స్వామి వివేకానంద జీవించినది 39 సంవత్సరాలే. కానీ భారతజాతిలో ఆయన నింపిన స్ఫూర్తి కొన్ని వందల సంవత్సరాలకు సరిపడవుంది.
నేటి యువతకు స్ఫూర్తి, చైతన్య దీప్తి, స్వామి వివేకానంద. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియశిష్యులు, వేదాంత, తత్త్వ శాస్త్రములతో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఆధ్యాత్మిక నాయకుడు.
తన ఉపన్యాసాల ద్వారా భారతదేశాన్ని జాగృతము చేయటమే కాకుండా, పాశ్చాత్య దేశాలలో కూడా హిందూ మత గొప్పతనాన్ని గురించి ఉపన్యాసాలు చేసారు. "హిందూత్వం అంటే మతం కాదని అది జీవన విధానం అని చెప్పిన జ్ఞాని శ్రీ వివేకానంద.
దేవుడి గురించి ఆయన జరిపిన అన్వేషణలో భాగంగా, శ్రీ రామకృష్ణుల వారిని కలిసిన తర్వాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడుగా మారారు.
భారతదేశం ఇల్లు అయితే, ప్రజలు ఆయనకు సోదర, సోదరీమణులు అయ్యారు. "ఆకలితో వున్న వారికి మతం గురించి చెప్పొద్దు. అన్నం పెట్టండి" అనేవారు. పేదవాడిని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అని చెప్పేవారు. ఇతర మతాలను, ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోనూ, సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి వుంటుందని భోదించారు.
ఆయన దేశమంతా పర్యటించారు. కమండలము, కాషాయము ఆయన ఆస్తి. కఠిన బ్రహ్మచర్య దీక్షలను పాటించేవారు. కటిక నేలపై పడుకునేవారు.
"నీ శక్తే నీ జీవితం. నీ బలహీనతే నీ మరణం" ఇటువంటి ఎన్నో అమూల్యమైన జీవితసత్యాలను చెప్పిన మహనీయుడు.
1893 సెప్టెంబరు 11న చికాగోలో స్వామి సర్వమత సమ్మేళనంలో ప్రసంగించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. భారతదేశ చరిత్రలో ఇది అపురూపమైన ఘట్టం.
యువత నిర్జీవంగా వుంటే ఆ దేశ ప్రగతి కుంటుపడుతుందని చెప్పారు. శక్తివంతమైన యువతతోనే దేశాభివృద్ధి వుంటుందని నిరూపించారు.
అందుకే ఆయన జన్మదినమైన జనవరి12 వతేదీని "జాతీయ యువజనోత్సవంగా" జరుపుకుంటున్నాము.
జననం - బాల్యం
వివేకానందుడి తండ్రి విశ్వనాథుడు. పేరుపొందిన న్యాయవాది. అడిగినవారికి లేదనకుండా దానం చేసే దానగుణం కలవారు. తల్లి భువనేశ్వరీ దేవి కూడా ధర్మాత్మురాలు. భక్తురాలు. సాధ్వీయతల్లి. వీరు కలకత్తాకు చెందిన కాయిస్థ క్షత్రియ కుటుంబీకులు. వీరి కుటుంబం కొన్ని వందల సంవత్సరాల నుంచి సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ, పాండిత్యంలోనూ, వితరణగుణంలోనూ మంచిపేరు ప్రఖ్యాతలు ఆర్జించుకున్నారు. భువనేశ్వరీదేవి, విశ్వనాధులకు జనవరి12వ తేదీ, 1863 వ సంవత్సరంలో వివేకానందుడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి మొదట "వీరేశ్వరుడు" అని పేరుపెట్టాడు. తర్వాత ఆపేరు నరేంద్రనాథ్, నరేంద్రుడుగా నామాంతరము చెందింది.
బాల్యంలో నరేంద్రుడు చాలా అల్లరి చేసేవాడు. అతని అల్లరికి విసుగు చెంది, అప్పుడప్పుడూ భువనేశ్వరీ దేవి అతనిని చల్లటి నీటి ధార క్రింద కూర్చోబెట్టేవారట.
నరేంద్రుడు ఇలా అల్లరి చిల్లరిగా వున్నప్పటికీ తల్లి చెప్పే "రామాయణం, భారతం మొదలైన కథలను చాలా ఆసక్తితో వినేవాడు.
ఆ మాతృమూర్తి నరేంద్రునకు చిన్ననాటి నుండీ ఉగ్గుపాలతో నూరిపోసిన భగవద్భక్తియే అతనిని లోకోత్తర పురుషుడుగా తయారుచేసింది. నరేంద్రుడికి దైవధ్యానం బాల్యం నుంచే అలవాటైనది.
అతను సుమారు 5సంవత్సరాల వయస్సులో, ఒకరోజు ధ్యానములో మునిగివుండగా, పెద్ద నాగుపాము అతని ముందు ప్రాకసాగింది. అక్కడే వున్న తోటి బాలురు దానిని చూచి భయపడి నరేంద్రుని అక్కడ్నించి లెమ్మని కేకలు వేశారు. కాని అతనికి ఆకేకలు వినబడలేదు. తన ధ్యానంలో తను నిమగ్నమయి వున్నాడు. కొంచెం సేపటి తర్వాత ఆ పాము అక్కడ్నించి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి నరేంద్రుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. పాము వచ్చినా పారిపోలేదు ఏమిటని అతని తల్లిదండ్రులు ప్రశ్నించగా, తనకా సంగతే తెలియదనీ, ధ్యానంలో హాయిగా వున్నదని నరేంద్రుడు జవాబిచ్చాడు.
(... ఇంకా వుంది)
|