రిస్కులు చేసే వయసు దాటిపోయింది - ఎన్టీఆర్
ఎన్టీఆర్ కెమెరా ముందుకొస్తే.. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఖాయం అంటుంటారు దర్శకులు.
ఎన్టీఆర్‌లా డాన్సులు చేయలేరు.. అంటుంటారు హీరోయిన్లు.
ఎన్టీఆర్‌లా డైలాగులు చెప్పడం కష్టం.. అంటుంటారు తోటి నటులు.
టోటల్‌గా ఎన్టీఆర్ ఓ తిరుగు లేని ఆల్ రౌండర్. అతని స్టార్ డమ్‌కి అంతులేనంత నటన తోడైంది. దాంతో... వెండి తెరపై తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో వరుసగా రెండు హిట్లు కొట్టాడు. జనతా గ్యారేజ్‌తో హ్యాట్రిక్‌కు సిద్దమయ్యాడు. ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో జరిపిన స్పెషల్ ముచ్చట్లు.
* హాయ్ ...
- హాయండీ...
* జనతా గ్యారేజ్‌రిపోర్ట్ ఏంటి?
- అంతా హ్యాపీనే. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్ వస్తున్నాయి. ఐ యామ్ హ్యీపీ.
* అసలు ఈ సినిమా చేయడానికి కారణం ఏమిటి?
- కథే మొదటి కారణమండీ. చాలా గొప్ప కథ. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. అన్ని రకాల ఎమోషన్స్ బాగా పండాయి. నేనే హీరో అని చెప్పడానికి లేని కథ ఇది. కథలో అన్ని పాత్రలకూ సమానమైన స్థానం ఉంది. రభస టైమ్‌లోనే కొరటాల శివ నాకు చెప్పారు. ఆ తరవాత ఎన్ని సినిమాలుచేస్తున్నా.. జనతా గ్యారేజ్ కథ, అందులోని డైలాగులు, సన్నివేశాలూ నన్నువెంటాడేవి. ఫైనల్‌గా.. సినిమా చేశాం.. మీ ముందుకూ వచ్చేసింది.
* ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిందే అని కొరటాల శివని ఫోర్స్ చేశారట..
- అదంతా అబ్దమండీ. నేనెవరినీ ఫోర్స్ చేయను. ఫలానా వాళ్లతో సినిమా చేయాలి అని ఎప్పుడూ అనుకోను. రేపు ఎవరితో సినిమా చేస్తా అనే విషయం గురించి కూడా పెద్దగా ఆలోచించను. నా కెరీర్‌లో ఏదీ ప్లాన్ ప్రకారం జరగలేదు. అన్నీ అలా అయిపోయాయంతే. జనతా గ్యారేజ్ కూడా అంతే.
* కొరటాల శివలో మీకు నచ్చిన అంశం ఏమిటి?
- ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. అన్నీ తెలిసినప్పుడు స్వతహాగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ.. ఆయనలో అది కనిపించలేదు. దానికి తోడు బీభత్సమైన క్లారిటీ. అందరితోనూ కలివిడిగా ఉంటారు. అందరితోనూ ఆయన ఇంట్రాక్షన్ చాలా బాగుంటుంది. టీమ్ లో ఉన్నవాళ్లందరి బలాలు, బలహీనతలూ తెలిసిన వ్యక్తి. కాబట్టే... ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా పూర్తయ్యింది.
* మోహన్‌లాల్ పాత్ర మిమ్మల్ని డామినేట్ చేసేసిందని కొందరి అంటున్నారు..
- ఈసినిమా గొప్పదనం ఏమిటంటే.. ఏ పాత్ర ఎవ్వరినీ డామినేట్ చేయదు. ఆ అవసరం కూడా రాలేదు. కథలో ప్రతీ పాత్రా కీలకమే. సినిమా పూర్తయి బటకు వచ్చినప్పుడు అన్ని పాత్రలూ కళ్లముందు కదలాడతాయి. ఈ సినిమా నన్ను ఒకవేళ మోహన్‌లాల్ పాత్ర నిజంగానే డామినేట్ చేసినా మంచిదే. ఎందుకంటే ఆయన పాత్ర కూడా అంత గొప్పగా ఉంటుంది.
* ఈ సినిమాలో సందేహం ఇవ్వాలని ప్రయత్నించినట్టు అనిపించింది..
- నాకు సందేశాలపై నమ్మకం లేదండీ. మనం చెబితే జనం వింటారు అనుకోవడం మూర్ఖత్వమే. ఏం చేయాలో, ఏం చేయకూడదో జనాలకే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. కొరటాల శివగారిలో గొప్పదనం ఏమిటంటే.. ఆయన ఏ కథ రాసినా ఆషామాషీగా రాయరు. ఏదో ఓ మంచి విషయం ఉంటుంది. కానీ దాన్ని బలవంతంగా ఇరికించినట్టు అనిపించదు. జనతా గ్యారేజ్‌లోనూ అదే కనిపిస్తుంది.
* ప్రతీ సినిమమాకీ.... ఎన్టీఆర్ డాన్సులు ఇరగదీస్తాడన్న అంచనాలు పెంచుకొంటూ వస్తున్నారు ప్రేక్షకులు. దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు?
- కథని బట్టి పాటలు, పాటల్ని బట్టి డాన్సులూ ఉంటాయి. బలవంతంగా డాన్సులు చేస్తే జనం చూడరు. నాచోరే నాచో రే స్టెప్పులు అన్ని సార్లూ వేయడం కుదరదు.
* మరి ఫైటింగుల మాటేంటి? రిస్కీ ఫైట్లు చేసే విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
- ఇది వరకు మొండిగా రిస్క్ తీసుకొని మరీ ఫైటులు చేసేవాడ్ని. ఎముకలు విరిగినా మళ్లీ అతుక్కుపోతాయన్న నమ్మకం. కానీ.. ఇప్పుడు ఆ వయసు దాటేసింది (నవ్వుతూ) అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నా.
* కెమెరా ముందుకొచ్చేటప్పుడు ఎలాంటి కసరత్తులు చేస్తుంటారు? అంత సహజంగా నటిస్తుంటారు కదా, ఆ రహస్యం ఏమిటి?
- రిహార్సల్సూ, రిఫరెన్సుల మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఆ సంఘటన నిజంగానే నాకు ఎదరైతే ఏం చేస్తాను? అంటూ ఊహల్లోకి వెళ్లిపోతా అంతే. అంతకు మించి మెథడ్ యాక్టింగ్ అంటూ ఏమీ లేదు.
* మంచి వయసులో ఉన్నప్పుడు ప్రేమకథలు చేయలేకపోయాన్నన్న లోటు ఉందా?
- ఉందండీ. మాస్ ఇమేజ్ నాకు చాలా తొందరగా వచ్చేసింది. అప్పుడు యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేశా. ఇప్పుడు లవ్ స్టోరీలు చేస్తే బాగోదు. పెళ్లయి బాబు కూడా ఉన్నాడు కదా, నాకే సిగ్గుగా అనిపిస్తుంది.
* స్టార్ డమ్‌పై మీకున్న అభిప్రాయాలేంటి?
- స్టార్‌డమ్, ఇమేజ్.. ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచిస్తే బాగుంటుంది. నేను బేసిగ్గా నటుడ్ని. అలా అనుకొంటేనే మంచి పాత్రలు చేయగలం. స్టార్ డమ్ అనేది బ్యాగేజీ లాంటిది. అది మోసుకొంటూ ఎక్కువ దూరం ప్రయాణించకూడదు,.
* మరి మీ ఆశయం ఏమిటి?
- మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి కొడుకుగా మిగిలిపోవాలి. అంతకు మించి ఆశయాలేం లేవు. ఈరోజులో బ్రతకడం నాకు ఇష్టం. అంతకు మించి ఏం కోరుకోను.
* తదుపరి సినిమాలేంటి?
- ఇంకా ఏం అనుకోలేదు. జనతా తరవాత కొంతకాలం విరామం తీసుకొంటా. ఆ తరవాత కొత్త సినిమా ఏమిటో చెబుతా.
|