అత్తగారి సామ్రాజ్యం - బొబ్బు హేమావతి

Attagari samrajyam

అత్తగారు కంచు క్లాసులో టీ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ పైన వినీత ముందు టంగ్..... మని సౌండ్ చేస్తూ పెట్టింది. అప్పటికే టిఫిన్ తింటున్న వినీత తల ఎత్తి తన వైపు చూడగానే ఆమె వినీత వైపు చూసి చూడకుండా వేరొక పక్క చూసినట్లు చూస్తూ చిరాకు పడుతూ "ఇంట్లో పనంతా నేనే చేయాలి. గొడ్ల చావిడి అయిపోయింది. ఒక్కరికి కూడా నా బాధ పట్టదు" అంటూ రుస రుస లాడుతూ వంట గది లోకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరైనా బయట వ్యక్తులు ఆ సంఘటన చూసి ఉంటే... అయ్యో పాపం పెద్దావిడ. ఏంటిది....పెద్దకోడలు పని లో అత్తగారికి సాయం వెళ్లకుండా పెద్దావిడ అయిన అత్తగారి దగ్గర చేయించుకుంటుంది అనుకుంటారు. అక్కడ జరిగేది ఒకటి.... కంటికి కనిపించేది మరొకటి. వినీత వెంటనే చాలా హర్ట్ అయ్యింది. కానీ కన్నీళ్లు బయటకు రాకుండా అదిమి పెట్టుకుంది. అక్కడ అత్తగారింట్లో ఆమె పప్పులు ఉడకవు. బాధ చూపినా వెంటనే పెద్ద గొడవ. ఇక కోపం ఎక్కడ చూపేది. వినీత... నిశ్శబ్దంగా ఆ టీ తీసుకుని తాగింది. అప్పటికే హాట్ కేసులో నుంచి నాలుగు ఇడ్లీలు తీసుకుని పెట్టుకుని చట్నీ వేసుకొని తినింది. కనీసం అత్తగారు తను టీ తాగిందా లేదా అని తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. మీరు నవ్వు కోవచ్చు అత్తగారు వినీత కు గౌరవం ఇవ్వాలా అని...నేనంటాను... ఇవ్వాల్సిందేనని... ఎందుకంటే...??? వినీత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేటప్పటికి ఆమెకు పెళ్లి కావాల్సిన ఆడపడుచు, చదువుకుంటున్న మరిది, చాలీ చాలని సున్నపు మిద్దె లో నివాసం. వినీత భర్త భార్గవ్ అప్పుడే ఎం కామ్ ముగించి ఒక ఆడిటర్ దగ్గర ఉద్యోగం లో ఉన్నాడు. వినీత ఎంఫిల్ జస్ట్ పెళ్ళికి ముందే పూర్తి అయ్యింది. వినీత గైడ్ తనను అలాగే పిహెచ్.డి కంటిన్యూ చేయమన్నాడు. డాక్టరేట్ తీసుకోవాలి, డాక్టర్ అని అనిపించుకోవాలి అన్నది ఆమెకు తన చిన్న నాటి కల. దానిని ఎలాగైనా సాకారం చేసుకోవాలని కష్టపడుతోంది. పెళ్ళికి ముందు భార్గవ్ మాట్లాడుతూ వినిత తో.... పిహెచ్.డి థీసిస్ తనకు కట్నంగా ఇవ్వమని అన్నాడు. పెండ్లి అయ్యిన సంవత్సరమే వినీత తన పిహెచ్.డి థీసిస్ సబ్మిట్ చేసింది... అలాగే పండంటి పాపకు జన్మనిచ్చింది. ఇంతలోనే వినీత కు యూఎస్ఏ లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో పొజిషన్ వచ్చింది. వినీత మామ గారు ఇంటింటికి తిరిగి తన కోడలు త్వరలో అమెరికా పోబోతుంది అదేదో టెక్సాస్ యూనివర్సిటీ లో ఉద్యోగం వచ్చింది అని అడిగిన వారికి అడగని వారికి చెప్పొచ్చాడు. నా కొడుకు తెలివైన వాడు అందుకే చదువులమ్మను పెళ్లి చేసుకున్నాడు ....అనుకుంటూ మురిసిపోయాడు. తమ కూతుర్ని ఊరిలో వదిలి భార్యాభర్తలిద్దరూ అమెరికా ప్రయాణమై వెళ్లారు. ఇక అమెరికా చేరుకున్నాక భార్గవ్ కి కూడా అదే యూనివర్సిటీ లో లైబ్రరీ లో సిస్టం అనలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. వినీత పోస్ట్ డాక్టోరల్ గైడ్ అందుకు చాలా హెల్ప్ చేసాడు. వినీత మంచితనం భార్గవ్ చురుకుతనం తో ఇద్దరు కష్టపడి సంపాదించింది సంపాదించినట్లు ఇండియా కు పంపించారు. రెండేళ్ల తరువాత వినీత కు ముద్దులు మూట కట్టే చిట్టి తల్లి టెడ్డి పుట్టింది. అంతలోనే పెద్ద పాప బార్బీని ఇండియా నుంచి అమెరికాకు తెచ్చుకున్నారు. ఇద్దరు పిల్లలతో ఉద్యోగ బాధ్యతల తో భార్య భర్త కు తమ సంతోషానికి కూడా టైం కేటాయించుకోవడానికి కుదరలేదు. పెద్ద పాప బార్బీ స్కూల్ కి వెళ్లడం మొదలు పెట్టింది. భార్గవ్ పాపను స్కూల్ లో దించి డ్యూటీ కి వెళ్ళిపోతే, వినీత త్వరగా యూనివర్సిటీ కి వెళ్లి పాప స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేది. భార్గవ్ తాను వచ్చేటప్పుడు చిన్న పాపను డే కేర్ నుండి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఈ ఉరుకుల పరుగుల జీవితంతో కాలం త్వరగా గడిచిపోయింది. కానీ ఇద్దరి మధ్య ప్రేమ లోపించడం మొదలయ్యింది. ఇప్పుడేమో .... అత్తగారు తనని కనీసం వంట గదిలో కి కూడా రానీయడం లేదు. ఆ వంట గదికి ఆమె రారాణి. అలా వినీత పదేండ్లు అమెరికాలో పనిచేసింది. సంపాదించిందంతా భర్త తల్లిదండ్రులకు పంపిస్తా ఉంటే భర్త తోటే కదా జీవితం అనుకుని ఊరుకునేది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమీ లేదు. అలా పంపించిన డబ్బుతో మామగారు చాలా పెద్ద ఇల్లు కట్టారు ఉమ్మడి జాగాలో. డబ్బులు వడ్డీకి తిప్పుతున్నారు. అంతా బాగానే ఉంది అనుకునేటంత లో ఉన్నట్లుండి వినీత భర్త భార్గవ్ తమ ఇద్దరు కూతుర్లను తీసుకొని ఇండియా వెళ్ళిపోయాడు. ఆ రోజు వినీత యూనివర్సిటీ నుండి ఇంటికి రాగానే..... భర్త ఆమెకు ఫోన్ చేసి తాము ఇండియా ఫ్లైట్ ఎక్కాము అని చెప్పాడు. నువ్వు ఇక్కడే ఉద్యోగం చేసుకో. నేను పిల్లలు ఇండియా వెళ్తున్నాము అన్నాడు. వినీత వెంటనే షాక్ కి గురి అయ్యింది. ఆమె తిరిగి ఎన్ని సార్లు ఇండియా కు ఫోన్ చేసినా భర్త ఫోన్ తీయలేదు. అత్తగారికి మామగారికి ఫోన్ చేసింది. అత్త "మీ ఇద్దరి మధ్య సమస్య ఏమిటి " అని తిరిగి అడిగింది. మామ "నాకేమి తెలుసమ్మా...వాడు నువ్వు మాట్లాడుకోండి" అన్నాడు. ఎవరూ కనీసం ఒక చిన్న రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే "నీ కాపురం నువ్వు నిలబెట్టుకో అమ్మా" అన్నాడు నాన్న. అమెరికాలో చాలా మంచి ఉద్యోగం ఆమెకు. ఆ మధ్య అనుకోకుండా యూనివర్సిటీ లోని లైబ్రరీ లో జరిగిన గొడవ లో భార్గవ్ ఉద్యోగం పోయింది. భార్గవ్ ఉద్యోగం పోయిన డిప్రెషన్ లో వినీత తనను అవమానిస్తోంది అనుకుంటూ ప్రతి రోజూ గొడవ. అప్పటికీ వినీత అతనిని అర్థం చేసుకుని సామరస్యంతో తన కాపురాన్ని ఒక సంవత్సరం నెట్టుకొచ్చింది. భార్గవ్ ఇక నేను ఎక్కడా ఉద్యోగం చెయ్యను, నాకేమి కావాల్సినంత సంపాదించాను అనుకుంటూ, భార్య భర్త సమస్యలను ఇండియా లోని తన అమ్మకు ఫోన్ చేసి చెప్తూ సమస్యను పెద్దది చేసుకున్నాడు. భార్య భర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను సాల్వ్ చేసుకోకుండా పిల్లలతో