దానం - డా. లక్ష్మి రాఘవ

danam

“ఇంకా ఈడ ఉండొద్దు. ఎల్లిపోదాం బెంగలూరికి“ మల్లేషు మాటలకి రంగి పొయ్యిమీద ఉడుకుతున్న నూకలు కలియబెడుతూ వెనక్కి తల తిప్పి చూసింది. ఈ మధ్య కూలికి పోదామన్నా సరిగా దొరకక శానా ఇబ్బంది అవుతా వుంది. “ఆడకు పోయినా బాగా బతుకు తామని గ్యారెంటీ ఏముంది?” “నీకన్నీ అనుమానాలే. బాగా బతకొచ్చు అని సేప్పుతున్నా గదా” “నలుగురు కూడుకుని పోతే కూలీ దొరికే ఏర్పాటు వుంటది గానీ, ఇట్టా ఒంటరిగా పోతే ఎట్టా ఎతుకుతావు? “మొన్న రోసయ్యన్న వెళ్ళాలా. బెంగళూరు పొలిమేర్లలో దిగిపోతే బోలెడన్ని ఇల్లు కడతన్నారంటా...అక్కడ దిగేసి ఎతుక్కోవడమే” “మనమిద్దరమే కదా ఉండేది ఒకదగ్గర వుందాము. నిన్ను ఒదిలి నేను పోయినా మనసంతా ఈడనే వుంటాది. నీవు కూడా నేను ఏమి సేస్తా వున్నానో అని బెంగెట్టు కోవా ఏందీ. లేకపోతే మీ పుట్టినింటికి పోవాల...” పెళ్లి అయ్యి సంవత్సరానికే సాకలేక పుట్టింటికి పంపినాడని అంటారని ఇష్టం లేదు మల్లెశుకు

“నేను పోను...నీతోనే వస్తాలే...ఎబ్బుడు పోదాము?” సంగటి కెలికి దించింది రంగి. “ఈయాల కూలి డబ్బులు ఇస్తామన్నారు . తీసుకుని ఎల్లిపోదాము. పదిరోజుల్లో ఏదైనా పని దొరుకుతాది లే” దయిర్యంగా అన్నాడు మల్ల్లేషు.

‘”రేపు బెంగళూరు లో ఉంటాము ఎట్లనో ఏమో...”అనుకుంది రంగి.సాయంకాలం కూలీ డబ్బులు తీసుకుని వచ్చినాడు మల్లేషు. బట్టలు ఒక బాగ్గు లోకి సర్దుకున్నారు. బస్సు ఎక్కి బెంగళూరు దారి పట్టినారు.బెంగళూరు మొగదాలే దింపాలని కండెక్టరు కు చెప్పినారు. మూడు గంటల ప్రయాణం తరువాత కండెక్టరు “దిగండి ఇక్కడే”అని దిన్చేసినాడు. రోడ్డుకు దూరంగా కడుతున్న పెద్ద బిల్డింగులు చూసి శానా సంతోషపడినారు. కొంచెం దూరం నడిచి బిల్డింగుల కట్టడాల దగ్గరికి చేరినారు.

చిన్న కొట్టు ఒకటి వుంటే అడిగినారు’ఇక్కడ కూలి పని దొరుకుతుంది కదా’ అని .“కూలిపని చెయ్యడానికి కాంట్రాక్టు మేస్త్రీ దగ్గర ఉంటేనే..”అన్నాడాయన “అంటే ..” “లోపల మేస్త్రీ ఉంటాడు అడగండి..” అని చెప్పినాడు. కొంచెం నీడలో కూర్చుని తాము తెచ్చుకున్న అన్నం ముద్ద కొంచెం తిని నీళ్ళు తాగినాడు. రంగిని అక్కడే కూర్చోమని చెప్పి బిల్డింగు లోపలి వెళ్ళినాడు. మేస్త్రీ “కొత్తోల్లను తీసుకోవాలంటే ముందే మిత్తీ కట్తల. ఒక ఐదునూర్లు కట్టితే పని ఇస్తారు. మళ్ళీ కూలిలో కొంచెం డబ్బులు పట్టుకుంటారు...ఒప్పుకుంటే చేరు’ అన్నాడు.
‘నాదగ్గర రెండు నూర్లేవున్నాయి...అవి ఇస్తా. ఇంకా దినామూ వచ్చే కూలితో తినాల మేము అంతే” నిరాశగా అన్నాడు మల్లేషు.
“రెండు నూర్లు ఇచ్చి చేరు. దినామూ కూలి దొరుకుతాది. ఇంకో బిల్డింగు ఒప్పుకున్నా. దానికి పోతే నీకు కూలి ఎక్కిస్తా...’అని చెప్పితే ఒప్పుకొని రంగి దగ్గరికి వచ్చినాడు.

‘రంగీ, సిటీ లో దుడ్డ్లు సంపాదించేది సులబం కాదె. వచ్చినాము కాబట్టి రెండు నెలలు పనిచేసి వూరికి ఎల్లిపోదాము” అన్నాడు.
ఒక వారం ఎట్లనో గడిచింది. పండుకోవడానికి చోటు లేక కడుతున్నబిల్డింగ్ అంచున ఉండసాగినారు. ఏదో తుఫాను ఎచ్చరిక అని ఆరోజు కూలికి ఎవరూ రాలేదు. విపరీతమైన ఈదురు గాలి వచ్చి వాన మొదలైంది. ఒక మూలగా కూర్చుంది రంగి. బాగా చలి పెడతావుంటే బొంత కప్పుకుంది . వాన విపరీతం అవుతూంటే మల్లేషు చూస్తా ముందర భాగం లో నిల్చున్నాడు... మూడు గంటలు గడిచినా వాన తగ్గలేదు. ఎక్కువ అవుతూనే వుంది. అర్దరాత్రి సమయం లో బిల్డింగ్ లో ఒక భాగం కూలింది. సరిగ్గా మల్లేషు నెత్తి మీద స్లాబు విరిగి పడింది.
“అయ్యో ..”గట్టిగా అరిచింది రంగి.

మల్లేషు కదలలేదు. తలలోనించి రక్తం కారుతూంది. గట్టిగా కేకలు పెట్టింది రంగి. వెంటనే పక్కన వున్న బిల్డింగు దగ్గరకు పరిగెత్తింది. ఆమె కేకలకు అక్కడి వాళ్ళు లేచి వచ్చి చూసి 108 కు ఫోను చేసినారు మల్లేషు తో బాటు రంగి కూడా ఆస్పత్రి కి పోయి౦ది. డాక్టర్ “మీ ఆయనకు తల బాగా తగిలింది ‘అని చెప్పినారు.

బ్రెయిన్ డెడ్ అయిన మల్లేషు లోని అవయవాలు ఉపయోగపడతాయి. అది అర్థం అయ్యేలా రంగికి చెప్పినారు. ఒక యాభై వేలు నీకు ఇస్తాం” అని ఒప్పించినారు. అమాయకురాలైన రంగి పేపర్ మీద వేలి ముద్ర వేసింది. అవయవాలు ఆస్పత్రి వారు తీసుకున్నారు. లక్షలకు అమ్ముకుని యాభైవేలు రంగి చేతిలో పెట్టినారు. మల్లేషు ను అనాధ శవం లాగా దానం చేసినారు. యాబై వేలు దాచుకుని “నీవు చచ్చికూడా ఇంత డబ్బు నాకు అందేటట్టు చేసినావా”అని మల్లెషుని తలుచుకుని ఏడిచింది రంగి వూరి బస్సు ఎక్కి కూర్చొని. మల్లేషు అవయవాలు 6 మందికి ప్రాణాలు పోశాయి...కొన్ని లక్షలు అక్రమార్కులకు చేరాయి.

రంగి తనకిచ్చిన యాభై వేలే “ఎంత డబ్బో...”అనుకుంది అమాయకంగా. ఇలా కూడా అవయవ దానం జరుగుతుంది మరి.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి