నాగార్జున ద్విపాత్రాభినయంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. ఈ సినిమాలో తండ్రీ, కొడుకులుగా నాగార్జున నటిస్తున్నారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో స్వయంగా నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నాగార్జున. చాలా కాలం తర్వాత నాగార్జున ద్విపాత్రాభినయంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్‌లో నాగార్జున లుక్ చూసి అక్కినేని అభిమానులు ఫ్లాటైపోయారు.
నాగార్జున తనయులిద్దరూ హీరోలుగా తెరంగేట్రం చేసేసినా, వారికి ధీటుగా నాగార్జున హ్యాండ్సమ్ లుక్‌తో అమ్మాయిల మదిని దోచేస్తున్నాడు. తనదైన మేనరిజమ్స్‌తో నాగార్జున ఈ చిత్రంలో చెలరేగిపోయాడట. ఆద్యంతం అలరించేలా చక్కటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ఎమోషన్స్‌ని మిక్స్ చేసి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలచాడని అంటున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 27న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ చక్కటి మ్యూజిక్‌ను అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|