Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

స్వీట్ మెమొరీ
అప్పుడెప్పుడో 'కలక్టర్ జానకి' సినిమాలోని ఓ మోడ్రన్ హరికథ పాటలో 'హైద్రాబాద్ ఫేమస్ పుల్లారెడ్డి స్వీటైనా' అంటూ రాశారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. ఆ తర్వాత ఆ ప్రసక్తి వచ్చిన మరో హిట్ సాంగ్ -  'సింహాద్రి' సినిమాలోని 'నువ్ విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి' .

ఈ పాట వెనుక గల ఇంట్రస్టింగ్ స్టోరీ ఏటంటే  ఓ రోజు కీరవాణి  స్వీట్లు కొందామని పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ కి వెళ్ళారు. అక్కడ చేతికి గ్లౌస్ వేసుకుని నీట్ గా , హైజీనిక్ గా స్వీట్లు ప్యాక్ చెయ్యడం చూడగానే కొన్ని పదాలు ఆయన మనసులో మెదిలాయి.  వాటిని ఓ ట్యూన్ ప్రకారం అనుకుంటూ లైన్ లో పెట్టే సరికి అవి  'నీ అధరామృతం పుల్లారెడ్డీ - అర కేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ '  గా రూపొందాయి. ఇదేదో బావుందనుకుని రాసి వుంచుకుని 'సింహాద్రి' సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో బైట పెట్టారాయన. లైన్లు బావున్నాయి కానీ హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యాలంటే ఇంకేదో వుండాలి.

అప్పుడు చంద్రబోస్ 'నువ్ విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి - అది వినబడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డీ' అనే పల్లవిని ఇచ్చారు. అందరూ బావుందనుకున్నారు. ఒకే అయింది. మరీ కీరవాణి గారు రాసుకున్న రెండు లైన్లు ? అవి హీరో పాడడానికి అనువుగా వున్నాయి కాబట్టి,  అనుపల్లవిగా మార్చేస్తే బావుంటుందనుకున్నారు. తర్వాతి చరణాలను చంద్రబోస్ రాసేశారు. అలా పూర్తయిందా పాట. ఇదీ ఆ పాట స్టోరీ ...

పకడో పకడో
ఈ స్టిల్స్ అన్నపూర్ణా వారి 'వెలుగు నీడలు' సినిమాలోని 'ఓ రంగయో పూలరంగయో' పాట లోనివి. సినిమా మొదటి సగంలో నాగేశ్వరరావు, సావిత్రి బోట్ మీద వెళుతుండగా 'ఓ రంగయో' పాట వస్తుంది. విధివశాత్తూ సావిత్రి - నాగేశ్వరరావుని కాకుండా జగ్గయ్యని పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. వాళ్ళు కూడా బోట్ మీద వెళుతుండగా అదే పాట రిపీట్ అవుతుంది. ఇవి రెండు సీన్ లు..

ఆ రోజుల్లో అన్నీ చక్కగా ప్లాన్ చేసేవారు. ఈ రెండు సీన్ ల లోనూ సావిత్రి కామన్. మారవలసింది నాగేశ్వరరావు, జగ్గయ్య మాత్రమే. కొంత పోర్షన్ నాగేశ్వరరావు గారితోనూ, కొంత జగ్గయ్య గారి తోనూ చిత్రీకరిస్తే రెండు సీన్ లు అతి తక్కువ వ్యవధిలో అయిపోతాయి. అవుట్ డోర్ ఖర్చులు కూడా కలిసొస్తాయి. జస్ట్ సావిత్రి మేకప్ లో మార్పు వుంటే చాలు.

ఫొటోలు జాగ్రత్తగా గమనించండి. రెండు సీన్ ల లోనూ సావిత్రి హెయిర్ స్టయిల్ లో మార్పు లేదు. కట్టుకున్న చీరలో మార్పు లేదు. ఇయర్ రింగ్స్ తీసేసి దుద్దులు పెట్టారు. పెళ్ళయినట్టుగా నల్లపూసలు పెట్టారు. అంతే ... ఎంత తెలివిగా ప్లాన్ చేశారో చూశారా ?

చాలామంది పెళ్ళయ్యాక రెండు జడలు మానేసి ఒక్క జడే వేసుకుంటారు. ఇక్కడ ఆ మార్పు కూడా లేదు. అయినా ప్రేక్షకులు పట్టించుకోలేదంటే అంతగా లీనం చేసుకునే శక్తి ఆ కథలో వుందన్నమాట.






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam