సత్యవాక్కు విశిష్టత - సి.హెచ్.ప్రతాప్

Sattavaakku visishtatha

సత్యాన్నాస్తి పరోధర్మ : అనే ఒక శాస్త్ర వాక్కు యావత్ మానవాళికి ప్రామాణికం గా వేదకాలం నుండీ నిలుస్తోంది . సత్యమే విశ్వవ్యాపకమైన ఆత్మశ్క్తి. సత్యాన్ని ఆలంబనగా చేసుకోకపోతే మన జీవితాలు సంసార సముద్రంలో చుక్కాని లేని నావ లాగ గమ్యం లేకుండా అటూ ఇటూ తిరుగుతూ వుంటాయి. కాబట్టి మనందరం అజ్ఞానంతో ఆవరింపబడిన ఆత్మను సత్యజ్ఞానంతో శోధించి, సాధించి దివ్యాత్మ స్వరూపులం కావాలి.

కేవలం సత్యవాక్య పరిపాలననే తన జీవితానికి పునాది చేసుకున్న మోహన్ దాస్ కరం చం గాంధీ అనే ఒక సాధారణ మానవుడు యావత్ ప్రపంచం చేత మహాత్ముడు అని కొనియాడబడే స్థితికి ఎదిగాడు.

అసత్యం పలకడం అశౌచంతో సమానం అని శాస్త్రం చెబుతొంది. అసత్యవాది మాటలకు సమాజంలో ప్రామాణికత ఉండదు. అన్ని కాలాలలోనూ సత్య వచనాలు పలకడం వల్ల ఆనందమే కాకుండా వాక్కుకు రాణింపు, కార్యసిద్ధి కలుగుతాయి.

సత్యవాక్కు కామధేనువు లాంటిది. అది కీర్తిని, గౌరవాన్ని ఇస్తుంది. శత్రువులను తరిమేస్తుంది. కాబట్టి సత్యవాక్కును పలకడం జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రయత్న పూర్వకంగా అయినా ప్రియవాక్కులు పలకడం అలవాటు చేసుకోవాలి. సాధన క్రమంలో వాక్కుకు శుద్ధి కలుగుతుంది.పురాణులైన ,ఆద్యులైన వాల్మీకి వ్యాస వశిష్టాది మహర్షుల నోట వచ్చే మాటలన్నీ కూడా -సత్యములే అవుతాయి. 'ఋషయః సత్యవచసః 'అని శాస్త్రం. ఆ ఋషుల వాక్కులని అనుసరించే వారి భావాలు లోకానికి హితం చేస్తాయి. వేయి అశ్వమేధయాగాలు, ఒక సత్య వాక్కు ఈ రెంటినీ త్రాసులో పెట్టి తూచితే సత్య వచనమే బరువు. తీర్థయాత్రల వల్లా, వేదాధ్యయనం వల్ల వచ్చే పుణ్యం నిత్య సత్యవ్రతం అనుష్ఠించే వాని పుణ్యానికి సాటిరావు. సత్యమే పరబ్రహ్మ స్వరూపం.

సూక్ష్మ మరియు స్థూల రెండింటిలోనూ వ్యాపించి ఉన్న ఒక శక్తి ఉంది. ఆ శక్తి విశ్వాత్మ. మీలో ఉన్న దివ్య చైతన్యం అందరిలోనూ ఉన్నట్లే ప్రపంచమంతా ఈ పరమాత్మ చైతన్యంతో నిండి ఉంది. ఈ శాశ్వత సత్యాన్ని గ్రహించిన ప్రజలు తప్పు మార్గంలో నడవరు. రూపాలు అనేకం కానీ పరమాత్మ శక్తి ఒక్కటే. అందువల్ల, మనిషి తన సహజమైన దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. దైవత్వానికి ప్రతీక అయిన సత్యవాక్య పరిపాలలను ఒక యజ్ఞంలా భావించి జీవితమంతా ఆచరించాలి.

మానవులు తపస్సు ద్వారా గానీ, తీర్థయాత్రల ద్వారా గానీ, గ్రంథాల అధ్యయనం ద్వారా గానీ, జపం ద్వారా గానీ జీవన సాగరాన్ని దాటలేరు. పుణ్యాత్ములకు సేవ చేయడం ద్వారానే దానిని సాధించగలడు. అన్నది వేదవాక్కు. కాబట్టి మానవాళి అంతా సేవా మార్గంలోకి ప్రవేశించాలి, సత్యవాక్కును ఒక తపస్సులా భావించి పాటించాలి. అప్పుడే మానవులు మహనీయులవుతారు.నూరు కొలనులకన్నా ఒక బావి మేలు. నూరు బావులకన్నా ఒక యజ్ఞం శ్రేష్టమైనది. నూరు యాగాలకన్నా ఒక పుత్రుడు మేలైనవాడు. అటువంటి నూరుపుత్రుల కంటే ఒక సత్యవాక్కు శ్రేష్టమైనది అన్న్న శాస్త్రవచనాన్ని మన జీవితాలకు ఆలంబనగా చేసుకోవాలి.