కథ : పచ్చని ఆశ
రచయిత : రాచమళ్ళ ఉపేందర్
సమీక్ష : రామదుర్గం మధుసూధన రావు
గోతెలుగు 165వ సంచిక!
వట్టి మాటలు...గట్టి చేతలు..!:
సముద్రమంత ఆలోచన కన్నా...బిందువంత ఆచరణ మేలు...ఎప్పుడో చిన్నప్పుడు చదివిన వాక్యం...చాలా కాలం తర్వాత ...రాచమళ్ల ఉపేందర్ "పచ్చని ఆశ' మళ్లీ గుర్తొచ్చింది. ఎలాంటి నర్మగర్భార్థాల్లేని ఈ వాక్యం చూడటానికి సాధారణంగా కనిపించినా...అర్థం చేసుకోడానికి జీవితకాలం పడుతుంది. నిజం...మన మాటలకు చేతలకు పొంతన లేని సందర్భాలు జీవితంలో అనేకానేకం! వాటిని సమర్థించుకోడానికి మనం చెప్పుకునే కారణాలూ బోలెడన్నీ! ఎవరికి తోచిన లాజిక్ లు వారికుంటాయి. అయితే సత్యం లేదా వాస్తవం ఒకటే కదా! మనం ఎన్ని రకాలుగా...ఎంత ఆలంకారికంగా వర్ణించి చెప్పినా! సరిగ్గా ఈ ఆంశాన్నే కథాంశంగా తీసుకున్నారు ఉపేందర్. ఈ అంశాన్ని ఎంచుకోవడమే రచయితగా అతని తొలి విజయం.
ప్రకాశరావు ఓ ప్రకృతి ప్రేమికుడు. లోకమంతా పచ్చగా కళకళలాడాలని నిత్యం కాంక్షించే ఓ హరిత స్వాప్నికుడు. తన ఆశయాన్ని పదిమందికి చేరవేయగల వాక్చాతుర్యం గల గొప్ప ఉపన్యాసకుడు. ఎక్కడ పర్యావరణ సదస్సు జరిగినా అక్కడ ప్రకాశరావునే వక్తగా పిలుస్తుంటారు. పచ్చదనం కోసం అహరహం శ్రమించే ప్రముఖ పర్యావరణవేత్తగా అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రకాశరావుకు ఓ రోజు అనుకోకుండా సంజయ్ పరిచయమయ్యాడు. తను తొమ్మిదోతరగతి విద్యార్థినని...తమ స్కూలులో పచ్చదనం...అది లేకుంటే పర్యావరణానికి వాటిల్లే పెనుప్రమాదం గురించి వివరంగా చెప్పారని, సకాలంలో వానలు కురియాలంటే...మొక్కలు నాటడం వినా మరో మార్గం లేదని తమ సార్ చెప్పారని ఉద్వేగంతో చెప్పాడు. తమ క్లాసు మిత్రులందరూ కలిసి వేయి మొక్కలు నాటాలని సంకల్పించామని, అందుకు సహకరించాలని అభ్యర్థించాడు. తనతోటే కార్యక్రమం ప్రారంభించాలన్నది తన ఆశయమని సంజీవ్ చెబుతుంటే...ప్రకాశరావు చాలా ఆనందం కల్గింది. తనమాటకున్న శక్తికి లోలోనే పొంగిపోయాడు. అలాగే తప్పకుండా అంటూ పంపించాడు.
