Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with karthi

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కాష్మోరా 
తారాగణం: కార్తీ, శ్రీదివ్య, నయనతార, వివేక్‌, శరత్‌ తదితరులు 
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌ 
నిర్మాణం : పివిపి సినిమాస్‌ 
నిర్మాతలు: పెరల్‌ వి పొట్లూరి, పరమ్‌ వి పొట్లూరి, ప్రసాద్‌ వి పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు 
దర్శకత్వం: గోకుల్‌ 
సంగీతం: సంతోష్‌ నారాయణన్‌ 
విడుదల తేదీ: 28 అక్టోబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
కాష్మోరా ఓ భూతవైద్యుడు. జనం నమ్మకాల్ని క్యాష్‌ చేసుకోవడమే అతని పని. దెయ్యాల్ని పోగొట్టమని, ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఎవరైనా తన వద్దకు వచ్చి, తన మాయాజాలంతో వారి నుంచి డబ్బు కొల్లగొడుతుంటాడు తన కుటుంబంతో కలిసి. అలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ వ్యక్తి తన బంగ్లాలోని దెయ్యం నుంచి తమకు విముక్తి కల్పించాల్సిందిగా కాష్మోరాని ఆశ్రయిస్తాడు. కుటుంబంతో కలిసి కాష్మోరా ఆ బంగ్లాకి వెళతాడు. అక్కడి నుంచి అతని జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. దెయ్యం పేరుతో క్యాష్‌ చేసుకునే కాష్మోరాకి దెయ్యాలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత అతనెలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు. అందులోంచి బయట పడేందుకు కాష్మోరా ట్రిక్స్‌ పనిచేశాయా? లేదా? వంటివి తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
కార్తీ మన ఇంట్లో కుర్రాడు, మన పక్కింట్లో కుర్రాడు, మన స్నేహితుల్లో ఒకడు, మన కుటుంబంలో ఒకడు అనిపించేలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. నటించడం కాదు, జీవించేస్తుంటాడు. ఈ సినిమాకీ కార్తీ నటనే బలం. మూడు పాత్రల్లో దేనికదే అన్నట్లుగా సాగుతుంది అతని నటనా ప్రతిభ. సరదాగా నవ్వించేయడంలోనూ, అంతలోనే ఆశ్చర్యంలో ముంచెత్తడం ఇలా అన్ని పాత్రల్లోనూ జీవించేశాడు కార్తీ. కాష్మోరా తండ్రి పాత్రలో వివేక్‌ కడుపుబ్బా నవ్వించాడు. హీరోయిన్‌ శ్రీదివ్యకు నటించేందుకు స్కోప్‌ తక్కువే దక్కింది. నయనతార బాగానే చేసింది. సెకెండాఫ్‌లోనే నయనతార కన్పిస్తుంది. కన్పించినంతసేపూ థియేటర్స్‌లో విజిల్స్‌ వేయించుకుంది ఆమె పాత్ర. మిగతా పాత్రధారులంతా తమ పని తాము చేసుకుపోయారు. పెద్దగా వారికి స్కోప్‌ దక్కలేదు. 

కొత్త కథ, కొత్త కథనం అన్నీ సినిమాకి బాగా కుదిరాయి. ఎంటర్‌టైనింగ్‌ వేలో థ్రిల్లర్‌ సినిమాల్ని రూపొందించడం లేటెస్ట్‌ ట్రెండ్‌. ఓ వైపు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంకో వైపు కట్టిపడే గ్రాఫిక్స్‌ మాయాజాలంతో సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. కథనం బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. విజువల్‌ వండర్‌గా సినిమా గురించి చెప్పవచ్చు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ సినిమాకి కొత్త లైఫ్‌ తెచ్చాయని చెప్పక తప్పదు. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతమే కీలకం. ఈ సినిమాకి అది బాగానే కుదిరింది. పాటలు తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి, వినసొంపుగానూ ఉన్నాయి. 

మూడో సినిమానే అయినా దర్శకుడు విలక్షణమైన సబ్జెక్ట్‌ని ఎంచుకోవడమే కాక, దాంతో మంచి ఔట్‌పుట్‌ తీసుకురావడంలో సఫలమయ్యాడు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ని ఈ స్థాయిలో వాడుకోవడం చిన్న విషయం కాదు. 'బాహుబలి'తో కంపేరిజన్స్‌ రావడంతో ఏమాత్రం తక్కువ ఉన్నా తేడా కొట్టేస్తుంది. ఆ విభాగంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. తొలి సగం ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యతనిచ్చాడు. సరిగ్గా మలుపు తిప్పాల్సిన టైమ్‌లో తిప్పేసి, సెకెండాఫ్‌ని రసవత్తరంగా మార్చాడు. అక్కడక్కడా కొన్ని జర్క్స్‌ ఉన్నా ఓవరాల్‌గా సినిమాని దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. కార్తీ నుంచి ఆడియన్స్‌ ఏం ఆశిస్తారు? అనేది దర్శకుడు బాగా స్టడీ చేసినట్లున్నాడు. దాంతో ఓ మంచి ఔట్‌పుట్‌ అయితే దర్శకుడి నుంచి వచ్చిందని చెప్పక తప్పదు. కార్తీ సినిమాకి తెలుగులో కూడా మంచి మార్కెట్‌ ఉంది. సినిమాకి జరిగిన పబ్లిసిటీ కారణంగా ఓపెనింగ్స్‌ బాగా వచ్చినట్లే, సినిమా కూడా మంచి విజయం సాధించే అవకాశాలెక్కువ. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
భయపెట్టే కాష్మోరా కాదిది, సరదాగా ఉంటూనే ఆశ్చర్యపరిచే కాష్మోరా. 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
megastar steps with rattaalu