Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

బెదిరిస్తే భయపడటం - .

potential victims

ఈ bullying అనేది, కొంతమందికి చిన్నప్పటినుంచీ అలవాటవుతుంది. స్కూల్లో ఒక్కొక్కప్పుడు చిన్న్న పిల్లల్ని చూస్తూంటాము, తమకంటే బలహీనంగా కనిపించిన మిగిలిన పిల్లలమీద దాష్టీకం చేస్తూంటాడు.నోరూ, కండబలం ఉంది కదా అని ధైర్యం.మనలో చాలా మందికి ఈ bullies తటస్థపడుతూనే ఉంటారు దైనందిన జీవితంలో.కానీ, మనకా ఓపిక లేదు, వాళ్ళని ఎదుర్కోడం. అదేం కర్మమో కానీ, మన మొహం చూడగానే తెలుస్తుందనుకుంటా, మనం potential victims అని! అంతే పేట్రేగిపోతారు.

ఇలాటివి మామూలుగా ఆటో వాళ్ళలో ఎక్కువ చూస్తూంటాము.ఏదో బయటకు వెళ్ళాలని దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్ కి వెళ్ళి, ఫలానా చోటుకి వస్తావుటోయ్ అని అడగండి, ఓ పురుగుని చూసినట్టు ఓ చూపు విసిరి, ముందుగా రానూ అంటాడు,కాదూ కూడదూ అంటే, ఏదో ఓ పెద్ద ఎమౌంటు చెప్తాడు. అలా కాదూ, మీటరు మీద రాకూడదా అని అడిగితే, మీటరు పనిచేయడం లేదనో లాటి తిక్క సమాధానాలు చెప్తాడే కానీ, ఛస్తే బేరం ఒప్పుకోడు. మనకి తెలుసు అది రూల్స్ కి విరుధ్ధం అనీ, RTA వాళ్ళకి రిపోర్టు చేయొచ్చనీ, కానీ మనకా ధైర్యం ఉండదు, ఎందుకంటే మనమూ, వాడూ ఆ ఇలాకాలోనే ఉంటాము, రేపెప్పుడైనా ఏ అఘాయిత్యమైనా చేస్తే... వామ్మోయ్.పోనీ ధైర్యం చేద్దామా అంటే, పక్కనే ఉండే ఇంటావిడ జ్ఞానబోధలోటీ, " పోనిద్దురూ, వాళ్ళతో మనకెందుకూ..." అంటూ..అదీ నిజమే అనుకోండి, మనం ఏదైనా అన్నా కానీ, వాడు మన కాలరు పట్టుకుంటే చేసేదేమైనా ఉందా? అదిగో అలాటి పరిస్థితుల్లోనే, మనకి సినిమా హీరోలు "దైవాంశ సంభూతులు" అయిపోతారు. మనం మనస్సులో ఏమేం చేద్దామని ఊహించేసికుంటామో అవన్నీ ఆ హీరో చేసేస్తూంటాడు.వాటిని చూసి సంతృప్తి పడడం కన్న చేసేదేమీ ఉండదు.

ఈ కోవకే చెందినవాళ్ళు, రైల్వే స్టేషనులో పోర్టర్లు. ఆ దిక్కుమాలిన ట్రైనులో, మనం ప్రయాణం చేసేవా ఏసీ బోగీలు ( అలాగని పుట్టినప్పటినుంచీ ఏసీల్లో ప్రయాణం చేశామనికాదు) ఏదో సీనియర్ సిటిజన్ కన్సెషన్ల ధర్మమా అని, ఒకే టిక్కెట్టు మీద ఇద్దరూ చేసేస్తున్నాము కదా (40% +50% కలిపి). ఆ మాయదారి బోగీలేమో ట్రైనుకి ఆ చివరో, ఈ చివరో తగలడతాయి, తెచ్చుకున్న రెండు సూట్ కేసులూ wheels ఉన్నా సరే, ఆ overbridge దగ్గర మెట్లెక్కాలిగా, ఈ రెండు సూట్ కేసులూ ఎత్తే ఓపికుండదు చచ్చినట్టు ఓ కూలీని మాట్టాడాలే. మాములుగా సామాన్లు చూసి రేటు చెప్తారు, కానీ మన అదృష్టం ఏమిటో, మన figure చూసి మరీ వాడు రేటు చెప్తాడు ! మళ్ళీ ప్రతీ రైల్వే స్టేషనులోనూ ఓ పెద్ద బోర్డు మీద వ్రాసి మరీ ఉంచుతారు--" రైల్వే కూలీకి ఫలానా వెయిట్ కి ఫలానా రుసుం మాత్రమే ఇవ్వండీ..." అంటూ. ఒక విషయం చెప్పండి, మనలో ఎంతమంది, పోర్టర్లమీద complaint చేశారో? పోనీ చేశామా అనుకోండి, జరిగేదేమిటిట, ఓ కాగితం మీద రాసివ్వండీ, యాక్షన్ తీసికుంటామూ అని చెప్పి, మనం ఆ స్టేషన్ మాస్టరు రూమ్ములోంచి బయటకు వెళ్ళగానే చింపవతల పారేస్తారు. పోనీ, ఆ పోర్టరుని వదిలేసి, సామాన్లు మోసే ఓపికుందా అంటే అదీ లేదు. నోరుమూసుకుని, ఆ పోర్టరు చెప్పిన రేటుకే సామాన్లు మోయించడం. 

మామూలుగా ఈ bullies రాజకీయ నాయకుల "ప్రమథ గణాల్లో" ఎక్కువగా చూస్తూంటాము.వాళ్ళెక్కడికెళ్తే వీళ్ళూ ఉంటారు. దైవదర్శనానికి వెళ్ళినప్పుడు చూడాలి వీళ్ళ వీరంగాలు. ఆ వచ్చిన VIP తో పాటు వీళ్ళు కూడా దూరిపోతూంటారు.అడక్కూడదూ, ధైర్యం చేసి అడిగామా అంతే సంగతులు.. ఇంక పోలీసులు-- వీళ్ళకి యూనిఫారం వేసుకునేటప్పటికి వచ్చేస్తుందనుకుంటాను ఈ bullying attitude ! అలాగని అందరు పోలీసులూ అథారిటీ చలాయిస్తారని కాదూ, కానీ చాలామంది ఛాన్సు దొరికితే లాఠీ ఝుళిపించేస్తూంటారు. దానికి సాయం, ఏ రోడ్డుమీదో బైక్కు మీద వెళ్తూంటే, ఆ ట్రాఫిక్కు పోలీసు, గాడీని ఆపి, పక్కకు తీసికెళ్ళాడూ అంటే... చాలు...పోలిసులనేమిటీ, అధికారం చేతిలోకొచ్చేసరికి ప్రతీవాడూ, ఏదో ఒక సందర్భంలో ఈ bully రోలు లోకి వస్తాడే.. అంతదాకా ఎందుకూ, మన దురదృష్టం కొద్దీ, మనం ప్రయాణం చేసే రైలు ఏ కారణం చేతో ఏ wayside station లోనో చాలా సేపు ఆగవలసొచ్చిందనుకోండి, పైగా ఆ ట్రైనుకి ప్యాంట్రీ కారు లాటిది లేదనుకుందాము, అయిపోయిందే మన పని. ఎవడో ఓ చాయ్ దుకాణం పెట్టేస్తాడు. వాడికీ తెలుసు, అందరూ చాయ్ నీళ్ళకోసం ఎంతైనా ఇస్తారూ అని. అంతే వాడిష్టమొచ్చిన రేటు చెప్పేస్తాడు..

ఎక్కడదాకానో ఎందుకూ, ఓ రెండుమూడేళ్ళు తరవాత పుట్టిన పాపానికి , తమ్ముడో, చెల్లెలో, తమకంటె పెద్ద అయిన అక్క చేతిలోనో, అన్న చేతిలోనో  ఈ హింసకి బలైపోతూంటారు.  ఇళ్ళల్లో మరీ ప్రాణహాని దాకా వెళ్ళదనుకోండి,  కానీ “ ఎమోషనల్ అత్యాచారం “ మాత్రం తప్పదు. ప్రతీదానికీ అమ్మతో చెప్తానూ, నాన్నతో చెప్తానూ అని బెదిరించడం..ఇలా చెప్పుకుంటూ పోతే కావలిసినన్నుంటాయి. డిగ్రీలో తేడా అంతే....

సర్వేజనా సుఖినోభవంతూ…

- భమిడిపాటిఫణిబాబు
 

మరిన్ని శీర్షికలు
chnadighar