అయితే రోజులు గడుస్తున్నా...ప్రకాశరావు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేయడమేకానీ సంజయ్ తో కలిసి అడుగులేసింది లేదు..ప్రోత్సహించిందీ లేదు. ప్రకాశరావుకు మాటల్లో ఉన్నంత పస చేతల్లో లేదని ఆ చిన్నిబుర్రకు అర్థమైపోయింది. వేరేవాళ్లను కలుస్తున్నా...పెదవి విరిచేవారే తప్ప కలిసొచ్చేవారు కరవయ్యారు. ఇక లాభం లేదని మిత్రులందరు కలిసి ఓ నిర్ణయానికొచ్చారు. వేసవి సెలవుల్లో పనిచేసి డబ్బు పోగేసి హరిత కార్యక్రమం ప్రారంభించాలని. సంజయ్ తన కార్యాచరణను తండ్రికి వివరించాడు. కొడుకు ఆలోచనలు విని మురిసిపోయిన ఆ తండ్రి ఏదైనా పనికి కుదర్చాలని తీసుకెళుతుంటే...దారిలో ప్రకాశరావు కలవడం...తన తోటపనికే పంపమని కోరడం..సంజయ్ ఆ పనిని అద్భుతంగా నిర్వర్తించాడు. అయితే ఈ నెల రోజుల్లో ప్రకాశరావు ఒక్కసారికూడా సంజయ్ తో మొక్కల కార్యక్రమం గురించి ప్రస్తావించలేదు. ఈ వ్యవహారంతో ఆతని అసలు రూపం ఆ పిల్లాడికి ఇంకా పూర్తిగా తెలిసిపోయింది. కానీ తన పనిముఖ్యం అనుకున్నాడు కాబట్టి...అటుగా అడుగులు వేశాడు....సీన్ కట్ చేస్తే...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టౌన్ హాలులో ఓ గొప్ప సభ...పరవశించి ప్రసంగించి ప్రేక్షకుల కరతాళధ్వనులతో మైమరచి పోతున్న ప్రకాశరావు...ఇంతలో నిర్వాకుల నుంచి ఓప్రత్యేక కార్యక్రమం అంటూ ప్రకటన... వెంటనే మైకు ముందు సంజయ్...ప్రకాశరావు మొహంపై నెత్తురుచుక్క లేదు. అతడు కంగారుపడిపోతుండటం స్పష్టంగా తెలుస్తోంది. "పర్యావరణం పై సదస్సు పెట్టారు చాలా సంతోషం...కానీ మీలో ఎందరు మొక్కలు నాటారు...నాటుతున్నారు...కనీసం నాటాలనుకుంటున్నారు' సంజయ్ నోటి వెంట తూటాలా దూసుకొచ్చిన ఈ మాటకు అక్కడ ప్రకాశరావే కాదు చాలామంది బిత్తర పోయారు...నిరుత్తరులయ్యారు. మాటలు చెప్పడం తేలిక...ఆచరించడమే కష్టం. మా హరిత కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన ప్రకాశరావుగారికి సభాముఖంగా కృతజ్ఞతలు' అనగానే సభలో ఒకటే చప్పట్లు.ప్రకాశరావు సంజయ్ ను కళ్లనీళ్లతో కౌగలించుకుని...మొక్కలు నాటే కార్యక్రమానికి నాయకుడిగా ప్రకటించడంతో కథ ముగుస్తుంది.
ప్రకాశం...సంజయ్ ల మధ్య వేడివాడి వాగ్వాదం సృష్టించిఉంటే ఇదో సాదాసీదా కథే అయి ఉండేది. కానీ వయసులో చిన్నవాడు సంజయ్ సాత్వికంగా ఆలోచించి పలికిన పలుకులు...ప్రకాశరావు ఆత్మపరిశీలనకు...పరివర్తనకు కారణాలయ్యాయి. ఇక్కడే రచయిత మరోసారి తన పరిణతిని ప్రదర్శించగలిగారు.
అనూహ్య మలుపులు...అద్భుత చమత్కార సంభాషణలు లేకుండానే ఓ చక్కని సామాజిక నీతిని సులువుగా చెప్పడం రచయిత గొప్పదనమే అంటాను. ఎందుకంటే ఇంత సులువుగా చెప్పాలంటే మనసులో చాలా కష్టపడాలి మరి! కావాలంటే పచ్చని ఆశ కథ ఓసారి చదవండి మీకే తెలుస్తుంది!!
ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు...http://www.gotelugu.com/issue165/4224/telugu-stories/pachani-aasa/
|