ఇండియా కు పారిపోయాడు . ఆమెకు ఏం చేయాలో తోచలేదు. పిల్లలు ఎక్కడుంటే తల్లి అక్కడే కదా. ఆమె వెంటనే ప్రయాణం అవ్వడానికి కుదరదు. యూనివర్సిటీ లో ప్రాజెక్టు పీక్ స్టేజ్ లో ఉంది. పూర్తి చేయడానికి ఇంకా రెండు నెలలు పడుతుంది. ఆ రెండు నెలల్లో ఆమె ఎంతో మానసిక ఆందోళనకు గురైంది. ఎప్పుడైనా పిల్లలకు ఫోన్ చేసినప్పుడు... వినీత చిన్న కూతురు టెడ్డీ అమ్మని ఎంతో మిస్ అవుతున్నాను అని చెప్పింది. కానీ పెద్ద కూతురు బార్బీ అసలు ఆ ఛాయలకే రాలేదు. అప్పటికే బార్బీ కి పన్నెండు ఏళ్ళు నిండాయి. బార్బీ ని పెద్ద వాళ్ళందరూ కలిసి మార్చేశారు. అమ్మ మీద ఎన్నో చాడీలు చెప్పేశారు. మరిది వడ్డీ వ్యాపారం అంటూ తన చదువును కూడా పక్కన పెట్టేసాడు. ఆడపడుచు ఆమె భర్త ఇద్దరూ తమ ఇద్దరి పిల్లలతో ఇక్కడే. ఆలోచన లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పటికప్పుడు పంపి తాము తప్పు చేసాము అనుకునింది వినీత. రెండు నెలల తర్వాత తన అమెరికా లోని ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తనకు ఉన్నటువంటి బాధ్యతలు అన్నిటినీ పూర్తిచేసుకుని వినీత ఇండియాకు వచ్చింది. తన అత్తగారి ఊరు పులివెందుల దగ్గర్లోని పల్లె. అక్కడికి వెళ్ళగానే తన కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరూ లేరు. భార్గవ్ ఆంటీ ముట్టనట్టు మాట్లాడుతూ ఆమెతో... చిన్న బిడ్డ టెడ్డి వినీత దగ్గరకొచ్చి అమెరికా చాక్లెట్లు, బొమ్మలు తీసుకుంది. అమ్మ మళ్ళీ ఎక్కడ కనిపించకుండా పోతుంది అని తనను వదలకుండా తనకు కబుర్లు చెప్తూ తన తోనే పడుకుని నిద్రపోవడం మొదలుపెట్టింది. కానీ పెద్ద బిడ్డ తనకు దూరం దూరంగా. వినీత కు అర్థం అయింది.... తను తన పెద్ద బిడ్డను కోల్పోతున్నాను. జాగ్రత్త పడకపోతే పూర్తిగా కోల్పోతాను అనుకున్నది. తన భర్త భార్గవ్ తో మాట్లాడదామంటే అతను తలవంచుకుని వెళ్ళిపోతున్నాడు. తను ఏదో పెద్ద తప్పు చేసినట్లు ఇంట్లో అందరి మౌనం. అవును మరి ఇన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి అమెరికాలో సంపాదించిన మొత్తం ఇండియా కు పంపించేశారు. భర్త అమెరికాలో ఉద్యోగం మానేసి ఇండియాకు వచ్చేశాడు. నేను ఇక ఏ ఉద్యోగం చేయను అంటున్నాడు. ఇప్పుడు వినీత డబ్బు కోసం ఎక్కడ తమను ప్రశ్నిస్తుందోనని ఆ మౌనం. అది తన కుటుంబం అనుకునింది వినీత. తన కుటుంబాన్ని తాను ఏమని ప్రశ్నించాలి. చివరికి ఒకరోజు భార్గవ్ ని నిలదీసింది వినీత. అతను ఆమెకు ముఖం చూపించలేక ఆమెతో మాట్లాడుతూ నువ్వు మళ్ళీ ఉద్యోగం చూసుకో అన్నాడు. అవును ఇది పూర్తిగా అత్తగారి సామ్రాజ్యం. ఆమె ఇంట్లో ఒక సేవిక గా కూడా వినీత కు ప్రవేశం లేదు. ఇలాగే ఉంటే తను తన భర్తను తన పిల్లల్ని కోల్పోతానని నిర్ణయించుకుని... తన ప్రొఫెసర్ తో మాట్లాడి వినీత హైదరాబాద్ లో ఒక ఉద్యోగం సంపాదించింది. పిల్లలను పై చదువు అనే పేరిట హైదరాబాద్ కు తీసుకెళ్లి చేర్పించింది. తిరిగి తన బొమ్మరిల్లు కట్టుకోవడం ప్రారంభించింది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల