడకన బజారు బయలుదేరింది రాధిక . ఇంతలో ఎవరో వెనుకనుండి పిలిచినట్లుగా అనిపించి రోడ్డు పక్కన ఆగి వెనుక వైపు చూసింది . ఎవరో ఒకావిడ మేడ మీంచి చేతులు వూపి పిలుస్తున్నారు. ఈ వూళ్ళో తనను తెలిసిన వాళ్ళు ఎవరు వుంటారులే అని ముందుకు వెళ్లబోయింది. కానీ మళ్ళీ అదే పిలుపు ఏమండీ ఒక్కనిమిషం అక్కడే ఆగండి . నేను వస్తున్నాను “ అంటూ మేడ మీంచి పిలుస్తున్న ఆవిడ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రాధికను సమీపించింది.

“మీరు రాధిక కదూ !?” అంటూ చేతుల్లో చేతులు కలిపి భావోద్రేకంతో పలకరించింది ఆమె .

“ అవును .. మీరు .. నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు ..” అంటూ ఆగింది రాధిక .

“పదండి. నేనెవరో మీకు రెండు నిమిషాల్లో గుర్తుకు వస్తాను. మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం “ అంటూ చనువుగా రాధిక చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది ఆవిడ .

“ ఆ..ఆ..గుర్తుకు వచ్చింది. సారీ ఏమీ అనుకోకండి వెంటనే గుర్తు పట్టలేక పోయాను. మీరు నిర్మలగారు కదూ. చాలా ఆశ్చర్యంగా వుందే. మన ఇద్దరం ఈ వూళ్ళో ఇక్కడ చాలా కాలం తర్వాత తటస్తపడటం “ అంటూ వుద్వేగంతో లోపలికి అడుగుబెట్టింది రాధిక .“ఒక్క నిమిషం ఈ పుస్తకం చూస్తూ వుండండి. నేను ఈ లోపు కాఫీ కలుపుకుని వస్తాను “ అంటూ వంటింట్లోకి దూసుకు వెళ్లింది నిర్మల

ఆ రెండు నిమిషాల్లోనే రాధిక గతంలోకి వెళ్లిపోయింది. నిర్మలగారు, ఆవిడ భర్త గుంటూర్లో తమ పక్కింట్లో బ్రహ్మం గారింటికి తరచుగా వస్తూండే వారు. బ్రహ్మం గారు నిర్మలకు మామగారు అవుతారు. నిర్మల భర్తకు కాలేజీలో వేసవి సెలవలు ఇచ్చినప్పుడల్లా గుంటూర్ వచ్చి గడపడం అలవాటు. నిర్మల చాలా పత్రికలలో కథలు రాసింది.తనకు కూడా కథల మీద ఎక్కువ ఆసక్తి వుండటం అడపా దడపా తన కథలు కూడా అచ్చవడంతో ఇద్దరి భావాలు కలిశాయి. అలా వాళ్ళతో అనుకోకుండా తనకు పరిచయం మొదలయ్యింది

ఆ తర్వాత హటాత్తుగా తన భర్తకు ట్రాన్సఫర్ అవడంతో తమ కుటుంబం గుంటూర్ వదిలి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు నిర్మల గుర్తుకొచ్చినా వాళ్ళు ఎక్కడున్నారో అని ఆలోచించే పరిస్తితి కూడా కలగలేదు . సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇదిగో వూహించని రీతిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే నిర్మలను చూడటం . ఈ లోపు నిర్మల రెండు కప్పులతో కాఫీ తీసుకుని వచ్చి టీపాయి మీద పెట్టింది. పక్కన స్నాక్స్ డబ్బా మూత తీసి వుంచింది.

“ ఆ . ఇప్పుడు చెప్పండి రాధిక గారు మీరు ఇక్కడ ఎప్పటినుండి వుంటున్నారు . ఏమిటా కథ ?” అడిగింది కుతూహలంగా నిర్మల“ ఈయనకు ఎన్నో వూళ్ళు ట్రాన్స్ఫర్లు అయ్యాక చివరకు ఈ వూరు చేరుకున్నాం ఒక సంవత్సరం క్రితమే. . నేనైతే ఈ జన్మలో మళ్ళీ మనమిద్దరం కలుసుకుంటాం అని అనుకోలేదు నిర్మల గారు .. ఒక్కోసారి దేముడు ఇలా కలుపుతూ వుంటాడు” అంది రాధిక ఎంతో ఎక్ష్గైటింగ్గా

“ నాకూ అంతే. ఇది కలా నిజమా అనిపిస్తోంది. “ అంది నిర్మల అంతే తన్మయత్వంతో.“అది సరే. మరి మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు ? ” అడిగింది రాధిక వుత్సాహంగా.

“ మేమూ వచ్చి నాలుగేళ్ళు పైగా అయ్యుంటుంది. ఈయనకు ఇంకా ఒక్క సంవత్సరం సర్విస్ వుంది. ఈ వూరు నాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. ఎవరితోనూ పరిచయాలు లేవు. అసలు నేనే చేసుకోలేదు అంటే బాగుంటుందేమో. “ అంది నిర్మల నిర్లిప్తతతో “ బాగానే వుంది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు ఏమి చేస్తున్నారు ?ఆ వివరాలు ఇప్పుడు చెపుతారా లేదా మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు చెపుతారా ?” అడిగింది రాధిక కుతూహలంతో

“ అన్నట్టు మీరేదో అర్జెంట్ బజారు పని పెట్టుకున్నట్టున్నారుగా . ప్రస్తుతం మనం ఇక్కడుండే వాళ్లమేగా. రేపు మీ ఇంటికి వస్తాను . అక్కడ మాట్లాడుకుందాం “ అంది నిర్మల . ఆమెకెందుకో తన పిల్లల గురించి వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపలేదు. అందుకే ఆ విషయాన్ని వాయిదా వెయ్యడానికి ప్రయత్నించింది.

“ ఆ .. ఆ ..బజారు పనిదేముంది నిర్మలగారు . రేపైనా చేసుకోవచ్చు. మీకు వీలైతే ఈసారి ఇద్దరం కలిసి వెళ్లొచ్చు లెండి.. పోనీలెండి ఆ విషయాలన్నీ రేపు మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. పాపం మీరు రెస్ట్ తీసుకుంటారేమో తీసుకోండి . మనం రేపు మళ్ళీ మా ఇంట్లో కలవబోతున్నాం “ అంటూ అక్కడనుండి కదిలింది రాధిక .

******

అమ్మాయి ఎంటెక్ చదివి వుద్యోగం చేస్తోంది. . ఇక అబ్బాయి విషయం ఎందుకులే. వాడిని గురించి తల్చుకుంటూ వుంటేనే మనసంతా వికలం అయిపోతుంది. కొంతమందికి అదృష్టం చాలా దూరంగా వుంటుంది రాధిక గారూ. .దానికి భగవంతుని నిందించి ఏమీ లాభం లేదు .దేనికైనా రాసి పెట్టి వుండాలి. “ అంది నిర్మల కళ్ళల్లో అప్రయత్నంగా వుబికి వస్తున్న కన్నీళ్లను అదిమిపడుతూ .

ఇంతలో రాధిక భర్త కృష్ణమూర్తి లోపలకి వస్తూ పక్కనే సోఫాలో కూర్చున్న అపరిచిత వ్యక్తిని చూసీ చూడనట్టుగా పరికించి లోపలికి వెళ్లబోయాడు.“ఒక్క నిమిషం. ఏమండీ ఈవిడెవరో బహుశా మీకు గుర్తుండి వుండదు. ఈవిడ నిర్మల గారని మనం ఇంతకు ముందు గుంటూరులో వున్నప్పుడు భర్తతో పాటు మన ఇంటి పక్కన వున్న బ్రహ్మం గారి ఇంటికి వస్తూ వుండే వారు . బ్రహ్మం గారు వీరికి మామగారు అవుతారు. వీరి భర్తకు కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు వస్తూ వుండేవారు గుర్తొస్తోందా మీకు ? “ అడిగింది రాధిక.

“ అవునవును . చాలా రోజులైపోయింది కదా గుర్తు పట్టడం కష్టమై పోయింది. మరి వీరు ఇక్కడ నీకెలా కలిశారు ? “ అడిగాడు కృష్ణమూర్తి ఆశ్చర్యంగా. రాధిక ఆ వివరాలు చెప్పింది ..

లోపల నుండి బాగా వుల్లిపాయలు దట్టించి చేసిన శెనగపిండి పకోడీలు తీసుకొచ్చి నిర్మల పక్కన కూర్చుంది కృష్ణవేణి. “అబ్బ. మీకు జ్ఞాపక శక్తి చాలా బాగుందండీ. అప్పుడు గుంటూర్లో మీ ఇంటికొచ్చినప్పుడు మీరు చేసిన పకోడీలు తిని మెచ్చుకోవడం అది గుర్తు పెట్టుకుని మళ్ళీ మనం కలిసిన సంధర్భంగా వాటి రుచి తిరిగి ఇన్నాళ్లకు గుర్తు చెయ్యడం ...” . కృష్ణమూర్తి లోపలికెళ్లి పడుకున్నాడు. అతని గది తలుపు దగ్గరిగా నొక్కి వచ్చి నిర్మల దగ్గర కూర్చుంది రాధిక. “అన్నట్టు మా అబ్బాయి గురించి పూర్తిగా చెప్పలేదు కదా . వాడికి చదువు అయిపోయి హైదరాబాద్ లో వుద్యోగం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా తేవడం మొదలు పెట్టారు. ఏ సంబంధం వచ్చినా తిరగ కొట్టేసే వాడు. చక్కగా చదువుకుని నావళీకంగా వున్న పిల్లలు ఎంతమంది వచ్చినా వాడి మనసులోని మాట చెప్పే వాడు కాదు. చివరికి మాకు తెలిసిందేమిటంటే వాడు తన ఆఫీసులో తనతో పనిచేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడుట.ఆ అమ్మాయి తండ్రి, బందువులు కూడా మంచి స్థాయిలో వున్నారని, ఆర్ధిక పరిస్తితి కూడా మన కన్నా బాగుంది అని చెప్పాడు. “

“అవసరం లేదురా. మన బంధువుల్లోనే బొళ్ళంత మంది నిన్ను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నారు . అయినా మనకన్నా ఆర్ధికంగా గొప్పగా వున్న సంబంధాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు . ఒకటి గుర్తించుకో. ఎప్పుడూ మనం చేసుకునే అవతలి ఆడపిల్లల సంబంధాలు మనకన్నా ఆర్ధికంగా తక్కువ స్థాయిలో వుండేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు మనతో ఇమడలేరు. వాళ్ళ ఖర్చులు ఎక్కువగా వుంటాయి. అవి మనం తీర్చలేం. మన ఇంట్లో కలిసిపోయి మనల్ని అర్ధం చేసుకునే సంబంధాలు చేసుకుంటేనే వాళ్ళూ , మనమూ సుఖపడతాం.అయినా ఇప్పుడు నీకేమంత తొందరొచ్చింది .ఈ సారి ప్రమోషన్ లిస్టులో నీ పేరుంది అన్నావుగా. అది వచ్చాక ఇంకా మంచి సంబంధాలు నీ కోసం ఎగరేసుకుంటూ వస్తాయి . ఆ అమ్మాయికెవరికో మాటిస్తే ఇచ్చావు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి తప్పించుకో. ఇలా ఎవరి సంబంధాలు వాళ్ళు చూసుకునేటట్లైతే ఇక తల్లి తండ్రులకు ఏమి విలువ ఏడ్చి చస్తుంధి ? ఆ వచ్చిన వాళ్ళు మమ్మల్ని

మీతో వుండనిస్తారా ? మిమ్మల్ని కనీ పెంచి నానా అగచాట్లు పడి ఒక పొజిషన్కు తీసుకొచ్చిన తల్లి తండ్రులు చివరకు అనాధలుగా వుండిపోవాలా ?” అన్నారు ఈయన కొద్దిగా కోపంగానే .

“ చాల్లెండి నాన్నా మీరు తెచ్చిన సంబంధాలు ఒక్కటీ తీరూ తెన్నూ వున్నట్టుగా నాకనిపించలేదు. అయినా మన ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రంగా వుండి అవతల తెచ్చుకున్న పిల్ల ఆర్ధిక పరిస్తితి అలాగే వుంటే జోగీ జోగీ రాసుకున్నట్టుగా వుంటుంది. భవిష్యత్తులో ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా అంత సులువనుకుంటున్నారా ? ఇప్పటి చదువులు మీ కాలంలా వీధి బడిలో వేసి చదివించేవి కావు. పిల్లలు ఇంకా పుట్టకుండానే లక్షల రూపాయలు వాళ్ళ చదువుల కోసం ప్రణాళిక చేసుకునే పరిస్తితి. మా వుద్యోగాలు చేసినంత కాలం చేయగలం. . ఎంత కష్టం చేసినా ప్రమోషన్లు , ఇంక్రిమెంట్స్ దగ్గరికి వచ్చినపుడు ఎంతో పోటీలు పడి మాకు మేము అన్నీ విషయాలలో రుజువు చేసుకుంటూ వుండాలి. మనకు ఇష్టం లేకపోయినా, వాళ్ళకు ఇష్టం లేకపోయినా అంతే. మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డారు . ఒక్క చిన్న ఇల్లు అయినా కట్టుకోగలిగారా ? మీ అవసరాలకు ఏమైనా డబ్బు దాచుకోగలిగారా ? ఇవన్నీ ఆలోచించాకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ అమ్మాయికి నాకు వచ్చే అంత జీతం రాకపోయినా ఆమె తండ్రికి చాలా ఆస్తులున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వుంది. అది కాకుండా లంకంత ఇల్లు . ఒక వేళ ఖర్మ కాలీ వుద్యోగం అటూ ఇటూ అయినా మళ్ళీ వెతుక్కుని స్థిర పడే అంతవరకు ఏమీ ఇబ్బంది వుండదు అందుకే ఒక కాంక్రీట్ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మా యువత స్వేశ్చను హరించడానికి పెద్దలు ప్రయత్నం చేయకండి . “

వాడి మాటలు మమ్మల్ని కలవరపరిచినా బలవంతాన నిభాయించుకున్నాం. . మా మాట వినే పరిస్తితి దాటిపోయింది.. మేము కాదన్నా వాడి మార్గాలు వాడికున్నాయి. జీవితాన్ని అర్ధం చేసుకునే సరికి అది మన చేతులు దాటి పోతుంది . అప్పటి మా పరిస్తితి అదే. అయితే ఆ గదిలో మరో బాంబు పేలినట్టయ్యింది. . తను వర్ణాంతర వివాహం చేసుకోబోతున్నాని అది ఈ రోజుల్లో సామాన్య విషయమని , సరైన పెళ్లి సంబంధాలు దొరక్క యువతీ యువకులు వారికి కావలసిన భాగస్వాములను వారే నిర్ణయించుకుంటున్నారని , ఈ పద్దతి ఇప్పుడు సమాజం అంగీకరిస్తోందని ఇంకా ఏదేదో చెప్పుకు పోతున్నాడు. వాడి మాటలు విన్నాక మాలో సహనం పూర్తిగా నశించి మెదడు చచ్చుబడినట్లయ్యింది . బాలన్స్ తప్పి తూలి పడబోయి గోడపట్టుకుని నిలదొక్కుకున్నాను . ఇన్నాళ్ళు మా గురించి ఒక వుత్తమమైన విలువలను పాటించే కుటుంబంగా అందరికీ తెలుసు. కానీ వీడి నిర్ణయాలు విన్నాక మా కుటుంబం పూర్తిగా అదుపు తప్పి పయనిస్తోందని అనిపించింది. మానుండి ఎటువంటి సమాధానం ఆశించకుండానే వాడు అక్కడనుండి వెళ్ళి పోయాడు. అంటే తన నిర్ణయం తను ఎప్పుడో తీసేసుకున్నాడని అన్యాపదేశంగా వాడు చెపుతున్నది మాకు బోధపడింది . పాత సినిమాలలో లాగా నువ్వు ఈ ఇంటిలో అడుగు పెట్టడానికి వీల్లేదు మా శవాన్ని చూడటానికి కూడా రావడానికి నీకు అర్హత లేదు అని చెప్పే పరిస్తితులు ఇప్పుడు పూర్తిగా లేవు. అయినా కూడా ఈయన మా అబ్బాయితో విబేధించి “ సరే నీ ఇష్టం. నీ జీవితం నీది. తల్లి తండ్రులుగా మాకు నీ పెళ్లి చేసే అంతవరకు కనీస బాధ్యత వుందని ఇప్పటివరకు గుడ్డిగా నమ్ముతూ వచ్చాం. అది అవసరం లేదని ఈ క్షణమే తెలుసుకున్నాం. “ అంటూ ఆయన గదిలోకి వెళ్ళి పోయారు. ఈయన ఆమాత్రం తన ఆక్రోశాన్నైనా వెళ్ళగక్కారు . నాకా పరిస్తితి లేదు. మనసులో ఎంతో అలజడిగా వున్నా అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగాను .మాటలు తూటాలు లాంటివి. ఒక్కసారి బయట పడితే వెనక్కి తీసుకోలేము . కొన్ని కొన్ని సంఘటనల ప్రభావం మనుష్యుల మీద విపరీతంగా వుంటుంది అనుకుంటా .. ఆ రోజు మొదలుగొని వాడు వస్తున్నాడు వెళ్తున్నాడు కానీ మా ఇద్దరితో ముభావంగానే వుంటున్నాడు.

తన ప్రొపోజల్ మా ఇద్దరికీ అంగీకారం కాదని వాడికి అర్ధం అయిపోయింది . ఇంట్లో ఆడపిల్ల వున్నా అది తను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకొనంది. పోనీలే అబ్బాయి కిషోర్ కి పెళ్లైపోతే వాడికి ఒక భాద్యత అంటూ తెలుస్తుంది నాకూ ఆ వచ్చే కోడలు చేదోడు వాదోడుగా వుంటుంది అనుకున్న నా ఆలోచనలు గాలి తీసిన బెలూనుల్లా అయిపోయాయి. ఇష్టమైన వ్యక్తి కోసం ఏమైనా చెయ్యక తప్పదనుకున్నాడో ఏమో మళ్ళీ ఒకటి రెండు సార్లు మా దగ్గర తన విషయం కదిపి చూసి మా ముభావాన్ని ,మా ఇబ్బందిని , మా మనసులోని అలజడిని గ్రహించి నిష్కర్షగా , నిర్మొహమాటంగా , తన పెళ్లి విషయం వాళ్ళతో చర్చించి ఖాయం చేసుకున్నాడు. కనీసం ఆ అమ్మాయిని చూపించాలని కూడా వాడికి మనసులో అనిపించలేదు. మొహం చాటేశాడు . ఈయన వాడికన్నా మొండి. పరువు ప్రతిష్టలంటే ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు. . తను అనుకున్న విధంగా మా అంగీకారంతో సంబంధం లేకుండానే వాడు తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. కనీసం ఆ అమ్మాయి తల్లి తండ్రులు కూడా బాధ్యతా రహితంగా కనీస ధర్మంగా మమ్మల్ని సంప్రదించక పోవడం నిరంతరం మా మెదడులను తొలిచెయ్యసాగింది. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి మూడేళ్లయ్యింది . అప్పుడప్పుడు వాడు వచ్చి వెళ్తూ వుంటాడు కానీ ఆ అమ్మాయిని మేము ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె తల్లి తండ్రులు మమ్మల్ని కలవలేదు. ఈ సంఘటన మా జీవితంలో ఒక పీడ కలగా మిగిలిపోయింది. అప్పటినుండి మీ అన్నయ్యగారికి ఆ వూళ్ళో తలెత్తుకుని తిరగడం కష్టమై పోయింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మా కుటుంబాన్ని వెటకారం చేస్తున్న భావన మాలో మెదిలింది . అందుకే ఆ వూళ్ళో వుద్యోగం చెయ్యడం ఇష్టం లేక ఈ వూరికి వాడికి దూరంగా ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చేశాం. ఆయన ఇప్పటికీ శివుడు గరళాన్ని మింగినట్టుగా అవమానాన్ని దిగమింగుకుని వుద్యోగం చేసుకుంటున్నారు. .” అంటూ ధీర్ఘంగా శ్వాస తీసి వదిలింది నిర్మల.

ఇన్నాళ్లకు తన గుండెల్లో గూడుకట్టుకున్న దిగులు, తీరని వ్యధ రాధికతో చెప్పుకున్నాక నిర్మల మొహంలో ఆవేదన తాలూకు వేదన మబ్బులా వీడింది.

“ మిమ్మల్ని చూడగానే పొరపాటున కూడా మీలో ఇంత ఆవేదన గూడుకట్టుకుందని నేను వూహించలేదు నిర్మలగారు . ప్రతి వారికి జీవితంలో వూహించని ఎన్నో మలుపులు వుంటాయని తెలుసు కానీ ఇంతగా బాధపెట్టేవిగా వుంటాయని మీరు చెప్పాకనే తెలిసింది. జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఈ రోజుల్లో పిల్లలకు రెక్కలొచ్చే అంతవరకే తన తల్లి తండ్రులతో సంబంధం. వారికి ఆకాశమే హద్దు. మన చేతుల్లో ఏమీ లేదు. అన్నట్టు ఇప్పుడు మీ అమ్మాయి బెంగళూరులో వుందని అన్నారుగా . ఎప్పటికైనా పెళ్లి చెయ్యాలి కదా ఆ విషయం ఏం చేస్తున్నారు ?” అడిగింది రాధిక తలవంచుకుని ఆలోచిస్తున్న నిర్మల తల పైకెత్తి చూసి. .

“ అది ఒప్పుకుంటుందని మేము అనుకోవడం లేదు . . తన అన్నగారు చేసిన పనికి వాడు మాకు కలిగించిన చిత్తక్షోభకు తను పెళ్లి చేసుకోకుండానే వుండిపోయింది . ఈ విధంగా మాకు రెండు విధాలుగా మనశ్శాంతి కరువయ్యింది అనుకో “ నిర్మల చెపుతూన్న విషయాలు వింటూ వుంటే రాధికలో ఒక రకమైన నైరాశ్యం అలుముకుంది. ఏమిటి ఈ కాలపు పిల్లలు ? జీవితాలను తమ చేతుల్లోకి తీసుకుని కనీ పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రులను నిర్ధాక్షిణ్యంగా కాలదన్నేసి స్వార్ధ చింతనతో

తమ భవిష్యత్తు తాము చూసుకుంటున్నారు. ఆనక అమాయకంగా ముందూ వెనక ఆలోచించక అగ్ని గుండంలో సమిధలుగా మారుతున్నారు. వూహించని కష్టాలు అనుభవిస్తూ జీవితాంతం తమకు , తమ తోటివారికి తీరని శిక్షగా మారుతున్నారు. నిర్మల కథ విన్నాక ఇప్పుడు రాధిక ఇంకా పెళ్లికాని తన పిల్లల గురించి తీవ్రంగా ఆలోచనలో పడిపోయింది .

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి