Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Raja Music Muchchatlu

ఈ సంచికలో >> సినిమా >>

ఆదిత్య హృదయం

Aditya Hrudayam

1) "Gorgle" after you 'slip' = "Gossip"
నా దృష్టిలో 'గాసిప్' అంటే, ఒక వార్తని టేస్ట్ కోసం 'సిప్' చేసి, వెంటనే గార్గుల్ చేసి ఊసెయ్యాలి. టేస్ట్ బావుందని లోపలికి తీసుకుంటే అది మానసిక అనారోగ్యానికి దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మానసిక అనారోగ్య అయోగ్యుల వల్ల మానవ సంబంధాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి కూడా -

అంతర్జాల మాయాజాలంలో ఎక్కువమంది త్వరగా వల్లో (నెట్ లో) పడాలంటే ఎల్లో న్యూస్ హల్లో అనాలి. లేకపోతే ఆకట్టుకునే అంశాలేవీ కనపడక వెబ్ చారులు ఆయా సైట్లని 'ఎల్లెహే! అంటారు. వాళ్ళే ఓ బ్లాగ్ ఓపెన్ చేసుకుని వాళ్ల ఆనందం మేరకు నచ్చినట్టు రాసేసుకుంటారు.

సిరాశ్రీ గారు నాకు ఈ స్పేస్ ఇచ్చినట్టు ఎవరు ఎవరికైనా ఇలా ఇవ్వచ్చు లేదా, వాళ్ళే తీసేసుకోవచ్చు - దీనికి నిర్దిష్టమైన ప్రాతిపదికలేవీ లేవు.

అయినా సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ వార్తల్ని రాసే వెబ్ సైట్లు చాలావరకూ ఎవరి ఇమేజ్ లనీ డామేజ్ చేసేంత క్రూరంగా మాత్రం లేవు.

ఎప్పుడో ఓసారి కొంతమంది విషయాల్లో శృతిమించినా కూడా మన పాత్రికేయులు వాస్తవం 50 శాతం అయితే, వాళ్లు తీసుకునే లిబర్టీ కేవలం 10,15 శాతం మాత్రమే ఉంటుంది. అదే ఇతర భాషల్లో, ముఖ్యంగా హిందీ సినీ ఫీల్డు వార్తల్లో 10 శాతం ఉంటే, పాత్రికేయులు 'కుక్ అప్' చేసే వార్తల లిబర్టీ 90 శాతం దాకా ఉంటుంది.

మన సినీ పాత్రికేయులు వ్యక్తిగతంగా పరిశ్రమ ప్రేమికులు - పరిశ్రమలో చాలా మందికి స్నేహితులు - తర్వాతే వృత్తిరీత్యా పాత్రికేయులు - అందుకేనేమో వ్యత్యాసం తక్కువ, వాస్తవం ఎక్కువ.

నా 'నేనున్నాను' సినిమా జరుగుతున్న టైం లో ఓ రోజు రాత్రి 12 గంటలకి నాకు టీవీ 9 ఆఫీసు నుండి ఓ జర్నలిస్ట్ ఫోన్ చేశారు. "మీరు డిల్లీ లో ఉన్నారా... ఎవరో లేడీ ఆర్టిస్ట్ హీరోయిన్ గా ఛాన్స్ అడిగితే రేపు ఉదయం హోటల్ కొచ్చి ఒంటరిగా కలవమన్నారా?" అని.

ఆ సమయంలో నేను, హైదరాబాద్ రవీంద్రభారతి లో కర్నాటిక్ క్లాసికల్ కచేరీ ఇచ్చిన నా బాల్యమిత్రులు మల్లాది బ్రదర్స్ (శ్రీ రామ్ ప్రసాద్, రవి కుమార్)ని నా కారులో ఎక్కించుకుని, క్రాస్ రోడ్స్ లో వాళ్ళున్న హోటల్ ఖాళీ చేయించి, సామానుతో సహా మా ఇంటికి తీసుకెళ్తున్నాను. నా డ్రైవింగ్ లో, సగం నిద్రలో. ఆ ఫోన్ కాల్ పుణ్యమా అని నా నిద్ర ఎగిరిపోయి, నా మిత్రులిద్దర్నీ సేఫ్ గా మా ఇంటికి తీస్కెళ్ళాననుకోండి.

ఇలా ఓ న్యూస్ రాగానే క్రాస్ చెక్ చేసుకునే కల్చర్ మన తెలుగు మీడియా జర్నలిస్ట్ లు అందరికీ ఉంది.

సాధారణంగా ఈ గాసిప్స్ లో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, తెలీకుండా రెండో వ్యక్తి నష్టపోవడం ఎక్కువ జరుగుతుంది. అది పెద్ద నష్టమే అయినా... వారించలేనిది, నివారించలేనిది. అందుకే పబ్లిక్ ఇంటరెస్ట్ కోసం ఈ సిప్స్ ని టేస్ట్ చేసి, గాగుల్ చేసి వదిలెయ్యాలి. అంతే...

2) "స్లిప్స్" :- అంటే, టంగ్ 'స్లిప్స్' పరిశ్రమలో వ్యక్తులు నలుగురు కలిస్తే, సాధారణంగా ప్రతి ఒక్కరూ పాటించే నానుడి "ఆత్మస్తుతి, పరనింద". ఆ పరనిందలో భాగమే ఎక్కువగా టంగ్ 'స్లిప్స్'. మన ప్రతిభను చాటుకోవడం కోసం పక్కవాడి గురించి బలహీనంగానో, హీనంగానో మాట్లాడటం.

3) "చిప్స్" :- ఇవి ప్రతి మందు పార్టీలోనూ, మందు మీటింగ్ లోను మంచింగ్ లన్నమాట. స్పైస్ కోసం మంచింగ్ లో మంచిని కాకుండా చెడునే ఎక్కువగా మాట్లాడుకోవడం వల్ల వీటిని "చిప్స్" లా హాట్ గా ఉండేలా చూసుకుని ఆ టైం కి ఆత్మానందం పొందడం. కొందరు వివేకులు మత్తు దిగాక మర్నాడు మర్చిపోతారు. కొందరు మేధావులు మర్నాటి నుంచి వాటిని ప్రచారం చేస్తూ పొట్టపోసుకుంటారు. కొందరి గొంతు నొక్కి, అన్నం తినలేకుండా చేసి తమ కడుపు నింపుకోవడం వీరి నైజం - ఇది నిజం.

4) "చీప్స్" :- పరిశ్రమలో పనిచేసే వారందరికీ ఓ ఐ. ఏ. ఎస్. ఉద్యోగం లాగో, డాక్టర్ లాగో, ఇంజనీర్ లాగో ఒకే విధమైన ఎడ్యుకేషన్, ఒకే రకమైన పెంపకం ఉండాల్సిన అవసరం లేదు, ఆ అవకాశం కూడా లేదు. 'సినిమా' అనే వ్యామోహంతో ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకునే సమిష్టి పరిశ్రమ కాబట్టి అందరి మైండ్ సెట్లూ సంస్కారంతోనూ ఉండాలని రూలేం లేదు. ఎవరి పరుగు వారిది. ఎవరి ప్రతిభ వారిది. సక్సస్సే నిర్ణయాత్మక సూత్రమై పరిపాలించే పరిశ్రమ ఇది. వారి వ్యక్తిగత సంస్కారం ఏమాత్రం అవసరం లేని ఏకైక ప్రతిభావేదిక ఇది. దీనిమీద ఆ రోజు ఇచ్చే ప్రదర్శనే ప్రాధాన్యం - ప్రామాణికం. అలా కొన్ని చీప్ మైండ్లు అద్భుత ప్రతిభతో పైకొచ్చి, కొందర్ని సాధికారికంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఈ పరిశ్రమలో ఎక్కువే. ప్రసాద్ ల్యాబ్ లో ఓ సంగీత దర్శకుడు ప్రారంభించిన దుష్ప్రచారం ఓ గాయని కుటుంబ జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన సంఘటన నాకు తెలుసు. అలాంటి ప్రచారాలు "చీప్స్".

5) ఎక్సెట్రా :- ఎక్సెట్రాలంటే ఆ పేరులాగే ఎక్స్ ట్రాలన్న మాట. కొబ్బరి బొండాం గానీ, జ్యూస్ గానీ ఆస్వాదించాలంటే స్ట్రాలు అవసరం. ఎదుటివారిని మానసికంగా ముందు దెబ్బతీసి, తర్వాత వారిని మనదారిలోకి తెచ్చుకుని పనిచేయించుకోవడానికి కొందరు వాడే స్ట్రాలు ఈ ఎక్స్ ట్రాలు. వాళ్లకి ఆ వ్యక్తే కావాలి - కానీ తను అనుకున్నట్లు చేయాలి - అదే వారి వ్యాపార విజయం, వ్యవహార దక్షత.

ఇవండీ ఈ వారం విశేషాలు...            
వచ్చేవారం "తల్లీ, తండ్రీ, గురువు, దైవం" అని హెడ్డింగ్ పెడితే ఈ కాలం చదివినంత ఇంటరెస్టింగ్ గా చదువుతారా? చూస్తాను...





మీ
వి.ఎన్.ఆదిత్య

మరిన్ని సినిమా కబుర్లు
extra income for cini poets